Skip to main content

విదేశీ భాషలు...ఉజ్వల కెరీర్‌కు బాటలు !

ప్రస్తుతం ప్రపంచీకరణ ప్రభావంతో దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఏటికేడు విస్తృతమవుతున్నాయి. ఆర్థిక బంధాలు అంచెలంచెలుగా ఎదుగుతున్నాయి.
ఈ క్రమంలో సంస్థలు తాము ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు సంబంధించిన భాషలపై పట్టున్న వారికోసం అన్వేషిస్తున్నాయి. ఆకర్షణీయ వేతనాలతో పట్టం కడుతున్నాయి. గత నాలుగేళ్లలో విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి 20 శాతం మేర డిమాండ్ పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న విదేశీ భాషలు, వాటిలో నైపుణ్యాల సముపార్జనకు మార్గాలు తదితర వివరాలు...

ఒకప్పుడు..
మాతృభాషకు అదనంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు సంపాదిస్తే చాలు.. మంచి కెరీర్ సొంతమవుతుందనే భావన ఉండేది. అందుకే అధిక శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌పైనే దృష్టిసారించేవారు.
ఇప్పుడు..
కేవలం ఇంగ్లిష్ మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా శరవేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో విదేశీ భాషలు యువతకు సుస్థిర కెరీర్‌ను సొంతం చేస్తున్నాయి.
  • మన దేశం విషయానికొస్తే.. పొరుగునే ఉన్న చైనా మొదలు.. ఫ్రాన్స్ వరకు పలు దేశాల సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. వీటి కార్యకలాపాలు సజావుగా సాగడానికి, ఒప్పందం చేసుకున్న దేశానికి చెందిన భాషలో పట్టున్న వారికోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఇదే.. ఇప్పుడు ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు చక్కటి కెరీర్‌కు బాటలు వేస్తున్నాయి.
వేతనాలు అదనం..
ప్రస్తుతం పలు ఎంఎన్‌సీల్లో విదేశీ భాషలు నేర్చుకున్న ఉద్యోగులకు.. సహచర ఉద్యోగులతో పోల్చితే 15 నుంచి 20 శాతం వరకు అదనపు వేతనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కేపీఓ, బీపీఓ, ఫార్మా రంగాల్లో ఈ పరిస్థితిని చూడొచ్చు. ఇటీవల ఓ జాబ్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 50 శాతానికి పైగా సంస్థలు.. తమ నియామక ప్రక్రియలో విదేశీ భాషా నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం గమనార్హం. ఇదే ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌కు ప్రత్యక్ష నిదర్శనం.

40 శాతం వరకు వృద్ధి :
ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు సంస్థల నుంచి ఏటా డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా.. వీరికి అందించే వార్షిక వేతనాలు సగటున రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉంటున్నాయి. వేతనాల్లో దాదాపు 40 శాతం వరకు వృద్ధి కనిపిస్తున్నట్లు ఇటీవల ఓ సర్వే వెల్లడించింది.

డిమాండ్ ఉన్న భాషలు..
ప్రస్తుతం అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న విదేశీ భాషలు..
  • ఫ్రెంచ్
  • చైనీస్
  • స్పానిష్
  • జర్మన్
  • జపనీస్
  • కొరియన్
అకడమిక్‌గా ఎన్నో మార్గాలు..
విదేశీ భాషా నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అకడమిక్‌గా ఆయా నైపుణ్యాలు పొందేందుకు ఇప్పుడెన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ యూనివర్సిటీలు మొదలు.. స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ల వరకు ఎన్నో శిక్షణ సంస్థలు.. సర్టిఫికెట్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అదే విధంగా వివిధ దేశాల ఎంబసీలు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, భాషా శిక్షణ కోర్సులు అందిస్తున్నాయి.

