Study Abroad Career Opportunities: విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు ఇవే!!
విదేశాల్లో ఉన్నత చదువుల స్వప్న సాకారానికి సమయం ఆసన్నమైంది. కలల గమ్యాన్ని చేరుకునేందుకు.. సన్నద్ధమవ్వాల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని యూనివర్సిటీలు.. అంతర్జాతీయ విద్యార్థులకు మళ్లీ స్వాగతం పలుకుతున్నాయి. కోవిడ్ పూర్వ పరిస్థితులు నెలకొని.. కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకోవడంతో.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశ ప్రక్రియ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో.. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు.. ప్రవేశ నిబంధనలు..విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..
- విదేశీ విద్యకు పెరుగుతున్న ఆశావహులు
- కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడమే కారణం
- క్రేజీ డెస్టినేషన్స్‌గా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా
- నిబంధనలు, తగిన జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు
ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో.. విదేశీ యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కోవిడ్ పూర్వ స్థితిలో ఉన్న మాదిరిగానే ఉన్నత విద్య అవకాశాల కల్పనకు ముందుకొస్తున్నాయి. మన విద్యార్థులకు స్టడీ అబ్రాడ్ అనగానే గుర్తుకొచ్చే అమెరికా, బ్రిటన్ మొదలు మరెన్నో దేశాల్లోని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రవేశ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి.
ఆ నాలుగు దేశాలు
మన దేశ విద్యార్థులు ప్రధానంగా నాలుగు దేశాలను తమ గమ్యాలుగా భావిస్తున్నారు. అవి.. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా. ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. మన విద్యార్థుల సంఖ్య రెండో స్థానంలో నిలుస్తుండటం విశేషం. 2021లో చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య దాదాపు అయిదు లక్షలుగా నమోదైంది. చైనా తర్వాత మన దేశం రెండో స్థానంలో నిలుస్తోంది.
Study Abroad: ఎంక్యాట్‌తో.. విదేశీ వైద్య పీజీ
అమెరికాలో పెరిగిన ప్రవేశాలు
- కోవిడ్ పరిస్థితులు కొంత అడ్డంకిగా మారినా.. అమెరికాలో గత ఏడాది భారతీయ విద్యార్థుల సంఖ్య పెరగడం విశేషం. 2021లో మొత్తం 12,36,748 విద్యార్థులకు యూఎస్.. ఎఫ్–1, ఎం–1 వీసాలు లభించగా.. వారిలో భారత విద్యార్థుల సంఖ్య 2,32,851 మందిగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
- ఆస్ట్రేలియాలోనూ దాదాపు 97 వేల మంది భారత విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు లభించాయి. కోవిడ్ ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ.. అంటే నాలుగు నెలల్లోనే 15,310 వీసాలు అందించారు.
- యూకేలోనూ ప్రస్తుతం మన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021లో 7,830 మంది విద్యార్థులు అక్కడ అడుగుపెట్టగా.. 2022లో ఇప్పటివరకు 8,660 మంది వీసా దరఖాస్తులు దాఖలు చేశారు.
- అమెరికా పొరుగునే ఉన్న కెనడాలోనూ భారీ స్థాయిలో దాదాపు 1.8 లక్షల మందికి స్టూడెంట్ వీసాలు మంజూరు చేశారు. కోవిడ్–19 ముందు గణాంకాలతో పోల్చితే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదవడం విశేషం.
వీసా నిబంధనలు సరళం
పలు దేశాలు విద్యార్థుల సౌలభ్యం కోసం వీసా నిబంధనలను కొంత మేరకు సరళీకృతం చేస్తున్నాయి. ముఖ్యంగా 2020 నాటికి ఆయా దేశాల్లో చదువుతూ.. కోవిడ్ నిబంధనల కారణంగా స్వదేశాలకు వెళ్లిన వారికి వీసాల కాల పరిమితిని పొడిగించడం లేదా పునరుద్ధరిస్తున్నాయి. ఉదాహరణకు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా(వీసా సబ్‌క్లాస్–485) పొంది.. 2020 ఫిబ్రవరి నుంచి 2021 డిసెంబర్ వరకు స్వదేశాలకు వెళ్లిన వారికి సదరు వీసాను పొడిగించింది. ఈ టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసా విధానం ప్రకారం–విద్యార్థులకు రెండు నుంచి నాలుగేళ్ల పాటు పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం లభిస్తుంది. ఇదే తరహాలో యూకే, కెనడా కూడా కోవిడ్ సమయంలో ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులకు వీసా పరిమితుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తునాయి.
