Skip to main content

Higher Education: సెంట్రల్‌ యూనివర్సిటీస్‌.. ఉమ్మడి ఎంట్రన్స్‌!

సెంట్రల్‌ యూనివర్సిటీలు.. ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థలు! యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల బోధనలో.. ఉన్నత వేదికలుగా గుర్తింపు! వీటిలో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఆయా సర్టిఫికెట్లకు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుందనే భావన! కానీ.. దేశంలో దాదాపు 50 వరకు ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. ఆయా యూనివర్సిటీలు ప్రత్యేకంగా నిర్వహించే ఎంట్రన్స్‌కు హాజరవడం వ్యయ ప్రయాసలకు గురి చేస్తోంది. ఒక వర్సిటీ ఎంట్రన్స్‌కు, మరో వర్సిటీ ఎంట్రన్స్‌కు మధ్యతక్కువ వ్యవధి ఉంటుంది. ఎంట్రన్స్‌లు ఒకే తేదీలో జరిగే సందర్భాలు ఉంటాయి! ఫలితంగా.. విద్యార్థులు ఒకట్రెండు వర్సిటీల ఎంట్రన్స్‌లకే పరిమితమవుతున్న పరిస్థితి! ఇప్పుడు ఈ సమస్యలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టొచ్చు! దేశంలోని అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకు ఒకే ఉమ్మడి ఎంట్రన్స్‌తో ప్రవేశం ఖాయం చేసుకోవచ్చు. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీయూ–సెట్‌ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. సీయూ–సెట్‌ ఉద్దేశం, పరీక్ష విధానాలు, ప్రవేశాలు కల్పించే కోర్సులు తదితర అంశాలపై విశ్లేషణ...
Higher Education: Common Entrance Test For Central Universities admission
Higher Education: Common Entrance Test For Central Universities admission
  • 2022 నుంచి సెంట్రల్‌ వర్సిటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ఎంట్రన్స్‌
  • సీయూసెట్‌కు కసరత్తు
  • ఈ నెలాఖరు లేదా మార్చిలో నోటిఫికేషన్‌!
  • ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఎంట్రన్స్‌ టెస్ట్‌

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు అనేక వ్యయ ప్రయాసల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నిపుణుల కమిటీ కూడా నిర్దిష్ట సిఫార్సులు చేసింది. గత రెండేళ్లుగా ప్రతిపాదనలు, అభిప్రాయాల సేకరణ దశకే పరిమితమైన సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఈ ఏడాది నుంచి కార్యరూపం దాల్చనుందని చెబుతున్నారు. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్‌ ఆధారంగానే వచ్చే విద్యా సంవత్సరం (2022–23) నుంచి అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

చ‌ద‌వండి: FRI courses: అటవీ కోర్సులతో.. ఉజ్వల అవకాశాలు
 

సీయూ–సెట్‌ ఉద్దేశం

సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రధాన ఉద్దేశం.. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఒకే పరీక్షను నిర్వహించడం, విద్యార్థులు ఎదుర్కొంటున్న వ్యయ ప్రయాసల నుంచి వారికి ఉపశమనం కల్పించడం. సీయూ–సెట్‌ నిర్వహణ, విధి విధానాలపై అధ్యయనానికి రెండేళ్ల క్రితమే ఏడుగురు సభ్యుల కమిటీని యూజీసీ నియమించింది. సదరు కమిటీ సీయూ–సెట్‌ నిర్వహణపై సానుకూల నివేదికను అందించింది. దీంతో ఈ ఏడాది నుంచే సీయూ–సెట్‌ను నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఎన్‌టీఏ ఆధ్వర్యం

సీయూ–సెట్‌ నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. సీయూ సెట్‌ బాధ్యతలను కూడా ఎన్‌టీఏకే ఇస్తే సెంట్రల్‌ యూనివర్సిటీలపై భారం తగ్గుతుందని.. అకడమిక్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని నిపుణుల కమిటీ పేర్కొంది.

రెండు విభాగాలుగా ప్రవేశ పరీక్ష?

సీయూ–సెట్‌ను ఈ ఏడాది నుంచే నిర్వహించే అవకాశం ఉంది. దీంతో పరీక్ష విధానం ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత లేకపోయినప్పటికీ.. యూజీసీ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం–పరీక్ష రెండు భాగాలుగా జరుగనుంది. 

  • యూజీ కోర్సుల(బ్యాచిలర్‌ డిగ్రీ)కు నిర్వహించే ప్రవేశ పరీక్ష సెక్షన్‌–ఎ, సెక్షన్‌–బిగా ఉంటుంది.
  • సెక్షన్‌–ఎను కామన్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌గా పేర్కొంటున్నారు. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 15 ప్రశ్నలు, వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ నుంచి 10 ప్రశ్నలు, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి 10 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ఐసీటీ నుంచి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ విభాగానికి కేటాయించే సమయం ఒక గంట. 
  • సెక్షన్‌–బిను సబ్జెక్ట్‌ టెస్ట్‌గా పేర్కొంటున్నారు. ఇందులో అభ్యర్థులు ఏ కోర్సుకు దరఖాస్తు చేసుకుంటున్నారో.. దానికి సంబంధించిన సబ్జెక్ట్‌ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం రెండు గంటల వ్యవధిలో 30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 

పీజీ ప్రవేశ పరీక్ష మాదిరిగానే

  • ఈ పరీక్ష ప్రస్తుతం దేశంలో 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష మాదిరిగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి 100 మార్కులతో ఆబ్జెక్టివ్‌ విధానంలో పార్ట్‌–ఎ, పార్ట్‌–బిగా.. రెండు విభాగాల్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. –పార్ట్‌–ఎలో లాంగ్వేజ్‌ స్కిల్స్, జనరల్‌ అవేర్‌నెస్, మ్యాథమెటికల్‌ అప్టిట్యూడ్, అనలిటికల్‌ స్కిల్స్‌కు సంబంధించి 25 ప్రశ్నలు, పార్ట్‌–బి పేరుతో మరో 75 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన విభాగాల నుంచి అడగనున్నారు.
  • పీహెచ్‌డీ, రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ అభ్యర్థులకు కూడా వంద మార్కులకే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. వంద మార్కుల్లో 50 మార్కులు అభ్యర్థుల డొమైన్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి ఉంటాయి. మిగతా 50 మార్కులకు లాంగ్వేజ్, జనరల్‌ అవేర్‌నెస్, మ్యాథమెటికల్‌ అప్టిట్యూడ్, అనలిటికల్‌ స్కిల్స్, రీసెర్చ్‌ మెథడాలజీకి సంబంధించి అడగనున్నారు.


చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం
 

ఆన్‌లైన్‌ విధానం

ప్రతిపాదిత సీయూ–సెట్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహించనున్నారు. అంతేకాకుండా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధించే అవకాశం ఉంది. సీయూ–సెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ఒక సెషన్‌ను జూన్‌/జూలైలో.. మరో సెషన్‌ను డిసెంబర్‌/ జనవరిలో నిర్వహించనున్నారు. ఇంటర్, బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా మే/జూన్‌లో ఇతర ఎంట్రన్స్‌లకు హాజరయ్యే విద్యార్థులు అసౌకర్యానికి గురి కాకుండా.. డిసెంబర్‌/జనవరి సెషన్‌ ఉపయుక్తంగా ఉంటుందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలుస్తోంది.

