Dual Degree Courses After Inter: డ్యూయల్ డిగ్రీతో.. యూజీ + పీజీ!
ఉన్నత విద్యకోసం..విద్యార్థులు బ్యాచిలర్, ఆ తర్వాత పీజీ డిగ్రీల వైపు దృష్టిపెడతారు. ఎందుకంటే.. మూడు నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ డిగ్రీతోనే కెరీర్‌లో రాణించలేని పరిస్థితి నెలకొంది! సంబంధిత విభాగంలో పీజీ సైతం పూర్తిచేస్తేనే జాబ్ మార్కెట్‌లో గుర్తింపు లభిస్తోంది!! కాని బ్యాచిలర్ తర్వాత పీజీలో చేరాలంటే.. సంబం«ధిత ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరో రెండేళ్ల పాటు చదువుకోసం వెచ్చించాలి. ఇలాంటి విద్యార్థులు ఒకే ప్రవేశ ప్రక్రియతో.. ఐదేళ్లలోనే అటు బ్యాచిలర్, ఇటు పీజీ సైతం పూర్తిచేసుకునే మార్గం ఉంది! అదే.. డ్యుయల్ డిగ్రీ విధానం!! ఈ నేపథ్యంలో.. ఏకకాలంలో డిగ్రీ+పీజీకి మార్గాలు, అందుబాటులో ఉన్న కోర్సులు, అందిస్తున్న యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు తదితర అంశాలపై విశ్లేషణ...
- ఒకే సమయంలో యూజీ, పీజీ చదివే అవకాశం
- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో అయిదేళ్లలోనే ఎంటెక్
- సైన్స్ విభాగంలో బీఎస్+ఎంఎస్ కోర్సులు
- సంప్రదాయ కోర్సులో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లు
- విద్యార్థులకు ఏడాది సమయం కలిసొచ్చే అవకాశం
బీటెక్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్ల కోర్సు. అంటే.. సంప్రదాయ విధానంలో ఎంటెక్ పట్టా పొందాలంటే.. మొత్తం ఆరేళ్ల సమయం పడుతుంది. కానీ..ఐఐటీలు అందిస్తున్న బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీని అయిదేళ్లలోనే పూర్తిచేసుకోవచ్చు. ఈ విధానంలో ఒక ఏడాది ముందుగానే పీజీ సర్టిఫికెట్ చేతిలో పడుతోంది. దేశంలోని అన్ని ఐఐటీలు అయిదేళ్ల వ్యవధిలో బీటెక్+ఎంటెక్ పేరుతో డ్యూయల్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వంటి విద్యాసంస్థలు సైతం బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి.
చదవండి: Engineering Special: 'సీఎస్‌ఈ'కే.. సై అంటున్న విద్యార్థులు
సైన్స్ కోర్సుల్లోనూ
- సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన ఐఐఎస్‌ఈఆర్‌లో అయిదేళ్ల బీఎస్+ఎంఎస్ కోర్సు అందుబాటులో ఉంది. ఇక్కడ బీఎస్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు, ఎంఎస్ కోర్సు రెండేళ్లుగా ఉంటోంది. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ విధానంలో అయిదేళ్లకే ఎంఎస్ పట్టా సొంతం చేసుకోవచ్చు.
- ఐఐఎస్‌సీ-బెంగళూరు కూడా ఇదే తరహాలో ఇంటిగ్రేటెడ్ బీఎస్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. నాలుగేళ్ల బీఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌లో అయిదో సంవత్సరంలో ఎంఎస్‌లో చేరే అవకాశం ఉంది.
- ఐఐటీ రూర్కీ కూడా బీఎస్+ఎంఎస్ పేరుతో డ్యూయల్ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. బీఎస్ చివరి సంవత్సరం ముగిసిన తర్వాత విద్యార్థులు తమ అర్హతకు సరితూగే స్పెషలైజేషన్‌లో నేరుగా ఎంఎస్‌లో చేరొచ్చు.
