Intermediate Exams: ఇంటర్ ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్ రక్షణ ....నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
అమరావతి: ఇంటర్మీడియట్ అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్ష పేపర్లు ఎక్కడా బయటకు రాకుండా గతేడాది అనుసరించిన విధానాలనే అమలు చేశారు. పరీక్షకు గంట ముందు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్‌కు ప్రశ్నాపత్రాలను విడుదల చేస్తున్నారు. వెంటనే ప్రిన్సిపల్ పాస్‌వర్డ్‌తో ఆన్‌లైన్‌లోని ప్రశ్నాపత్రాలను ప్రింట్ తీసి విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటివరకు జరిగిన నాలుగు యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ పరీక్షలను ఇదే విధానంలో నిర్వహించగా, మంగళవారం నుంచి ప్రారంభమైన అర్ధ వార్షిక పరీక్షలకు కూడా ఇదే విధానం అమలు చేశారు. దీంతో ఎక్కడా లీక్ అనే సమస్యలు గానీ, ప్రశ్నాపత్రం బయటకు వెళ్లడం గానీ జరగదని బోర్డు అధికారులు చెబుతున్నారు. గత నాలుగేళ్లలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ఆన్‌లైన్‌లోనే బోర్డు నుంచి గంట ముందు ప్రిన్సిపల్‌కు పంపిస్తే ప్రింట్ తీసి విద్యార్థులకు అందించేవారు.
ఇదీ చదవండి: Andhra Pradesh Intermediate Time Table 2025
కాగా, విద్యార్థుల మార్కులను సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చారు. గతంలో పబ్లిక్ పరీక్షలు మినహా, మిగిలిన పరీక్షల మార్కులను మాన్యువల్‌గా సంబంధిత కళాశాలలోనే నమోదు చేసేవారు, కానీ ఈసారి పరీక్షలు పూర్తయిన తర్వాత మార్కుల నమోదుకు విద్యార్థి వివరాలతో ప్రత్యేక ఆన్‌లైన్ ఫార్మేట్ అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంతో విద్యార్థి రాసిన అన్ని పరీక్షల వివరాలు, ప్రతిభా స్థాయి ఉన్నతాధికారులు కూడా పరిశీలించే అవకాశం కల్పించారు.
ఇదీ చదవండి: AP Inter Exam Dates 2025: Check Tentative Practical and Theory Exam Dates