Skip to main content

Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

స్టడీ అబ్రాడ్‌.. విదేశీ విద్య. నేడు దేశంలో లక్షల మంది స్వప్నం! ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమవుతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో మూడింతలు పెరగడమే ఇందుకు నిదర్శనం! కోవిడ్‌ కారణంగా కఠిన నిబంధనలు అమలు చేసిన అమెరికా యూనివర్సిటీల్లోనే మన విద్యార్థులు ఎక్కువగా చేరినట్లు ఇటీవల అధికారిక గణాంకాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. మన విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు, చేరుతున్న కోర్సులు, ప్రవేశ విధానాలు, ముందస్తు సన్నద్ధతపై ప్రత్యేక కథనం..
Advance planning for foreign education
  • విదేశీ విద్యవైపు భారత విద్యార్థుల చూపు
  • గత మూడేళ్లలో దాదాపు మూడింతల వృద్ధి
  • తొలి గమ్యంగా అగ్రరాజ్యం అమెరికా
  • ఎక్కువ మంది చేరేది ఎంఎస్, ఎంబీఏలోనే! 
  • ముందస్తు సన్నద్ధతతోనే సక్సెస్‌ అంటున్న నిపుణులు

విదేశీ విద్యకు వెళ్లాలనుకునే మన విద్యార్థులు ఎంతో ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకొని అడుగులు వేస్తున్నారు. ఫలితంగానే..విదేశీ యూనివర్సిటీల్లో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటే­టా పెరుగుతోంది. దేశం నుంచి స్టడీ అబ్రాడ్‌కు వెళ్లి­న విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో భారీగా పెరిగిందని తాజాగా బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ గణాంకా­లు స్పష్టం చేస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన మన వి­ద్యార్థుల సంఖ్య 2020లో 2,59,655గా ఉంటే.. 2021లో 4,44,553గా, 2022లో 7,50,365గా ఉంది.
 

ఎంఎస్, ఎంబీఏ కోసమే

విదేశాల్లో ఉన్నత విద్య కోసం పయనమవుతు­న్న వారిలో ఎక్కువ మంది ఎంఎస్‌-కంప్యూటర్‌ సై­న్స్, లేదా ఎంబీఏ కోర్సుల్లో చేరుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో వీరి సంఖ్య దాదాపు 80 శాతంగా ఉంది. ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల విషయానికొస్తే.. హాస్పిటాలిటీ, నర్సింగ్, అగ్రికల్చర్‌ విభాగాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఈ కోర్సులకు సంబంధించి యూకే, ఆస్ట్రేలియా భారతీయ విద్యార్థులకు ప్రధాన గమ్యాలుగా నిలుస్తున్నాయి.

చ‌ద‌వండి: విదేశీ భాషలు...ఉజ్వల కెరీర్‌కు బాటలు ! 

యూఎస్‌.. ఓపీటీతో కొలువు

యూఎస్‌లో అడుగుపెట్టాలంటే.. పలు అర్హత ప్రమాణాలు తప్పనిసరి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అమెరికాలోని అధిక శాతం యూనివర్సిటీలు 16ఏళ్ల (10+2+4) విధానంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొంటున్నాయి. మరికొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు(హార్వర్డ్, ఎంఐటీ, యూసీ, కార్నెగీ తదితర) మాత్రం తప్పనిసరిగా 10+2+4 విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతోపాటు సైన్స్, ఇంజనీరింగ్‌ కోర్సుల అభ్యర్థులు జీఆర్‌ఈలో, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విద్యార్థులు జీమ్యాట్‌లో మంచి స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. ప్రవేశం ఖరారయ్యాక వర్సిటీలు అందించే ఐ-20 ఫామ్‌ ద్వారా స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
కొలువుకు మార్గం: అమెరికాలో ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) పేరుతో ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం-యూఎస్‌లోని ఏదైనా యూనివర్సిటీలో పీజీ కోర్సులో చేరిన అంతర్జాతీయ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఓపీటీ పేరుతో అక్కడి సంస్థల్లో 12 నెలలపాటు పని చేయొచ్చు.స్టెమ్‌(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) కోర్సుల విద్యార్థులు 36 నెలలపాటు ఓపీటీ విధానంలో యూఎస్‌లోని సంస్థల్లో పని చేసే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చక్కటి పనితీరుతో సదరు సంస్థలను మెప్పిస్తే.. అదే కంపెనీలో శాశ్వత కొలువు కోసం అభ్యర్థుల తరఫున హెచ్‌-1బి పిటిషన్‌కు కంపెనీలు దరఖాస్తు చేసే అవకాశముంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా యూఎస్‌లో దాఖలవుతున్న హెచ్‌-1బి పిటిషన్లలో ఓపీటీ పూర్తి చేసుకున్న విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 
ఫీజు 50 వేల డాలర్లు: అమెరికాలోని వర్సిటీల్లో కోర్సుల వార్షిక ఫీజు 35 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకు ఉంటోంది. హార్వర్డ్, ఎంఐటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్క్‌లీ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలంటే.. ఏడాదికి కనీసం యాభై వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

చ‌ద‌వండి: గ్లోబల్ కెరీర్‌కు ఇంగ్లిష్ స్కిల్స్!

