Skip to main content

AYUSH Counseling: అందుబాటులో ఉన్న కళాశాలలు, ఫీజుల వివ‌రాలు ఇలా..

ఆయుష్‌ కోర్సులు.. వైద్య రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి చక్కటి ప్రత్యామ్నాయాలు! గత కొన్నేళ్లుగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ చేజారిన విద్యార్థులు.. ఆయుష్‌ కోర్సుల్లో చేరుతున్నారు. వీటి సీట్లను కూడా నీట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ మాదిరిగానే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు! తాజాగా తెలంగాణలో ఆయుష్‌ –యూజీ కోర్సుల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో..ఆయుష్‌ కోర్సుల కౌన్సెలింగ్, ఆల్‌ ఇండియా కోటా, స్టేట్‌ కోటా విధానం,అందుబాటులో ఉన్న కళాశాలలు, ఫీజులు, ఈ కోర్సులతో కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం...
AYUSH Courses Counseling: All India quota, State quota, available colleges, fees, career opportunities here
AYUSH Courses Counseling: All India quota, State quota, available colleges, fees, career opportunities here
  • నీట్‌–యూజీ ర్యాంకు ఆధారంగా ఆయుష్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌
  • ఆల్‌ ఇండియా కోటా, స్టేట్‌ కోటా విధానంలో ప్రవేశాలు
  • ఆల్‌ ఇండియా కోటా సీట్లకు ఏఏసీసీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌
  • స్టేట్‌ కోటాలో రాష్ట్రాల హెల్త్‌ యూనివర్సిటీల ఆధ్వర్యంలో మరో కౌన్సెలింగ్‌
  • తాజాగా టీఎస్‌ యూజీ–ఆయూష్‌ వైద్య ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల 
     

ఆయుష్‌ కోర్సులంటే

ఆయుర్వేద, యునాని, హోమియోపతి, నేచురోపతి, సిద్ధ యోగ.. వీటినే సంక్షిప్తంగా ఆయుష్‌ విభాగంగా పేర్కొంటారు. వీటికి సంబంధించి బ్యాచిలర్‌ స్థాయిలో అందుబాటులో ఉన్న బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్‌లను ఆయుష్‌ కోర్సులుగా పిలుస్తారు. వీటిలో ప్రవేశానికి నీట్‌–యూజీ ఉత్తీర్ణత ఆధారంగా జాతీయ స్థాయిలో ఆల్‌ ఇండియా కోటా, రాష్ట్రాల స్థాయిలో స్టేట్‌ కోటా పేరుతో రెండు రకాల కౌన్సెలింగ్‌ ప్రక్రియలు నిర్వహిస్తున్నారు.

ఆల్‌ ఇండియా కోటా 15 శాతం

ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల మాదిరిగానే ఆయుష్‌ కోర్సులకు కూడా జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటా పేరుతో భర్తీ చేస్తున్నారు. మిగిలిన 85 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల హెల్త్‌ యూనివర్సిటీలు.. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఏఐక్యూ కౌన్సెలింగ్‌

ఆల్‌ ఇండియా కోటా(ఏఐక్యూ) పరిధిలో.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలోని 15 శాతం సీట్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను.. కేంద్ర ఆయుష్‌ శాఖ పరిధిలోని ఆయుష్‌ అడ్మిషన్‌ సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఏఏసీసీసీ) పర్యవేక్షిస్తుంది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్‌ కళాశాలల్లోని 15 శాతం సీట్లను, సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని వంద శాతం సీట్లను, అదే విధంగా డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని వంద శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఈ సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. ఏఏసీసీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ విండోలో రిజిస్ట్రేషన్‌ చేసుకొని.. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సమయంలో.. అభ్యర్థులు తమ కోర్సుల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం మూడు రౌండ్లలో జరుగుతుంది. అభ్యర్థులు తదుపరి రౌండ్లకు హాజరయ్యే విధంగా స్లైడ్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో 52 వేలకు పైగా ఆయుష్‌ సీట్లు ఉన్నాయి. 

రాష్ట్రాల స్థాయిలో 85 శాతం సీట్లు

  • రాష్ట్రాల స్థాయిలో సీట్ల భర్తీకి స్టేట్‌ హెల్త్‌ యూనివర్సిటీలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. 
  • తెలుగు రాష్ట్రాల్లో..ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ(ఏపీ), తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ(తెలంగాణ)లు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తాయి. 
  • రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లకు స్టేట్‌ కోటా పేరుతో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. నీట్‌–యూజీ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. యూనివర్సిటీలు మెరిట్‌ జాబితాను రూపొందిస్తాయి. 
  • మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులు.. సంబంధిత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం నిర్దేశిత కౌన్సెలింగ్‌ కేంద్రాలకు వెళ్లి.. సదరు సర్టిఫికెట్ల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయించుకొని.. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. 
  • అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సులను ఆన్‌లైన్‌లో ప్రాథమ్యాల వారీగా పేర్కొంటే..అందుబాటులో ఉన్న సీట్లు, ర్యాంకుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
  • సీటు పొందిన విద్యార్థులు నిర్దేశిత తేదీల్లో ఆన్‌లైన్‌లోనే రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో సీట్లు

