Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం
- ట్రెడిషనల్, ప్రొఫెషనల్ కోర్సులు, విదేశీ విద్యకు రుణాలు
- ఐబీఏ నేతృత్వంలో మార్గదర్శకాలు
- విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తుకు అవకాశం
- కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు లోన్
గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో సిటీల వరకూ.. యువత ఉన్నత చదువుల పట్ల ఆసక్తి చూపుతోంది. అయితే కొంత మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక తమ ఆశయంవైపు ముందుకు సాగలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులు బ్యాంకులు అందిస్తున్న ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా తమ కలలు సాకారం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
భారీగా ఫీజులు
- ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత చదువులకు భారీగా ఖర్చు అవుతోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవాలంటే కోర్సును బట్టి రూ.మూడు లక్షల నుంచి రూ.అయిదు లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువులకు రూ.15 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఇక విదేశీ విద్యకు వెళ్లాలనుకుంటే రూ.50 లక్షలు చేతిలో ఉండాల్సిందే. ఈ స్థాయి వ్యయాలను పేద, మధ్య తరగతి కుటుంబాలు భరించలేవు. దాంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు సైతం అవకాశాలకు దూరమవుతున్నారు.
ఐబీఏ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ అందించి.. వారి ఉన్నత విద్యకుతోడ్పాటునందించేలా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌లు సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి. బ్యాంకులు విద్యా రుణాల మంజూరుకు అనుసరించాల్సిన విధానాలపై నిరంతరం మార్గదర్శకాలను జారీ చేస్తున్నాయి. ఆయా కోర్సులను కేటగిరీలుగా విభజించడం మొదలు రుణ గరిష్ట మొత్తం, తిరిగి చెల్లింపు నిబంధనలు తదితర అంశాలను కూడా ఐబీఏ ఆయా బ్యాంకులకు సూచిస్తోంది.
మూడు రకాలుగా వర్గీకరణ
విద్యా రుణాల మంజూరుకు ఐబీఏ.. 2021లో మార్గదర్శకాలు రూపొందించింది. ముందుగా రుణాల మంజూరు విషయంలో విద్యార్థులను మూడు రకాలుగా పేర్కొంది. అవి..
- టాప్ రేటెడ్(అత్యున్నత శ్రేణి) ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు.
- ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు.
- విదేశాల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులు.
అర్హత ఉన్న కోర్సులు
- విద్యా రుణాల మంజూరుకు సంబంధించి అర్హత ఉన్న కోర్సులను కూడా ఐబీఏ రూపొందించింది. దీని ప్రకారం..
- ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పరిధిలోకి వచ్చే కోర్సులు.
- ఏఐసీటీఈ,యూజీసీ,ఏఐబీఎంఎస్, ఐసీఎంఆర్ సహా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు, కాలేజీల్లో.. బ్యాచిలర్, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు.
- సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులు.
- ఐఐంలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, నిఫ్ట్, ఎన్‌ఐడీ తదితర సంస్థలు అందించే కోర్సులు.
- ఏరోనాటికల్, పైలట్ ట్రైనింగ్, షిప్పింగ్, నర్సింగ్‌లో డిప్లొమా/డిగ్రీ వంటి కోర్సులు.
- మన దేశంలో విదేశీ యూనిర్సిటీలు అందించే గుర్తింపు పొందిన కోర్సులు.
- ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పై కోర్సులతోపాటు యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా విద్యా రుణాలకు అర్హులే.
విదేశీ విద్యకూ.. ఎడ్యుకేషన్ లోన్
- ఐబీఏ మార్గదర్శకాల ప్రకారం– విదేశీ విద్యకు కూడా రుణం లభిస్తుంది. సదరు కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో నిర్దిష్ట ప్రమాణాలు తప్పనిసరి. దీని ప్రకారం..
- విదేశాల్లోని ఆయా ప్రభుత్వ గుర్తింపు ఉన్న, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో జాబ్ ఓరియెంటెడ్, టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు, ఎంబీఏ, ఎంఎస్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు, సీఐఎంఏ–లండన్, సీపీఏ–యూఎస్ తదితర సంస్థలు అందించే కోర్సుల్లో సీటు ఖరారు చేసుకున్న విద్యార్థులు.. స్టడీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవాస భారతీయులకు కూడా
ఐబీఏ గతేడాది విడుదల చేసిన నూతన మార్గ దర్శకాల ప్రకారం–మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందిన ప్రవాస భారతీయ విద్యార్థులు, విదేశాల్లోని భారత సంతతి విద్యార్థులు కూడా విద్యా రుణాలకు మన దేశంలోని బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి స్థానికంగా మన దేశంలో ఉండే వ్యక్తులు హామీగా ఉండాలి.
ర్యాంకులతో సీటు పొందితేనే
విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ కోర్సుకు సంబంధించి నిర్వహించిన ఎంట్రన్స్‌లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంటే.. సంబంధిత ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారికే విద్యా రుణ దరఖాస్తుకు అర్హత ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన వారికి ఈ రుణాల మంజూరుకు అర్హత ఉండదు. మేనేజ్‌మెంట్ కోటాలో సీటు సొంతం చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే.. వారికున్న తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కొన్ని బ్యాంకులు రుణం మంజూరు చేయడానికి ముందుకొస్తున్నాయి.
రూ.10 లక్షలు.. రూ.20 లక్షలు
- విద్యా రుణాల మంజూరు.. గరిష్ట రుణ మొత్తం విషయంలో ప్రస్తుతం బ్యాంకులు రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి.
- మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ. పది లక్షలు మంజూరు చేస్తున్నాయి.
- విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్టంగా రూ.20లక్షలు మంజూరు చేస్తునాయి.
- సదరు ఇన్‌స్టిట్యూట్ ప్రామాణికతను పరిగణనలోకి తీసుకుంటూ.. రుణ మొత్తాన్ని నిర్ణయించే అధికారం బ్యాంకులకు ఉందని ఐబీఏ మార్గదర్శకాలు జారీ చేసింది.
మూడు శ్లాబ్‌లు.. హామీలు
ప్రస్తుతం ఎడ్యుకేషన్ లోన్స్‌ను బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానంలో మంజూరు చేస్తున్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న శ్లాబ్ (రుణ మొత్తం) ఆధారంగా ముందస్తుగానే కొన్ని హామీ పత్రాలు ఇచ్చే విధంగా నిబంధనలు పాటిస్తున్నాయి.
- శ్లాబ్–1 మేరకు రూ.4 లక్షల రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.
- శ్లాబ్–2 మేరకు రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
- శ్లాబ్–3 విధానంలో.. రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం ఉంటోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ (స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది.
కొంత మేర మార్జిన్ మనీ
రుణానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం ఉండదు. రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో చదివే విద్యార్థులు అయిదు శాతం, విదేశీ విద్య అభ్యర్థులు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తానికి మార్జిన్ మనీ విషయంలో బ్యాంకులకే విచక్షణాధికారం ఉంటుందని ఐబీఏ పేర్కొంది.
రుణం లభించే వ్యయాలు
- ట్యూషన్ ఫీజు; హాస్టల్ ఫీజు; ఎగ్జామినేషన్/లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు; విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు; పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం; కంప్యూటర్ కొనుగోలు వ్యయం; కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే వ్యయం;
- ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్,రిఫండబుల్ డిపాజిట్‌లకు రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి.
- కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది.
రీ పేమెంట్ హాలిడే
విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలోనూ బ్యాంకులు సానుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయి. రీపేమంట్ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల విధానంలో తిరిగి చెల్లించే విధంగా ప్రస్తుతం నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇలా గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో ఈఎంఐ విధానంలో చెల్లించొచ్చు.
విద్యా లక్ష్మి పోర్టల్
- విద్యాలక్ష్మి పోర్టల్.. విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్స్‌కు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సింగిల్ అప్లికేషన్ వెబ్‌సైట్‌గా పేర్కొనొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. విద్యార్థులు తమకు ప్రవేశం లభించిన కోర్సు, ఇన్‌స్టిట్యూట్, అవసరమైన రుణ మొత్తం వంటి వాటిని ఆన్‌లైన్‌లో అందించాల్సి ఉంటుంది.
- తాజాగా ఐబీఏ మార్గదర్శకాల ప్రకారం.. విద్యా రుణానికి దరఖాస్తు చేయదలచుకున్న విద్యార్థులు.. తప్పనిసరిగా విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
- దీని ప్రకారం గరిష్టంగా మూడు బ్యాంకులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
- ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపుతారు.
- ఆ తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. తదుపరి దశలో ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతాయి. అంటే.. విద్యాలక్ష్మి పోర్టల్ విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు, బ్యాంకులకు అనుసంధానకర్తగా ఉంటోంది.
- దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల లోపు బ్యాంకులు తమ నిర్ణయాన్ని తెలియజేసే విధంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వెబ్‌సైట్: www.vidyalakshmi.co.in
బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఎక్కువగా
ప్రస్తుతం ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం–గరిష్ట రుణమొత్తం విషయంలో నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ..విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే ఆ గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికారాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి ఈ గరిష్ట రుణం విషయంలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.
చదవండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్ కంపెనీల్లో ఉద్యోగం
నిరంతర సమీక్ష
ఎడ్యుకేషన్ లోన్ పొందిన విద్యార్థికి సంబంధించి.. ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లిస్తే.. సంబంధిత రశీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి అందిస్తారు. ఆ తర్వాత దశ నుంచి నేరుగా ఇన్‌స్టిట్యూట్‌కు పంపుతారు. అదే విధంగా రుణ మొత్తాన్ని ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో నిర్దేశిత గడువు తేదీలోగా ఇన్‌స్టిట్యూట్‌కు పంపించే బ్యాంకులు.. అంతకుముందు సంవత్సరంలో సదరు అభ్యర్థి ప్రతిభ గురించి కూడా సమీక్ష చేస్తున్నాయి. దీని ప్రకారం.. మిగతా రుణం జారీ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాయి.
విద్యా రుణ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
- ప్రవేశ ధ్రువీకరణ పత్రం
- అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు
- తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ
- తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్స్
- నివాస ధ్రువీకరణ
- థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ
- కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్
- వివరాలకు వెబ్‌సైట్: www.iba.org.in
విద్యా రుణాలు.. ముఖ్యాంశాలు
- స్వదేశీ, విదేశీ విద్యలకు బ్యాంకుల రుణాలు.
- కనిష్టంగా రూ. 4 లక్షలు గరిష్టంగా రూ. 15 లక్షల వరకు రుణ మొత్తం.
- నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థల్లో అడ్మిషన్ పొందితేనే రుణ దరఖాస్తుకు అర్హత.
- విదేశీ విద్య, ఐఐఎంలు వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే రుణ మొత్తాన్ని పెంచే అవకాశం.
- విద్యాలక్ష్మి పోర్టల్ పేరిట ఆన్‌లైన్‌లో ఒకేసారి మూడు బ్యాంకులకు రుణ దరఖాస్తు చేసుకునే సదుపాయం.