ఐఐటీ జోథ్‌పూర్.. బీఎస్+ఎంటెక్
ఐఐటీ-జోథ్‌పూర్ ఈ ఏడాది నుంచి బీఎస్ + ఎంటెక్ ప్రోగ్రామ్‌ను అందించనుంది. ఈ ఇన్‌స్టిట్యూట్.. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఎంటెక్‌లో చేరే వీలుంది. ఈ విధానాన్ని బీఎస్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీగా పేర్కొంటున్నారు.
చదవండి: Best Engineering Branch: బీటెక్... కాలేజ్, బ్రాంచ్ ఎంపిక ఎలా
బీటెక్ + ఎంబీఏ
ప్రస్తుతం దేశంలో మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా డ్యుయల్ డిగ్రీ విధానంలో అందిస్తున్నారు. బీటెక్ ఉత్తీర్ణుల్లో అధిక శాతం మంది ఎంబీఏ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో పలు ఇన్‌స్టిట్యూట్‌లు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంబీఏ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ఒకవైపు టెక్నికల్ స్కిల్స్, మరోవైపు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు రెండూ లభిస్తున్నాయి.
'లా'.. అయిదేళ్లే
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.
వాస్తవానికి మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో లా ఎంట్రన్స్‌లో అర్హత సాధించి.. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాల్సి ఉంటుంది. అంటే..ఇంటర్ తర్వాత ఎల్‌ఎల్‌బీ పట్టా పొందేందుకు ఆరేళ్ల సమయం వెచ్చించాలి. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ విధానంలో.. ఇంటర్ అర్హతతోనే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరొచ్చు. ఇలా విద్యార్థులకు ఒక ఏడాది సమయం కలిసొస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ను నేషనల్ లా యూనివర్సిటీలు అందిస్తున్నాయి. క్లాట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలోనూ ఇంటర్మీడియెట్ అర్హతతోనే 'లా' సెట్‌లలో అర్హత ఆధారంగా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరే వీలుంది.
చదవండి: After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..
ఇంటిగ్రేటెడ్ పీజీ
ఒకే సమయంలో బ్యాచిలర్, పీజీకి మార్గం.. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లు. ఇవి అధిక శాతం సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లోనే ఉన్నాయి. బీఏ+ ఎంఏ, బీకాం+ఎంకాం, బీఎస్సీ+ఎమ్మెస్సీలను ప్రధాన ప్రోగ్రామ్‌లుగా పేర్కొనొచ్చు. వీటి వ్యవధి అయిదేళ్లు. అంటే.. మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ, ఆ తర్వాత మరో రెండేళ్లు పీజీ ప్రోగ్రామ్. ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల వల్ల విద్యార్థులకు ప్రధానంగా కలిగే ప్రయోజనం.. డిగ్రీ తర్వాత పీజీ కోర్సులో ప్రవేశానికి ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం ఉండదు. మొదటి మూడేళ్ల బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత తమకు కొనసాగడం ఆసక్తి లేకపోతే.. సదరు ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించే(ఎగ్జిట్) అవకాశం కూడా ఉంది. ఇలాంటి విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్లను పొందొచ్చు.
ప్రస్తుతం ఈ తరహా కోర్సులను అన్ని యూనివర్సిటీల్లో అందిస్తున్నారు. టిస్, జేఎన్‌యూ వంటి ప్రముఖ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు.. ఇంటిగ్రేటెడ్ ఎంఏ పేరుతో పలు ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో ఎంఏ స్థాయిలో సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి.
చదవండి: Pre-placement offers at IITs: ఐఐటీల్లో.. పీపీఓలు అదరహో!
పెరుగుతున్న ఆదరణ
- ప్రస్తుతం పలు యూనివర్సిటీలు అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లకు విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఐఐటీల్లోని డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశిస్తున్న విద్యార్థుల సంఖ్యనే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. బీటెక్‌లో సీఎస్‌ఈ లేదా తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌లో సీటు లభించని విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్నారు.
