Department of Education: డుమ్మా టీచర్లపై నిఘా.. పాఠశాలల్లో విరి ఫొటోలు..
అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. టీచర్ల బదిలీ, పదోన్నతులు చేపట్టి వారి సమస్యలను పరిష్కరించింది. ఇక డుమ్మా పంతుళ్లపై నిఘా పెట్టింది. కొంత మంది టీచర్లు బినామీల ద్వారా విధులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను తరగతి గదుల్లో ఏర్పాటు చేయనుంది.
ఇందుకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధి మారుమూల మండలాల్లోని పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు బినామీ టీచర్లుగా ఏర్పాటు చేసుకొని బడులకు గైర్హాజరవుతున్నారు.
చదవండి: 1 Teacher 2 Students: ఒక్కరే టీచర్.. ఇద్దరు విద్యార్థులు
పాఠశాలల్లో ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.. వారెవరనే విషయం అధికారులకు, విద్యార్థుల తల్లి దండ్రులకు సైతం తెలియడం లేదు. ఈ క్రమంలో తరగతి గదిలో వారి ఫొటోలు ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సదరు పంతుళ్లు సమయానికి వస్తున్నారా.. విధులకు ఎగనామం పెడుతున్నారా అనే విషయం తేటతెల్లం కానుంది.
పాఠశాలల్లో టీచర్ల ఫొటోలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయుల ఫొటోలను తరగతి గదుల్లో ఏర్పాటు చేసేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. టీచర్ ఫొటోతో పాటు పేరు, ఏ సబ్జెక్టు బోధిస్తారు, సెల్ నంబర్ వంటివి పొందుపరుస్తారు. సదరు ఉపాధ్యాయుడు అందుబాటులో లేకుంటే పాఠశాలకు వచ్చిన అధికారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకునే అవకా శం ఉంటుంది. అయితే ఇదివరకు ఉపాధ్యాయు లకు బయోమెట్రిక్ హాజరు ఉండగా, ప్రస్తుతం ఆ విధానం మూలన పడింది. దీంతో చాలా మంది సమయపాలన పాటించకపోవడంతో పాటు విధులు ఎగనామం పెడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారనే లేకపోలేదు.
బోధన మెరుగు పడేలా..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డుమ్మా పంతుళ్ల ఆగడాలకు చెక్ పడనుంది. అలాగే విద్యాబోధన గాడిన పడే అవకాశం ఉంటుంది. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలతో పాటు వారి సమాచారం ఏర్పాటు చేస్తున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి.
– ప్రణీత, డీఈవో