TS Tenth Class Annual Exams 2025: పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫీజు రూ. 125 మాత్రమే
కోదాడ: పదవ తరగతి చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వార్షిక పరీక్ష ఫీజు రాయితీని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ దీన్ని పొందడానికి విధించిన నిబంధనే హాస్యాస్పదంగా ఉంది. ఈ ఫీజు రాయితీ పొందడానికి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులకు రూ.20 వేలు, పట్టణ ప్రాంత వాసులుకు రూ.25 వేలు ఉండాలని నిబంధన విధించింది. ప్రస్తుతం దినసరి కూలీలకు కూడా వార్షిక ఆదాయం రూ. లక్షకు తక్కువగా ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో పేద విద్యార్థులు ఈ ఫీజు రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. ఈ నిబంధనను మార్చాలని చేస్తున్న విజ్ఞప్తులు బుట్టదాఖలవుతున్నాయే తప్పా ఆచరణకు నోచుకోవడం లేదు.
ఇదీ చదవండి: TS 10th Class Model Papers - 2025
రెండు, మూడు వందలు ఖర్చు
వార్షిక ఆదాయం సర్టిఫికెట్ తీసుకోవాలంటే విద్యార్థులు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అక్కడి క్లర్క్‌కు వంద రూపాయలు ఇచ్చుకోవాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఒక రోజు మొత్తం సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీనికి వారు రూ.100 వసూలు చేస్తున్నారు. ఇలా 125 రూపాయల రాయితీ కోసం రెండు మూడు వందలు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో తల్లిదండ్రులు ఫీజు రాయితీ గురించి ఆలోచించడం మానేశారు. ఇబ్బందిగా ఉన్నా మొత్తం ఫీజు చెల్లిస్తున్నారు. నిజంగా పేద విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వానికి ఉంటే ఈనిబంధనలన్నీ తొలగించి ఆయా సామాజిక వర్గాల వారికి పూర్తి ఫీజు రాయితీ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
రూ.1000 నుంచి రూ.2వేల వరకు వసూలు!
పదవ తరగతి వార్షిక ఫీజు రూ.125 మాత్రమే. కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు రూ.1000 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి రసీదు కూడా ఇవ్వడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రూ.125కు బదులుగా రూ.400 వసూలు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కోదాడ బాలుర పాఠశాలకు హెచ్‌ఎంగా మండల విద్యాధికారి ఉన్నారు. ఇదే పాఠశాలలో రూ.400 వసూలు చేస్తున్నారని అలాంటప్పుడు తమను ఎందుకు అంటున్నారని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నల్ పరీక్ష ఫీజు, ఫొటోలు, ఆన్‌లైన్ చార్జీలను కలిపి రూ.400 తీసుకుంటున్నట్లు ఎంఈఓ చెబుతున్నారు. ఈ పది పరీక్షల ీఫీజుల దందాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రూ. 125 మాత్రమే తీసుకోవాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు రాయితీ విషయంలో ఉన్న ఆదాయ నిబంధనపై ప్రభుత్వ స్ధాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఇక పదవ తరగతి పరీక్ష పీజు రూ. 125 మాత్రమే. అంతకు ఒక్క రూపాయికూడా ఎక్కువ తీసుకోవద్దు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 18 వరకు తీసుకోవాలి. అదనంగా వసూలు చేస్తే నిర్దిష్టంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– అశోక్, జిల్లా విద్యాధికారి, సూర్యాపేట