Skip to main content

Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!

పీహెచ్‌డీలో ప్రవేశాలకు యూజీసీ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్‌తోనే పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు వీలు కల్పించింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం దేశంలో పీహెచ్‌డీలో చేరేందుకు అందుబాటులో ఉన్న వివిధ ప్రవేశ మార్గాల గురించి తెలుసుకుందాం...
Pathways to Ph.D

సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌

శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు.. జాతీయ స్థాయిలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ పరీక్షలో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. కౌన్సిల్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)లు సంయుక్తంగా నిర్వహించే పరీక్ష సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌. లైఫ్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్‌; ఎర్త్, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, ఓషియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌ తదితర విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రీసెర్చ్‌ లేబొరేటరీల్లో పీహెచ్‌డీలో ప్రవేశించేందుకు సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత చక్కటి మార్గం. 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌–ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులైన వారు సీఎస్‌ఐఆర్‌ – యూజీసీ నెట్‌కు హాజరు కావచ్చు.
వెబ్‌సైట్‌: https://www.csirhrdg.res.in/

చ‌ద‌వండి: Higher Education: డిగ్రీతోనే పీహెచ్‌డీలో చేరేలా..!

పీహెచ్‌డీ వయా యూజీసీ నెట్‌

సామాజిక అభివృద్ధి ఆకాంక్ష ఉన్న విద్యార్థులు.. సామాజికంగా ఎదురవుతున్న సమస్యలకు తమ పరిశోధనల ద్వారా పరిష్కారం కనుగొనాలనుకుంటే.. వారికి అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. యూజీసీ–నెట్‌. లాంగ్వేజెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో యూజీసీ–నెట్‌ అర్హతతో పీహెచ్‌డీలో ప్రవేశం సుగమం చేసుకోవచ్చు. ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ టెస్ట్‌కు సంబంధిత సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌తో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్‌లో అర్హత సాధించి జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌) పొందితే.. జాతీయ స్థాయిలోని సోషల్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్స్, మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు యూనివర్సిటీల్లోని సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

చ‌ద‌వండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీకి యూజీసీ తాజా మార్గదర్శకాలు, అర్హతలు, ప్రవేశ మార్గాలు..

రీసెర్చ్‌ ల్యాబ్స్‌లో పీహెచ్‌డీకి.. జెస్ట్‌

పీహెచ్‌డీ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో అద్భుత మార్గం.. జెస్ట్‌! దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్‌ ల్యాబ్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం కల్పిస్తుంది.. జెస్ట్‌(జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌). ఫిజిక్స్, థియొరాటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌/న్యూరోసైన్స్‌/కంప్యుటేషనల్‌ బయాలజీ సబ్జెక్ట్‌లలో నిర్వహించే జెస్ట్‌లో విజయం సాధిస్తే..ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్, హోమీబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, హరీశ్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎస్‌సీ–బెంగళూరు వంటి 29 రీసెర్చ్‌ కేంద్రాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో, అదే విధంగా ఎంఎస్‌ బై రీసెర్చ్‌ వంటి ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు. 
వెబ్‌సైట్‌: https://www.jest.org.in

గేట్‌తో.. ఐఐటీలు, నిట్‌లు

గేట్‌.. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌. బీటెక్‌ చదువుతున్న విద్యార్థులందరికీ సుపరిచితమైన పరీక్ష ఇది. ప్రతి ఏటా నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణతతోనూ పీహెచ్‌డీలో ప్రవేశించేందుకు అవకాశం ఉంది. గేట్‌ స్కోర్‌ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలతోపాటు.. దేశంలోనే టెక్నికల్‌ విద్యకు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లతోపాటు సైన్సెస్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ అభ్యర్థులు కూడా గేట్‌ రాసేందుకు అవకాశం కల్పించారు. గేట్‌ ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశం పొందితే ఫెలోషిప్‌ సైతం లభిస్తుంది. ముఖ్యంగా జాతీయ స్థాయితోపాటు, రాష్ట్ర స్థాయిలోని ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ ప్రవేశాల్లో గేట్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం లభిస్తుంది. 
వెబ్‌సైట్‌: https://gate.iitk.ac.in

చ‌ద‌వండి: Dual Degree Courses After Inter: డ్యూయల్‌ డిగ్రీతో.. యూజీ + పీజీ!

