Careers in Space: అంతరిక్ష విభాగంలో అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ మార్గాలు ఇవే..
- అంతరిక్ష విభాగంలో అద్భుత కెరీర్స్
- ఆస్ట్రోనాట్ నుంచి స్పేస్ సైంటిస్ట్ వరకు ఉద్యోగాలు
- అకడమిక్ నైపుణ్యాలతో సొంతం చేసుకోవచ్చు
- ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో సంబంధిత కోర్సులు
నిప్పులు కక్కుతూ.. నింగికి ఎగసే శాటిలైట్ ప్రయోగాలను వీక్షిస్తుంటే.. అదొక అద్భుత అనుభూతి. కాని మన కంటికి కనిపించే ఈ అంతరిక్ష ప్రయోగాల వెనుక ఎంతో మంది పట్టుదల, అకుంఠిత దీక్ష, కృషి దాగి ఉంటుంది. సదరు ప్రయోగం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగి విజయవంతమయ్యేలా సైంటిస్ట్‌లు నిరంతరం పరిశోధనలు చేస్తుంటారు. శాటిలైట్స్ రూపకల్పన, పర్యవేక్షణ నైపుణ్యాలు పొందాలంటే.. అకడెమిక్‌గా సంబంధిత కోర్సులు పూర్తి చేయడం తోపాటు శిక్షణ సైతం అవసరం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పేరున్న పలు ఇన్‌స్టిట్యూట్‌లు స్పేస్ కోర్సులను అందిస్తున్నాయి.
ఇంటర్‌తోనే అంతరిక్ష కోర్సు
విద్యార్థులు ఇంటర్మీడియెట్ అర్హతతోనే అంతరిక్ష కోర్సుల్లో చేరే వీలుంది. వీటిల్లో బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ప్రధానంగా పేర్కొనొచ్చు. ఈ కోర్సు ద్వారా విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది. ఐఐటీ ఖరగ్‌పూర్, బాంబే, మద్రాస్, కాన్పూర్ తదితర టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
చదవండి: Engineering Careers
ఐఐఎస్‌టీలో ఆస్ట్రానమీ కోర్సులు
- స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకతను గుర్తించిన ఇస్రో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) పేరుతో తిరువనంతపురంలో ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ స్థాయిలో.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఏవియానిక్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
- అదే విధంగా ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎర్త్ సిస్టమ్ సైన్స్, ఆప్టికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో.. అయిదేళ్ల బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సును అందిస్తోంది. వీటికి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
- పీజీ స్థాయిలో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్, ఎర్త్ సైన్స్ సిస్టమ్స్ వంటి కోర్ బ్రాంచ్‌లు సహా మొత్తం పదిహేను స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్ కోర్సులను ఐఐఎస్‌టీ అందిస్తోంది. గేట్ స్కోర్ ఆధారంగా వీటిలో అడుగు పెట్టొచ్చు.
- పీహెచ్‌డీ స్థాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో పీహెచ్‌డీ అవకాశాలున్నాయి. వీటిలో పూర్తిగా అభ్యర్థులు పీజీలో చూపిన ప్రతిభ, రీసెర్చ్‌పై ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలు కల్పిస్తారు.
అన్ని బ్రాంచ్‌లకు అవకాశం
స్పేస్ సైన్స్ టెక్నాలజీ విభాగంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులే కాకుండా.. బీటెక్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల అభ్యర్థులు కూడా కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. స్పేస్ క్రాఫ్ట్ లేదా శాటిలైట్‌ను రూపొందించే క్రమంలో ఎలక్ట్రికల్, మెకానికల్ , కంప్యూటర్ సైన్స్ అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. అప్లైడ్ సైన్సెస్‌లో నైపుణ్యంతోనూ అంతరిక్ష కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫిజిక్స్‌లో రీసెర్చ్ స్థాయి అభ్యర్థులకు ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి.
పీహెచ్‌డీతో సైంటిస్ట్
ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు, రోబోటిక్స్, సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ అర్హతతో అంతరిక్ష రంగంలో సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తోంది. బార్క్, డీఆర్‌డీఓ రీసెర్చ్ లేబొరేటరీల్లో పీహెచ్‌డీ చేసే వీలుంది. ప్రస్తుతం ఐఐఎస్‌సీ-బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, ఐఐటీ-ఢిల్లీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆస్ట్రోఫిజిక్స్,ఏవియానిక్స్, కాస్మా లజీ, ఆస్ట్రానమీ విభాగాల్లో పరిశోధనలకు అవకాశం లభిస్తోంది. వీటిలో ప్రవేశానికి సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా జెస్ట్(జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్) స్కోర్‌లను ప్రామాణికంగా తీసుకుని.. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
చదవండి: CSIR UGC NET 2023: సైన్స్ పరిశోధనలకు మార్గం.. 200 మార్కులకు పరీక్ష
వేతనాలు
బీటెక్ నుంచి పీహెచ్‌డీ వరకు స్పేస్ సైన్స్ టెక్నాలజీ సంబంధిత కోర్సులు పూర్తి చేసుకున్న వారికి విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తున్నాయి. ఇస్రో, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్ తదితర సంస్థల్లో చేరిన వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి. అంతరిక్ష రంగంలో ఉన్నత కొలువులు పొందిన అభ్యర్థులు నెలకు రూ. రెండు లక్షల వరకూ వేతనం అందుకునే వీలుంది. అనుభవంతో సైంటిస్ట్ హోదాలో నెలకు రూ.అయిదు లక్షల వరకు వేతనం పొందొచ్చు.
