Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..
- జాబ్ మార్కెట్‌లో కీలకంగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్
- సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి సీఈఓ వరకు ఇంగ్లిష్తో రాణింపు
- పోటీ పరీక్షల్లోనూ విజయానికి దోహదపడుతున్న ఆంగ్లం
- రిటెన్, స్పోకెన్ ఇంగ్లిష్ స్కిల్ పెంచుకోవాలంటున్న నిపుణులు
మన విద్యార్థుల్లో అకడమిక్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ.. ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ నైపుణ్యం లేనికారణంగా ఎంతో మంది విలువైన అవకాశాలను కోల్పోతున్నారు.ఇలాంటి విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తే.. జాబ్ మార్కెట్‌లో ముందంజలో నిలవొచ్చు అంటున్నారు నిపుణులు. జాబ్ మార్కెట్‌తోపాటు పోటీ పరీక్షల్లో రాణించేందుకు, స్వయం ఉపాధికి, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌లో విజయావకాశాలకు సైతం ఇంగ్లిష్ నైపుణ్యం దోహదపడుతోంది.
25 శాతం మందిలోనే జాబ్ రెడీ స్కిల్స్
ప్రస్తుత కార్పొరేట్ రంగం, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోణంలో పరిశీలిస్తే.. 20 నుంచి 25 శాతం మందిలోనే జాబ్ రెడీ నైపుణ్యాలు ఉంటున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్ కీలకంగా ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యం సొంతం చేసుకుంటే.. దేశవిదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాఫ్ట్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్‌లో రాణించాలంటే..ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి.
చదవండి: విదేశీ భాషలు...ఉజ్వల కెరీర్‌కు బాటలు !
సేల్స్ టు సీఈఓ
ప్రస్తుత పరిస్థితుల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వరకూ.. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఎంఎన్‌సీ సంస్థల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్.. క్లయింట్‌కు, సంస్థకు మధ్య ప్రధాన వారధిగా నిలుస్తోంది. దీంతో సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, బీపీఓ,కాల్ సెంటర్ ఉద్యోగులకు ఇంగ్లిష్ నైపుణ్యం ఆవశ్యకంగా మారింది. ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఇంగ్లిష్ స్కిల్స్ మరింత కీలకం.
ఆ నాలుగు ప్రధానంగా
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యంలో నాలుగు విభాగాలు కీలకంగా నిలుస్తున్నాయి. అవి...
- స్పీకింగ్: నచ్చిన అంశాన్ని ఎంచుకుని మాట్లాడటం.తొలిదశలో ఈ ప్రయోగం ఎంతో అవసరం.
- రీడింగ్: ఒక అంశాన్ని క్షుణ్నంగా చదవడం. దాని సారాంశాన్ని, అందులోని పద ప్రయోగాలను గుర్తించడం.
- లిజనింగ్: ఎదుటి వాళ్లు చెప్పేది లేదా ప్రసార మాధ్యమాల్లోని చర్చలను ఏకాగ్రతతో వినాలి. ఫలితంగా వారు ఏ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారో తెలుస్తుంది.
- రైటింగ్: చివరి దశగా చదివిన,విన్న విషయాలను సొంతంగా రాయడం అలవాటు చేసుకోవాలి.
పరీక్షలు కూడా ఈ విభాగాల్లోనే
ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి. అందుకోసం విద్యార్థుల ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌ను గుర్తించే క్రమంలో టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ, కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ అసెస్‌మెంట్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు..రిటెన్, స్పోకెన్, లిజనింగ్, రైటింగ్ విభాగాల్లోనే ఉంటున్నాయి. వీటిల్లో ప్రతిభ చూపితేనే అంతర్జాతీయంగా టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం లభిస్తుంది.
రాత పరీక్షల్లో ఇంగ్లిష్
ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే రాత పరీక్షల్లో విజయం సాధించేందుకు రిటెన్ ఇంగ్లిష్ నైపుణ్యం అత్యంత కీలకంగా మారింది. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అనే విభాగం ఉంటోంది. రిటెన్ ఇంగ్లిష్‌పై పట్టు సాధిస్తే ఆయా పరీక్షల్లో ఎదురయ్యే రీడింగ్ కాంప్రహెన్షన్, వెర్బల్ ఎబిలిటీ వంటి అంశాల్లో మంచి మార్కులు సాధించే అవకాశముంది.
చదవండి: గ్లోబల్ కెరీర్‌కు ఇంగ్లిష్ స్కిల్స్!
స్పోకెన్ స్కిల్
చాలా మంది ఇంగ్లిష్ రైటింగ్ లో పట్టున్నా.. స్పీకింగ్ విషయానికొచ్చే సరికి తడబడుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రైటింగ్‌తోపాటు స్పోకెన్ ఇంగ్లిష్ కూడా ముఖ్యమే. కొద్దిపాటి చిట్కాలతో స్పోకెన్ ఇంగ్లిష్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. అందుకోసం ముందుగా ఏదైనా ఒక టాపిక్‌ను ఎంచుకోవాలి. సదరు టాపిక్‌కు సంబంధించి అప్పటికే ప్రచురితమైన వ్యాసాలు, వార్తలు చదవాలి. అందులో వినియోగించిన పదజాలం, వాక్య నిర్మాణం పరిశీలించాలి. స్థూలంగా దాని సారాంశం తెలుసుకోవాలి. ఈ నాలుగు అంచెలు పూర్తయిన తర్వాత సదరు టాపిక్‌ను తమకు అనువైన రీతిలో పాయింట్ల రూపంలో రాసుకోవాలి. వీటిని ముందుగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. స్పోకెన్ ఇంగ్లిష్‌లో.. విషయాన్ని ఎదుటి వారికి సరిగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా? లేదా? అనేదే ప్రధానమని గుర్తించాలి.
