Skip to main content

Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

Special Courses and Skills for Career Planning
Special Courses and Skills for Career Planning

పోటీ ప్రపంచం.. కళ్ల ముందు ఎన్నో కోర్సులు, కెరీర్స్‌! ఏ కోర్సు చూసినా.. దేనికదే ప్రత్యేకం! అవకాశాల విషయంలోనూ దేనికదే సాటి!! మరోవైపు.. ఎక్కువ మంది విద్యార్థులు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సుల వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి! కానీ.. కేవలం మార్కెట్‌ కోణంలోనే ఆలోచించి కోర్సును ఎంచుకుంటే దీర్ఘకాలంలో రాణించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది!! ఎందుకంటే.. అధిక శాతం మంది తాము ఎంచుకున్న కెరీర్‌ పట్ల మధ్యలోనే నిరాశకు గురవుతున్నారు! ఇలాంటి పరిస్థితుల్లో.. కొద్దిపాటి కసరత్తుతో తమకు నప్పే కోర్సు ఏదో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కెరీర్‌ ప్లానింగ్, వ్యక్తిత్వ లక్షణాలు, కోర్సు ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.. 

  • కళ్ల ముందు అనేక కోర్సులు, కెరీర్స్‌
  • ఆసక్తి, అవకాశాల ఆధారంగానే కోర్సు ఎంపిక మేలు
  • వ్యక్తిత్వ లక్షణాలనూ పరిగణనలోకి తీసుకోవాలంటున్న నిపుణులు 


విద్యార్థి కీలక దశలో తీసుకునే ఒకే ఒక్క కెరీర్‌ నిర్ణయం.. యావత్‌ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. కోర్సు ఎంపికలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. తొందరపాటుగా వ్యవహరించినా.. జీవితం ఆసాంతం దాని ప్రభావం ఉంటుంది. అందుకే ఉజ్వల భవిష్యత్తును ఊహించుకునే విద్యార్థులు.. కోర్సు ఎంపికలో ఎంతో కసరత్తు చేసి.. స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కోర్సు, కెరీర్‌ ఎంపికలో ఆసక్తి, అవకాశాలతోపాటు విద్యార్థి తన వ్యక్తిత్వ లక్షణాలు, అలవాట్లు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.
 
వ్యక్తిత్వం కీలకం
ఇటీవల కాలంలో కోర్సు, కెరీర్‌ ఎంపికలో వ్యక్తిత్వ లక్షణాలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడు ఏ కోర్సు చూసినా.. దానికి సంబంధించి ప్రొఫెషనల్‌ నైపుణ్యాలే కాకుండా.. వ్యక్తిగతంగానూ ప్రత్యేక లక్షణాలు అవసరం అవుతున్నాయి. ఆయా లక్షణాలున్న వ్యక్తులే సదరు ప్రొఫెషన్‌లో చక్కగా రాణిస్తున్నారు.

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

అంతర్ముఖులు

  • వ్యక్తుల్లో కొందరు అంతర్ముఖులు(ఇంట్రావర్ట్‌లు) ఉంటారు. వారు తమ ఆలోచనలను తమలోనే మదింపు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి.. రీసెర్చ్, సైన్స్, ఐటీ వంటి రంగాలు సరితూగుతాయనేది నిపుణుల అభిప్రాయం. కారణం.. వీటిలో నిరంతరం ఆలోచిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. 
  • రీసెర్చ్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఏదైనా ఒక అంశంపై లోతుగా ఆలోచిస్తూ.. పని చేయాలి. అంతర్ముఖలు ఏదైనా విషయంపై అన్ని కోణాల్లో ఎంతసేపైనా ఆలోచించేందుకు, ఒంటరిగా పనిచేసేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటారు. 
  • సైన్స్‌ విభాగంలో.. స్వీయ విశ్లేషణ,తులనాత్మక అధ్యయనం వంటి వ్యక్తిగత లక్షణాలు ఆయా కోర్సుల్లో రాణించడానికి ఉపయోగపడతాయి. 
  • ఐటీ రంగంలో సైతం.. నిర్దిష్టంగా ఒక ప్రాజెక్ట్‌ లేదా అల్గారిథంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. లాజికల్‌ థింకింగ్‌ చాలా అవసరం. ఇలాంటి విధుల్లో అంతర్ముఖులు ముందంజలో నిలుస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. కారణం.. వీరికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉండటమే. అంతేకాకుండా వీరు ఏ విషయంపైనైనా సుదీర్ఘ సమయం వెచ్చించే మనస్తత్వం కూడా కలిగుంటారు. 

