Skip to main content

Study in USA: అమెరికా కల సాకారం చేసుకోవచ్చు ఇలా.. కాలేజ్‌ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్‌ టెస్టులు తదితర వివరాలు...

అమెరికాలో చదువు.. లక్షల మంది విద్యార్థుల స్వప్నం! ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విద్యార్థులు ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే.. యూఎస్‌లో ఉన్నత విద్యకు సన్నద్ధత ప్రారంభిస్తారు. ఇందుకు అవసరమైన స్టాండర్డ్‌ టెస్ట్‌లకు హాజరవుతుంటారు. అకడమిక్‌ అర్హతలతోపాటు పూర్తి అవగాహనతో ప్రయత్నిస్తే.. అమెరికా కల సాకారం చేసుకోవచ్చు. యూఎస్‌లో స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ (జనవరిలో ప్రారంభం)కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. కాలేజ్‌ ఎంపిక, అవసరమైన పత్రాలు, స్టాండర్డ్‌ టెస్టులు తదితర వివరాలు...
Best Career Opportunities in USA
 • లక్షల మంది విద్యార్థులకు గమ్యంగా యూఎస్‌ యూనివర్సిటీలు
 • సరైన డాక్యుమెంట్లతో సిద్ధం కావాలంటున్న నిపుణులు

విదేశీ విద్యకు వెళ్లాలనుకునే మన దేశ విద్యార్థుల తొలి గమ్యం..అమెరికా. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా యూఎస్‌కు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గింది. 2020-2021లో 1,67,582 మంది విద్యార్థులు అమెరికాలో అడుగు పెట్టగా..అంతకుముందు సంవత్సరంలో 2,32,851 మంది అక్కడకు వెళ్లారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంది. ఫాల్‌ సెషన్‌ ప్రవేశాల కోసం గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

యూనివర్సిటీ, కాలేజ్‌ అన్వేషణ

యూఎస్‌కు వెళ్లే మన విద్యార్థుల్లో అధికశాతం మంది ఎంఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి విద్యార్థులు తొలుత యూనివర్సిటీ ఎంపికపై కసరత్తు చేయాలి. యూఎస్‌ వర్సిటీల్లో ఫాల్‌ (సెప్టెంబర్‌-డిసెంబర్‌), స్ప్రింగ్‌(జనవరి-మే), సమ్మర్‌ (జూన్‌-ఆగస్ట్‌) సెషన్లలో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది. తాము చేరదలచుకున్న సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ముందుగా తమకు ఆసక్తి ఉన్న ప్రోగ్రామ్‌లను అందిస్తున్న యూనివర్సిటీల జాబితాను రూపొందించుకోవాలి. సదరు విశ్వవిద్యాలయం పేర్కొన్న అర్హత నిబంధనలు, స్టాండర్ట్‌ టెస్ట్‌ స్కోర్‌ల గురించి తెలుసుకోవాలి. ప్రతి యూనివర్సిటీకి సంబంధించి దరఖాస్తు గడవు తేదీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి.

చ‌ద‌వండి: విదేశీ భాషలు...ఉజ్వల కెరీర్‌కు బాటలు ! 

రోలింగ్‌ అడ్మిషన్స్‌

అమెరికాలోని యూనివర్సిటీలు రోలింగ్‌ అడ్మిషన్‌ విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం-దరఖాస్తుకు ఎలాంటి గడువు తేదీ ఉండదు. అభ్యర్థులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత సెషన్లలో సీట్లు భర్తీ కాని సందర్భాల్లో రోలింగ్‌ అడ్మిషన్‌ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీలో రోలింగ్‌ అడ్మిషన్‌ సెషన్‌ ఉంటే దానికి కూడా దరఖాస్తు చేసుకోవడం మేలు.

అర్హత నిబంధనలు

అమెరికాలోని అధికశాతం యూనివర్సిటీలు ఎంఎస్‌ కోర్సులో ప్రవేశానికి తప్పనిసరిగా 16ఏళ్లు(10+2+4) చదివి ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల వ్యవధిలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు (హార్వర్డ్, ఎంఐటీ, యూసీ, కార్నెగీ మిలన్‌ తదితర) మాత్రం 10+2+4 విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా పేర్కొంటున్నాయి.

చ‌ద‌వండి: గ్లోబల్ కెరీర్‌కు ఇంగ్లిష్ స్కిల్స్!