గ్రూప్ డిస్కషన్స్
స్పోకెన్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకునేందుకు గ్రూప్ డిస్కషన్స్ చక్కటి సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. తొలి దశలో ఈ గ్రూప్ డిస్కషన్స్‌ను స్నేహితులతో ప్రారంభించాలి. ఫలితంగా సదరు డిస్కషన్‌లో మీకంటే బాగా మాట్లాడిన వాళ్లు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో తెలుస్తుంది. వీటితోపాటు డిబేట్స్(చర్చలు)లో పాల్గొనడం కూడా మేలు చేస్తుంది. డిబేట్స్‌లో పాల్గొనడం ద్వారా పబ్లిక్ స్పీకింగ్ ఫోబియా సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది.
డిక్షనరీ ఆదరవుగా
ప్రారంభంలో ఇంగ్లిష్ నేర్చుకునేందుకు అత్యంత ఉపయోగకర సాధనాలు నిఘంటువు(డిక్షనరీ)లు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి డిక్షనరీల్లో ఒక పదానికి అర్థం తెలియజేయడంతోపాటు.. సదరు పదాన్ని ఏ సందర్భంలో వాడతారు? ఎలా మాట్లాడొచ్చు? అనే విషయాలు ఉంటాయి. అంతేకాకుండా.. సదరు పదాలకు సమానార్థాలు, వ్యతిరేకార్థాలు కూడా కనిపిస్తాయి.
వొకాబ్యులరీ.. వెరీ ఇంపార్టెంట్
స్పోకెన్ ఇంగ్లిష్ నైపుణ్యం కోణంలో వొకాబ్యులరీపై పట్టు సాధించడం ఎంతో అవసరం. ప్రతి రోజు కనీసం పది కొత్త పదాలు - వాటి అర్థాలు తెలుసుకోవడం తోపాటు వాటిని ఏఏ సందర్భాల్లో వాడొచ్చో గమనించాలి.
బేసిక్ గ్రామర్
ఇంగ్లిష్‌పై పట్టు సాధించే క్రమంలో.. బేసిక్ గ్రామర్(వ్యాకరణం)పై అవగాహన కీలకంగా నిలుస్తుంది. ప్రధానంగా టెన్సెస్, డైరెక్ట్-ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫలితంగా ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేసే క్రమంలో చక్కటి నైపుణ్యం లభిస్తుంది.
చదవండి: Spoken English: ఇవి తెలుసుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నించడం సులువే!
స్కిల్స్ పెంచుకునేందుకు మార్గాలెన్నో
ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్య సాధనకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్ స్థాయిలోనే కాలేజ్‌లు, యూనివర్సిటీల పరిధిలో ఫినిషింగ్ స్కూల్స్ పేరుతో, లేదా ఇంగ్లిష్ లాంగ్వేజ్ క్లబ్‌ల పేరుతో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు.. బ్రిటిష్ కౌన్సిల్, కేంబ్రి డ్జ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించి లెర్నర్ స్టేజ్ నుంచి దశల వారీగా శిక్షణనిస్తున్నాయి. వీటి ట్రైనింగ్ సదుపాయం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా సదరు ట్రైనింగ్ వ్యవధి పూర్తయ్యాక నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు.
- వివరాలకు వెబ్‌సైట్స్: https://www.britishcouncil.in/english, https:/www.cambridgeenglish.org/in
ఇంగ్లిష్ స్కిల్.. ముఖ్యాంశాలు
- పలు నివేదికలు, సర్వేల ప్రకారం-నూటికి 60 శాతం మందిలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్ గ్యాప్ సమస్య ఉంది.
- సాఫ్ట్ స్కిల్స్‌లో రాణించేందుకు తొలి అడుగు ఇంగ్లిష్ నైపుణ్యం.
- ఇంగ్లిష్‌పై పట్టుతో మెరుగైన అవకాశాలు అందుకునేందుకు మార్గం.
- బ్రిటిష్ కౌన్సిల్ నివేదిక ప్రకారం-ఇంగ్లిష్ నైపుణ్యం ఉన్న వారికి ఇతరులతో పోల్చితే వేతనాలు కూడా ఎక్కువగా లభిస్తున్నాయి.
- సంస్థల్లో సెక్యూరిటీ విభాగం నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వరకు ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి స్కిల్‌గా మారుతోంది.
బిడియం పోగొట్టుకోవాలి
ఇంగ్లిష్ విషయంలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య 'బిడియం', 'ఆత్మన్యూనత'. దీన్ని పోగొట్టుకునేందుకు కాలేజ్ స్థాయిలోనే కల్చరల్ క్లబ్స్, గ్రూప్ డిస్కషన్స్ వంటి వాటిలో చురుగ్గా పాల్గొనాలి. మొదట్లో పొరపాట్లు చేయడం సహజం. పొరపాట్లను విశ్లేషించుకుంటూ ముందుకు సాగితే.. ఇంగ్లిష్ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
- ప్రొ'' ఎస్.జయరాజు, డీన్, ఫొనెటిక్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లిష్, ఇఫ్లూ