Higher Education: డిగ్రీతోనే పీహెచ్‌డీలో చేరేలా..!
డిగ్రీ చదువుతున్నారా.. పరిశోధనలపై ఆసక్తి ఉందా.. పీహెచ్‌డీలో చేరాలని భావిస్తున్నారా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. డిగ్రీ అర్హతతోనే.. పీహెచ్‌డీలో చేరే అవకాశం కల్పిస్తోంది. అందుకు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి! తాజాగా.. యూజీసీ(మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ పీహెచ్‌డీ డిగ్రీ)–2022 పేరుతో ముసాయిదా రూపొందించింది. ఈ నేపథ్యంలో.. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి రూపొందించిన విధానాలు, రీసెర్చ్–పీహెచ్‌డీ కోణంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలు తదితర అంశాలపై విశ్లేషణ...
- యూజీసీ సరికొత్త విధానం!
- నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్‌డీలో చేరే అవకాశం
- కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఆరేళ్లు సమయం
- యూజీసీ నెట్, ఇన్‌స్టిట్యూట్స్ స్వీయ ఎంట్రన్స్‌ల ద్వారా ప్రవేశం
- పీహెచ్‌డీ ప్రవేశాలపై యూజీసీ తాజా మార్గదర్శకాలు విడుదల
యూజీసీ తాజాగా.. మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అవార్డ్ ఫర్ పీహెచ్‌డీ డిగ్రీ రెగ్యులేషన్స్–2022ను రూపొందించింది. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులకు నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించడం ప్రధాన అంశంగా తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. పీహెచ్‌డీ పూర్తి చేస్తే విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది నిస్సందేహం. ఐఐసీటీ, సీఎస్‌ఐఆర్, ఐసీఏఆర్, ఎన్‌జీఐఆర్‌ఐ, ఇక్రిశాట్ తదితర సంస్థల్లో జూనియర్ సైంటిస్ట్‌లుగా అవకాశం లభిస్తుంది. బోధన రంగంలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ప్రైవేటు సంస్థల ఆర్ అండ్ డీ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా ప్రారంభంలోనే నెలకు రూ.2లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు.
చదవండి: Higher Educationలో సమూల మార్పులు... యూకే వర్సిటీల సహకారంతో రూపకల్పన
ఈ ఏడాది నుంచే అమలు
యూజీసీ ప్రతిపాదించిన కొత్త విధానం ఈ ఏడాది నుంచే అమలు చేసే అవకాశముంది. తాజా విధానంపై ముసాయిదాను రూపొందించి, విద్యా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన యూజీసీ..దీనికి సంబంధించి డీఎస్‌టీ, హెచ్‌ఆర్‌డీ విభా గాలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
అర్హత ప్రమాణాలివే
- నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు పీహెచ్‌డీ ప్రవేశాల విషయంలో.. యూజీసీ నిర్దిష్టంగా కొన్న అర్హత ప్రమాణాలను పేర్కొంది. అవి..
- నాలుగేళ్లు లేదా ఎనిమిది సెమిస్టర్లలో 10 పాయింట్ల సీజీపీఏలో కనీసం 7.5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 0.5 స్కోర్ మినహాయింపు ఉంటుంది.
- నాలుగేళ్ల డిగ్రీతోపాటు ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలోని పీజీ కోర్సుల ఉత్తీర్ణులు కూడా పీహెచ్‌డీ ప్రవేశాలకు యధావిధిగా అర్హత పొందుతారు. వీరు కనీసం 55 శాతం మార్కులు లేదా బి గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాలి.