ఐఐఎంల్లో ఫెలో ప్రోగ్రామ్‌/పీహెచ్‌డీ

ప్రస్తుత కార్పొరేట్‌ యుగంలో మేనేజ్‌మెంట్‌ (నిర్వహణ) రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. మేనేజ్‌మెంట్‌ విభాగాల్లోనూ పరిశోధనలు ఆవశ్యకమవుతున్నాయి. మేనేజ్‌మెంట్‌లో రీసెర్చ్‌ చేయడానికి సరైన వేదికలు దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐఎం(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) క్యాంపస్‌లు అని చెప్పొచ్చు. ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఐఐఎంలు రీసెర్చ్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్‌ పీహెచ్‌డీకి సమానంగా పరిగణిస్తారు. క్యాట్, జీమ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా వీటిలో అడుగుపెట్టొచ్చు. దేశంలోని దాదాపు అన్ని ఐఐఎంలలో మేనేజ్‌మెంట్‌ పీహెచ్‌డీ అవకాశం అందుబాటులోకి వచ్చింది.
వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

చ‌ద‌వండి: After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

ప్రతిష్టాత్మక ఫెలోషిప్‌.. పీఎంఆర్‌ఎఫ్‌

దేశంలో రీసెర్చ్‌ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చిన మరో ప్రధాన మార్గం.. ప్రైమ్‌ మినిస్టర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌(పీఎంఆర్‌ఎఫ్‌). సైన్స్‌/ఇంజనీరింగ్‌ /టెక్నాలజీ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, ట్రిపుల్‌ ఐటీల్లో ఆయా విభాగాల్లో పీహెచ్‌డీలోకి ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను తెచ్చారు. 
బీటెక్‌ చివరి సంవత్సరం అభ్యర్థులు మొదలు ఎంటెక్, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ అభ్యసిస్తున్న వారు ఈ స్కీమ్‌ ద్వారా పైన పేర్కొన్న ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. 
నాలుగంచెల విధానంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. నామినేషన్, డిటెయిల్డ్‌ అప్లికేషన్, ఎవాల్యుయేషన్, ఫైనల్‌ సెలక్షన్‌. 
గేట్‌లో కనీసం 650 స్కోర్‌తో ఉత్తీర్ణత సాధించాలి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనే అకడమిక్‌ డిగ్రీలు చదువుతున్న అభ్యర్థులు ప్రతి సెమిస్టర్‌లో సీజీపీఏ ఎనిమిది పాయింట్లు పొందాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ రీసెర్చ్‌ ప్రతిపాదన అంశాన్ని పీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా తెలియజేయాలి. వీటిని నిపుణుల కమిటీ సమీక్షిస్తుంది. ఈ సమీక్షలో సంతృప్తికరమైన ప్రతిపాదనలు పంపిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి.. ఆయా క్యాంపస్‌లలో పీహెచ్‌డీ చేసే విధంగా అలాట్‌మెంట్‌ చేస్తుంది. 
ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.70వేలు, మూడో ఏడాది నెలకు రూ.75వేలు, నాలుగో సంవత్సరం నెలకు రూ.80వేలు, ఐదో సంవత్సరం నెలకు రూ.80వేలు అందిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుతో పీహెచ్‌డీలో చేరిన వారికి నాలుగో ఏడాది వరకే ఈ ఫెలోషిప్‌ లభిస్తుంది. అదేవిధంగా బీటెక్‌తో ఐదో ఏడాది కూడా ఫెలోషిప్‌ అందుతుంది. 
వెబ్‌సైట్‌: https://www.pmrf.in

Published date : 08 Dec 2022 04:56PM

Photo Stories