UGC Latest Guidelines: పీహెచ్‌డీ లేకున్నా.. అసిస్టెంట్ ప్రొఫెసర్!
- యూజీసీ తాజా మార్గనిర్దేశాలు
- నెట్/స్లెట్/సెట్ అర్హత ఉంటే చాలు
- అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకాలు
యూజీసీ 2018లో జారీ చేసిన మార్గనిర్దేశాల్లో.. కళాశాల స్థాయిలో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టాలంటే.. పీహెచ్‌డీ పట్టా ఉండాలని స్పష్టం చేసింది. కాని పీహెచ్‌డీ ప్రవేశ అవకాశాల విషయంలో ఉన్న పరిమితులు..అదే విధంగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో నెలకొన్న ఫ్యాకల్టీ కొరత వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఈ నిబంధనను సడలించినట్లు స్పష్టం అవుతోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్
యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక వృత్తిలో ప్రవేశానికి తొలిమెట్టు.. అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ పోస్ట్‌ల నియామకాలకు సంబంధించి 2018లో యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం-అభ్యర్థులు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్), స్టేట్ లెవల్ ఎలిజిబిటీ టెస్ట్(స్లెట్)లలో ఏదో ఒక దాంట్లో అర్హత పొంది ఉండాలి. దీంతోపాటు సంబంధిత విభాగంలో రెగ్యులర్ విధానంలో పీహెచ్‌డీ పూర్తి చేయాలి.
చదవండి: మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి..
కొత్త నిబంధనలు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్/స్లెట్/సెట్‌లో అర్హత సాధించాలి.
- ఒకవేళ పీహెచ్‌డీ పట్టా ఉంటే.. వారికి నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణత నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది.
- అంటే.. ఇక పీహెచ్‌డీ లేకున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌లకు పోటీ పడి అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టొచ్చు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు కమిటీ
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌ల భర్తీకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని యూజీసీ పేర్కొంది. ఇందుకోసం యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు ప్రత్యేకంగా నియామక కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో వైస్ ఛాన్స్‌లర్ లేదా ఆయన తరఫున ప్రతినిధి కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాలి. వీసీ ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి ప్రొఫెసర్ స్థాయిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
- ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ విషయంలో సంబంధిత ఇన్‌స్టిట్యూట్ చైర్ పర్సన్ లేదా నామినీ నియామక కమిటీ చైర్ పర్సన్‌గా ఉంటారు. ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీ, యూనివర్సిటీ వీసీ ప్రతిపాదించిన ఇద్దరు యూనివర్సిటీ ప్రతినిధులు ఉండాలి. దీంతోపాటు ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపిక కమిటీలో నియమించాలి.
గ్రేడ్ పాయింట్ల ఆధారంగా
- యూజీసీ పేర్కొన్న నిపుణులతో ఏర్పాటైన కమిటీని స్క్రీనింగ్, మూల్యాంకన కమిటీగా పేర్కొంటారు. ఈ కమిటీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌ల నియామకాలను ఖరారు చేసేందుకు గ్రేడ్ పాయింట్ల విధానాన్ని అమలు చేస్తుంది. ఈ గ్రేడ్ పాయింట్ల ఆధారంగా తొలుత అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి..ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ, గ్రేడ్ పాయింట్లను క్రోడీకరించి తుది నియామకాలు ఖరారు చేస్తారు.
- బ్యాచిలర్ డిగ్రీలో 80 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే 15 పాయింట్లు, 60-80 శాతం మార్కులు సాధిస్తే 13 పాయింట్లు, 55-60 శాతం మధ్యలో ఉంటే 10 పాయింట్లు, 45-55 శాతం మధ్యలో ఉంటే 5 పాయింట్లు స్కోర్ కేటాయిస్తారు. పీజీలో 80 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే 25 పాయింట్లు, 60-80 శాతం మార్కులు సాధిస్తే 23 పాయింట్లు, 55-60 శాతం మధ్యలో ఉంటే 20 పాయింట్లు స్కోర్ కేటాయిస్తారు. మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో 60 శాతం పైగా మార్కులు సాధిస్తే 7 పాయింట్లు, 55-60 శాతం మధ్యలో మార్కుల సాధిస్తే 5పాయింట్లు కేటాయిస్తారు. పీహెచ్‌డీ ఉంటే 30 పాయింట్ల స్కోర్ లభిస్తుంది.
