10th Class Preparation Tips: టెన్త్ క్లాస్‌లో.. పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ టిప్స్..
- ఏపీలో మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు
- తెలంగాణలోనూ మార్చి 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
- సిలబస్, ప్రశ్నల తీరుపై అవగాహనతో ఉత్తమ స్కోర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024, మార్చి 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఈసారి.. సైన్స్(పీఎస్, ఎన్‌ఎస్) పేపర్లను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ మార్చి 18 నుంచి పరీక్షలు జరపనున్నట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు.. తేలిగ్గా తీసుకోవద్దు
మన మాతృ భాష తెలుగు అనే ఆలోచనతో విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌ను కొంత తేలిగ్గా తీసుకుంటారు. కానీ.. మంచి గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే మాత్రం విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే. అందుకోసం.. పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరి పెట్టకుండా.. సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. తెలుగు సబ్జెక్ట్‌లో వ్యాకరణం కూడా ముఖ్యమే. ఈ వ్యాకరణంలో మెరుగ్గా రాణించాలంటే.. సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. ఇప్పటి నుంచి ప్రతి రోజు క్లాస్ రూంలో బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్థులు జనవరి మొదటి వారం నుంచి పునశ్చరణకు ప్రత్యేకంగా సమయం కేటాయించేలా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
చదవండి: TS 10th Class TM Study Material
ఇంగ్లిష్ ృ ఆందోళన వద్దు
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఆందోళన చెందే సబ్జెక్ట్ ఇది. కానీ.. ఇందులోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం చేయాల్సిందల్లా.. ముందుగా ఇంగ్లిష్ పదజాలం, వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటిని తాము సొంతంగా విశ్లేషించే నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాలుృసమాధానాలను పరిశీలించడం మేలు చేస్తుంది. విద్యార్థులు ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సన్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి.. సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పోయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్‌ను చదవాలి. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందొచ్చు. అన్‌నోన్ ప్యాసేజ్ కింద ఇచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఆ ప్యాసేజ్ సారాంశాన్ని గుర్తించే నైపుణ్యం అవసరం. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టు పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్.. ప్రాక్టీస్‌తోనే స్కోర్
మ్యాథమెటిక్స్.. భవిష్యత్తులో ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు..ఇలా అన్నింటా ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఈ సబ్జెక్ట్‌లో వందకు వంద సాధించే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి చాప్టర్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతోపాటు వాటికి సంబంధించిన ప్రశ్నలు (ప్రాబ్లమ్స్)ను ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ; బీజ గణితం; నిరూపక రేఖాగణితం; పేపర్‌ృ2లో రేఖా గణితం; క్షేత్రమితి; త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యక శాస్త్రంపై పట్టు సాధించాలి. విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలోనే సమస్య సాధనతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు,సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్›్ట బుక్‌లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేస్తే సులభంగానే 60 శాతం మార్కులు సొంతం చేసుకోవచ్చు.
చదవండి: TS 10th Class Model Papers
ఫిజికల్ సైన్స్.. అన్వయ దృక్పథం
ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో ఫిజిక్స్ నుంచి ఏడు, కెమిస్ట్రీ నుంచి ఏడు మొత్తం 14 చాప్టర్లు చదవాల్సి ఉంటుంది. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడంృపరికల్పన చేయడం; ప్రయోగాలుృక్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలుృప్రాజెక్ట్ పనులు; పటాలుృవాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదే విధంగా.. మూలకాల ధర్మాలుృవర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత పెంచుకుంటే బెస్ట్ స్కోర్ చేయొచ్చు.
నేచురల్ సైన్సెస్
జీవశాస్త్రంలో టాప్ స్కోర్ కోసం సబ్జెక్ట్ అవగాహనతోపాటు విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్‌లు, బ్లాక్ డయాగ్రమ్స్‌లను సొంతంగా రూపొందించుకోవాలి. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రయోగాలకు సంబంధించి ప్రయోగం ఫలితంతోపాటు.. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందాలి. చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్‌కు సంబంధించిన భాగాలను గుర్తించడమే కాకుండా..వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
చదవండి: AP 10th Class Study Material
సోషల్ స్టడీస్.. సమకాలీనంగా
సోషల్ స్టడీస్‌లో అడిగే ప్రశ్నల తీరులో మార్పు వచ్చింది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. టెక్స్›్ట బుక్‌లో ఒక అంశం గురించి ఉంటే.. దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం లాభిస్తుంది. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన,ప్రశ్నించడం, ప్రశంస/అభినందనలపై సా«ధన చేయాలి. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి, సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్‌లో భారతదేశం ృభౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తిృఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం; సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగల నుంచి అనుసరించారు? వంటి కోణాల్లో చదవాలి. డయాగ్రమ్/రేఖాచిత్ర, పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి.
చదవండి: AP 10th Class Model Papers 2024
ఉత్తమ స్కోర్‌కు సూచనలు
- అవగాహన, ప్రతిస్పందన, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి.
- ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- అనువర్తిత నైపుణ్యం పెంపొందించుకునేలా చదవాలి.
- మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్‌ను బాగా అధ్యయనం చేయాలి.
- ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
- జనవరి నుంచి అధిక సమయం పునశ్చరణకు కేటాయించాలి.
- జనవరి చివరి నాటికి ప్రిపరేషన్, రివిజన్ రెండిటినీ పూర్తి చేసుకోవాలి.
- ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు ప్రీృఫైనల్స్‌కు హాజరవ్వాలి.
- తొలి పరీక్షకు వారం ముందు నుంచి పూర్తిగా ఆ పరీక్ష కోసమే సమయం కేటాయించాలి.