Foreign Education: విదేశీ విద్యపై భారత విద్యార్థుల వెనకడుగు.. కారణం ఇదే..
ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు.
కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్న విద్యార్థులు చెబుతున్నారు.
ఆ రోజులు పోయాయ్!
విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయత్నించేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్‌టైమ్ జాబ్‌తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు.
ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్‌తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి.
చదవండి: Working Holiday Maker Program: ఖాళీలు వెయ్యి.. దరఖాస్తులు 40 వేలు!
వెళ్లినవారికి ఉపాధి కష్టాలు
ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది.
విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది.
చదవండి: Canada Work Permit Rules Changed: వర్క్ పర్మిట్‌లో కీలక మార్పులు చేసిన కెనడా ప్రభుత్వం
ఆఫర్ లెటర్లు ఇచ్చినా..
చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
దేశంలో ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం
అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది.
నైపుణ్యం సమస్య!
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్‌స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు.
మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా
బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్‌సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కన్పించడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది.
– మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యార్థి)
రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం.
– జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు
అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు.
– అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్‌వీఎన్
అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది.
– సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి)
Tags
- foreign education
- Indian students
- America
- Canada
- Australia
- Britain
- MS in Foreign
- Employment
- Study Abroad
- Overseas Education
- Foreign education in india
- Foreign education consultants
- Foreign education advantages
- Foreign education courses
- Foreign education system
- Employment Creator
- InternationalEducation
- ForeignEducation
- EducationTrends
- GlobalEducation