Study Abroad: ఎంక్యాట్‌తో.. విదేశీ వైద్య పీజీ
విదేశాల్లో వైద్యవిద్య పీజీ, ఆపై స్థాయి కోర్సులు చదవాలనుకునే వారికి చక్కటి మార్గం.. ఎంక్యాట్. ఈ పరీక్ష స్కోర్‌తో అమెరికాతోపాటు పలు దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో.. మెడికల్ పీజీ కోర్సుల్లో చేరొచ్చు. తద్వారా కెరీర్ అవకాశాలను మరింత విస్తృతం చేసుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ (ఏఏఎంసీ).. ఎంక్యాట్‌ను నిర్వహిస్తుంది. ప్రతి ఏటా జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ.. పలుసార్లు పరీక్ష జరుగుతుంది. తాజాగా ఎంక్యాట్ 2022 ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎంక్యాట్ ప్రత్యేకత.. ప్రవేశం లభించే కోర్సులు.. అర్హతలు.. పరీక్ష విధానం తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
- ఎంక్యాట్ స్కోర్‌తో విదేశాల్లో మెడికల్ పీజీ ప్రవేశాలు
- ఏఏఎంసీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ
- ఎంబీబీఎస్ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం
- 2022 ప్రవేశాలకు కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్.. ఎంక్యాట్. ఇది అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజెస్ నిర్వహించే పరీక్ష. ఎంక్యాట్ స్కోర్‌తో అమెరికాతోపాటు, కెనడా, ఆస్ట్రేలియా, కరేబియన్ దేశాలకు చెందిన వందల సంఖ్యలోని మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీలు ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎంక్యాట్‌లో అత్యుత్తమ స్కోర్ సాధించిన వారికి హార్వర్డ్ మెడికల్ స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వంటి అమెరికాలోని టాప్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
అర్హతలు
ఎంక్యాట్ పరీక్షకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. కనీస ఉత్తీర్ణత స్కోర్ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. కానీ.. ఎంక్యాట్‌లో మంచి స్కోర్ సాధిస్తే.. టాప్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో పీజీ ప్రవేశాలు ఖరారు చేసుకోవచ్చు.
చదవండి: Study Abroad: ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలు..
పరీక్ష విధానం
ఎంక్యాట్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. మొత్తం అయిదు విభాగాల్లో ఏడున్నర గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది.
విభాగం | ప్రశ్నలు | సమయం |
కెమికల్ అండ్ ఫిజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ బయలాజికల్ సిస్టమ్స్ | 59 | 95 ని. |
క్రిటికల్ అనాలిసిస్ అండ్ రీజనింగ్ స్కిల్స్ | 53 | 90 ని. |
బయలాజికల్ అండ్ బయో మెడికల్ ఫౌండేషన్స్ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ | 59 | 95 ని. |
సైకలాజికల్, సోషల్ అండ్ బయలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ బిహేవియర్ | 59 | 95 ని. |
- పరీక్షకు ముందు 10 నిమిషాల ట్యుటోరియల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
- దీంతోపాటు ప్రతి విభాగం ముగిసిన తర్వాత పది నిమిషాల విరామం కల్పిస్తారు.
- క్రిటికల్ అనాలిసిస్ అండ్ రీజనింగ్ స్కిల్స్ విభాగం పూర్తి చేశాక.. మిడ్ ఎగ్జామ్ బ్రేక్‌తో 30 నిమిషాల విరామం కల్పిస్తారు.
- ఇలా మొత్తం ఏడున్నర గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.
మార్కుల ఆధారంగా.. స్కోర్ శ్రేణి
- ఎంక్యాట్ పరీక్షలో ఆయా విభాగాల్లో పొందిన మార్కుల ఆధారంగా స్కోర్ శ్రేణిని నిర్ధారిస్తారు. ప్రతి విభాగంలో సాధించిన మార్కులను, అదే విధంగా అన్ని విభాగాల్లోనూ పొందిన మార్కులను కలిపి స్కోర్లను ప్రకటిస్తున్నారు.
- మొత్తం స్కోర్‌ను 472 నుంచి 528 శ్రేణిలో గణిస్తారు. మొదటి విభాగంలో 124 స్కోర్‌తో 123 నుంచి 125 బ్యాండ్‌లో; రెండో విభాగంలో 123 స్కోర్‌తో 122–124 బ్యాండ్‌లో; మూడు, నాలుగో విభాగాల్లో 127 స్కోర్ చొప్పున ప్రతి విభాగంలో 126–128 పర్సంటైల్‌తో మంచి శ్రేణిలో నిలవొచ్చు.
- మొత్తంగా 501 స్కోర్ పాయింట్లతో 499–503 బ్యాండ్స్ మధ్య స్కోర్ సాధిస్తే.. టాప్ మెడికల్ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది.
జనవరి నుంచి సెప్టెంబర్ వరకు
- అమెరికాలోని మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ ప్రవేశాలకు నిర్దేశించిన ఎంక్యాట్‌ను ప్రతి ఏటా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహిస్తారు. 2022కు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించారు. ఈ పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలు..