Study Abroad: ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలు..
అమెరికా వీసా ఇలా
- మన విద్యార్థులకు టాప్ డెస్టినేషన్‌గా నిలుస్తున్న అమెరికా వీసా దరఖాస్తు సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. యూఎస్‌లో స్టూడెంట్ వీసాలను ఎఫ్–1, ఎం–1 వీసాల పేరుతో రెండు కేటగిరీలుగా నిర్ణయించారు. ఎఫ్–1 వీసాకు అమెరికాలోని నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు అర్హులు. వీరు తప్పనిసరిగా ఐ–20గా పిలిచే అడ్మిషన్ లెటర్ ఆధారంగా వీసాకు దరఖాస్తు చేయాలి.
- ఎం–1 వీసా: వృత్తి విద్యా కోర్సులు లేదా ఇతర గుర్తింపు పొందిన నాన్–అకడమిక్ ప్రోగ్రామ్స్‌గా పేర్కొనే కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి వీటిని మంజూరు చేస్తారు. వీసా దరఖాస్తు ప్రక్రియలో భాగంగా.. విద్యార్థులు అర్హతలు, ఆర్థిక వనరులు, ఇతర ప్రామాణికాల ఆధారంగా ప్రవేశం ఖరారు చేసిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే ఐ–20 ఫామ్(అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్) ఆధారంగా దరఖాస్తు చేయాలి.
- ఆ తర్వాత దశలో ఆన్‌లైన్ విధానంలో యూఎస్ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌లోని డీఎస్–160 వీసా ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. దీని ఆధారంగా ఇంటర్వ్యూ స్లాట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తదుపరి దశలో అప్లికేషన్ సెంటర్‌లో ఇంటర్వ్యూ విజయవంతంగా ముగించుకుంటే.. వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సిటిజన్‌షిప్ పాస్‌పోర్ట్, అపాయింట్‌మెంట్ లెటర్, డీఎస్–160 కన్ఫర్మేషన్ లెటర్, SEVIS (Student Exchange Visitor Information system report) రిసీప్ట్ (I-901), I-20లను దగ్గర ఉంచుకోవాలి. విద్యార్థులు అకడమిక్ సెషన్ ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందుగా వీసా మంజూరు ప్రక్రియ ముగుస్తుంది.
- వివరాలకు వెబ్‌సైట్: https://travel.state.gov/content/travel/en/us-visas/study/student-visa.html
ఆస్ట్రేలియా వీసా నిబంధనలు
మన విద్యార్థులకు మరో ముఖ్య గమ్యంగా నిలుస్తున్న ఆస్ట్రేలియాలో.. వీసాలను సబ్ క్లాస్‌లుగా వర్గీకరించారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీ, రీసెర్చ్ విద్యార్థులు.. వీసా సబ్‌క్లాస్ 500 కేటగిరీలో వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సింప్లిఫైడ్ స్టూడెంట్ వీసా ఫ్రేమ్ వర్క్(ఎస్‌ఎస్‌వీఎఫ్) విధానంలో వీసా అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను నెలరోజుల్లోపు సమీక్షించి.. మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ విభాగం.. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలకు రిస్క్ రేటింగ్స్ కేటాయించింది. లెవల్–1, లెవల్–2, లెవల్–3గా వీటిని పేర్కొంది. లెవల్–1 ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు వీసా మంజూరు మరింత సులభం అవుతుంది. స్టూడెంట్ వీసా పొందేందుకు విద్యార్థులు అడ్మిషన్ అప్లికేషన్, ఫైనాన్షియల్ ఎవిడెన్స్, ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీలో ఎన్‌రోల్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, వీసా లాడ్జ్‌మెంట్ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.studyaustralia.gov.au/english/latest-travel-and-visa-advice/updates/step-by-step-guide-to-visa-and-entry-requirements
కెనడా ఆకర్షణీయంగా