స్టాండర్డ్‌ టెస్ట్‌ల స్కోర్లు

 • అమెరికాలోని యూనివర్సిటీలు విద్యార్థులకు స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్లు ఉండాలని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఎంపిక చేసుకున్న డొమైన్‌ ఆధారంగా జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్‌ స్కోర్లు పొందడం తప్పనిసరి. జీఆర్‌ఈలో సబ్జెక్ట్‌ టెస్ట్‌ స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేశాయి. 
 • జీఆర్‌ఈలో కనీసం 300కుపైగా పాయింట్లు సొంతం చేసుకోవడం వల్ల అవకాశాలు మెరుగవుతాయి. 
 • జీమ్యాట్‌లో 650కు పైగా స్కోర్‌ సొంతం చేసుకోవడం మేలు.
 • టోఫెల్‌లో కనీసం 100 స్కోర్‌ సొంతం చేసుకుంటే.. టాప్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది.

అకడమిక్, టెస్ట్‌ స్కోర్లు ఉన్నా

అకడమిక్‌గా అద్భుతమైన జీపీఏ, టెస్ట్‌ స్కోర్లు ఉన్నప్పటికీ..లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌(ఎల్‌ఓఆర్‌), స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌(ఎస్‌ఓపీ) కీలకంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అకడమిక్, టెస్ట్‌ స్కోర్లను సైతం కాదని.. ఎల్‌ఓఆర్, ఎస్‌ఓపీ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయంటే.. వీటి ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. 

లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌

అభ్యర్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తూ సంబంధిత రంగంలోని నిపుణులైన వ్యక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలే.. ఎల్‌ఓఆర్‌(లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌)! అభ్యర్థులు తాము చదువుకున్న యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్లు, లేదా వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అయితే వారి ఉన్నతాధికారులతో ఎల్‌ఓఆర్‌ను పొందాల్సి ఉంటుంది. తమ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఈ సిపార్సు లేఖలు తీసుకోవడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలోని వర్సిటీలు ప్రస్తుతం కనీసం రెండు ఎల్‌ఓఆర్‌లను అడుగుతున్నాయి.

చ‌ద‌వండి: Spoken English: ఇవి తెలుసుకుంటే... ఇంగ్లిష్‌లో ప్రశ్నించడం సులువే!

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌

అభ్యర్థులు సదరు యూనివర్సిటీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. ఆ కోర్సునే ఎంపిక చేసుకోవడానికి కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి?! అనే వివరాలు పేర్కొంటూ.. నిర్దేశిత పదాల్లో సొంతంగా రాయాల్సిన నివేదిక.. ఎస్‌ఓపీ(స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌). దీన్ని యూనివర్సిటీ అకడమిక్‌ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఎస్‌ఓపీలో విద్యార్థి పొందుపర్చిన సమాచారం, నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని వర్సిటీలు ప్రవేశం ఖరారు చేస్తున్నాయి.

ఎస్సే

అమెరికాలోని యూనివర్సిటీలు అనుసరిస్తున్న మరో విధానం.. ఎస్సే(వ్యాస రచన) రాయమని అడగడం. దరఖాస్తు సమయంలోనే ఏదైనా ఒక అంశం పేర్కొని.. నిర్దిష్ట పదాల్లో వ్యాసం రాయమని సూచిస్తున్నాయి.

రెజ్యుమే కూడా

దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అభ్యర్థుల అకడమిక్‌ అర్హతలు, టెస్ట్‌ స్కోర్లు పొందుపరిచే విధంగా దరఖాస్తు నమూనా ఉంటుంది. అయినప్పటికీ యూనివర్సిటీలు రెజ్యుమే లేదా సీవీని కూడా అప్‌లోడ్‌ చేయమని అడుగుతున్నాయి. అభ్యర్థుల అకడెమిక్‌ అర్హతలతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో పాల్గొన్న తీరు, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ వివరాలు తెలుసుకునేందుకు రెజ్యుమెను అప్‌లోడ్‌ చేయమని సూచిస్తున్నాయి.

చ‌ద‌వండి: Communication skills: అంతర్జాతీయ అవకాశాలకు.. ఇంగ్లిష్‌! భాషపై పట్టు సాధించేందుకు మార్గాలు..

