Skip to main content

Changes in TOEFL: టోఫెల్‌.. కీలక మార్పులు ఇవే!

టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ ఫారెన్‌ లాంగ్వేజ్‌.. సంక్షిప్తంగా టోఫెల్‌! ఇది విదేశీ విద్య విద్యార్థులు తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన పరీక్ష!! ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో అడుగుపెట్టాలంటే.. టోఫెల్‌ స్కోర్‌ తప్పనిసరి! నిర్వాహక సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌(ఈటీఎస్‌)..ఇటీవల ఈ పరీక్షలో పలు కీలక మార్పులను ప్రకటించింది. కొత్త విధానం జూలై 26 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. టోఫెల్‌ నూతన విధానం, తాజా మార్పులు, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు తదితర వివరాలు..
Changes in TOEFL
  • విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలకు ప్రామాణిక పరీక్ష టోఫెల్‌
  • టోఫెల్‌లో మార్పులు ప్రకటించిన ఈటీఎస్‌
  • రెండు గంటలకు తగ్గిన పరీక్ష సమయం
  • జూలై 26 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం

టోఫెల్‌.. అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లోని 11,500 ఇన్‌స్టిట్యూట్‌లు ప్రామాణికంగా తీసుకుంటున్న లాంగ్వేజ్‌ టెస్ట్‌. డొమైన్‌ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా అన్ని విభాగాల అభ్యర్థులకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై ఉన్న అవగాహన విదేశీ యూనివర్సిటీల ప్రవేశాల్లో కీలకంగా మారుతోంది. దీంతో స్టడీ అబ్రాడ్‌ అభ్యర్థులకు టోఫెల్‌ స్కోర్‌ అత్యంత ఆవశ్యకంగా మారింది. ఈ పరీక్షకు ఏటా లక్ష మంది వరకూ హాజరవుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పరీక్ష విధానంపై అభ్యర్థుల్లో కొంత ప్రతికూలత నెలకొంది. ముఖ్యంగా సుదీర్ఘమైన టెస్ట్‌ సమయం, తుది స్కోర్‌ కేటాయింపులో పరిగణనలోకి తీసుకోని ప్రశ్నలు ఉండటం వంటి కారణాలతో సమయాభావం ఏర్పడుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న టోఫెల్‌ నిర్వాహక సంస్థ.. ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌(ఈటీస్‌).. ఈ పరీక్షలో పలు కీలక మార్పులు చేసింది.

పరీక్ష వ్యవధి రెండు గంటలే

టోఫెల్‌ కొత్త విధానంలో పరీక్ష వ్యవధిని రెండు గంటలకు తగ్గించారు. ఇంతకాలం మొత్తం నాలుగు విభాగాల్లో(రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్‌) మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తుండగా.. తాజా-పరీక్ష సమయం రెండు గంటలుగా నిర్ణయించారు.

చ‌ద‌వండి: టోఫెల్ పరీక్ష గురించి వివరించండి?

విభాగాల వారీగా ప్రశ్నలు

  • రీడింగ్‌ సెక్షన్‌: రెండు ప్యాసేజ్‌ల నుంచి 10 ప్రశ్న­లు చొప్పున మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. 35 నిమిషాల వ్యవధిలో సమాధానాలు ఇవ్వాలి.
  • లిజనింగ్‌ సెక్షన్‌: మూడు లేదా నాలుగు లెక్చర్స్‌. ఒక్కో లెక్చర్‌ నుంచి 6 ప్రశ్నలు ఉంటాయి. అదే విధంగా రెండు లేదా మూడు సంభాషణలు ఇచ్చి.. ఒక్కో సంభాషణపై 5 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 36 నిమిషాలు.
  • స్పీకింగ్‌ సెక్షన్‌: ఇండిపెండెంట్‌ టాస్క్‌-1, ఇండిపెండెంట్‌ టాస్క్‌-2, ఇండిపెండెంట్‌ టాస్క్‌-3, ఇండిపెండెంట్‌ టాస్క్‌-4. దీనికి లభించే సమయం 16 నిమిషాలు.
  • రైటింగ్‌ సెక్షన్‌: ఇందులో రెండు టాస్క్‌లు ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. టాస్క్‌-1లో రైటింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ టాస్క్, టాస్క్‌-2లో అకడమిక్‌ రైటింగ్‌ డిస్కషన్‌ టాస్క్‌ ఉంటాయి. ఒక్కో టాస్క్‌కు 29 నిమిషాల సమయం కేటాయిస్తారు.

అన్‌-స్కోర్డ్‌ కొశ్చన్స్‌ తొలగింపు

టోఫెల్‌ కొత్త విధానంలో భాగంగా అన్‌-స్కోర్డ్‌(స్కోర్‌ కేటాయింపులో పరిగణించని) ప్రశ్నలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుత విధానంలో లిజనింగ్‌ విభాగంలో అన్‌ స్కోర్డ్‌ కొశ్చన్స్‌ పేరుతో అయిదు ప్రశ్నల వరకు అడుగుతున్నారు. వీటికి సమాధానాలు ఇవ్వడం తప్పనిసరి. కానీ.. ఈ ప్రశ్నల ద్వారా పొందిన మార్కులను స్కోర్‌ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోరు. వీటి కారణంగా అభ్యర్థులు సమయాభావ సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈటీఎస్‌.. ఇకపై లిజనింగ్‌ విభాగంలో స్కోర్డ్‌ కొశ్చన్స్‌నే అడగనుంది.

కొత్తగా రైటింగ్‌ ఫర్‌

కొత్తగా 'రైటింగ్‌ ఫర్‌ యాన్‌ అకడమిక్‌ డిస్కషన్‌' పేరుతో కొత్త టాస్క్‌ చేర్చారు. ఇందులో అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ప్రొఫెసర్‌ ఇచ్చిన ప్రశ్నను చదివి.. దానికి అప్పటికే ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని పరిగణనలోకి తీసుకుంటూ.. అదే అకడమిక్‌ అంశంపై సమాధానాన్ని ఇవ్వడంతోపాటు, తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తీకరించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

రీడింగ్‌ సెక్షన్‌లోనూ సమయం కుదింపు

ప్రస్తుత విధానంలో మూడు లేదా నాలుగు ప్యాసేజ్‌ల నుంచి 10 ప్రశ్నలు చొప్పున మొత్తం 40 ప్రశ్నలు రీడింగ్‌ సెక్షన్‌లో అడుగుతున్నారు. వీటికి కనిష్టంగా 54 నిమిషాలు, గరిష్టంగా 72 నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. 
కొత్త విధానంలో మాత్రం రెండు ప్యాసేజ్‌లు, వాటి ఆధారంగా 20 ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. వీటికి 35 నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే..పాత విధానంతో పోల్చితే అభ్యర్థులకు దాదాపు సగం సమయం కలిసొస్తుంది.

స్కోర్‌ వెల్లడి

కొత్త విధానంలో పరీక్ష పూర్తి కాగానే.. అభ్యర్థులు తమ స్కోర్‌ వెల్లడి తేదీని తెలుసుకునే సదుపాయం కూడా కల్పించనున్నారు. దీనివల్ల అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఈటీఎస్‌ పంపే సమాచారం కోసం వేచి చూసే పరిస్థితికి ఫుల్‌స్టాప్‌ పడనుంది. పరీక్ష సమయంలో ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సూచనలు అందిస్తూ.. వారికి ఆన్‌లైన్‌ విధానంలో సహకరించే పద్ధతిని కూడా అమలు చేయనున్నారు.

స్థానిక కరెన్సీలో ఫీజు

టోఫెల్‌ అభ్యర్థులకు అనుకూలించే మరో మార్పు.. స్థానిక కరెన్సీలో ఫీజు చెల్లించే అవకాశాన్ని అందుబాటులోకి తేనుండడం. ఇప్పటి వరకు టోఫెల్‌ అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ సమయంలో డాలర్ల రూపంలోనే ఫీజు చెల్లించే విధానం ఉంది. కొత్తగా జూలై 26 నుంచి స్థానిక కరెన్సీలో అంటే మన దేశానికి చెందిన అభ్యర్థులు రూపాయల్లో కూడా ఫీజు చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. 
ఇప్పటికే టోఫెల్‌ పరీక్ష తేదీలను, స్లాట్లను రిజర్వ్‌ చేసుకున్న అభ్యర్థులు కూడా జూలై 26 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానంలో పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని ఈటీఎస్‌ కల్పిస్తోంది. 

చ‌ద‌వండి: Study in USA: అమెరికా కల సాకారం చేసుకోవచ్చు ఇలా.. కాలేజ్‌ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్‌ టెస్టులు తదితర వివరాలు...

