Skip to main content

CSIR UGC NET 2023: సైన్స్‌ పరిశోధనలకు మార్గం.. 200 మార్కులకు పరీక్ష

csir ugc net 2023 notification december
  • సీఎస్‌ఐఆర్‌ నెట్‌తో జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌కు మార్గం
  • సీఎస్‌ఐఆర్‌-యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల
  • సైన్సెస్, ఇంజనీరింగ్, పీజీ అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు
  • మొత్తం అయిదు విభాగాల్లో పరీక్ష నిర్వహణ

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అదేవిధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ఎంపికకు మార్గం.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్షను కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) సంయుక్తంగా నిర్వహిస్తాయి. ప్రతి ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్‌) ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యం ఆధారంగా జేఆర్‌ఎఫ్‌కు లేదా లెక్చర్‌షిప్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌నకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

అయిదు విభాగాలు

  • సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ ద్వారా సైన్సెస్‌కు సంబంధించిన అయిదు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అవి.. కెమికల్‌ సైన్సెస్‌; ఎర్త్, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, ఓషియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌; లైఫ్‌ సైన్సెస్‌; మ్యాథమెటికల్‌ సైన్సెస్‌; ఫిజికల్‌ సైన్సెస్‌. 
  • ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులు పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీ చేసేందుకు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ అయిదు విభాగాలకు సంబంధించి అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టాలనుకునే వారికి లెక్చర్‌షిప్‌ లేదా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ పేరుతో అర్హత లభిస్తుంది.

చ‌ద‌వండి: CSIR-UGC NET Notification: సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదల..

అర్హతలు

  • సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌కు సైన్సెస్, ఇంజనీరింగ్, పీజీ అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, బీఈ/బీటెక్‌/ బీఫార్మసీ/ఎంబీబీఎస్, బీఎస్సీ ఆనర్స్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. 
  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులకు లెక్చర్‌షిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌లకు అర్హత ఉండదు. అదే విధంగా బీఎస్సీ ఆనర్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న వారికి, ఫలితాల కోసం వేచి చూస్తున్న వారికి దరఖాస్తుకు అర్హత లేదు.

వయసు
జేఆర్‌ఎఫ్‌కు అభ్యర్థుల వయసు జూలై 1, 2023 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల వారికి అయిదేళ్లు, ఓబీసీ వర్గాల వారికి మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. లెక్చర్‌షిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
జేఆర్‌ఎఫ్‌.. లెక్చర్‌షిప్‌/అసిప్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌

సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ స్కోర్‌ ఆధారంగా పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం కల్పించే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్, అదే విధంగా కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేసేందుకు వీలుగా లెక్చర్‌షిప్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌లను కేటాయిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ ప్రాథమ్యం తెలియజేయాలి. పలితాల సందర్భంగా జేఆర్‌ఎఫ్‌ మెరిట్‌ లిస్ట్, లెక్చర్‌షిప్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ మెరిట్‌ లిస్ట్‌ పేరుతో రెండు జాబితాలను విడుదల చేస్తారు. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి పరిశోధన లేబొరేటరీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలలో పీహెచ్‌డీ చేసే అవకాశం లభిస్తుంది. లెక్చర్‌షిప్‌ పొందిన అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం కళాశాలల్లో అధ్యాపకులుగా చేరేందుకు ఆమోదం లభిస్తుంది.

చ‌ద‌వండి: CSIR-UGC NET 2023 Notification: సైన్స్‌లో బోధన, పరిశోధనలకు మార్గం.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌

200 మార్కులకు పరీక్ష
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ పరీక్ష మూడు విభాగాల్లో మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. మొత్తం మార్కులు రెండు వందలు. పరీక్షలో పార్ట్‌ ఏ, పార్ట్‌ బీ, పార్ట్‌ సీ ఉంటాయి. పార్ట్‌ ఏ అందరికీ కామన్‌గా జనరల్‌ అప్టిట్యూడ్‌పై ఉంటుంది. పార్ట్‌ బీ సబ్జెక్ట్‌ పేపర్‌ కాగా, పార్టీ సీలో సబ్జెక్ట్‌ పేపర్‌-2 ఉంటుంది.