ప్రాంతీయ భాషల్లో సీయూ సెట్‌

జాతీయ స్థాయిలో నిర్వహించే సీయూ–సెట్‌ను.. ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌(బ్యాచిలర్‌ డిగ్రీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, ఒరియా, తమిళం, ఉర్దూ, అస్సామీ భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంది. పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల ఎంట్రన్స్‌ను ఇంగ్లిష్‌ లేదా హిందీలో మాత్రమే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కౌన్సెలింగ్‌ వేర్వేరుగా

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించినా.. ప్రవేశాల విషయంలో మాత్రం.. ఆయా సెంట్రల్‌ యూనివర్సిటీలు వేర్వేరుగా ప్రవేశ ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. అంటే.. సీయూ–సెట్‌ స్కోర్‌ను అర్హతగా పేర్కొంటూ సెంట్రల్‌ యూనివర్సిటీలు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తు చేసుకోమని అడుగుతాయి. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థుల మెరిట్, సీట్ల సంఖ్య, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని సీట్లు భర్తీ చేస్తాయి. 

మంచి స్కోర్‌తోనే ప్రవేశం

ఉమ్మడి ఎంట్రన్స్‌ టెస్ట్‌ వల్ల విద్యార్థులకు అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనున్నప్పటికీ.. బెస్ట్‌ స్కోర్‌ లేదా ర్యాంకు సొంతం చేసుకుంటే ప్రవేశం దక్కుతుంది. ఉదాహరణకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీనే పరిగణనలోకి తీసుకుంటే.. ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. వంద మార్కులకు నిర్వహించే ఎంట్రన్స్‌లో 80కు పైగా మార్కులు సాధించాలి. ఇదే వి«ధంగా ఇతర ప్రముఖ సెంట్రల్‌ యూనివర్సిటీల్లోనూ ప్రవేశానికి కనీసం 70 శాతం పైగా మార్కులు సొంతం చేసుకుంటేనే అడ్మిషన్‌ దక్కుతుంది.

మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్‌

సీయూ–సెట్‌కు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసి.. మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. యూజీసీ, విద్యా శాఖల నుంచి పరీక్ష విధానంపై స్పష్టత లభించిన వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌టీఏ వర్గాలు చెబుతున్నాయి.

సీయూ–సెట్‌– ముఖ్యాంశాలు

  • దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష.
  • ఎంట్రన్స్‌లో స్కోర్‌ ఆధారంగా ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేయనున్న సెంట్రల్‌ యూనివర్సిటీలు.
  • ప్రస్తుతం సెంట్రల్‌ యూనివర్సిటీల్లో బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏడు వందలకుపైగా కోర్సులు, స్పెషలైజేషన్లు.
  • తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌సీయూ, ఏపీ యూనివర్సిటీ, ఇఫ్లూ, ఉర్దూ యూనివర్సిటీల్లో ప్రవేశాలకూ సీయూ–సెట్‌ స్కోర్‌తో అవకాశం.
  • తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో సీయూ–సెట్‌ నిర్వహణ.
  • ఏటా రెండుసార్లు సీయూ–సెట్‌ను నిర్వహించే అవకాశం. 
  • పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా సీయూ–సెట్‌.
  • పలు ఎంట్రన్స్‌లకు హాజరయ్యే వ్యయ ప్రయాసల నుంచి విద్యార్థులకు ఉపశమనం.

ఎంతో ప్రయోజనం

సెంట్రల్‌ యూనివర్సిటీలన్నింటికీ కలిపి ఒకటే ఎంట్రన్స్‌ను నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కొన్ని స్పెషలైజేషన్లు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వేర్వేరు పరీక్షలు రాసే పరిస్థితికి ఈ ఉమ్మడి ఎంట్రన్స్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు. అంతేకాకుండా విద్యార్థులు కూడా ఆయా వర్సిటీల్లో ఉన్న కోర్సులన్నిటిపై అవగాహన ఏర్పరచుకుని.. వారి ఆసక్తి, అర్హతలకు సరితూగే కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
– ప్రొ‘‘ బి.సత్యనారాయణ, వైస్‌ ఛాన్స్‌లర్, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటక.

చ‌ద‌వండి: AYUSH Counseling: అందుబాటులో ఉన్న కళాశాలలు, ఫీజుల వివ‌రాలు ఇలా..

Published date : 21 Feb 2022 05:59PM

Photo Stories