- నెట్ జేఆర్‌ఎఫ్‌కు 7పాయింట్లు, నెట్‌కు 5 పాయింట్లు, సెట్/స్లెట్‌కు 3 పాయింట్లు, యూజీసీ నిర్దేశించిన జర్నల్స్‌లో పరిశోధన పత్రం ప్రచురితమైతే.. ఒక్కో పబ్లికేషన్‌కు 2 మార్కులు చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయిస్తారు. టీచింగ్/పోస్ట్ డాక్టోరల్ అనుభవానికి ప్రతి ఏడాది రెండు మార్కులు చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయిస్తారు.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వ విభాగాల నుంచి అవార్డులు పొందితే వాటికి మూడు మార్కులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు పొందితే.. వాటికి రెండు మార్కులు కేటాయిస్తారు.
- తాజాగా పీహెచ్‌డీ నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో.. పీహెచ్‌డీకి కేటాయించిన 30 మార్కులను నెట్/స్లెట్/సెట్ స్కోర్లకు బదలాయించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చదవండి: స్కూల్ అసిస్టెంట్ సాధించాలంటే.. సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్ సాగించండిలా..
సెమినార్/లెక్చర్ విధానం
అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక ప్రక్రియలో సెమినార్ లేదా క్లాస్ రూమ్ లెక్చర్ విధానాన్ని కూడా అమలు చేసే అవకాశాన్ని యూజీసీ కల్పించింది. దీనిద్వారా సదరు అభ్యర్థులు ఏదో ఒక అంశంపై లెక్చర్ ఇవ్వాల్సి ఉంటుంది.
పదోన్నతికి పీహెచ్‌డీ తప్పనిసరి
అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో పదోన్నతులు పొందాలంటే మాత్రం పీహెచ్‌డీ పూర్తి చేయడం తప్పనిసరి. పదోన్నతుల ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్‌గా, అనంతరం ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్‌గా ఎదిగేందుకు అవకాశముంటుంది.
టీచింగ్, రీసెర్చ్
- టీచింగ్‌తోపాటు రీసెర్చ్ యాక్టివిటీస్, పరిపాలనపరమైన అంశాల్లో భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని.. పనితీరు ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించి.. పదోన్నతులు కల్పిస్తారు.
- తమకు కేటాయించిన క్లాసుల్లో 80 శాతం కంటే ఎక్కువ బోధిస్తే 'గుడ్' అని, 70-80 శాతం లోపు క్లాసులను బోధిస్తే సంతృప్తికరమని, 70 శాతం కంటే తక్కువ క్లాస్‌లను బోధిస్తే అసంతృప్తి అని పేర్కొంటారు.
- పరిపాలన, రీసెర్చ్ కార్యకలాపాలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్.. ఈ మూడింటిలో పాల్గొంటే.. గుడ్ అని, 1 లేదా రెండు యాక్టివిటీస్‌లో పాల్గొంటే సంతృప్తికరమని పేర్కొంటారు.
చదవండి: TS TET ప్రివియస్ పేపర్స్
కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్
అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికైన వారు ఆయా యూనివర్సిటీలు నిర్వహించే కెరీర్ అడ్వాన్‌మెంట్ స్కీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. టీచింగ్ మెథడాలజీలో 21 రోజుల ఓరియెంటేషన్ క్లాసులు, రిఫ్రెషర్ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా వర్క్‌షాప్స్/సిలబస్ అప్‌గ్రెడేషన్ వర్క్‌షాప్/ట్రైనింగ్ టీచింగ్-లెర్నింగ్ ఎవాల్యుయేషన్/టెక్నాలజీ ప్రోగ్రామ్స్/ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో కనీసం రెండు ప్రోగ్రామ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
లేదా మూక్ కోర్సులు, ఈ-కంటెంట్ డెవలప్‌మెంట్ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తారు. దీన్ని కూడా స్క్రీనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ కమిటీ చేపడుతుంది.