కెనడా.. సైన్స్, రీసెర్చ్‌

సైన్స్, ఇంజనీరింగ్, రీసెర్చ్‌ కోర్సుల విద్యార్థులకు కెనడా బెస్ట్‌ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. అమెరికాకు పొరుగునే ఉండడంతో భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది కెనడాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న సింప్లిఫైడ్‌ వీసా ఫ్రేమ్‌ వర్క్‌ విధానం, వర్క్‌ పర్మిట్, ఇమిగ్రేషన్‌ విధానం భారతీయులకు వరంగా మారింది. ఈ దేశంలో కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుని స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఆధారంగా వర్క్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లపాటు పని అనుభవంతో పర్మనెంట్‌ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా సరళీకృత నిబంధనలను కెనడా రూపొందించింది.
కెనడా..బెస్ట్‌ కోర్సులు: ప్రస్తుతం కెనడాలో సైన్స్, డెయిరీ టెక్నాలజీ, రీసెర్చ్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఏవియేషన్‌ టెక్నాలజీ, ఆస్ట్రానమీ, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ బెస్ట్‌ కోర్సులుగా నిలుస్తున్నాయి. ఈ కోర్సుల వ్యవధి 14 నెలల నుంచి 24 నెలలు. ఇక్కడ ఫీజులు ఏడాదికి 30 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్ల వరకు ఉంటున్నాయి. మెక్‌గిల్‌ యూనివర్సిటీ; క్వీన్స్‌ యూనవర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో; వాటర్‌లూ యూనివర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా; యూనివర్సిటీ ఆఫ్‌ అల్బెర్టా;యూనివర్సిటీ డి మాంట్రియల్‌; మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ; వెస్ట్రన్‌ యూనివర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ కల్గెరీ వంటి టాప్‌-10 యూనివర్సిటీల్లో చదవాలంటే.. ఏడాది 40 వేల డాలర్లకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

యూకే.. ఏడాది పీజీ

మన విద్యార్థుల మరో ముఖ్య గమ్యం.. యూకే. ఇక్కడి వర్సిటీల్లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్,హుమానిటీస్‌ కోర్సుల్లో చేరుతున్నారు. ప్రధానంగా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఎకనామిక్స్, బ్యాంకింగ్, లా కోర్సులకు యూకే కేరాఫ్‌గా నిలుస్తోంది. యూకేలోని చాలా యూనివర్సిటీల్లో పీజీ కోర్సును ఒక ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశం ఉండటం మన విద్యార్థులకు కలిసి వస్తోంది. ఫీజులు కూడా అమెరికా, కెనడాలతో పోల్చుకుంటే తక్కువగా ఉంటున్నాయి. ఏడాది వ్యవధిలో ఉండే పీజీ కోర్సు ఫీజు 10వేల పౌండ్ల నుంచి 25 వేల పౌండ్ల మధ్యలోనే ఉంటోంది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్,లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామి­క్స్,యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్,వార్వి­క్‌ యూనివర్సిటీ, కింగ్స్‌ కాలేజ్, ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ, లాంకెస్టర్‌ యూనివర్సిటీ, గ్లాస్గో యూనివర్సిటీలు టాప్‌-10 జాబితాలో నిలుస్తున్నాయి.

చ‌ద‌వండి: Spoken English: ఇవి తెలుసుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నించడం సులువే!

ఆస్ట్రేలియా..అవకాశాలకు మార్గం

ఇటీవల కాలంలో మన విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశం.. ఆస్ట్రేలియా. అగ్రికల్చర్, డెయిరీ టెక్నాలజీ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ కోర్సులు అందించడంలో ఇక్కడి యూనివర్సిటీల­కు మంచి పేరుంది. మేనేజ్‌మెంట్‌ కోర్సుల వ్యవధి 14 నెలల నుంచి 20 నెలలు; ఇంజనీరింగ్‌ కోర్సుల వ్యవధి 24 నెలల వరకు ఉంటోంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఏడాది పాటు ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం ఉంది. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే అక్కడే కొనసాగే అవకాశముంది. 

ఫిబ్రవరి, జూలై నెలల్లో ఇక్కడి యూనివర్సిటీల్లో అకడమిక్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది. ఫీజు కనిష్టంగా 22 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు, గరిష్టంగా 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల వరకూ ఉంది. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌; యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ; అడిలైడ్‌ యూనివర్సిటీ; మొనాష్‌ యూనివర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌; యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌; యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా వంటి వర్సిటీల్లో ఏడాదికి సగటున 30 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లను ఫీజులుగా చెల్లించాల్సి ఉంటుంది.

