Higher Educationలో సమూల మార్పులు... యూకే వర్సిటీల సహకారంతో రూపకల్పన

- ఉన్నత విద్యకు కొత్త సిలబస్!
- యూకే వర్సిటీల సహకారంతో రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య స్వరూపాన్ని సమూలంగా మార్చాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త పాఠ్య ప్రణాళికను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. డిగ్రీ, పీజీ స్థాయిలో సామాజిక శాస్త్ర కోర్సుల్లో తొలి విడతగా దీన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. బ్రిటిష్ యూనివర్సిటీల సమన్వయంతో ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నారు. బీఏ, బీకాం, ఎంఏ, ఎం.కాం వంటి కోర్సులకు ప్రాధాన్యత తగ్గుతోంది. విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్ గ్రూపుల వైపు వెళ్తున్నారు. సంప్రదాయ కోర్సులు చేసినా ఉపాధి అవకాశాలు ఉండటం లేదన్న విద్యార్థుల అభిప్రాయంతో.. డిగ్రీ కోర్సుల ప్రవేశాలు పడిపోతున్నాయి. దీన్ని దూరం చేసి, అంతర్జాతీయ మార్కెట్లో ఉపాధి పొందేలా కోర్సులను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది.
Also read: Higher Education: సెంట్రల్ యూనివర్సిటీస్.. ఉమ్మడి ఎంట్రన్స్!
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు: ఉత్తర భారతంలో ఇప్పటికే సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వభావం మారింది. వివిధ విభాగాలతో కలిపి డిగ్రీ కోర్సులు అందిస్తున్నారు. ఇందులో ఎక్కువగా కంప్యూటర్, ఆధునిక టెక్నాలజీని కలిపి కోర్సుల రూపకల్పన చేస్తున్నారు. ఉదాహరణకు బీఏ విద్యారి్థకి ఆధునిక రాజకీయ విశ్లేషణలకు అనుకూలంగా సరికొత్త పరిజ్ఞానాన్ని జోడించారు. కామర్స్ విద్యార్థులకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ నాలెడ్జ్‌తో కోర్సులు అందిస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సులకు దీటుగా డేటా సైన్స్ వంటి వాటిని రూపొందించారు. ఫలితంగా మంచి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని ఉత్తరాది రాష్ట్రాల అనుభవం చెబుతోంది. దీన్ని అధ్యయనం చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి యూకే విశ్వవిద్యాలయాలతో కలిసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను తయారు చేస్తోంది. పారిశ్రామిక అధ్యయనం, ఫీల్డ్ స్టడీస్‌కే అత్యధిక ప్రాధాన్యం ఉండేలా కొత్త కోర్సులను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇవి తుదిదశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ కోర్సులకు సంబంధించి ముసాయిదా రూపొందించే వీలుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
Also read: Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం