Skip to main content

Student Visa Latest Rules: స్టూడెంట్‌ వీసాలపై పలు దేశాల ఆంక్షలు.. కొత్త నిబంధనలు ఇవే..

నేడు మన దేశ విద్యార్థుల్లో ఎక్కువ మంది లక్ష్యం.. స్టడీ అబ్రాడ్‌! గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంటూనే.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నికల్, సైన్స్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విద్యార్థులు.. విదేశాల్లో ఎంఎస్‌ చేస్తే కెరీర్‌కు ఢోకా ఉండదని భావిస్తున్నారు. కాని కోవిడ్‌ అనంతరం కాలంలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని భావిస్తున్న పలు దేశాలు.. స్టూడెంట్‌ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. టాప్‌ డెస్టినేషన్స్‌గా నిలుస్తున్న పలు దేశాల్లో తాజా వీసా నిబంధనలపై ప్రత్యేక కథనం..
Study Abroad Student Visa Latest Rules   InternationalStudents  EngineeringCourses
  • స్టూడెంట్‌ వీసాలపై పలు దేశాల ఆంక్షలు
  • కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో కొత్త నిబంధనలు 
  • అన్ని రకాల జాగ్రత్తలతోనే ప్రవేశం!

కెనడా.. చదువు భారమే!

  • వీసా నిబంధనలు కఠినం చేసిన దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది కెనడా. తాజా నిబంధనల ప్రకారం-కెనడాలో స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ ఆర్థిక స్థోమతకు, సంసిద్ధతకు సంబంధించి చూపాల్సిన డిపాజిట్‌ మొత్తాన్ని భారీగా పెంచేసింది. ప్రస్తుతం పది వేల కెనడా డాలర్లుగా ఉన్న డిపాజిట్‌ మొత్తాన్ని 20,635 డాలర్లకు పెంచింది. దీంతో దరఖాస్తు దశలోనే విద్యార్థులపై ఆర్థికంగా రెట్టింపు భారం పడుతోంది. ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. దీంతో కెనడా చదువు ఆర్థికంగా పెను భారం అనేది స్పష్టమవుతోంది. దీంతోపాటు విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై రెండేళ్లపాటు పరిమితి విధించనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ శాఖ ప్రకటించింది. 
  • వెరిఫికేషన్‌ ప్రక్రియను కూడా 2023, డిసెంబర్‌ 1 నుంచి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పోస్ట్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ స్థాయిలో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌ (డిజిగ్నేటెడ్‌ లెర్నింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌) ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి సంబంధించి లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ను ఐఆర్‌సీసీకి చూపి ఆమోదం పొందాలనే నిబంధన తెచ్చారు. 
  • అంతేకాకుండా త్వరలోనే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్‌ ప్రోగ్రామ్‌ విధానంలోనూ మార్పులు తెచ్చే దిశగా కెనడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో.. పోస్ట్‌ స్టడీ వర్క్‌ విషయంలోనూ మన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారముంది. ప్రస్తుత విధానంలో పీజీ పూర్తి చేసుకున్న తర్వాత ఆరు నెలల పాటు కెనడాలోనే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ సమయంలో ఏదైనా ఉద్యోగం లభిస్తే పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. కనిష్టంగా ఎనిమిది నెలలు, గరిష్టంగా మూడేళ్ల వ్యవధికి తొలుత పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ను జారీ చేస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
  • స్టూడెంట్స్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ మొత్తాన్ని పెంచడం.. దాన్ని వెంటనే అమల్లోకి తేవడం; అదే విధంగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల ప్రభావం ఇప్పటికే మన విద్యార్థులపై కనిపిస్తోంది. 2022 డిసెంబర్‌తో పోల్చితే.. 2023 డిసెంబర్‌లో- మన దేశ విద్యార్థుల సంఖ్యలో 86 శాతం మేర తగ్గుదల నమోదవడమే ఇందుకు నిదర్శనం.
  • కెనడాలోని యూనివర్సిటీల్లో చేరేందుకు విద్యార్థులు ముందుగా స్టూడెంట్‌ వీసాకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగానూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోదల్చిన విద్యార్థులు www.cic.gc.ca ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రవేశం ఖరారు చేసుకున్నట్లు రుజువు చేసే అడ్మిషన్‌ కన్మరేషన్‌ లెటర్‌ ఆధారంగా.. స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలో నిర్దేశిత డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. విద్యార్థులకు కెనడా కాన్సులేట్‌ అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించి.. ఈ పర్మిట్‌ను మంజూరు చేస్తారు. వీరికి ముందుగా టెంపరరీ రెసిడెంట్‌ వీసా ఇస్తారు.

చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!

