Skip to main content

Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

Best Engineering Branch

ఇంజనీరింగ్‌.. లక్షల మంది విద్యార్థుల లక్ష్యం! రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన.. టీఎస్‌ ఎంసెట్, ఏపీ ఈఏపీసెట్‌ మొదలు జాతీయ స్థాయిలో జరిగే.. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ వరకూ లక్షల మంది పోటీపడుతుంటారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దీంతో విద్యార్థులు సీట్ల భర్తీ ప్రక్రియ, కౌన్సెలింగ్‌పై దృష్టిసారిస్తున్నారు. కాలేజ్‌ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కాలేజ్‌ లేదా కోర్సులో దేనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న బ్రాంచ్‌లు ఏవి.. ఇలా విద్యార్థులకు ఎదురవుతున్న సందేహాలపై ప్రత్యేక కథనం.. 

  • 21 నుంచి మొదలైన టీఎస్‌ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌
  • 22 నుంచి ఏపీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌
  • కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక కీలకమంటున్న నిపుణులు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో విద్యార్థులకు ప్రధానంగా బ్రాంచ్, కాలేజీలో.. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే సందేహం ఎదురవుతుంది. 'బ్రాంచ్‌ ఎంపికకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రాంచ్‌ ఎంపికలో తమ ఆసక్తి, అభిరుచికి పెద్దపీట వేయాలి. క్రేజ్‌ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవడం సరికాదు. దీనివల్ల అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్తు గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది' అంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రాంచ్‌ ఎంపికలో ఆయా బ్రాంచ్‌ల సిలబస్, కరిక్యులం స్వరూపాన్ని పరిశీలించి.. తమ సహజ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం మేలు.

చ‌ద‌వండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

కాలేజ్‌ ఎంపిక.. ఇవి కీలకం

బ్రాంచ్‌ ఎంపికలో స్పష్టత వచ్చిన విద్యార్థులు మలి దశలో కాలేజ్‌ ఎంపికపై దృష్టిపెట్టాలి. ఇందుకోసం పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 

  • ఏఐసీటీఈ నిబంధనలు: కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ వరకూ.. అన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఈ సమాచారం ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలి. 
  • ఎన్‌బీఏ గుర్తింపు: తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు సదరు కాలేజ్‌లో ఎన్‌బీఏ గుర్తింపు ఉందో లేదో కనుక్కోవాలి. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌లా వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్‌ అంటూ.. అన్ని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • కాలేజ్‌కు ఉన్న పేరు: గత ఏడాది సదరు కాలేజ్‌లో సీట్ల భర్తీలో ఓపెనింగ్‌క్లోజింగ్‌ ర్యాంకుల వివరాలు గమనించాలి. ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలలు సహా పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్‌ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటోంది. అంటే..ఆ కళాశాలలు విద్యార్థుల ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు. 
  • టీచింగ్‌లెర్నింగ్‌: కళాశాలలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ.. టీచింగ్‌ విధానంలో లోపాలు ఉండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్‌ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశిత పరిశీలన చేయాలి. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ సైతం ఉన్నారని ప్రకటనలు ఇస్తుంటాయి.

చ‌ద‌వండి: Top 20 Engineering(Civil)Colleges : క్రేజ్ త‌గ్గ‌ని.. సివిల్ ఇంజనీరింగ్.. టాప్‌-20 కాలేజీలు ఇవే..

ప్లేస్‌మెంట్స్‌

కళాశాలను ఎంపిక చేసుకునేటప్పుడు గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్స్‌ను పరిశీలించాలి. సదరు కాలేజీకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి.వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయో గమనించాలి. కొన్ని కళాశాలలు తమ కళాశాలలకు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని కలర్‌ఫుల్‌ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా వచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీల్లో కోర్‌ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇచ్చాయో తెలుసుకోవాలి. ప్రముఖ కంపెనీలు సైతం బీపీఓ, వాయిస్, నాన్‌వాయిస్‌ ప్రొఫైల్స్‌లో ప్లేస్‌మెంట్స్‌ ఇస్తున్నాయి. కోర్‌ జాబ్‌ ప్రొఫైల్‌ ఆఫర్స్‌ సంఖ్య 20 నుంచి 30 శాతం లోపే ఉంటోంది.

మెచ్చిన బ్రాంచ్‌ రాకుంటే

ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినా.. మెచ్చిన బ్రాంచ్‌లో సీటు వచ్చే అవకాశం లేకుంటే.. సదరు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉండే ఇంటర్‌ డిసిప్లినరీ బ్రాంచ్‌లవైపు దృష్టిసారించొచ్చు. కోరుకున్న బ్రాంచ్‌లో సీటు లభించలేదని నిరుత్సాహానికి గురికాకూడదు.

నచ్చిన కాలేజ్‌ రాకుంటే

కోరుకున్న కాలేజ్‌లో ప్రవేశం లభించకున్నా.. స్వీయ అధ్యయనం ద్వారా రాణించేందుకు కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్‌ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈలెర్నింగ్‌ పోర్టల్స్‌ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్‌లైన్‌ లెక్చర్స్, వర్చువల్‌ క్లాస్‌రూమ్స్, వర్చువల్‌ లేబొరేటరీ సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి.

చ‌ద‌వండి: Top Engineering(CSE)Colleges : సీఎస్‌ఈ బ్రాంచ్‌కు టాప్‌-20 ఇంజ‌నీరింగ్ కాలేజీలు ఇవే..