నలుగురితో కలిసే వారైతే 

  • మరికొందరు ఎప్పుడూ నలుగురితో కలుస్తూ.. గలగలా మాట్లాడుతూ (ఎక్స్‌ట్రావర్ట్‌లు).. నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తుంటారు. వీరు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుంటారు. ముఖ్యంగా బహిర్ముఖులకు ఇతరులను మెప్పించే నైపుణ్యాలు ఎక్కువ. ఇలాంటి వారికి మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, సోషల్‌ వర్క్‌ వంటి కెరీర్స్‌ చక్కగా నప్పుతాయి. 
  • మేనేజ్‌మెంట్‌ విభాగంలో నిర్వహణ, నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం ఉంటుంది. బహిర్ముఖులు ఈ విభాగంలోని మెళకువలను సులువుగా ఆకళింపు చేసుకుంటూ.. తమకు కేటాయించిన పనిని బృందంతో కలిసి వేగంగా పూర్తి చేయగలరు. 
  • సమాజంతో కలిసి పనిచేయాల్సిన జర్నలిజం, మీడియా, సోషల్‌ మీడియా, సోషల్‌ వర్క్‌ వంటి విభాగాల్లోనూ ఎక్స్‌ట్రావర్టులు చక్కగా రాణించగలరు. 

ఆసక్తి
ఆసక్తి లేకుండా కోర్సులో చేరితే.. ఆశించిన ఫలితం కష్టమే! ప్రస్తుతం సంగీతం నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకూ.. అన్ని రంగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ‘క్రేజీ కెరీర్‌’ అనే కోణానికే పరిమితం కాకుండా.. విద్యార్థులు తమ ఆసక్తి మేరకు కోర్సును ఎంచుకోవచ్చు. ఉదాహరణకు సంగీతం పట్ల ఆసక్తి ఉంటే.. మ్యూజిక్‌ కాగ్నిషన్, ఆడియో ఇంజనీరింగ్‌ వంటి కొత్త కోర్సుల్లో చేరొచ్చు. 
 

చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం
అప్టిట్యూడ్‌

కొంతమంది విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే వారి అప్టిట్యూడ్‌ (సహజ ప్రతిభ లేదా నైపుణ్యం) వివిధ చర్యల ద్వారా కనిపిస్తుంది. వీరు చిన్నప్పటి నుంచే ఏదైనా ఒక అంశంపై స్పష్టమైన ఆసక్తి కలిగి ఉంటారు. ఉదాహరణకు కంప్యూటర్, లేదా ఎలక్ట్రానిక్‌ పరికరాల పట్ల ఆసక్తి చూపడం; లేదా ఇంట్లోని కారు, టూ వీలర్స్‌ వంటి వాటిని స్వతహాగా బాగు చేస్తుంటారు. కొన్ని పనులు సహజంగా, వేగంగా చేస్తుంటారు. కొన్ని విషయాలపై స్పష్టమైన ఆసక్తి ఉంటుంది. ఇలాంటి విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌ చదవాలి, లేదా డాక్టర్‌ కావాలి లేదా టీచర్‌ అవ్వాలి, కంప్యూటర్స్‌ నేర్చుకోవాలి అనే సంకల్పం కనిపిస్తుంటుంది. అలాంటి వారి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ అప్టిట్యూడ్‌ను సరిగా బహిర్గతం చేయలేని విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. వారికి ఎలాంటి కోర్సు, కెరీర్‌ నప్పుతుందో గమనించాలి. వారి ప్రతిభ, సామర్థ్యాలను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.
 
దృక్పథం 
కోర్సు ఎంపికలో విద్యార్థి దృక్పథాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థిలో థియరీ ఓరియెంటేషన్‌ ఉందా, లేదా ప్రాక్టికల్‌ దృక్పథమా అనేది కూడా పరిశీలించాలి. ఉదాహరణకు మ్యాథమెటిక్స్, సైన్స్‌ వంటి కోర్సుల్లో ప్రాక్టికల్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. హిస్టరీ, ఎకనామిక్స్, ఇతర సోషల్‌ సైన్సెస్‌ విషయంలో థియరీ నైపుణ్యాలు లాభిస్తాయి. విద్యార్థులు ఈ రెండింటిలో తమ వైఖరి ఏంటో గుర్తించి.. ఆ మేరకు కోర్సును ఎంచుకోవాలి.

కోర్సు వ్యవధి
కోర్సు ఎంపికలో కోర్సు వ్యవధిని సైతం పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ఇటీవల కాలంలో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో కొంత వ్యవధి ఆదా అవుతుంది. కొన్ని కోర్సులకు పీజీ, పీహెచ్‌డీ చేస్తే కానీ అవకాశాలు లభించవు. ఉదాహరణకు వైద్య విద్యను పరిగణనలోకి తీసుకుంటే..ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్‌ రాణించాలంటే..ఎంబీబీఎస్‌ తర్వాత పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ తర్వాత దాదా పు పదేళ్ల సమయం పడుతోంది. అదే విధం గా సైన్స్‌ కోర్సులు కూడా పీజీ, పీహెచ్‌డీ చేస్తే∙ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. ఇలాంటి కోర్సులతో దీర్ఘకాలంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటు ంది. కానీ మన కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పదో తరగతి, ఇంటర్‌ తర్వాత ఎక్కువ రోజులు చదువు కొనసాగించే పరిస్థితి అందరికీ ఉండదు. డిప్లొమా లేదా డిగ్రీతోనే ఉపాధి వెతుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కోర్సు వ్యవధి, అవకాశాల పరిధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

చ‌ద‌వండి: మెరుగైన‌ భవిష్యత్‌కు...విలువైన మల్టీడిసిప్లినరీ కోర్సు..