- జనవరి 14, 15, 20, 21; మార్చి 12, 25;
- ఏప్రిల్ 8, 9, 29, 30; మే 13, 14, 19, 27; జూన్ 4, 17, 18, 24, 25, 30; జూలై 16, 29; ఆగస్ట్ 5, 20, 26, 27; సెప్టెంబర్ 1, 2, 9, 10
- అభ్యర్థులు పరీక్ష తేదీకి కనీసం 60 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
- ప్రతి పరీక్ష తేదీ తర్వాత 30 రోజులకు ఫలితాలు వెల్లడించి.. స్కోర్ కార్డ్‌లు అందుబాటులో ఉంచుతారు.
ఏడాదిలో మూడుసార్లు
- ఎంక్యాట్ ఒక ఏడాదిలో మూడుసార్లు; వరుసగా రెండేళ్లలో నాలుగుసార్లు; మొత్తంగా గరిష్టంగా ఏడుసార్లు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంది.
- ఇలా పలు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించడం ద్వారా ఒక సెషన్‌లో తక్కువ స్కోర్ వచ్చినా.. మరో సెషన్‌లో దాన్ని మెరుగుపరచుకోవచ్చు.
- ఎంక్యాట్ స్కోర్ కాల పరిమితి గరిష్టంగా మూడేళ్లు ఉంటుంది. ఈ వ్యవధి ఆయా కాలేజ్‌ల విధానాల ప్రకారం అమలవుతోంది. దీంతో అభ్యర్థులు తాము స్కోర్ పొందిన తర్వాత ఈ వ్యవధిలోనే విదేశీ మెడికల్ కళాశాలలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
టాప్ స్కోర్ ఇలా
- ఎంబీబీఎస్ అకడమిక్ నైపుణ్యాలపై పూర్తి స్థాయి పట్టు సాధిస్తే.. ఎంక్యాట్‌లో టాప్ స్కోర్ సొంతం చేసుకోవచ్చు. పేపర్ల వారీగా సిలబస్‌ను విశ్లేషించుకొని..వాటిని ఎంబీబీఎస్ అకడమిక్స్‌తో బేరీజు వేసుకుంటూ చదవాలి. ప్రతి విభాగంలోనూ పది ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. వీటిని కేస్ స్టడీస్ ఆధారంగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు థియరీ సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా.. ప్రాక్టికల్ అప్రోచ్‌తో అభ్యసనం సాగించాలి.
- క్రిటికల్ అనాలిసిస్ అండ్ రీజనింగ్ స్కిల్స్‌లో.. అభ్యర్థుల్లోని విశ్లేషణ, తులనాత్మక పరిశీలన నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.సామాజిక అంశాల నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు కమ్యూనిటీ హెల్త్, ఇతర సామాజిక, సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
చదవండి: యూఎస్‌లో యూజీ.. ఈ కోర్సులకు అధిక ప్రాధాన్యం
ఉజ్వల అవకాశాలు
- ఎంక్యాట్‌లో మంచి స్కోర్ సాధించి అమెరికాలోని మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం ఖరారు చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. వైద్య విద్యలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, ఆ తర్వాత అక్కడే ఉద్యోగం పొందేలా అమెరికా అవకాశాలు కల్పిస్తోంది.
- అమెరికాలో మెడికల్ పీజీ పూర్తి చేసుకున్న వారికి రేడియాలజీ, అంకాలజీ, పిడియాట్రిక్స్, అనస్థీషియా, ఇంటర్నల్ మెడిసిన్ విభాగాల్లో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లుగా కొలువులు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనాలు దక్కుతున్నాయి.
స్కాలర్‌షిప్ సదుపాయాలు
అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీల్లో ఎండీ కోర్సుల ఫీజులు అధికంగా ఉంటున్నప్పటికీ.. అక్కడి యూనివర్సిటీలు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ వంటి ప్రముఖ యూనివర్సిటీలు నీడ్ బేస్డ్ అసిస్టెన్స్ పేరుతో కొంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.
ఎంక్యాట్.. ముఖ్యాంశాలు
- ఎంక్యాట్ స్కోర్ ఆధారంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, కరేబియన్ దేశాల్లోని మెడికల్ యూనివర్సిటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం.
- ప్రతి ఏటా గరిష్టంగా మూడు సార్లు ఎంక్యాట్‌కు హాజరయ్యే అవకాశం.
- మూడేళ్లపాటు ఎంక్యాట్ స్కోర్‌కు గుర్తింపు. ఫలితంగా ఒక విద్యా సంవత్సరంలో ప్రవేశం లభించకపోయినా.. మరుసటి సంవత్సరంలో అదే స్కోర్‌తో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అవకాశం.
- అమెరికా యూనివర్సిటీల్లో పీజీ పూర్తి చేసుకుంటే.. అక్కడే కచ్చితంగా ఉద్యోగం లభిస్తున్న పరిస్థితి.
- ఏఏఎంసీ అంచనా ప్రకారం–2025 నాటికి 90 వేల మంది పీజీ స్పెషలిస్ట్ డాక్టర్ల అవసరం ఉంది.
ఎంక్యాట్–2022 ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- 2022 ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ నుంచి మొదలైన ఎంక్యాట్ దరఖాస్తు ప్రక్రియ.
- జనవరి 14, 2022 నుంచి సెప్టెంబర్ 10 వరకు పలు సెషన్లలో పరీక్ష.
- ప్రతి పరీక్ష తేదీకి కనీసం 60 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
- పరీక్ష తర్వాత 30 రోజులకు స్కోర్ వెల్లడి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://students-residents.aamc.org/taking-mcat-exam/taking-mcat-exam
చదవండి: ఉజ్వల భవితకు ఉత్తమ గమ్యం ఇలా..