విజయానికి ప్రిపరేషన్‌ ఇలా
రీడింగ్‌

ఈ విభాగంలో అభ్యర్థులకు అకడమిక్‌ సంబంధి­త ప్యాసేజ్‌లు ఇస్తారు. వీటి ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విభా­గం ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థులు యూనివర్సిటీ స్థాయి అకడమిక్స్‌ను అవగాహన చేసుకోగలరా లేదా? అనేదే. కాబట్టి ఇందులో రాణించేందుకు విద్యార్థులు తమ అకడమిక్‌ అర్హతలకు అనుగుణంగా ఆయా పుస్తకాలను నిరంతరం చదువుతుండాలి.

లిజనింగ్‌ టెస్ట్‌

ఈ విభాగంలో క్లాస్‌ రూం డిస్కషన్స్, లెక్చర్స్‌ లేదా ఇతర సంభాషణలు సమ్మిళితంగా ఉండే ఆడియోను వినాల్సి ఉంటుంది. ఆ సంభాషణల ఆడి­యో పూర్తయిన తర్వాత.. వాటి ఆధారంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఆడియోకు సంబంధించి ఆరు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రాణించాలంటే.. ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానెళ్లను వీక్షించడం, అందులోని చర్చలను అనుసరిస్తూ భాష, యాసపై అవగాహన పెంచుకోవాలి.

రైటింగ్‌ టెస్ట్‌

ఈ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు అంతకుముందు దశలైన రీడింగ్, లిజనింగ్‌లో తమకు ఎదురైన రెండు అంశాలపై ఎస్సే రాయాల్సి ఉంటుంది.

స్పీకింగ్‌ టెస్ట్‌

రైటింగ్‌ టెస్ట్‌లో మాదిరిగానే ఇందులో కూడా అభ్యర్థులు అప్పటికే తాము ఎదుర్కొన్న రీడింగ్, లిజనింగ్‌ విభాగాల్లో పేర్కొన్న అంశాలు, లేదా కొత్త టాపిక్స్‌పై తమ అభిప్రాయాలను చర్చా రీతిలో వ్యక్తం చేయాల్సి ఉంటుంది.

స్కోరింగ్‌ ఇలా

టోఫెల్‌లో ప్రతి విభాగంలో గరిష్టంగా 30 పాయింట్లు చొప్పున 120 పాయింట్ల స్కోర్‌ ఉంటుంది. ఈ స్కోర్స్‌లో ప్రతి విభాగంలో 24 నుంచి 30 పాయింట్లు పొందితే.. హై పెర్‌ఫార్మెన్స్‌ క్యాండిడేట్‌గా పరిగణిస్తారు. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఈ అధిక స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తాయి.

రిజిస్ట్రేషన్‌

టోఫెల్‌ అభ్యర్థులు పరీక్ష కోసం ఎప్పుడైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఏడాది పొడవునా.. నిర్ణీత తేదీల్లో పరీక్ష జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విషయంలోనూ ఎలాంటి పరిమితి లేదు. అభ్యర్థులు ఒక దశ పరీక్ష రాశాక.. కనీసం 12 రోజుల తర్వాత మాత్రమే మరో దశకు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన అమలవుతోంది. 

టోఫెల్‌ కొత్త స్వరూపం

సెక్షన్‌ ప్రశ్నలు సమయం
రీడింగ్‌ 20 35 నిమిషాలు
లిజనింగ్‌ 28 36 నిమిషాలు
స్పీకింగ్‌ 4 టాస్క్‌లు 16 నిమిషాలు
రైటింగ్‌ 2 టాస్క్‌లు 29 నిమిషాలు

టోఫెల్‌ మార్పులు.. ముఖ్యాంశాలు

  • జూలై 26 నుంచి నూతన విధానంలో టోఫెల్‌ పరీక్ష.
  • రెండు గంటల వ్యవధిలోపే పరీక్ష నిర్వహణ.
  • కొత్తగా రైటింగ్‌ ఫర్‌ యాన్‌ అకడమిక్‌ డిస్కషన్‌ టాస్క్‌.
  • అన్‌స్కోర్డ్‌ ప్రశ్నల తొలగింపు.
  • పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ వెల్లడి తేదీని చూసుకునే అవకాశం.
  • స్థానిక కరెన్సీ(రూపాయల్లో) ఫీజు చెల్లించే సదుపాయం.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ets.org/toefl.html; www.ets.org/toefl/ibtenhancements.html
Published date : 29 Jun 2023 07:22PM

Photo Stories