కనిష్టంగా రెండేళ్లు.. గరిష్టంగా ఆరేళ్లు
పీహెచ్‌డీ ప్రవేశాలకు మార్గదర్శకాలు రూపొందించిన యూజీసీ.. పీహెచ్‌డీ కాల వ్యవధిని కూడా పేర్కొంది. కోర్సు వర్క్ కాకుండా కనీసం రెండేళ్లు, గరిష్టంగా ఆరేళ్ల వ్యవధిలో పీహెచ్‌డీ పూర్తి చేసుకునేందుకు గడువుగా పేర్కొంది. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల నిబంధనలకు అనుగుణంగా మరో రెండేళ్ల గడువు పొడిగించే అవకాశం కల్పించింది. అదే విధంగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన రెండో ఏడాది నుంచి స్టూడెంట్ ఎక్సే్ఛంజ్ విధానంలో.. విదేశాల్లో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌లో కొన్ని రోజులు రీసెర్చ్ చేసే అవకాశం కూడా ఉంది.
చదవండి: Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం
నెట్.. స్వీయ ఎంట్రన్స్
- జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యూజీసీ నెట్ స్కోర్ లేదా ఆయా యూనివర్సిటీలు స్వయంగా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఈ రెండు విధానాలకు సీట్ల కేటాయింపును విభజించింది.
- మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను నెట్/జేఆర్‌ఎఫ్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయాలి.
- మిగిలిన 40శాతం సీట్లను యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌ల ద్వారా భర్తీ చేయాలి.
- ఈ రెండు టెస్ట్‌లలో స్కోర్ ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ స్థాయిలో అకడమిక్ నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ప్రవేశాలు ఖరారు చేయాలి.
ఎంట్రన్స్ టెస్ట్ ఇలా
- యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని రీసెర్చ్, అనలిటికల్, కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లను పరిశీలించే విధంగా సిలబస్ ఉండాలని యూజీసీ పేర్కొంది. ఈ నాలుగు విభాగాల నుంచి 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా నెట్/ జేఆర్‌ఎఫ్ లేదా యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారినే ఇంటర్వ్యూకు పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన కూడా రూపొందించింది.
- నెట్/జేఆర్‌ఎఫ్ లేదా యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
12 క్రెడిట్స్ వస్తేనే పీహెచ్‌డీ
- నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణతతో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన తర్వాత అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టా ఇవ్వాలంటే.. సదరు అభ్యర్థులు పీహెచ్‌డీ స్థాయిలో కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది క్రెడిట్ కోర్సులను తీసుకోవాలని.. వాటిలో రీసెర్చ్ టెక్నిక్స్, డొమైన్ సంబంధిత సబ్జెక్ట్ ఉండాలని పేర్కొంది.
- ఇతర అభ్యర్థులు సదరు కోర్సు సమయంలో కనీసం 12 క్రెడిట్స్‌ను.. గరిష్టంగా 16 క్రెడిట్స్‌ను సొంతం చేసుకోవాలి. అదే విధంగా రీసెర్చ్ మెథడాలజీకి కనీసం నాలుగు క్రెడిట్స్ విధానాన్ని అమలు చేయాలని.. అవి కూడా క్వాంటిటేటివ్ మెథడ్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, రీసెర్చ్ ఎథిక్స్, సంబంధిత రంగంలో పబ్లిష్ అయిన రీసెర్చ్ సమీక్ష, ఫీల్డ్ వర్క్ తదితర అంశాలకు కేటాయించాలని యూనివర్సిటీలకు స్పష్టం చేసింది. కోర్స్ వర్క్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని.. అప్పుడే సర్టిఫికెట్ పొందేందుకు అర్హులవుతారని స్పష్టం చేసింది.
పరిశోధనలకు మార్గాలివిగో..!
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్
ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు, జాతీయ స్థాయిలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు అందుబాటులో ఉన్న పరీక్ష.. సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్. కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ).. సంయుక్తంగా సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌ను నిర్వహిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్; ఎర్త్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ తదితర విభాగాల్లో.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రీసెర్చ్ లేబొరేటరీల్లో పీహెచ్‌డీలో చేరేందుకు మార్గం.. సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్. 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్–ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌కు హాజరు కావచ్చు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.csirhrdg.res.in/
సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్‌కు యూజీసీ నెట్
లాంగ్వేజెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో యూజీసీ–నెట్ అర్హతతో పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహించే నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత సబ్జెక్ట్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. యూజీసీ నెట్‌లో అర్హత సాధించి జేఆర్‌ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) పొందితే.. జాతీయ స్థాయిలోని పలు సోషల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్స్, లాంగ్వేజ్ లేబొరేటరీస్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లోని సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.
