Foreign Affairs: 13 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న 18 లక్షల మంది ప్రవాసులు.. కారణం ఇదే..
2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.
చదవండి: Foreign Education: రూపాయి పడింది... విదేశీ చదువుకు డాలర్ దెబ్బ
అమెరికాలో రెండో స్థానం
వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు.