Skip to main content

10th Class Preparation Tips: టెన్త్‌ క్లాస్‌లో.. పదికి పది ఇలా!.. మంచి స్కోర్‌ సాధించేందుకు సబ్జెక్ట్‌ నిపుణుల సూచనలు

పదో తరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ! టెన్త్‌లో సాధించే మార్కులు, సబ్జెక్ట్‌ నైపుణ్యాలు భవితకు పునాదిగా నిలుస్తాయి. అంతేకాదు పదో తరగతి సబ్జెక్ట్‌ల్లో పొందే మార్కుల ఆధారంగా చేరాల్సిన ఉన్నత విద్య కోర్సుపై స్పష్టత వస్తుంది. ఇంతటి కీలకమైన టెన్త్‌ క్లాస్‌ 2024 వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో.. పదోతరగతి పరీక్షల్లో తాజా మార్పులు.. పరీక్ష విధానం.. వార్షిక పరీక్షల్లో మెరుగైన స్కోర్‌కు మార్గాల గురించి తెలుసుకుందాం..
10th Class Special 2023
10th Class Special 2023

‘పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు, జీపీఏ సాధించాలంటే.. పాఠ్యపుస్తకాల అభ్యసనంతోపాటు అనువర్తిత దృక్పథం సొంతం చేసుకోవాలి. చదివే ప్రతి అంశాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటూ.. ఆయా సబ్జెక్ట్‌ అంశాలపై పట్టు సాధించాలి’ అంటున్నారు సబ్జెక్ట్‌ నిపుణులు. చక్కటి ప్రణాళికతో చదువు కొనసాగిస్తే.. మంచి మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.

Also read: Career Guidance: డిజైన్‌ కెరీర్స్‌కు.. దారిచూపే ఎఫ్‌డీడీఐ

ఆరు పేపర్లుగానే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లుగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పేపర్‌–1, పేపర్‌–2 విధానానికి స్వస్తి పలికారు. దీనికి బదులుగా ప్రతి పేపర్‌లోనూ పార్ట్‌–ఎ, పార్ట్‌–బిలు ఉంటాయి. ఇంతకుముందు జరిగిన పేపర్‌–1,పేపర్‌–2 విధానంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబ్జెక్ట్‌ నిపుణుల విశ్లేషణ. రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్‌గా ఏపీలో 100 మార్కులకు, తెలంగాణలో 80 మార్కులకు ప్రతి సబ్జెక్ట్‌లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం సిలబస్‌ అంశాల నుంచి ఒకే పేపర్‌లో ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షకు కేటాయించే వ్యవధిని పెంచడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. తెలంగాణలో పరీక్ష సమయాన్ని మూడు గంటలుగా, ఏపీలో 3:15 గంటలుగా పేర్కొన్నారు.

సైన్స్‌ ఒకే పేపర్‌.. పార్ట్‌–ఎ, పార్ట్‌–బిగా

  • గతంలో సైన్స్‌లో.. పీఎస్‌(ఫిజికల్‌ సైన్స్‌), ఎన్‌ఎస్‌(నేచురల్‌ సైన్స్‌) పేరుతో రెండు పేపర్లు ఉండేవి. ఇప్పుడు పీఎస్, ఎన్‌ఎస్‌ రెండింటినీ ఒకే పేపర్‌గా.. పార్ట్‌–ఎ, పార్ట్‌–బి పేరుతో ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌–ఎలో పీఎస్‌(భౌతిక రసాయన శాస్త్రం), పార్ట్‌–బి(జీవ శాస్త్రం) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఏపీలో పార్ట్‌–ఎ, పార్ట్‌–బిలు 50 మార్కులు చొప్పున, తెలంగాణలో.. పార్ట్‌–ఎ, పార్ట్‌–బిలు 40 మార్కులకు చొప్పున ఉంటాయి. 
  • ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్లూ ప్రింట్స్, మోడల్‌ పేపర్స్‌ను పరిశీలిస్తూ.. సబ్జెక్ట్‌ వారీగా ఆయా అంశాలకు ఉన్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలో మంచి స్కోర్‌ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

Also read: CUET UG 2023: ఒక్క పరీక్షతో.. 54 వర్సిటీల్లో ప్రవేశం

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష పేపర్ల స్వరూపం
మ్యాథమెటిక్స్‌
     ఒక మార్కు ప్రశ్నలు 12(12 మార్కులు), రెండు మార్కుల ప్రశ్నలు 8(16 మార్కులు), నాలుగు మార్కుల ప్రశ్నలు 8(32 మార్కులు), ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5(40 మార్కులు).

జనరల్‌ సైన్స్‌
     పార్ట్‌–ఎ.. పీఎస్‌లో ఒక మార్కు ప్రశ్నలు 6(6 మార్కులు); రెండు మార్కుల ప్రశ్నలు 4(8 మార్కులు), నాలుగు మార్కుల ప్రశ్నలు 3(12 మార్కులు), ఎనిమిది మార్కుల ప్రశ్నలు 3(24 మార్కులు). 
     పార్ట్‌–బి.. జీవ శాస్త్రంలో ఒక మార్కు ప్రశ్నలు 6(6 మార్కులు); రెండు మార్కుల ప్రశ్నలు 4(8 మార్కులు); నాలుగు మార్కుల ప్రశ్నలు 5(20 మార్కులు); ఎనిమిది మార్కుల ప్రశ్నలు 2(16 మార్కులు).

సోషల్‌ స్టడీస్‌
     ఒక మార్కు ప్రశ్నలు 12(12 మార్కులు), రెండు మార్కుల ప్రశ్నలు 8(16 మార్కులు), నాలుగు మార్కుల ప్రశ్నలు 8(32 మార్కులు), ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5(40 మార్కులు).

ఇంగ్లిష్‌
రెండు మార్కుల ప్రశ్నలు 5(10 మార్కులు); రెండు మార్కుల ప్రశ్నలు 3(6 మార్కులు), ప్యాసేజ్‌ ఆధారిత మరో రెండు మార్కుల ప్రశ్నలు 2(4 మార్కులు) అడుగుతారు. పోస్టర్‌ ఆధారిత ప్రశ్నలు 5(10 మార్కులు). సెక్షన్‌–బికు 40 మార్కులు. సెక్షన్‌–సికు 30 మార్కులు.

తెలుగు.. పద్య,గద్య భాగాలు, వ్యాకరణం
     ఎనిమిది మార్కుల ప్రశ్నలు 7(56 మార్కులు), 4 మార్కుల ప్రశ్నలు 3(12 మార్కులు), స్వల్ప సమాధాన, బహుళైచ్ఛిక ప్రశ్నలకు 32 మార్కులు. ∙అన్ని సబ్జెక్ట్‌లలోనూ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

Also read: Dual Degree Courses After Inter: డ్యూయల్‌ డిగ్రీతో.. యూజీ + పీజీ!

తెలంగాణ పదో తరగతి పరీక్ష పేపర్ల స్వరూపం

  •      సూక్ష్మ లఘు సమాధాన ప్రశ్నలు ఆరు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు(మొత్తం 12 మార్కులు).
  •      లఘు సమాధాన ప్రశ్నలు 6 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు (మొత్తం 18మార్కులు).
  •      వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఆరు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అయిదు మార్కులు (మొత్తం 30 మార్కులు).
  •      పార్ట్‌–బి పేరుతో బిట్‌ పేపర్‌ నుంచి 20 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు.
  •      ఇలా మొత్తం పార్ట్‌–ఎ, పార్ట్‌–బి నుంచి 80 మార్కులకు ప్రతి సబ్జెక్ట్‌లో పరీక్ష జరుగుతుంది.

సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ ఇలా 
మ్యాథమెటిక్స్‌
పదో తరగతి స్థాయిలో విద్యార్థులు క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌ మ్యాథమెటిక్స్‌. సిలబస్‌ అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ.. ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్‌పై పట్టు సాధించొచ్చు. సంఖ్యా వ్యవస్థ; బీజగణితం; నిరూపక రేఖాగణితం; రేఖా గణితం; క్షేత్రమితి; త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్‌ రూపంలో రాసుకుంటే.. రివిజన్‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్‌ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్‌ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి;  క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేయాలి. 
–కె.సారథి, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు

Also read: CTET-2022 Notification: సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..


సైన్స్‌ పేపర్‌.. పార్ట్‌–ఎ.. పీఎస్‌
సైన్స్‌ సబ్జెక్ట్‌లో పార్ట్‌–ఎ ఫిజికల్‌ సైన్స్‌(పీఎస్‌)లో మంచి మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్‌ అప్రోచ్‌తో చదవడం ఎంతో ముఖ్యం. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్‌ సాగిస్తే.. విషయ పరిజ్ఞానం మరింత పెంపొందించుకోవచ్చు. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం–పరికల్పన చేయడం; ప్రయోగాలు–క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు–ప్రాజెక్ట్‌ పనులు; పటాలు–వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్‌ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్‌ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు–వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభించి.. మంచి మార్కులు సొంతమవుతాయి. 
–ఎం.రవీంద్ర, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు

సైన్స్‌ పేపర్‌.. పార్ట్‌–బి ఎన్‌ఎస్‌(నేచురల్‌ సైన్సెస్‌)
సైన్స్‌ పేపర్‌లోనే పార్ట్‌–బిగా ఉండే జీవశాస్త్రంలో రాణించేందుకు.. అవగాహన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలను పెంచుకోవాలి. పుస్తకాల్లోని ఆయా అంశాలకు సంబంధించి ఫ్లో చార్ట్‌లు, బ్లాక్‌ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్‌ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా..  వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. 
–పి.నీలకంఠం, సబ్జెక్ట్‌ టీచర్‌

Also read: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!


తెలుగు
ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఉండే తెలుగు పేపర్‌లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు.. ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరి పెట్టకుండా.. సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్‌ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో సొంతగా ఆలోచిస్తూ చదవాలి. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. వ్యాకరణంలో మంచిగా ప్రతిభ చూపాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. 
–జి.వెంకట రమణ, ఎస్‌ఏ–తెలుగు

ఇంగ్లిష్‌ 
ఇంగ్లిష్‌ పేపర్‌లో మంచి మార్కులు పొందేందుకు వెర్బల్, నాన్‌–వెర్బల్‌ అంశాలు బాగా చదవాలి. ఉదాహరణకు లేబుల్స్, బార్‌ డయాగ్రమ్స్, పై చార్ట్స్‌ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. సొంతంగా విశ్లేషించేలా నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాల సమాధానాలను పరిశీలించడం కూడా మేలు చేస్తుంది. ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సివ్‌ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పోయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, యాక్టివ్‌ వాయిస్, ప్యాసివ్‌ వాయిస్, ఫ్రేజల్‌ వెర్బ్స్‌. ఈ విషయంలో చదవడంతోపాటు ప్రాక్టీస్‌ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు మరింత ఆస్కారం లభిస్తుంది. అదే విధంగా అపరిచిత గద్యం(అన్‌ నోన్‌ ప్యాసేజెస్‌) సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. లెటర్‌ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్‌ ది లెటర్‌ వంటి అంశాలపై పట్టు ఎంతో అవసరం. 
–డి.హనుమంతరావు, ఎస్‌ఏ–ఇంగ్లిష్‌

Also read: Recruitment Trends 2023: స్మార్ట్‌ హైరింగ్‌.. ఐటీ కొలువు!


సోషల్‌ స్టడీస్‌
ఈ సబ్జెక్ట్‌లో మంచి మార్కులు పొందాలంటే.. సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. పాఠ్య పుస్తకంలోని ఏదైనా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవాలి. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సా«ధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి.. సొంత పరిజ్ఞానంతో రాసే నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం –భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి–ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగల నుంచి అనుసరించారు తదితర కోణాల్లో చదవాలి. 
–బి.శ్రీనివాస్, సబ్జెక్ట్‌ టీచర్‌

Also read: AP 10th Class Model Papers Ebook 2023 : ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన మోడ‌ల్ పేప‌ర్స్ (TM & EM).. అత్యంత త‌క్కువ ధ‌ర‌కే..

పదో తరగతి వార్షిక పరీక్షలు.. ముఖ్యాంశాలు

  •      రెండు రాష్ట్రాల్లో పేపర్‌–1, పేపర్‌–2 విధానానికి స్వస్తి.
  •      కేవలం ఆరు పేపర్లలోనే పరీక్షలు.
  •      ఏపీలో ప్రతి సబ్జెక్ట్‌లో 100 మార్కులకు, తెలంగాణలో ప్రతి సబ్జెక్ట్‌కు 80 మార్కులకు పరీక్ష.
  •      సైన్స్‌కు సంబంధించి పార్ట్‌–ఎగా పీఎస్, పార్ట్‌–బిగా ఎన్‌ఎస్‌ సబ్జెక్ట్‌లతో ఒకటే ప్రశ్న పత్రం.
  •      వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో ఇంటర్నల్‌ ఛాయిస్‌ విధానం.

Also read: TS 10th Class Model Papers Ebook 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేప‌ర్స్ (TM & EM)

పదో తరగతి విద్యార్థులు.. దృష్టి సారించాల్సిన అంశాలు

  •      సిలబస్‌లో ఆయా సబ్జెక్ట్‌లు, చాప్టర్లలో సిలబస్‌ను పరిశీలించాలి.
  •      ముఖ్యమైన చాప్టర్లను వెయిటేజీ ఆధారంగా వర్గీకరించుకోవాలి.
  •      అత్యధిక వెయిటేజీ ఉండే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  •      ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  •      అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.
  •      మ్యాథమెటిక్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్‌ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను బాగా అధ్యయనం చేయాలి. 
  •      ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. 
Published date : 09 Jan 2024 03:29PM

Photo Stories