UK-India Young Professionals Scheme: ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ప్రయోజనాలు ఇవే..
- ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్æస్కీమ్ ప్రారంభం
- ఈ నెల 28 నుంచి మార్చి 2వ తేదీ వరకూ దరఖాస్తులు
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా దరఖాస్తుకు అవకాశం
- ఎంపికైతే రెండేళ్లపాటు యూకేలో కొలువుకు మార్గం
ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ఫస్ట్ బ్యాలెట్‌కు దరఖాస్తులు కోరుతున్నట్లు యూకే ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న బ్యాలెట్‌లో 2,400 వీసాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. మార్చి 2వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
అర్హతలు
భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. భారత్‌లోని గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ,అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు బ్యాంక్ ఖాతాలో కనీసం 2,530పౌండ్‌లు ఉండాలి.
ఆన్‌లైన్‌లో బ్యాలెట్ ఎంట్రీ
తొలుత ఆన్‌లైన్ విధానంలో ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ బ్యాలెట్ దశకు దరఖాస్తు చేసుకోవాలి. పేరు, పుట్టినతేది, పాస్‌పోర్టు వివరాలు, పాస్‌పోర్ట్ స్కాన్ చేసిన కాపీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలు ఇవ్వాలి. దీనికి ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ముగిసిన రెండువారాల్లోపు ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. విజేతలైన వారి ఈమెయిల్‌కు సమాచారం అందిస్తారు.
చదవండి: Study Abroad Career Opportunities: విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు ఇవే!!
వీసాకు 30 రోజుల గడువు
- ప్రస్తుత ఫిబ్రవరి బ్యాలెట్ దశలో 2,400 వీసాలు అందుబాటులో ఉన్నాయి.
- బ్యాలెట్ దశలో ఎంపికైతే వీసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తారు. వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి 30 రోజుల సమయం ఇస్తారు.
- బ్యాలెట్ దశలో ఎంపికై సంబంధిత అన్ని పత్రాలతో వీసాకు దరఖాస్తు చేసుకుంటే.. మూడు వారాల్లోపు వీసా మంజూరుపై నిర్ణయం వెలువడుతుంది. ప్రస్తుత బ్యాలెట్ దశలో ఎంపిక కాని వారు తదుపరి బ్యాలెట్(జూలై)కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైన పత్రాలు
వ్యాలిడ్ పాస్‌పోర్టు; విద్యార్హతల సర్టిఫికెట్లు; బ్యాంక్ అకౌంట్‌లో 2,530 పౌండ్లు ఉన్నట్లు చూపే పత్రం; టీబీ టెస్ట్ రిపోర్ట్, పోలీస్ క్లియరెన్స్ తదితర సర్టిఫికెట్‌లను వీసా దరఖాస్తు సమయంలో అందజేయాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు
దరఖాస్తు ఫీజు 259 పౌండ్లు, హెల్త్‌కేర్ సర్‌చార్జెస్ 940 పౌండ్లతోపాటు బ్యాంక్ అకౌంట్‌లో 2,530 పౌండ్లు ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును రిఫండ్ చేయరు.
ప్రయోజనాలు ఇవే
- యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా వీసా పొందిన వారు గరిష్టంగా రెండేళ్లు మాత్రమే బ్రిటన్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది. వీరు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. స్వయం ఉపాధి సైతం పొందొచ్చు. సొంతంగా కంపెనీ ప్రారంభించుకునే వీలుంది.
- వీసా అమల్లో ఉన్న కాలంలో ఎప్పుడైనా యూకేలో ప్రవేశించొచ్చు. తిరిగి స్వదేశానికి రావచ్చు. కావాలంటే మళ్లీ వెళ్లొచ్చు. అయితే వీసా రెండేళ్ల గడువు ముగిసాక పొడిగించుకునేందుకు అవకాశం ఉండదు.
చదవండి: Study Abroad Career Opportunities: విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ చేయూత
సరళీకరణ బాట
బ్రిటన్ గత కొన్నేళ్లుగా భారతీయులకు స్టడీ, వర్క్ వీసాల విషయంలో సరళీకృత విధానాలను అనుసరిస్తోంది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా, స్కేల్ అప్ వీసా వంటి పథకాలను ప్రారంభించింది. వీటి ప్రకారం-పోస్ట్ స్టడీ వర్క్ నిబంధనలను సడలించడం, కోర్సు పూర్తయి స్వదేశానికి వెళ్లిన తర్వాత రెండేళ్లలోపు తిరిగొచ్చి ఉద్యోగం కోసం అన్వేషించేందుకు అవకాశం కల్పించడం; స్కేల్ అప్ వీసా విధానంలో కనిష్టంగా ఆరు నెలలు, గరిష్టంగా అయిదేళ్లు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించడం వంటి పలు చర్యలు తీసుకుంటోంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 28, 2023
- దరఖాస్తులకు చివరి తేది: మార్చి 2, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.gov.uk/india-young-professionals-scheme-visa