  • బీహెచ్‌ఎంఎస్‌: తెలంగాణాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లోని సీట్ల సంఖ్య 550. ఏపీలో 520 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీఏఎంఎస్‌: తెలంగాణలో రెండు ప్రభుత్వ కళాశాలల్లో 100 సీట్లు, ఏపీలో మూడు కళాశాలల్లో 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీఎన్‌వైఎస్‌: తెలంగాణలో 100 సీట్లు, ఏపీలో 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • యునానీ(బీయూఎంఎస్‌): తెలంగాణలో 75 సీట్లు, ఏపీలో 50 సీట్లు ఉన్నాయి.
  • గమనిక: సీట్ల వివరాలు.. గత ఏడాది 2020–21 విద్యా సంవత్సరానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌ సమయానికి పేర్కొన్న గణాంకాలని గమనించాలి.

ఫీజులు ఇలా

  • ఆంధ్రప్రదేశ్‌లో 2020–2022 బ్లాక్‌ పిరియడ్‌కు ప్రభుత్వ కళాశాలల్లో రూ.15వేలు, ప్రైవేట్‌ కళాశాల్లో ఎ–కేటగిరీ సీట్లకు రూ.22 వేలు, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు రూ.మూడు లక్షలు వార్షిక ఫీజుగా పేర్కొన్నారు. 
  • తెలంగాణలో గత ఏడాది కన్వీనర్‌ కోటాలో రూ.20 వేలు ఫీజు, మేనేజ్‌మెంట్‌ కోటాలో(బీ–కేటగిరీలో) కనిష్టంగా రూ.75 వేలు, గరిష్టంగా రూ.మూడు లక్షలు ఫీజుగా నిర్ణయించారు.

కెరీర్‌ అవకాశాలు 

ఆయుష్‌ కోర్సుల అభ్యర్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఉత్తీర్ణులకు దీటుగా కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ విభాగాల్లోనూ ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థలు అడుగు పెడుతున్నాయి. ఆయుష్‌ కోర్సుల ఉత్తీర్ణులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఆయుష్‌ కోర్సుల అభ్యర్థులు కెరీర్‌ అవకాశాల పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణుల అభిప్రాయం.

బీహెచ్‌ఎంఎస్‌
బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీహెచ్‌ఎంస్‌) కోర్సులో.. ఎంబీబీఎస్‌ కరిక్యులంలో ఉండే విభాగాలు(ఉదాహరణకు అనాటమీ,ఫిజియాలజీ తదితర) ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రజల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడంతో పలు కార్పొరేట్‌ వైద్య సంస్థలు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా బీహెచ్‌ఎంఎస్‌తో నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనం పొందే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో మెటీరియా మెడికా, హోమియోపతిక్‌ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్‌ నెలకొంది.

బీఏఎంఎస్‌
సహజ సిద్ధ పద్ధతులతో వైద్యం చేయగలిగే నైపుణ్యాలు అందించే కోర్సు.. బీఏఎంఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ). ఇది వైద్య రంగంలో కెరీర్‌ కోరుకునే బైపీసీ విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఎంబీబీఎస్‌లో మాదిరిగానే బీఏఎంఎస్‌లోనూ..అనాటమీ,ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్‌ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఉన్నత విద్యలో..ఎండీ ఆయుర్వేద, ఎంఎస్‌–ఆయుర్వేద కోర్సుల్లో చేరొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్‌ మెడిసిన్‌కు సరితూగే కాయ చికిత్స, జనరల్‌ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సులు కూడా పీజీ స్పెషలైజేషన్లుగా ఉన్నాయి. బీఏఎంఎస్‌తో ఆయుష్‌ శాఖల్లో,ప్రైవేటు ఆయుర్వేద ఆసుపత్రుల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.

యునానీ(బీయూఎంఎస్‌)
బీయూఎంఎస్‌.. బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడికల్‌ సైన్స్‌. దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ఈ కోర్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పు న రెండు కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంది. బీయూఎంఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే ఎండీ, ఎంఎస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బీఎన్‌వైఎస్‌
బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతిక్‌ మెడికల్‌ సైన్సెస్‌.. బీఎన్‌వైఎస్‌. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రకృతి వైద్యం పట్ల అవగాహన పెరుగుతోంది. దాంతో ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు దీటైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.. బీఎన్‌వైఎస్‌. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. 

టీఎస్‌ యూజీ ఆయుష్‌ వైద్య ప్రవేశాలకు నోటిఫికేషన్‌

తెలంగాణలో యూజీ ఆయుష్‌ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయుష్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నీట్‌–2021లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల(జనవరి) 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ.. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.knruhs.telangana.gov.in

మెరుగైన అవకాశాలు

ఆయుష్‌ కోర్సుల ఉత్తీర్ణులకు కెరీర్‌ అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ఈ కోర్సుల విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు మాదిరిగానే చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరు బ్యాచిలర్‌ డిగ్రీతోనే సరిపెట్టుకోకుండా.. పీజీని కూడా పూర్తి చేస్తే.. కెరీర్‌ పరంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 
–డా‘‘ మీనా కుమారి, సీసీఐఎం మెంబర్‌

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

Published date : 31 Jan 2022 07:05PM

Photo Stories