ఉన్నత విద్య
కోర్సు ఎంపికలో ఉన్నత విద్య మార్గాలను కూడా పరిశీలించాలి. ఇప్పుడు చాలా కోర్సుల్లో ఉన్నత విద్యకు అవకాశం ఉంది. మరోవైపు డిగ్రీతోనే కొలువులు ఖాయం చేసే కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి పీజీ స్థాయిలో స్పెషలైజేషన్లు ఉండట్లేదు. కాబట్టి ఉన్నత విద్యపై ఆసక్తి ఉండే విద్యార్థులు.. అందుకు అవకాశం ఉన్నవాటిలో చేరడమే మంచిదని నిపుణుల అభిప్రాయం.

ఉపాధి వేదికలు
కోర్సు ఎంపికలో ఉపాధి వేదికల పరంగానూ ముందుగానే అవగాహన కలిగిన ఉండటం మేలు. సంబంధిత రంగంలో భవిష్యత్తు అవకాశాలు; ఉద్యోగ మార్గాలపై దృష్టిసారించాలి. అంతేకాకుండా సదరు రంగం ప్రస్తుత ప్రగతి, సంబంధిత కోర్సు ముగిసే సమయానికి అందుబాటులో ఉండే అవకాశాలపై ఒక స్పష్టమైన అంచనా ఏర్పరచుకోవాలి. ఇందుకోసం సంబంధిత రంగ నిపుణులు, సీనియర్ల సలహాలు, సూచనలు లాభిస్తాయి.

హాబీలు
కోర్సు ఎంపికలో కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అలవాట్లు లేదా హాబీలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఉదాహరణకు డ్రాయింగ్‌ హాబీ ఉంటే ఫైన్‌ ఆర్ట్స్, డిజైనింగ్‌ వంటి రంగాల్లో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా క్రీడలంటే మక్కువ ఉన్న విద్యార్థులు.. క్రీడా రంగంలోనే కెరీర్‌ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. డ్యాన్సింగ్, యాక్టింగ్, మ్యూజిక్‌ వంటి హాబీలున్న విద్యార్థులకు కూడా ఇప్పుడు ఆయా విభాగాల్లో చక్కటి కోర్సులు ఉన్నాయి. అందుకే కెరీర్‌ ప్లానింగ్‌లో హాబీలకు  కూడా సముచిత స్థానం కల్పించాలన్నది నిపుణుల అభిప్రాయం.

ప్రత్యామ్నాయాలు
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సుతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా అన్వేషించాలి. కొన్ని సందర్భాల్లో తమకు ఆసక్తి ఉన్న కోర్సులో ప్రవేశం లభించకుంటే.. ఈ ప్రత్యామ్నాయ అన్వేషణ ఉపయోగపడుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో ఆశించిన కోర్సులో ప్రవేశం లభించకపోవచ్చు. ఉదాహరణకు ఇంటర్మీడియెట్‌ బైపీసీ విద్యార్థుల్లో అధిక శాతం మందికి ఎంబీబీఎస్‌లో చేరడం లక్ష్యం. కానీ పోటీ కారణంగా అవకాశం దక్కకపోవచ్చు. ఇలాంటి విద్యార్థులు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఆయుష్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ వంటి కోర్సుల గురించి ఆలోచించి పెట్టుకోవాలి.

కెరీర్‌ ఎంపిక.. ముఖ్యాంశాలు

  • కెరీర్‌ ప్లానింగ్‌లో వ్యక్తిగత లక్షణాలు, ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • స్వీయ సామర్థ్యం/నైపుణ్యాలు గుర్తించాలి.
  • వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి.
  • అంతర్ముఖులకు సైన్స్, రీసెర్చ్, ఐటీ కోర్సులు నప్పుతాయి.
  • బహిర్ముఖులకు మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, సోషల్‌ వర్క్‌ కోర్సులు అనుకూలం.

చ‌ద‌వండి: ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్న ఈ తరుణంలో.. సైబర్‌ సెక్యూరిటీకి పెరుగుతున్న అవ‌కాశాలు..!​​​​​​​

Published date : 11 Nov 2021 06:01PM

Photo Stories