జర్మనీ..రీసెర్చ్‌కు కేరాఫ్‌

భవిష్యత్తులో రీసెర్చ్‌ దిశగా అడుగులు వేయాలనుకునే అభ్యర్థులకు కేరాఫ్‌గా నిలుస్తోంది.. జర్మనీ. ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగాల్లో ఎంఎస్‌ బై రీసెర్చ్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. వీటి తర్వాత స్థానంలో మేనేజ్‌మెంట్‌ కోర్సులు నిలుస్తున్నాయి. అకడమిక్‌ సెషన్‌ జనవరి, జూలై నెలల్లో ప్రారంభమవుతుంది. ఇక్కడ అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఫ్రీ ఎడ్యుకేషన్‌ విధానం అమలవుతోంది. విద్యార్థులు సెమిస్టర్‌కు కనీసం రూ.500 యూరోలు డెవలప్‌మెంట్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లో మాత్రం పది వేల యూరోల నుంచి 20 వేల యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక 18 నెలలపాటు ఆ దేశంలోనే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించే విధంగా సరళీకృత ఇమిగ్రేషన్‌ విధానం అమల్లో ఉంది. హంబోల్ట్‌ యూనివర్సిటీ, ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్‌ బెర్లిన్, టెక్నికల్‌ యూనివర్సిటీ మ్యునిచ్, జార్జ్‌ అగస్ట్‌ యూనివర్సిటీ, ఎబర్‌హార్డ్‌ కార్ల్స్‌ యూనివర్సిటీ, టెక్నికల్‌ యూనివర్సిటీ బెర్లిన్, లీప్‌జిగ్‌ యూనివర్సిటీ, జెనా యూనివర్సిటీ, బ్రెమెన్‌ యూనివర్సిటీ, రెగెన్స్‌బర్గ్‌ యూనివర్సిటీలు టాప్‌లో నిలుస్తున్నాయి.

ఫాల్, స్ప్రింగ్‌.. ప్రవేశాలు

  • విదేశీ యూనివర్సిటీలు ఫాల్, స్ప్రింగ్‌ సెషన్‌ పేరుతో ఏటా రెండుసార్లు ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. 
  • ఫాల్‌ సెషన్‌ ఆగస్ట్‌లో, స్ప్రింగ్‌ సెషన్‌ జనవరిలో ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించిన ప్రవేశాలు సదరు సెషన్‌ ప్రారంభానికి ఆరు నెలల ముందుగానే ప్రారంభమవుతున్నాయి. 
  • ఫాల్‌ సెషన్‌ అడ్మిషన్ల కోసం జనవరి నుంచి ఏప్రిల్‌ నెల వరకు, స్ప్రింగ్‌ సెషన్‌ ప్రవేశాలకు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో యూనివర్సిటీలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి.
  • ఫాల్, స్ప్రింగ్‌ సెషన్లతోపాటు కొన్ని యూనివర్సిటీలు రోలింగ్‌ అడ్మిషన్ల పేరిట ఏడాది ఆసాంతం దరఖాస్తు ప్రక్రియ చేపడుతుంటాయి. 
  • అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు తాము చేరదలచుకున్న సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి. అలాగే ఇతర దేశాలకు కూడా ముందస్తు కసరత్తు ప్రారంభించడం మేలు చేస్తుంది.

చ‌ద‌వండి: Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్‌! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..

స్టాండర్డ్‌ టెస్ట్‌లు తప్పనిసరి

  • విదేశీ యూనివర్సిటీల నిబంధనల ప్రకారం-నిర్దేశిత స్టాండర్డ్‌ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించి నిర్దేశిత స్కోర్‌ సొంతం చేసుకుంటేనే ప్రవేశం లభిస్తుంది.
  • సైన్స్, ఇంజనీరింగ్‌ కోర్సుల విద్యార్థులు జీఆర్‌ఈలో కనీసం 300కుపైగా పాయింట్లు సాధించాలి. 
  • మేనేజ్‌మెంట్‌ కోర్సుల అభ్యర్థులు జీమ్యాట్‌లో 650కు పైగా స్కోర్‌ సొంతం చేసుకుంటే బెస్ట్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. . 
  • విదేశీ విద్య అభ్యర్థులు లాంగ్వేజ్‌ టెస్ట్‌లలోనూ స్కోర్‌ సొంతం చేసుకోవాలి. 
  • టోఫెల్‌లో కనీసం 100 స్కోర్‌; ఐఈఎల్‌టీఎస్‌లో 9 బ్యాండ్స్‌లో కనీసం 6.5 బ్యాండ్స్‌ సొంతం చేసుకుంటే.. బెస్ట్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
  • అకడమిక్‌గా పదో తరగతి నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ వరకు కనీసం 60 శాతం మార్కులు లేదా దానికి సమానమైన జీపీఏ సాధించిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం దక్కుతోంది.

ఈ డాక్యుమెంట్లు సిద్ధంగా

  • విదేశీ విద్య అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందే కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవి..
  • అప్లికేషన్, కవరింగ్‌ లెటర్‌; అప్లికేషన్‌ ఫీజు; జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, ఎస్‌ఏటీ పరీక్షల్లో స్కోరు; స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌; లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌; వ్యాసాలు; అకడమిక్‌ సర్టిఫికెట్లు; ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌; పాస్‌పోర్ట్‌; స్పాన్సర్‌ లెటర్స్, స్పాన్సరర్స్‌ ఆదాయపు పన్ను స్టేట్‌మెంట్‌.
     
Published date : 14 Jun 2023 03:27PM

Photo Stories