పెరిగిన జేఆర్‌ఎఫ్‌

  • సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌లో విజయం సాధించి నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లు లేదా రీసెర్చ్‌ లేబొరేటరీల్లో పీహెచ్‌డీ ప్రవేశం పొందిన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ.37 వేలు చొప్పున రీసెర్చ్‌ ఫెలోషిప్, రెండేళ్లపాటు ప్రతి ఏటా రూ.20 వేల చొప్పున కాంటింజెంట్‌ గ్రాంట్‌ కూడా లభిస్తుంది. రెండేళ్ల తర్వాత పీహెచ్‌డీకి నమోదు చేసుకుంటే సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా పరిగణిస్తూ నెలకు రూ.42 వేలు చొప్పున ఫెలోషిప్‌ లభిస్తుంది. ఇలా గరిష్టంగా మొత్తం అయిదేళ్ల పాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు లభిస్తాయి.
  • గత ఏడాది వరకు జేఆర్‌ఎఫ్‌కు రూ.31 వేలు; ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ.35వేల ఫెలోషిప్‌ ఉండేది. తా­జాగా ఫెలోషిప్‌లను పెంచుతూ యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేయడంతో సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌-డిసెంబర్‌-2023లో అర్హత సాధించిన వారికి ఈ పెరిగిన మొత్తాలను అందిస్తారు.

అధ్యాపకులకు కనీస అర్హత

  • సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత వల్ల కలిగే మరో ప్రయోజనం.. అధ్యాపక వృత్తిలో అవకాశాలు కచ్చితంగా లభించడం. యూజీసీ నిబందనల ప్రకారం.. ఉన్నత విద్యా సంస్థలు లెక్చరర్స్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాలో నియామకాలకు సీఎస్‌ఐఆర్‌ -యూజీసీ నెట్‌ ఉత్తీర్ణులను నియమించుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నేపథ్యంలో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టేందుకు, యూజీసీ నిర్దేశించిన పే-స్కేల్‌కు అనుగుణంగా వేతనాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది.

చ‌ద‌వండి: CSIR UGC NET Study Material

మంచి స్కోర్‌కు మార్గమిదే
జనరల్‌ ఆప్టిట్యూడ్‌
అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడి విభాగం.. జనరల్‌ ఆప్టిట్యూడ్‌. ఇందులో రాణించేందుకు తార్కిక విశ్లేషణ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, పజిల్స్‌ తదితర అంశాలపై దృష్టి పె­ట్టాలి. అదే విధంగా బేసిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌/కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

సబ్జెక్ట్‌ పేపర్‌-1 (పార్ట్‌-బి)
పార్ట్‌-బి పేరుతో ఉండే సబ్జెక్ట్‌ పేపర్‌-1లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇవి పూర్తిగా మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. అభ్యర్థులు తమ అకడమిక్‌ స్థాయి పుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేయడం, అన్వయ దృక్పథంతో ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఇందులో మార్కులు పొందొచ్చు.

సబ్జెక్ట్‌ పేపర్‌-2 (పార్ట్‌-సి)
ఈ విభాగంలోనూ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ సంబంధిత ప్రశ్నలే ఉంటాయి. వీటి క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. శాస్త్రీయ భావనలపై అవగాహన, అన్వయ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. విశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేయడం ద్వారా సమాధానాలను గుర్తించొచ్చు. కాబట్టి అభ్యర్థులు తమ అకడెమిక్స్‌ సంబంధించి పీజీ స్థాయి పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

పరిశోధన దృక్పథం
సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లో పీజీ స్థాయి అవగాహన పొందాలి. ముఖ్యంగా రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగించాలి. తమ సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రస్తుత సమస్యలు, వాటి పరిష్కారం దిశగా పరిశోధనల గురించి అవగాహన పెంచుకోవాలి. తద్వారా పార్ట్‌-సిలో రాణించేందుకు మార్గం సుగమం అవుతుంది. 

చ‌ద‌వండి: Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!
 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 30, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: డిసెంబర్‌ 2 - డిసెంబర్‌ 4,2023
  • సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ తేదీలు: డిసెంబర్‌ 26, 27, 28 తేదీల్లో,2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in/
Published date : 14 Nov 2023 06:35PM

Photo Stories