ఆస్ట్రేలియా.. ఇంగ్లిష్‌పై పట్టుంటేనే

  • మన దేశ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 2022 గణాంకాల ప్రకారం-ఈ దేశంలో లక్ష మందికిపైగా భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆస్ట్రేలియా సైతం అంతర్జాతీయ విద్యార్థులకు కఠిన నిబంధనల అమలు దిశగా అడుగులు వేస్తోంది. సబ్‌ క్లాస్‌ 500 కింద స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇకపై ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యానికి సంబంధించి మరింత ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆస్ట్రేలియా ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం- టెంపరరీ గ్రాడ్యుయేట్‌ వీసా పొందాలనుకుంటే.. ఐఈఎల్‌టీఎస్‌ 6.5 బాండ్స్‌ ఉండాల్సిందే. ప్రస్తుతం ఇది 6గానే ఉంది. ఇక స్టూడెంట్‌ వీసా దరఖాస్తుకు అవసరమైన ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ను 5.5 బ్యాండ్స్‌ నుంచి 6 బ్యాండ్స్‌కు పెంచింది. 
  • అంతేకాకుండా 'న్యూ జెన్యూన్‌ టెస్ట్‌' అనే కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న 'జెన్యూన్‌ టెంపరరీ ఎంట్రెంట్‌'కు బదులు దీన్ని తీసుకురానుంది. నూతన విధానం ప్రకారం-ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే విద్యార్థుల అసలు ఉద్దేశాన్ని, వారు చేరాలనుకుంటున్న కోర్సు ద్వారా వారి ఆశిస్తున్న లక్ష్యాలను పరిశీలించనున్నారు.
  • అదే విధంగా విద్యార్థులు దరఖాస్తు సమయంలో చూపాల్సిన సేవింగ్స్‌ మొత్తాన్ని కూడా పెంచింది. మొత్తం 24,505 డాలర్లు తమ వద్ద ఉ­న్నట్లు చూపాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఈ మొత్తం ఏడాదికి 20, 290 డాలర్లుగానే ఉంది.
  • ఆస్ట్రేలియాలో యూజీ, పీజీ, మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సబ్‌ క్లాస్‌ 500 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీరి అడ్మిషన్‌ దరఖాస్తు, ఫైనాన్షియల్‌ ఎవిడెన్స్, ట్యూషన్‌ ఫీజు, యూనివర్సిటీలో ఎన్‌రోల్‌మెంట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, వీసా లాడ్జ్‌మెంట్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీసా మంజూరు చేస్తారు.

యూకే..డిపెండెంట్‌ వీసాలకు నో ఛాన్స్‌

  • అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశం, వీసా మంజూరుపై ఆంక్షలు విధిస్తున్న దేశాల జాబితాలో యూకే ముందు వరుసలో నిలుస్తోంది. తాజా నిబంధనల ప్రకారం -స్టూడెంట్‌ వీసాతో వచ్చే విద్యార్థులు తమ కుటుంబాలను వెంట తెచ్చుకోకుండా బ్రిటన్‌ నిషేధం విధించింది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ చేస్తున్న విద్యార్థులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. 
  • అదేవిధంగా విద్యార్థులు తమ చదువు పూర్తయ్యేవరకు వర్క్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించారు. దీంతోపాటు పోస్ట్‌ స్టడీ వర్క్‌ విషయంలోనూ సంస్కరణలు తెచ్చేలా యూకే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత విధానంలో చదువు పూర్తయ్యాక రెండేళ్ల వ్యవధికి పోస్ట్‌ స్టడీ వర్క్‌ వీసా మంజూరు చేస్తున్నారు. 
  • ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానంలో మార్పుల దిశగా యూకే ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా విధానం ప్రకారం-బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు రెండేళ్లు, పీహెచ్‌డీ విద్యార్థులు మూడేళ్లుపాటు పోస్ట్‌ స్టడీ వర్క్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుకు ఆమోదం లభించి గ్రాడ్యుయేట్‌ వీసా మంజూరైతే.. చేతిలో ఆఫర్‌ లెటర్‌ లేకపోయినా.. అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ చేయొచ్చు. ఉద్యోగం లభిస్తే గ్రాడ్యుయేట్‌ వీసా కాలపరిమితి ముగిశాక.. ఇతర వర్క్‌ వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు గ్రాడ్యుయేట్‌ వీసాతో ఉద్యోగం పొంది.. రెండేళ్లు, లేదా మూడేళ్ల వ్యవధి పూర్తయ్యాక.. స్కిల్డ్‌ వర్కర్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్కిల్డ్‌ వర్కర్‌ వీసా మంజూరైతే.. సదరు అభ్యర్థులు యూకేలోనే మరింత కాలం ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. ఈ విధానాన్ని సమీక్షించి మార్పులు తెచ్చే అవకాశముందని యూకే అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
  • యూకేలో పీజీ స్థాయి కోర్సులు, గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు టైర్‌-4 జనరల్‌ కేటగిరీ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా సదరు ఇన్‌స్టిట్యూట్‌ అందించే కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ యాక్సప్టెన్స్‌ ఫర్‌ స్టడీస్‌(సీఏఎస్‌) ఫామ్‌ ఆధారంగానే చేయాల్సి ఉంటుంది.

