CUET PG 2024 Notification: సెంట్రల్ వర్సిటీస్‌లో పీజీ చేస్తారా!
- సీయూఈటీ–పీజీ 2024 నోటిఫికేషన్ విడుదల
- సెంట్రల్ వర్సిటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో పీజీ ప్రవేశాలు
- ఆరు విభాగాల్లో 157 పేపర్లు/సబ్జెక్ట్‌లలో పరీక్ష
- గరిష్టంగా నాలుగు పేపర్లకు హాజరయ్యే అవకాశం
దేశంలో పదుల సంఖ్యలో సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. వాటిలో చేరాలనుకునే విద్యార్థులు.. గతంలో ప్రతి యూనివర్సిటీ సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకొని హాజరవ్వాల్సి వచ్చేది.ఇది విద్యార్థులకు భారమని భావించిన ప్రభుత్వం.. అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాల కోసం ఉమ్మడిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు సీయూఈటీ–యూజీ, పీజీ కోర్సులకు సీయూఈటీ–పీజీ నిర్వహిస్తున్నారు.
56 సెంట్రల్ యూనివర్సిటీలు
సీయూఈటీ–పీజీ స్కోర్ ఆధారంగా దేశంలోని 56 సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం; తెలంగాణలో.. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో సీయూఈటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు దాదాపు 210కి పైగా ఇన్‌స్టిట్యూట్‌లకు సీయూఈటీ–పీజీ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అర్హతలు
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సబ్జెక్ట్‌తో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2024లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయసు: ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
ఆరు విభాగాలు.. 157 పేపర్లు
సీయూఈటీ–పీజీ పరీక్షను మొత్తం ఆరు విభాగాల్లో 157 పేపర్లలో నిర్వహించనున్నారు. కామన్ విభాగంగా 22 సబ్జెక్ట్‌లు; లాంగ్వేజెస్ విభాగంలో 41 సబ్జెక్ట్‌లు; సైన్స్ విభాగంలో 30 సబ్జెక్ట్‌లు; హ్యుమానిటీస్ విభాగంలో 26 సబ్జెక్ట్‌లు; ఎంటెక్/హయ్యర్ సైన్సెస్ విభాగంలో 12 సబ్జెక్ట్‌లు; ఆచార్య విభాగంలో 26 సబ్జెక్ట్‌లలో పరీక్ష పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు పీజీలో ఏ స్పెషలైజేషన్‌లో చేరాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పేపర్‌లో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
గరిష్టంగా నాలుగు పేపర్లు
విద్యార్థులు గరిష్టంగా నాలుగు సబ్జెక్ట్ పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీలో తాము చదివిన సబ్జెక్ట్‌లు, వాటికి పీజీలో సరితూగే స్పెషలైజేషన్లుకు సంబంధించిన పేపర్ల పరీక్షకు హాజరయ్యే వీలుంది.
జనరల్ విభాగం తొలగింపు
సీయూఈటీ–పీజీ–2024లో ప్రధాన మార్పు.. జనరల్ విభాగాన్ని తొలగించడం. గతేడాది ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి పార్ట్–ఎలో జనరల్ టెస్ట్‌ను నిర్వహించారు. పార్ట్–బిలో సబ్జెక్ట్ ప్రశ్నలను అడిగారు. ఈ ఏడాది జనరల్ టెస్ట్ విభాగం లేదని పేర్కొన్నారు. దీంతో.. పేపర్‌లో ప్రశ్నలన్నీ సబ్జెక్ట్‌కు సంబంధించినవే అడిగే అవకాశముంది.
75 ప్రశ్నలు.. 300 మార్కులు
- సీయూఈటీ–పీజీ పరీక్షలో ప్రతి పేపర్/సబ్జెక్ట్‌లో 75 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు కేటాయించే సమయం 1 గంట 45 నిమిషాలు.
- పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్/ హిందీ మీడియంలలోనే పరీక్ష ఉంటుంది. ఎంటెక్/హయ్యర్ సైన్సెస్‌కు ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఆచార్య విభాగంలోని కోర్సులకు సంబంధించి హిందూ స్టడీస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, బుద్ధ దర్శన్ మినహా అన్ని పేపర్లు సంస్కృతంలో ఉంటాయి. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
చదవండి: PG Courses
మలి దశలో.. వేర్వేరుగా దరఖాస్తు
సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడిగా సీయూఈటీ–పీజీని నిర్వహిస్తున్నప్పటికీ.. ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల సమయంలో విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు యూనివర్సిటీలు అడ్మిషన్ నోటిఫికేషన్లు విడుదల చేశాక.. సీయూఈటీ–పీజీ స్కోర్‌ను పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాలి. ఇలా.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. సీయూఈటీ–పీజీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. పీజీ ప్రవేశాలను ఖరారు చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జనవరి 24
- దరఖాస్తు సవరణ చివరి తేదీ: 2024, జనవరి 29
- టెస్ట్ సెంటర్ సమాచారం వెల్లడి: 2024,మార్చి 4
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: 2024, మార్చి 7
- సీయూఈటీ–పీజీ తేదీలు: మార్చి 11 నుంచి మార్చి 28 వరకు (ప్రతి రోజు మూడు షిఫ్ట్‌లలో పరీక్ష. మొదటి షిఫ్ట్ 9 నుంచి 10:45 వరకు; రెండో షిఫ్ట్ 12:45 నుంచి 2:30 వరకు; మూడో షిఫ్ట్ 4:30 నుంచి 6:15 వరకు);
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://pgcuet.samarth.ac.in/index.php/site/index
రాత పరీక్షలో రాణించేలా
- సీయూఈటీ–పీజీలో రాణించాలంటే.. అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్‌ల కోసం బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి వరకూ పుస్తకాలను సంపూర్ణంగా చదవాలి.
- లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ల కోసం సంబంధిత లాంగ్వేజ్‌ల గ్రామర్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా వాక్య నిర్మాణం, ప్రెసిస్ రైటింగ్, ప్యాసేజ్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా.. సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి.
- జనరల్ పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను చదవాలి. అదే విధంగా కరెంట్ ఈవెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇక.. క్వాంటిటేటివ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్స్‌పై అవగాహన అవసరం.
- ఎంటెక్/హయ్యర్ సైన్స్ పేపర్ల అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో అభ్యసనం సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయా ఫార్ములాలు, బేసిక్స్, సిద్ధాంతాలు, వాటిని వాస్త వ పరిస్థితుల్లో అన్వయిస్తున్న విధానంపై అవగాహన ఏర్పరచుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. సైన్స్ విభాగం అభ్యర్థులు కూడా ఇదే తరహా ప్రిపరేషన్ సాగిస్తే మంచి స్కోర్ సాధించొచ్చు.
- లాంగ్వేజెస్ అభ్యర్థులు లిటరేచర్, పొయెట్రీ, కవులు, కాంప్రహెన్షన్, గ్రామర్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హ్యుమానిటీస్ విద్యార్థులు తమ సబ్జెక్ట్‌లకు సంబంధించి కోర్ అంశాలతోపాటు.. సమకాలీన పరిణామాలపైనా అవగాహన పొందాలి. అదే విధంగా కోర్ సబ్జెక్టులను తాజా పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ముఖ్యంగా సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ సబ్జెక్ట్‌ల అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్
అభ్యర్థులకు సీయూఈటీ విధానం, అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌పై అవగాహన కల్పించేందుకు ఎన్‌టీఏ.. టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ ప్రాక్టీస్ సెంటర్లలో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ద్వారా పరీక్షలో అడిగే ప్రశ్నల తీరుపై అవగాహన పొందొచ్చు.
220కు పైగా స్కోర్‌తో
జేఎన్‌యూ, డీయూ, బీహెచ్‌యూ వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ ప్రోగ్రామ్‌లకు సైతం సీయూఈటీ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు ఖరారు చేసుకోవాలంటే.. సీయూఈటీలో 220కు పైగా స్కోర్ సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 190కు పైగా మార్కులు సాధిస్తే టాప్ వర్సిటీల్లో ప్రవేశం లభిస్తుందని పేర్కొంటున్నారు.
Tags
- CUET PG Notification
- CUET PG 2024 Notification
- admissions
- PG Admissions
- Common University Entrance Test
- entrance test
- CUTE PG 2024 Details
- Central Universities
- Careers
- job opportunities
- higher education
- sakshi education
- Sakshi Bhavitha
- Academic Qualifications
- University Admissions
- PG courses Admissions
- Qualifications
- notifications
- sakshi education latest admissions
- Latest Admissions.