మన దేశ విద్యార్థులు ఆసక్తి చూపే మరో ముఖ్య దేశం కెనడా. ఇక్కడ కూడా ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులకు వీసా మంజూరులో సరళీకృత నిబంధనలనే అమలు చేస్తున్నారు. కెనడాలో ముందుగా స్టడీ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనే విధానం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే..వేగంగా స్టడీ పర్మిట్ మంజూరుకు అవకాశం లభిస్తుంది.కెనడా ప్రభుత్వ గుర్తింపు పొందిన డిసిగ్నేటెడ్ లెర్నింగ్ సెంటర్స్ జాబితాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందిన వారికి స్టడీ పర్మిట్ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.canada.ca/en/immigration-refugees-citizenship/services/study-canada.html
యూకేలో.. టైర్–4 కేటగిరీ
యూకేలోని యూనివర్సిటీల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు.. టైర్–4 కేటగిరీలో స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైర్–4 వీసాను మంజూరు చేసే క్రమంలో పాయింట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. గరిష్టంగా 40 పాయింట్లను రెండు అంశాలకు కేటాయించారు. అవి.. సీఏఎస్, నిర్వహణకు సంబంధించి ఆర్థిక స్థోమత. సీఏఎస్(కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సప్టెన్స్ ఫర్ స్టడీస్)కు 30 పాయింట్లు; నిర్వహణకు సంబంధించిన అంశాలకు 10 పాయింట్లు కేటాయించారు. అభ్యర్థులు ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్, దాని ప్రామాణికత ఆధారంగా సీఏఎస్ పాయింట్లను గణిస్తారు. అదే విధంగా నిర్వహణకు సంబంధించిన కోణంలో విద్యార్థుల ఆర్థిక స్థోమత, నగదు నిల్వలకు సంబంధించి ఇచ్చిన ధ్రువీకరణలను పరిగణనలోకి తీసుకుని ఈ పాయింట్లు కేటాయిస్తారు. టైర్–4కు దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి.. రెండు వారాల వ్యవధిలో వీసా మంజూరు అవుతుంది. కాబట్టి అడ్మిషన్ ఖరారు చేసుకున్న విద్యార్థులు.. అకడమిక్ సెషన్ ప్రారంభానికి మూడు నెలల ముందుగానే వీసాకు దరఖాస్తు చేసుకునేలా సిద్ధం కావాలి.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.gov.uk/student-visa/apply
స్టాండర్డ్ టెస్ట్‌లు తప్పనిసరి
అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్న విదేశీ యూనివర్సిటీలు.. అర్హత నిబంధనల్లో మాత్రం మార్పులు చేయలేదనే చెప్పాలి. అభ్యర్థులు తప్పనిసరిగా స్టాండర్ట్ టెస్ట్ స్కోర్స్ పొంది ఉండాలని యూనివర్సిటీలు పేర్కొంటున్నాయి. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ వంటి లాంగ్వేజ్ టెస్ట్‌లు; అదే విధంగా జీమ్యాట్, జీఆర్‌ఈ వంటి సబ్జెక్ట్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించాలి. దీనికి సంబంధించి అకడమిక్ సెషన్ ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందుగా స్కోర్స్ సొంతం చేసుకునేలా.. ఆయా టెస్ట్‌లకు హాజరైతే మేలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ పత్రాలు కావాలి
- ఏ దేశంలో అడుగుపెట్టాలనుకున్నా.. వీసా దరఖాస్తు సమయానికి విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని ధ్రువ పత్రాలు(డాక్యుమెంట్లు)సిద్ధం చేసుకోవాలి. అవి.. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, సిటిజన్ పాస్‌పోర్ట్, అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్.
- సదరు ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు ఫీజు వ్యయం, సంబంధిత దేశంలో కోర్సు వ్యవధిలో నివసించేందుకు అవసరమైన ఆర్థిక వనరులకు సంబంధించిన రుజువులు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే దానికి సంబంధించి సదరు బ్యాంకు నుంచి అధీకృత రుజువు, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, లెటర్ ఆఫ్ రికమండేషన్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ రిపోర్ట్స్ ఉండాలి.