- కొంతమంది విద్యార్థులు నేరుగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లకే తమ ఆప్షన్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు. సంప్రదాయ కోర్సుల్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ వైపు దృష్టి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా సైన్స్ కోర్సుల విషయంలో ఈ దృక్పథం ఎక్కువగా ఉంటోంది.
ఎగ్జిట్ సదుపాయం
బ్యాచిలర్, పీజీ కలిపి డ్యూయల్ డిగ్రీ పేరుతో అందిస్తున్న యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఎగ్జిట్ సదుపాయాన్ని కల్పించడం విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఉదాహరణకు ఐఐటీ రూర్కీలో అయిదేళ్ల బీఎస్+ఎంఎస్ ప్రోగ్రామ్‌లో నాలుగో ఏడాది తర్వాత విద్యార్థులు ఎగ్జిట్ అవ్వొచ్చు. వీరికి బీఎస్ సర్టిఫికెట్ అందిస్తారు. బీటెక్+ఎంటెక్ పేరుతో అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సుల విషయంలో మాత్రం ఈ అవకాశం లేదు.
ఎంపికలో అప్రమత్తంగా
డ్యూయల్ డిగ్రీ కోర్సులను ఎంచుకునే విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత కరిక్యులంను పరిశీలించాలని..తమ ఆసక్తికి అనుగుణంగా ఉందో లేదో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఎగ్జిట్ మార్గం, రీసెర్చ్‌లో పాల్పంచుకునే అవకాశాల గురించి కూడా తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. ఇన్‌స్టిట్యూట్స్‌ను ఎంచుకునే ముందుకు నిర్దిష్టంగా ఆయా ప్రోగ్రామ్‌లకు ఉన్న గుర్తింపుపై స్పష్టత తెచ్చుకోవాలని చెబుతున్నారు.
చదవండి: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
డ్యూయల్ డిగ్రీ.. ప్రయోజనాలు.. ప్రతికూలతలు ప్రయోజనాలు
- ఇంటర్ అర్హతతోనే పీజీ దిశగా నేరుగా అవకాశం.
- బీటెక్+ఎంటెక్ కోర్సులో ఏడాది వ్యవధి కలిసొచ్చే అవకాశం.
- సైన్స్, హ్యుమానిటీస్ కోర్సుల విషయంలో బ్యాచిలర్ తర్వాత ఎగ్జిట్ అయ్యే అవకాశం.
- బ్యాచిలర్ తర్వాత పీజీలో చేరేందుకు మరో ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేకపోవడం.
ప్రతికూలతలు
- టెక్ కోర్సుల్లో ఎగ్జిట్ అవకాశాలు తక్కువగా ఉండడం.
- తప్పనిసరిగా మొత్తం అయిదేళ్లు చదవాల్సిన ఆవశ్యకత.
- రీసెర్చ్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకునే అవకాశం లేకపోతే.. నైపుణ్యాలు లభించని పరిస్థితి.
- పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లనే ఎంచుకోవాల్సిన పరిస్థితి.
డ్యూయల్ డిగ్రీ కోర్సులు.. ముఖ్యాంశాలు
- టెక్, సైన్స్ విభాగాల్లో అత్యధికంగా డ్యూయల్ డిగ్రీ కోర్సులు.
- ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు ప్రముఖ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్.
- రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు.
- టెక్, మేనేజ్‌మెంట్ కోర్సుల కలయికగానూ పలు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు.
ఆసక్తికి అనుగుణంగా
డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో చేరే విద్యార్థులు తమ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా స్టెమ్ కోర్సుల్లో సుదీర్ఘ కాలం అధ్యయనం కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఎంతో ప్రధానం. ఎగ్జిట్ ఆప్షన్ ఉన్న కోర్సులను, ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆసక్తి ఉండి చేరితే మాత్రం కచ్చితంగా సదరు విద్యార్థులకు కెరీర్ పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
-ప్రొ''డి.ఎన్.రెడ్డి, యూజీసీ మాజీ సభ్యులు