స్పేస్ కెరీర్స్ ఇవిగో
ఆస్ట్రోనాట్
స్పేస్ టెక్నాలజీ లేదా స్పేస్ సైన్స్ అనగానే గుర్తొచ్చే జాబ్ ప్రొఫైల్ ఆస్ట్రోనాట్(వ్యోమగామి) అనడంలో సందేహం లేదు. ఆస్ట్రోనాట్‌గా అవకాశం పొందాలంటే.. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ నైపుణ్యాలు తప్పనిసరి. దీంతోపాటు శారీరకంగానూ ద్రుఢత్వం అవసరం. ఆస్ట్రోనాట్‌గా ఎంపికైన వారికి కఠోర శిక్షణనందిస్తారు. రోదసీలోని వాతావరణ పరిస్థితుల్లో ఇమడగలిగేలా శిక్షణను ఇస్తారు.
స్పేస్ ఇంజనీర్స్
అంతరిక్ష రంగంలో మరో ముఖ్యమైన కొలువు.. స్పేస్ ఇంజనీర్. స్పేస్-క్రాఫ్ట్స్, స్పేస్ వెహికిల్స్, స్పేస్ స్టేషన్స్‌ను డిజైన్ చేయడమే కాకుండా.. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ నిరంతరం స్పేస్ క్రాఫ్ట్స్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. స్పేస్ ఇంజనీర్స్‌గా స్థిర పడాలంటే.. ఏరోస్పేస్/ఏరో నాటికల్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, స్పేస్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎంటెక్ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసుకోవాలి.
స్పేస్ సైంటిస్ట్
అంతరిక్ష శాస్త్రంలో మరో కీలక హోదాగా స్పేస్ సైంటిస్ట్‌ను పేర్కొనొచ్చు. స్పేస్ సైన్స్‌కు సంబంధించి పలు విభాగాల్లో పరిశోధనలు చేసి.. ఆయా విభాగాల్లో స్పేస్ క్రాఫ్ట్స్ రూపకల్పనకు, వాటికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. వీరికి ఇస్రో, షార్ వంటి సంస్థల ఆధ్వర్యంలోని లేబొరేటరీల్లో కొలువులు లభిస్తాయి.
టెక్నాలజిస్ట్స్
స్పేస్ ఇంజనీర్స్‌కు, స్పేస్ సైంటిస్ట్స్‌కు సహాయకారులుగా టెక్నాలజిస్టులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి కమ్యూనికేషన్ టెక్నీషియన్స్, క్యాడ్ ఆపరేటర్స్, డ్రాఫ్టర్స్,ఎలక్ట్రిషియన్స్, లేజర్ టెక్నీషియన్స్, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్స్, రాడార్ టెక్నీషియన్స్, రోబోటిక్ టెక్నీషియన్స్, శాటిలైట్ టెక్నీషియన్స్ వంటి కొలువులు లభిస్తాయి.
చదవండి: Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!
మెటీరియాలజిస్ట్ట్
అంతరిక్ష ప్రయోగ శాలలు, పరిశోధన సంస్థల్లో లభించే మరో ముఖ్య కొలువు ..మెటీరియాలజిస్ట్. వీరు భూ వాతావరణాన్ని పరిశీలించి, భవిష్యత్తు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, దానికి సంబంధించిన నివేదికలను రూపొందించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
క్లైమేటాలజిస్ట్
అంతరిక్ష రంగంలో మరో ముఖ్యమైన జాబ్.. క్లైమేటాలజిస్ట్. వీరు కూడా నిర్దిష్ట ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, అప్పటికే దానికి సంబంధించిన ప్రయోగాల నివేదికలను విశ్లేషించి క్రోడీకరించడం తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
స్పేస్ క్రాఫ్ట్ డిజైనర్స్
స్పేస్ టెక్నాలజీ/స్పేస్ సైన్స్ విభాగంలో మరో అత్యంత కీలకమైన హోదా.. స్పేస్ క్రాఫ్ట్ డిజైనర్స్. శాస్త్రవేత్తల పరిశోధనలకు, ప్రయోగించనున్న ఉపగ్రహాల లక్ష్యాలకు అనుగుణంగా పేలోడ్ సామర్థ్యాన్ని, ప్రయోగించనున్న ఉపగ్రహాల సంఖ్యకు అనుగుణంగా స్పేస్ క్రాఫ్ట్‌ను డిజైన్ చేయడం వీరి ప్రధాన విధిగా ఉంటుంది.
Tags
- Careers
- Careers Courses
- Astronomy Courses
- Careers and Courses in Space
- Aditya L1 Mission
- Chandrayaan 3
- Space
- Aerospace Engineering
- Engineering
- Top institutes
- Engineering courses
- JEE Advanced
- Space Science and Technology
- Space Scientists
- Technologists
- Spacecraft Designers
- latest notifications
- SpaceExploration
- spaceDepartment
- SatelliteLaunches
- Sakshi Education Latest News