Skip to main content

గ్లోబల్ కెరీర్‌కు ఇంగ్లిష్ స్కిల్స్!

ప్రపంచంలోని ప్రజలందర్నీ అనుసంధానం చేస్తున్న ఏకైక భాష.. ఇంగ్లిష్. ఇది ఐరోపా దేశాల నుంచి ఆఫ్రికా, చైనా, ఇండియా వరకు అకడెమిక్, కెరీర్ పరంగా కీలకంగా వ్యవహరిస్తూ ప్రపంచభాషగా గుర్తింపు పొందుతోంది. ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు దేశాలకు అతీతంగా ఉద్యోగావకాశాలను అందుకొంటున్నారు. దీంతో నేటి యువతకు ఇంగ్లిష్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యార్థుల కెరీర్ పరంగా ఇంగ్లిష్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంచుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలు తదితరాలపై నిపుణుల సూచనలు...
  • విదేశీ విద్య, ఇంజనీరింగ్‌లో ఉన్నత చదువు, మేనేజ్‌మెంట్‌లో మెరుగైన కెరీర్.. లక్ష్యాలు ఏవైనా.. వాటిని సాధించేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు తప్పనిసరి.
  • అకడెమిక్ నైపుణ్యాలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో విజయానికి ఇంగ్లిష్ కీలకంగా మారింది. కాబట్టి ప్రసుత్తం విద్యార్థులందరూ ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలను పెంచుకునేందుకు అకడమిక్ స్థాయి నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా!
లాంగ్వేజ్ స్కిల్స్
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి.. సబ్జెక్ట్ స్కిల్స్, కమ్యూనికేటివ్ స్కిల్స్.
సబ్జెక్ట్ స్కిల్స్: ఇవి ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ప్రామాణిక నైపుణ్యాలను అందిస్తాయి. సబ్జెక్ట్ స్కిల్స్ ద్వారా బేసిక్ గ్రామర్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్ ఫార్మేషన్ వరకు అన్నిటిపైనా పట్టు ఏర్పడుతుంది. బేసిక్ గ్రామర్ సంబంధించి ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, డెరైక్ట్- ఇన్‌డెరైక్ట్ స్పీచ్, సెంటెన్స్ కన్వర్షన్ (యాక్టివ్ టు పాసివ్, పాసివ్ టు యాక్టివ్ వాయిస్) వంటి వాటిపై అవగాహన కలిగి ఉండటాన్ని సబ్జెక్ట్ స్కిల్స్‌గా పేర్కొంటారు.
కమ్యూనికేటివ్ స్కిల్స్: ఇంగ్లిష్‌లో తప్పులు లేకుండా రాసే పరిజ్ఞానం ఉంటే భాషపై పట్టు సాధించారని చెప్పవచ్చు. అయితే అదే సమయంలో ఇంగ్లిష్‌ను మౌఖికంగా వ్యక్తం చేసే పరిజ్ఞానం కలిగుండాలి. వీటినే కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటారు. మౌఖిక ఇంగ్లిష్ నైపుణ్యాలతో ఎదుటివారితో మాట్లాడటం, ఇతరులకు అర్థమయ్యే విధంగా భావ వ్యక్తీకరణ చేయడం వంటివి అలవడతాయి. ఇతరులతో మాట్లాడే సమయంలోగ్రామర్ వినియోగంపై కంటే చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో వొకాబ్యులరీ కీలకంగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఆంగ్లభాషా ఔత్సాహికులు పదాలు, వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.
ఓరల్ కమ్యూనికేషన్: వీటి ద్వారా ఒక విషయాన్ని మౌఖికంగా చెప్పగలిగే పరిజ్ఞానం, ఇతరులు చెప్పే అంశాలను అర్థం చేసుకుని వాటికి తగ్గట్లు స్పందించే నైపుణ్యాలు అలవడతాయి. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు అవసరమైన టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి భాషాపరీక్షల్లో రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఆంగ్ల భాషా నైపుణ్యాల్లో గ్రామర్‌పై పట్టుతో వాక్యాలు రాయగలగటంతో పాటు వినడం, చదవటం కీలకం.

వృత్తి విద్య- ఇంగ్లిష్ ప్రాధాన్యం
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్, లా వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాల ప్రాధాన్యం విస్మరించలేనిది. ఆయా కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్స్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులు సంబంధిత సంస్థలకు వెళ్లాలి. ప్రస్తుతం అన్ని సంస్థలు వ్యాపార విస్తరణలో భాగంగా ఇంగ్లిష్‌కు పెద్దపీట వేస్తున్నాయి. జాబ్ మార్కెట్‌లో టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆవశ్యకత రోజురోజుకు పెరుగుతోంది. ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్స్, ఫుల్ టైం ఎంప్లాయ్‌మెంట్.. ఏ మార్గంలో ఆయా సంస్థల్లో ప్రవేశించాలనుకున్నా ఆంగ్లభాషా నైపుణ్యాలు కలిగి ఉండాల్సిన పరిస్థితి.

టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్
ఇంజనీరింగ్, సైన్స్, ఇతర శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని ఉద్యోగార్థుల పరంగా టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. అకడమిక్స్ స్థాయిలో నేర్చుకున్న సబ్జెక్ట్ పరిజ్ణానం, ఆయా సబ్జెక్టుల పదజాలాన్ని వినియోగిస్తూ ఇంగ్లిష్‌లో కమ్యూనికేట్ చేయటాన్ని టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్ పదజాలంతో వాక్యాలు రాయడం, లెటర్స్ ప్రిపరేషన్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డ్రాఫ్టింగ్ వంటి అంశాలపై అవగాహనతో టెక్నికల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అలవరచుకోవచ్చు. దీని కోసం ఆంగ్లంలో ప్రాథమిక నైపుణ్యం పొందుతూనే.. ఆయా డొమైన్ ఏరియాలకు సంబంధించి ప్రచురితమైన జర్నల్స్, పబ్లికేషన్స్‌ను అధ్యయనం చేయాలి.

బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్
ప్రొఫెషనల్, గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు.. బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్. వీటిలో రాత నైపుణ్యాలు, ఓరల్ కమ్యూనికేషన్‌లకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా మాట్లాడటం, వ్యాపార సంబంధ అంశాలపై సంప్రదింపులు చేయటం వంటివి ఓరల్ కమ్యూనికేషన్‌లో కీలకం. ప్రపోజల్ రైటింగ్స్, బిజినెస్ స్ట్రాటజీస్ రైటింగ్ వంటివి రిటెన్ కమ్యూనికేషన్‌లో ప్రధానంగా ఉంటాయి.

నేర్చుకునేందుకు మార్గాలెన్నో!
ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు యూనివర్సిటీల స్థాయి నుంచి ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల వరకు పలు శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీల స్థాయిలో అందించే ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులు పూర్తిచేస్తే లాంగ్వేజ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవటంతో పాటు సర్టిఫికెట్లు సైతం అందుకోవచ్చు. స్టడీ అబ్రాడ్ లక్ష్యంగా టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి పరీక్షలకు బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ విభాగాల్లో శిక్షణ తరగతులు అందుబాటులో ఉన్నాయి.

శిక్షణతోపాటు వ్యక్తిగత సాధన తప్పనిసరి
ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకునే క్రమంలో అభ్యర్థులు శిక్షణతోపాటు వ్యక్తిగత సాధనకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల సూచన..
  • బిగ్గరగా చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల క్రమేణా రీడింగ్ స్కిల్స్ పెరగడంతో పాటు వేగం కూడా పెరుగుతుంది.
  • చదివిన అంశాలను రాయడం హాబీగా అలవర్చుకోవాలి. రాసేటప్పుడు కూడా బిగ్గరగా చదువుతూ రాస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.
  • ఇంగ్లిష్ భాషపై ఏ మాత్రం అవగాహన లేని అభ్యర్థులు ముందుగా చిన్న చిన్న కథల పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలి.
  • టీవీ చానల్స్‌లో వార్తా కథనాలు, బిజినెస్ న్యూస్‌లను వీక్షించాలి.
  • స్పోకెన్ ఇంగ్లిష్‌కు సంబంధించి ప్రాక్టీస్‌ను ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. మొదట్లో తప్పులు వచ్చినా బిడియ పడకుండా ప్రాక్టీస్ కొనసాగిస్తే స్వల్ప సమయంలోనే పట్టు సాధించవచ్చు.
  • డిక్షనరీని వినియోగించడం అలవర్చుకోవాలి. ప్రతి రోజు కనీసం పది నుంచి 20 కొత్త పదాలను నేర్చుకొని, వాక్యాల్లో వాటి ప్రయోగంపై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లిష్ నైపుణ్యాలతో ప్రయోజనాలు
  • కెరీర్‌లో త్వరగా ఉన్నత హోదాలు అందుకోవచ్చు.
  • స్టడీ అబ్రాడ్ అవకాశాలు మెరుగవుతాయి.
  • ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే గ్రూప్ డిస్కషన్ వంటి అంశాల్లో రాణించొచ్చు.
  • ఉద్యోగ పరంగా ఇతరులకంటే ఒకడుగు ముందుండే అవకాశం.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులు, ట్రైనింగ్ అందిస్తున్న యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు:
  • ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ - హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.efluniversity.ac.in
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్ - హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.uohyd.ac.in
  • బ్రిటిష్ కౌన్సిల్
    వెబ్‌సైట్:
    www.britishcouncil.in
  • సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్, ఉస్మానియా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    uceou.edu/CELT/celt.html
  • జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
      www.jnu.ac.in/SLLCS/
  • ఈటీఎస్ ఆన్‌లైన్ కోర్సులు
    వెబ్‌సైట్:
      www.ets.org
  • పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్
    వెబ్‌సైట్:
      www.pearsonpte.com
నివేదికలు..
ఇంగ్లిష్ ప్రాధాన్యం
  • జాబ్ మార్కెట్ కోణంలో 70 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు పెరగాల్సిన ఆవశ్యకత ఉంది.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించి దాదాపు 75 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకపోవడం వల్ల అవకాశాలను చేజార్చుకుంటున్నారు.
  • ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల్లో 60 శాతం మందికి హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ అవగాహన మాత్రమే ఉంది.
  • 2022 నాటికి 500 రంగాల్లో 500 మిలియన్ అభ్యర్థులకు ఇంగ్లిష్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలనేది ఎన్‌ఎస్‌డీసీ లక్ష్యం.
ఇంగ్లిష్ మేడ్ ఈజీ
ప్రస్తుతం ఎడ్యుకేషన్ పరంగా ఇంగ్లిష్ ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ దీన్ని గ్రహించ టం లేదు. దీంతో డొమైన్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యం లేక వెనుకబడుతున్నారు. బిగ్గరగా చదవడం, రాయడం వంటి కొద్దిపాటి మెళకువలతో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో సులభంగా రాణించొచ్చు.
- కె.విమల, లాంగ్వేజ్ ట్రైనర్, బ్రిటిష్ కౌన్సిల్ హైదరాబాద్.

కార్పొరేట్ కంపెనీల్లో తప్పనిసరి
ఇంగ్లిష్ నైపుణ్యాలు కార్పొరేట్ వాతావరణంలో తప్పనిసరిగా మారాయి. కంపెనీలు తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ లాంగ్వేజ్‌గా మారిన ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అకడమిక్ స్థాయి నుంచే ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇంగ్లిష్ నైపుణ్యాలు మెరుగ్గా ఉంటే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఇతర రిక్రూట్‌మెంట్ ప్రక్రియల్లో తేలిగ్గా విజయం సాధించగలరు. మాతృభాషలో చదివిన, గ్రామీణ నేపథ్యాల నుంచి ప్రొఫెషనల్ కోర్సుల్లో అడుగుపెట్టిన అభ్యర్థులు రోజుకు కనీసం గంట సమయం ఇంగ్లిష్ నైపుణ్యాలను పెంచుకొనేందుకు కేటాయించాలి.
- ప్రొఫెసర్ ఎ.ఆర్.మూస్వీ, ఇఎఫ్‌ఎల్, హైదరాబాద్
Published date : 29 Jan 2016 11:03AM

Photo Stories