వీసాకు దరఖాస్తు

ప్రవేశం ఖరారైతే.. యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్‌ లెటర్‌ ఆధారంగా ఇమిగ్రేషన్‌ విభాగంలో.. ఐ-20 ఫామ్‌ను పూర్తి చేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్‌ విభాగం అధికారులు.. సంబంధిత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొచ్చేస్తామనే విధంగానే సమాధానాలు ఇవ్వాలి. 

ఓపీటీతో.. ఉద్యోగం దిశగా

అమెరికాలోని యూనివర్సిటీలో చేరి పీజీ కోర్సు ముగిసిన తర్వాత ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) పేరుతో అక్కడి సంస్థల్లో 12 నెలలపాటు పని చేసే అవకాశం ఉంది. స్టెమ్‌(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) కోర్సుల అభ్యర్థులు ఈ 12 నెలలకు అదనంగా మరో 24 నెలలు అంటే మొత్తం 36 నెలలు అక్కడి కంపెనీల్లో పని చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐ-765 పేరుతో తమను ఓపీటీకి ఎంపిక చేసిన సంస్థల నుంచి ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌తో యూఎస్‌ఐసీఐఎస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను ప్రతి ఏటా అక్టోబర్‌ 1 నుంచి తదుపరి ఏడాది మే 1లోపు అందించాలి.

ఓపీటీ ప్రతిభతో.. హెచ్‌-1బి

 • ఓపీటీ సమయంలో అభ్యర్థులు తమ పనితీరుతో సదరు సంస్థల యాజమాన్యాల నుంచి సానుకూల ఫలితం ఆశించొచ్చు. తద్వారా ఆ సంస్థల్లో శాశ్వత ఉద్యోగం కల్పించే విధంగా హెచ్‌-1బి పిటిషన్‌కు దరఖాస్తు చేసే మార్గాలు మెరుగుపరచుకోవచ్చు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా యూఎస్‌లో దాఖలవుతున్న హెచ్‌-1బి పిటిషన్ల విషయంలో ఓపీటీ పూర్తి చేసుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 
 • హెచ్‌-1బీకి పిటిషన్‌ దాఖలైతే.. అలాంటి అభ్యర్థులు ఓపీటీ ముగిసిన సమయానికి, హెచ్‌-1బీ వీసా మంజూరుకు మధ్య ఉన్న వ్యవధిలో అమెరికాలోనే నివసించేందుకు అనుమతి లభిస్తుంది. ఈ విషయంలో క్యాప్‌ గ్యాప్‌ అనే విధానం అమలవుతోంది. 

ఫీజు 30 వేల డాలర్ల నుంచి 50 వేల వరకు

అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్‌ ప్రోగ్రామ్‌ ఫీజులు ఏడాదికి ముప్పై వేల డాలర్ల నుంచి యాభై వేల డాలర్ల మధ్యలో ఉంటున్నాయి. ఇవి..ఆయా యూనివర్సిటీల స్థాయి, విద్యార్థులు ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటాయి. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలంటే.. ఏడాదికి కనీసం యాభై వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే.

అవసరమైన డాక్యుమెంట్లు

 • అకడమిక్‌ ట్రాన్స్‌క్రిప్ట్స్‌(విద్యార్హతల సర్టిఫికెట్లు); జీఆర్‌ఈ/జీమ్యాట్‌/టోఫెల్‌ /ఐఈఎల్‌టీఎస్‌ తదితర టెస్ట్‌ స్కోర్లు; లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌; స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌; వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిపికెట్‌; ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌(బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌); రెజ్యుమే/సీవీ.

వీసా మంజూరుకు

 • ఐ-20(అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్‌); యాక్సెప్టెన్స్‌ లెటర్‌; సెవిస్‌ రిసిప్ట్‌ (ఐ-901); వీటితోపాటు ఆర్థిక వనరుల రుజువులు; సిటిజన్‌ షిప్‌ పాస్‌పోర్ట్‌; అపాయింట్‌మెంట్‌ లెటర్‌; డిఎస్‌-160 కన్ఫర్మేషన్‌ లెటర్‌.

అమెరికా.. టాప్‌ యూనివర్సిటీలు

 • హార్వర్డ్‌ యూనివ్సిటీ; ఎంఐటీ; స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ; యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా; కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ; ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ; యూసీ-బర్కిలీ; యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో; కార్నెల్‌ యూనివర్సిటీ; యేల్‌ యూనివర్సిటీ.
Published date : 10 Nov 2022 05:03PM

Photo Stories