జెస్ట్‌తో ప్రతిష్టాత్మక రీసెర్చ్ ల్యాబ్స్‌లో పీహెచ్‌డీ
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ ల్యాబ్స్‌లో పీహెచ్‌డీలో చేరేందుకు మార్గం.. జెస్ట్(జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్). ఫిజిక్స్, థియరాటికల్ కంప్యూటర్ సైన్స్/ న్యూరోసైన్స్/కంప్యుటేషనల్ బయాలజీలలో నిర్వహించే జెస్ట్‌లో విజయం సాధిస్తే.. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్, హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఐఐఎస్‌సీ–బెంగళూరు వంటి 29 రీసెర్చ్ కేంద్రాల్లో పీహెచ్‌డీ, ఎంఎస్ బై రీసెర్చ్ వంటి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం లభిస్తుంది.
గేట్‌తో.. ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు
గేట్..గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. బీటెక్ విద్యార్థులందరికీ సుపరిచితమైన పరీక్ష. ఇందులో సాధించిన స్కోర్‌తో పీహెచ్‌డీలో ప్రవేశించేందుకు అవకాశం ఉంది. గేట్ స్కోర్ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల తోపాటు.. దేశంలోనే టెక్నికల్ విద్యకు ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
చదవండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్ కంపెనీల్లో ఉద్యోగం
ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్ రీసెర్చ్
ప్రస్తుత కార్పొరేట్ యుగంలో మేనేజ్‌మెంట్ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. మేనేజ్‌మెంట్ విభాగాల్లోనూ పరిశోధనల అవసరం ఏర్పడింది. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పేరుతో ఐఐఎంలు పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నాయి. క్యాట్, జీమ్యాట్ స్కోర్ ఆధారంగా వీటిలో అడుగుపెట్టొచ్చు.
పీఎంఆర్‌ఎఫ్
ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్.. పీఎంఆర్‌ఎఫ్. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, ట్రిపుల్ ఐటీల్లో ఆయా విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించేందుకు దీన్ని రూపొందించారు. పీఎంఆర్‌ఎఫ్‌కు ఎంపికైన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు నెలకు రూ.70వేల నుంచి రూ.80వేల వరకూ ఫెలోషిప్ అందుతుంది. బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు మొదలు ఎంటెక్, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అభ్యసిస్తున్న ప్రతిభావంతులు ఈ స్కీమ్ ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. వీరు గేట్‌లో 750 స్కోర్ సాధించాలి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనే అకడమిక్ డిగ్రీలు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సెమిస్టర్‌లో సీజీపీఏ ఎనిమిది పాయింట్లు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరిశోధన ప్రతిపాదనలను నిపుణుల కమిటీ సమీక్షిస్తుంది. సంతృప్తికరమైన ప్రతిపాదనలు పంపిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి..ఆయా క్యాంపస్‌లలో పీహెచ్‌డీ చేసే విధంగా అలాట్‌మెంట్ చేస్తుంది.
అందిపుచ్చుకోవాలి
డిగ్రీతోనే పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించాలన్న యూజీసీ తాజా నిర్ణయం.. వేల మంది యువతకు మేలు చేకూర్చేదిగా చెప్పొచ్చు. తక్కువ సమయంలో రీసెర్చ్ పూర్తి చేసుకుని పీహెచ్‌డీ పట్టా పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఆవిష్కరణలు కూడా పెరిగి ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన తర్వాత కూడా సంబంధిత రంగంలో పరిశోధనల్లో నిమగ్నమవ్వాలి.
– ప్రొ‘‘ కె.కిరణ్ కుమార్, డీన్, ఆర్ అండ్ డీ, ఐఐటీ–హెచ్.
చదవండి: Higher Education: సెంట్రల్ యూనివర్సిటీస్.. ఉమ్మడి ఎంట్రన్స్!