చదవండి: Student Visas: విద్యార్థుల‌ వీసాల‌ను త‌గ్గించిన కెన‌డా..!

అమెరికా.. పాస్‌పోర్ట్‌ ఆధారంగా వీసా

  • మన విద్యార్థులకు తొలి గమ్యంగా నిలిచే అమెరికా కూడా వీసా మంజూరులో కొత్త నిబంధనలు తెచ్చింది. తాజా నిబంధనల ప్రకారం-పాస్ట్‌పోర్ట్‌లో ఉన్న సమాచారాన్ని వీసా మంజూరుకు పరిగణనలోకి తీసుకోనుంది. ఇతర ఏ సమాచారాన్ని వీసా మంజూరుకు అంగీకరించరు. ఈ విధానాన్ని ఎఫ్‌-1, ఎం, జె స్టూడెంట్‌ వీసాలు పొందాలనుకునే వారికి అమలు చేయనున్నారు. 
  • అమెరికాలో ఉన్నత విద్య, వీసా కోరుకునేవారు యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ ఇచ్చే ఐ-20 ఫామ్‌(అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్‌) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దశలో ఆన్‌లైన్‌ విధానంలో యూఎస్‌ ఇమిగ్రేషన్‌ వెబ్‌సైట్‌లోని డీఎస్‌-160 వీసా అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఈ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సమయంలో తాము ఇంటర్వ్యూకు, అదే విధంగా అప్లికేషన్‌ సెంటర్‌(వీఏసీ)కి వేర్వేరుగా రెండు తేదీల్లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. వాటికి హాజరవదలచుకున్న కాన్సులేట్‌ కార్యాలయాన్ని తెలియజేయాలి. అప్లికేషన్‌ సెంటర్‌లో ప్రక్రియకు వెళ్లేముందు పాస్‌పోర్ట్, డీఎస్‌-160 కన్ఫర్మేషన్‌ పేజ్, అపాయింట్‌ కన్ఫర్మేషన్‌ పేజ్‌లతో వెళ్లాలి. అప్లికేషన్‌ సెంటర్‌లో ఇంటర్వ్యూ విజయవంతంగా ముగించుకుంటే వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్‌ సిటిజన్‌షిప్‌ పాస్‌పోర్ట్, అపాయింట్‌మెంట్‌ లెటర్, డీఎస్‌-160 కన్ఫర్మేషన్‌ లెటర్, సెవిస్‌(స్టూడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ రిపోర్ట్, రిసీప్ట్‌ (ఐ-901), ఐ-20లను దగ్గర ఉంచుకోవాలి. విద్యార్థులు అకడమిక్‌ సెష­న్‌ ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందుగా వీసా మంజూరు ప్రక్రియ ముగుస్తుంది

స్టాండర్ట్‌ టెస్ట్‌ స్కోర్లే ఆధారంగా
స్టూడెంట్‌ వీసా కోసం విద్యార్థులు అకడమిక్‌ ప్రతిభతోపాటు సంబంధిత స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్లలో బెస్ట్‌ స్కోర్‌ కోసం ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా దేశాల్లోని యూనివర్సిటీల ప్రామాణికాలు, ప్రభుత్వ ఇమిగ్రేషన్‌ నిబంధనలపై ముందుగానే అవగాహన పెంచుకుంటే.. వీసా పొందే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంటున్నారు.

ఇవి తప్పనిసరి
విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నిర్దేశిత డాక్యుమెంట్లు/ సర్టిఫికెట్లను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్, అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్, కోర్సు ఫీజు వ్యయం, ఆర్థిక వనరులకు సంబంధించిన రుజువులు, ఎడ్యుకేషన్‌ లోన్‌ ద్వారా అభ్యసించదలిస్తే సంబంధిత బ్యాంకు నుంచి అధీకృత రుజువులతో వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి: Study Abroad: కెనడా ప్రభుత్వం ప్రకటనతో విద్యార్థులు షాక్‌.. ఇదే జరిగింది..!

వీసా ఇంటర్వ్యూ
వీసా మంజూరుకు నిర్వహించే ఇంటర్వ్యూ సందర్భంగా విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొస్తామనే నమ్మకం కలిగించాలి. ఆ దేశంలోనే చదవాలనుకోవడానికి గల కారణాలను ఇమిగ్రేషన్‌ అధికారులను సంతృప్తి పరిచేలా చెప్పగలగాలి. అక్కడ కోర్సు ద్వారా తాము నేర్చుకోదలిచిన నైపుణ్యాల గురించి స్పష్టత ఉండాలి.

Published date : 25 Jan 2024 10:22AM

Photo Stories