ప్రధాన బ్రాంచ్‌లు ఇవే
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

గత మూడు, నాలుగేళ్లుగా టాప్‌ ర్యాంకర్లు సీఎస్‌ఈ బ్రాంచ్‌లోనే చేరారు. జనరల్‌ కేటగిరీలో 1500లోపు ర్యాంకుతోనే అన్ని ఐఐటీల్లో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అయిపోతున్నాయి. ఐఐటీలే కాకుండా.. ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇదే పరిస్థితి. యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలలు, టాప్‌10, 20 ఇన్‌స్టిట్యూట్‌లలో జనరల్‌ కేటగిరీలో అయిదు వేలలోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతున్నాయి. కారణం.. ప్రస్తుతం సీఎస్‌ఈకి ఉద్యోగాల పరంగా మెరుగైన అవకాశాలు అందుబాటులో ఉండటమే. డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ ఫలితంగా రాబోయే రోజుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయనే వార్తలు కూడా విద్యార్థులు సీఎస్‌ఈ పట్ల ఆసక్తి చూపడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌

ఐఐటీల్లో జనరల్‌ కేటగిరీలో గత రెండేళ్లుగా సగటున మూడున్నర వేల లోపు ర్యాంకుతో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఇతర టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. ఇంటర్నెట్, బ్రాడ్‌ బ్యాండ్, స్మార్ట్‌ టెక్నాలజీస్, ఐటీసీ అమలు వంటి విధానాలతోపాటు, 5జి టెక్నాలజీ స్థాయికి టెలికం రంగం విస్తరిస్తోంది. డిజిటల్‌ ఇండియా, డిజిటైజేషన్, డిజిటల్‌ లిటరసీ మిషన్‌ వంటి పలు పథకాలకు నాంది పడింది. దీంతో వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తోంది.

ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

ఈఈఈగా సుపరిచితమైన ఈ బ్రాంచ్‌ కూడా విద్యార్థుల ఆదరణలో రెండు, లేదా మూడు స్థానాల్లో నిలుస్తోంది. ఈ బ్రాంచ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తు పరంగా ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 1.5 లక్షల మంది ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు అవసరం ఏర్పడనుందని పరిశ్రమ వర్గాల అంచనా. 2025 నాటికి ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తిలో స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయి.

సివిల్‌ ఇంజనీరింగ్‌

మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో కట్టడాలు, డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించేలా ఈ కోర్సు స్వరూపం ఉంటుంది. జీపీఎస్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ వంటి పలు స్పెషలైజేషన్లకు రూపకల్పన జరిగినప్పటికీ.. వీటికి ఆధారం సివిల్‌ ఇంజనీరింగ్‌లోని మౌలిక సూత్రాలే. సివిల్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు అవసరమైన గృహ నిర్మాణాల కోణంలో రియల్టీ రంగంలో కార్పొరేట్‌ సంస్థలు అడుగుపెట్టడం కూడా ఈ బ్రాంచ్‌ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది. సివిల్‌ ఇంజనీరింగ్‌లో రాణించాలంటే..డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ వంటి అంశాలపై పట్టు సాధించాలి.

మెకానికల్‌ ఇంజనీరింగ్‌

రోజురోజుకీ కొత్త టెక్నాలజీలతో విస్తరిస్తున్న విభాగం..మెకానికల్‌ ఇంజనీరింగ్‌. మెకానికల్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే వాహన పరిశ్రమ నుంచి.. బోయింగ్‌ విమానాల ఉత్పత్తి వరకూ.. ప్రతి విభాగంలోనూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల అవసరం ఏర్పడుతోంది. ఫలితంగా ఈ బ్రాంచ్‌ నిత్య నూతనంగా వెలుగులీనుతోంది. ఇటీవల కాలంలో ఈ విభాగంలో ఆధునికత దిశగా అడుగులు పడుతున్నాయి. రోబోటిక్స్,అన్‌మ్యాన్డ్‌ వెహికిల్స్‌ వంటి వాటిని వీటికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనొచ్చు. ఈ బ్రాంచ్‌ విద్యార్థులకు అకడమిక్‌ స్థాయిలోనే రోబోటిక్స్, క్యాడ్, క్యామ్, 3డి డిజైన్‌ టెక్నాలజీస్‌ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ఆధారిత మెకా నికల్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు సొంతమవుతాయి. పైన పేర్కొన్న బ్రాంచ్‌లతోపాటు కెమికల్‌ ఇంజనీరింగ్‌; ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌; బయో టెక్నాలజీ; బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌; నావల్‌ ఆర్కిటెక్చర్‌/మెరై¯Œ ఇంజనీరింగ్‌; టెక్స్‌టైల్‌ టెక్నాలజీ వంటివి ముందంజలో నిలుస్తున్నాయి. 

ఆసక్తికే ప్రాధాన్యం

బ్రాంచ్‌ ఎంపికలో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తికే ప్రాధాన్యమివ్వడం మేలు. ఆసక్తి లేని బ్రాంచ్‌ను ఎంచుకుంటే.. అందులో అకడమిక్‌గా రాణించలేక.. భవిష్యత్తులో నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి లేని బ్రాంచ్‌ను ఎంచుకున్నా.. దానిపై ఇష్టం పెంచుకోవాలి. ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా.. క్లాస్‌ రూమ్‌ లెర్నింగ్‌కే పరిమితం కాకుండా.. లేటెస్ట్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునేలా స్వీయ ప్రణాళికలు రూపొందించుకోవాలి. 
ప్రొ''ఎన్‌.వి.రమణరావు,డైరెక్టర్,నిట్‌వరంగల్‌

Published date : 22 Aug 2022 04:53PM

Photo Stories