చైనీస్ :
ఆర్థిక కోణంలో చూస్తే ఇటీవల కాలంలో చైనా.. అంతర్జాతీయంగా అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దీంతో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న విదేశీ భాషల జాబితాలో చైనీస్ తొలి స్థానంలో నిలుస్తోంది. భారత్‌లో చైనీస్ నేర్చుకునేందుకు ప్రముఖ విద్యా సంస్థల్లో అవకాశముంది. అవి..
  • జేఎన్‌యూ.
  • ఢిల్లీ యూనివర్సిటీ.
  • ఇండియా-చైనా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.
ఫ్రెంచ్ : 30కు పైగా దేశాలకు అధికారిక భాషగా ఉన్న ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఇప్పుడు కెరీర్ అవకాశాల పరంగా అత్యున్నత వేదికగా నిలుస్తోంది. ఈ భాషను నేర్చుకోవడం తేలికే. కారణం.. ఇంగ్లిష్‌లో వినియోగంలో ఉన్న 50 శాతం పదాలకు ఫ్రెంచ్ మాతృకగా ఉండటమే. దీంతో ఇంగ్లిష్‌లో పట్టున్న అభ్యర్థులు ఫ్రెంచ్ భాషలోనూ సులువుగా నైపుణ్యాలు సొంతం చేసుకోగలుగుతారు.
ప్రముఖ సంస్థలు :
1. మిరండా హౌస్, ఢిల్లీ యూనివర్సిటీ.
2. అలియన్స్ ఫ్రాన్సైస్.
3. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ).

స్పానిష్:
ఫారెన్ లాంగ్వేజ్ కోణంలో డిమాండ్ ఉన్న మరో భాష.. స్పానిష్. యూరోపియన్ యూనియన్, యూఎన్‌ఓ వంటి ప్రముఖ సంస్థల్లోనూ ఇది అధికారిక భాషగా ఉంది. ఇటీవల కాలంలో భారత్‌కు చెందిన సంస్థలు.. స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్‌గా పేర్కొనే అర్జెంటీనా, కొలంబియా తదితర దేశాలతో పలు ఒప్పందాలు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇది కూడా కెరీర్ అవకాశాలకు దోహదపడుతోంది.
కోర్సును అందిస్తున్న సంస్థలు..
1. స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్, జేఎన్‌యూ.
2. ఐ.పి.కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ యూనివర్సిటీ.
3. జవహర్‌లాల్ నెహ్రూ అకాడమీ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్.
4. ఇన్‌లింగ్వా (Iningua).

జర్మన్:
విదేశీ భాషల నైపుణ్యం కోణంలో ఇటీవల కాలంలో జర్మన్ లాంగ్వేజ్‌కు కూడా మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. దీనికి అకడమిక్, కెరీర్ పరంగా అవసరాలను కారణంగా చెప్పొచ్చు. జర్మనీలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు జర్మన్‌లో బేసిక్ ప్రొఫిషియన్సీ ఉండాలనే నిబంధన ఉంది. అదే విధంగా మన దేశంలోని సంస్థలు రీసెర్చ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు సంబంధించి జర్మనీలోని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జర్మన్ భాషలో నైపుణ్యం సాధిస్తే చక్కటి వేతనంతో కొలువు ఖాయమనే పరిస్థితి ఏర్పడింది. ఈ భాషను నేర్చుకునేందుకు జర్మన్ ఎంబసీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఏ1 నుంచి సీ2 వరకు ఆరు స్థాయిల్లో ఉండే కోర్సులను పూర్తిచేస్తే.. ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్స్, డాక్యుమెంట్ రైటర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.
ప్రముఖ సంస్థలు :
  • గొయెత్ జర్మన్. హా ఇన్‌లింగ్వా (Iningua).
జపనీస్:
గత ఆరేళ్ల వ్యవధిలో జపాన్‌కు చెందిన దాదాపు 250 సంస్థలు మన దేశంలోని సంస్థలతో సంయుక్త భాగస్వామ్యంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాయి. దీంతో ఈ సంస్థలకు భారీ సంఖ్యలో ఇంటర్‌ప్రిటేటర్స్, ట్రాన్స్‌లేటర్స్ అవసరం ఏర్పడుతోంది. అదే విధంగా జైకా (జపాన్ ఇండియా కోఆపరేటివ్ ఏజెన్సీ) ద్వారా జపాన్, భారత్ మధ్య అధికారికంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, భారత్‌లో జపాన్‌కు చెందిన కంపెనీలు జాయింట్ వెంచర్ విధానంలో పనులు చేపడుతుండటం కూడా మరో కారణం.
ప్రముఖ విద్యా సంస్థలు :
1. జేఎన్‌యూ-న్యూఢిల్లీ.
2. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెరీర్ స్టడీస్ వైఎంసీఏ.
3. ఢిల్లీ యూనివర్సిటీ.
4. నిహోంగో-బషి (nihongo-bashi).

కెరీర్ అవకాశాలు..
ఫారెన్ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్లు సొంతం చేసుకున్న వారికి పర్యాటకం మొదలు కీలక తయారీ, ఐటీ, బీపీఓ, కేపీఓ, ఎల్‌పీఓ తదితర విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి. వీరికి సగటు వేతనం నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది.

అధ్యాపక వృత్తి:
ఇటీవల కాలంలో పలు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు డిగ్రీ, పీజీ స్థాయిలో ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల పేరుతో విదేశీ భాషా కోర్సులను అందిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ భాషలో పీజీ, ఆపై స్థాయి కోర్సులు చేసిన వారికి అధ్యాపక వృత్తిలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. సంస్థ స్థాయిని బట్టి నెలకు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వేతనం లభిస్తుంది.

స్వయం ఉపాధి :
విదేశీ భాషా నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు. ప్రధానంగా వీరికి ఫార్మాస్యూటికల్, పర్యాటక సంస్థల్లో అనువాదకులుగా(రిటెన్ అండ్ స్పోకెన్) అవకాశాలు లభిస్తాయి. రాత అనువాదం పరంగా పదాలు ఆధారంగా ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.3 వరకు లభిస్తుంది. స్పోకెన్ ట్రాన్స్‌లేషన్‌కు సంబంధించి పని గంటలను బట్టి ప్రముఖ టూరిజం సంస్థలు గంటకు రూ.వెయ్యి వరకు అందిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఫారెన్ లాంగ్వేజ్ శిక్షణ సంస్థలు/వర్సిటీలు :
1. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
2. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ).
3. ఉస్మానియా యూనివర్సిటీ.
4. జర్మన్ గొయెత్
5. అలియన్స్ ఫ్రాన్సైస్
వీటితోపాటు పలు యూనివర్సిటీలు ఇప్పుడు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ విభాగాల ఆధ్వర్యంలో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పేరిట ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్‌ను అందిస్తున్నాయి.

విదేశీ భాషలు-ప్రధాన ఉపాధి వేదికలు..
  • ఆతిథ్య రంగం.
  • పర్యాటక రంగం.
  • ఫార్మాస్యూటికల్ సంస్థలు.
  • వివిధ దేశాల రాయబార కార్యాలయాలు.
  • ఐటీ, బీపీఓ సంస్థలు.
  • ఎగుమతి-దిగుమతి కార్యకలాపాల సంస్థలు
విదేశీ భాషలు-ముఖ్య గణాంకాలు :
  • ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఇ-వాల్యూసర్వ్ అంచనా ప్రకారం 2020 నాటికి 2.5 లక్షల మంది ఫారెన్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ అవసరం.
  • స్పానిష్, జపనీస్, జర్మన్ భాషలకు బాగా పెరుగుతున్న డిమాండ్.
  • ఎంఎన్‌సీల్లో సగటున నెలకు రూ.50 వేల వేతనం.
  • అనువాదకులుగా నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు సంపాదించే అవకాశం.
బహు భాషా నైపుణ్యాలతోఅపార అవకాశాలు..
ప్రస్తుత కార్పొరేట్ యుగంలో బహు భాషా నైపుణ్యాలతో ఉన్నత అవకాశాలు లభించడం ఖాయం. ఈ నేపథ్యంలో విద్యార్థులు తాము నేర్చుకోవాలనుకుంటున్న భాషపై ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యం, అవకాశాలు తదితరాల ఆధారంగా భాషను ఎంపిక చేసుకోవాలి. ఫ్రెంచ్, జర్మన్ వంటి భాషలు కొంత క్లిష్టంగా ఉంటాయి. వీటిని నేర్చుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వీటిలో బ్యాచిలర్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి అంతర్జాతీయంగా ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో కొలువులు ఖాయం.
- శ్రవణ్ కుమార్, ఇఫ్లూ (హెచ్‌ఓడీ-ఫ్రెంచ్ స్టడీస్).
Published date : 08 Mar 2019 04:51PM

Photo Stories