Skip to main content

Study Abroad in USA: యూఎస్‌లో క్రేజీ కోర్సులు.. వీసాకు కావల్సిన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అమెరికాలో.. ఉన్నత విద్య! మన దేశ విద్యార్థుల తొలి గమ్యం!! ముఖ్యంగా టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విద్యార్థులు యూఎస్‌ యూనివర్సిటీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయా యూనివర్సిటీల నిబంధనలకు అనుగుణంగా ప్రామాణిక టెస్ట్‌లలో బెస్ట్‌ స్కోర్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఏ కోర్సుల్లో చేరాలనుకున్నా.. ఇమిగ్రేషన్, అకడమిక్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో.. యూఎస్‌లో మన విద్యార్థులకు క్రేజీ కోర్సులు.. అడ్మిషన్‌ నిబంధనలు.. ఇన్‌స్టిట్యూట్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సిద్ధం చేసుకోవాల్సిన ఇతర డాక్యుమెంట్లు తదితర వివరాలు..
International students pursuing technical degrees in the US, Study Abroad in USA visa, important precautions,Educational aspirations in the USA
  • యూఎస్‌ వర్సిటీల్లో కొనసాగుతున్న ఫాల్‌ సెషన్‌ సందడి
  • ప్రవేశాల కోసం ఆసక్తి చూపుతున్న భారత విద్యార్థులు
  • ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంపికలో అప్రమత్తత ముఖ్యం

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది ఎంఎస్, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పీజీ స్టడీస్‌కి సంబంధించి దాదాపు 60 శాతం మంది ఈ రెండు కోర్సులనే ఎంచుకుంటున్నారు. గత విద్యా సంవత్సరంలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో 13.3 శాతం మంది, కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో 66 శాతం మంది చేరినట్లు ఓపెన్‌ డోర్స్‌ నివేదిక పేర్కొంది.

ఇన్‌స్టిట్యూట్‌ల గుర్తింపు
అమెరికాలో ఉన్నత విద్యలో చేరాలనుకునే విద్యార్థులు ముందుగా.. అక్కడి ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపికపై కసరత్తు చేయాలి. తొలుత తమకు ఆసక్తి ఉన్న ప్రోగ్రామ్‌లను అందిస్తున్న యూనివర్సిటీల జాబితాను సిద్ధం చేసుకోవాలి. 

ఆ తర్వాత.. ఆయా విశ్వవిద్యాలయాల నిబంధనలు, స్టాండర్ట్‌ టెస్ట్‌ల కనీస స్కోర్‌ వివరాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రతి యూనివర్సిటీకి సంబంధించి దరఖాస్తు గడువు తేదీలు వేర్వేరుగా ఉంటాయి. ఫాల్‌ ఇన్‌టేక్‌ సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్‌లో ముగుస్తుంది. అలాగే స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ జనవరిలో ప్రారంభమై మే వరకూ కొనసాగుతుంది.

చ‌ద‌వండి: Study abroad: కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!

రోలింగ్‌ అడ్మిషన్స్‌
అమెరికా యూనివర్సిటీలు ప్రవేశ ప్రక్రియలో ఫాల్, స్ప్రింగ్‌లతోపాటు రోలింగ్‌ అడ్మిషన్‌ విధానాన్ని అమలు చేస్తుంటాయి. ఈ విధానంలో అభ్యర్థులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత సెషన్లలో సీట్లు భర్తీ కాని సందర్భాల్లో రోలింగ్‌ అడ్మిషన్‌ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఆయా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అడ్మిషన్‌ సెషన్ల గురించి కూడా తెలుసుకోవాలి. రోలింగ్‌ అడ్మిషన్‌ సెషన్‌ అందుబాటులో ఉంటే దానికి కూడా దరఖాస్తు చేసుకోవడం మేలు.

అర్హత నిబంధనలు
ఆయా యూనివర్సిటీలు అనుసరిస్తున్న అర్హత నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కువ శాతం ఇన్‌స్టిట్యూట్‌లు 16 ఏళ్ల (10+2+4) ఎడ్యుకేషన్‌ విధానంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలంటున్నాయి. మరికొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రం 10+2 తర్వాత మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ప్రఖ్యాత యూనివర్సిటీలు (హార్వర్డ్, ఎంఐటీ, యూసీ, కార్నెగీ మిలన్‌ తదితర) మాత్రం తప్పనిసరిగా 10+2+4 విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా పేర్కొంటున్నాయి.

చ‌ద‌వండి: Study Abroad: విదేశాల్లో చదువుపై ట్రిపుల్‌ ఐటీతో ఒప్పందం

ప్రామాణిక టెస్ట్‌లు
అధికశాతం యూఎస్‌ యూనివర్సిటీలు స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్లను తప్పనిసరి చేస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న డొమైన్‌ ఆధారంగా జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్‌ వంటి టెస్టుల స్కోర్లు పొందాల్సి ఉంటుంది. జీఆర్‌ఈలో సబ్జెక్ట్‌ టెస్ట్‌ స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేస్తున్నాయి. జీఆర్‌ఈలో కనీసం 300కుపైగా పాయింట్లు సొంతం చేసుకుంటే.. అడ్మిషన్‌ అవకాశాలు మెరుగవుతాయి.జీమ్యాట్‌లో 650 కు పైగా స్కోర్‌ పొందడం మేలు. టోఫెల్‌లో కనీ­సం 100 స్కోర్‌ సాధిస్తే.. టాప్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది.

మిగతా వాటిపైనా దృష్టి
యూనివర్సిటీల నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉన్నప్పటికీ.. అనేక ఇతర అంశాలు సైతం ప్రవేశం ఖరారులో కీలకంగా మారుతున్నాయి. వీటిల్లో లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌ (ఎల్‌ఓఆర్‌), స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌(ఎస్‌ఓపీ) ముఖ్యమైనవి. కొన్ని సందర్భాల్లో అకడమిక్,టెస్ట్‌ స్కోర్లను సైతం కాదని ఎల్‌ఓఆర్, ఎస్‌ఓపీ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారంటే.. వీటి ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు.

లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌
అభ్యర్థుల నైపుణ్యాలను, సామర్థ్యాలను ధ్రువీకరిస్తూ.. సంబంధిత రంగంలోని నిపుణులు ఇచ్చే సిఫార్సు లేఖలే.. లెటర్‌ ఆఫ్‌ రికమండేష¯Œు. అభ్యర్థులు తాము చదువుకున్న యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్లు; వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అయితే ఉన్నతాధికారులతో లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌ను పొందాల్సి ఉంటుంది. తమ గురించి బాగా తెలిసిన వ్యక్తులతో ఈ సిపార్సు లేఖలు పొందడం వల్ల మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలోని వర్సిటీలు కనీసం రెండు ఎల్‌ఓఆర్‌లను కోరుతున్నాయి.

చ‌ద‌వండి: Study Abroad: వీసా తిరస్కరణకు ముఖ్యమైన‌ కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎస్‌ఓపీ.. స్పెషల్‌ కేర్‌
మరో కీలకమైన డాక్యుమెంట్‌.. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌(ఎస్‌ఓపీ). విద్యార్థులు సదరు యూనివర్సిటీలో చేరాలనుకోవడానికి కారణాలు.. అదే ప్రోగ్రామ్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు.. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి?ఇలా వివిధ కోణాల్లో అన్ని వివరా­లు పొందుపరుస్తూ నిర్దేశిత పదాల్లో సొంతంగా రాయాల్సిన నివేదిక ఇది.దీన్ని యూనివర్సిటీకి చెందిన అకడమిక్‌ నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కొన్ని సందర్భాల్లో టెస్ట్‌ స్కోర్లు, అకడమిక్‌ పర్సంటేజీలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్‌ఓపీలో అభ్యర్థి పొందుపర్చిన సమాచారం, వారి నిబద్ధత­ను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం కల్పిస్తున్నాయి.

కీలకంగా రెజ్యుమే
విదేశీ యూనివర్సిటీలో అభ్యర్థుల అడ్మిషన్‌ను ఖరారు చేసే మరో సాధనం.. రెజ్యుమే. ఇటీవల కాలంలో కొన్ని యూనివర్సిటీలు రెజ్యుమే లేదా సీవీని కూడా అప్‌లోడ్‌ చేయమంటున్నాయి. అభ్యర్థులు అకడమిక్‌ స్థాయిలో పొందిన అర్హతలతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో పాల్గొన్న తీరు, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ వంటి వాటి గురించి తెలుసుకోవాలనుకోవడం ఇందుకు కారణం.

వీసాకు దరఖాస్తుకు ఇలా
అమెరికాలో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థు­లు..యూనివర్సిటీ ఇచ్చే కన్ఫర్మేషన్‌ లెటర్‌ ఆధారంగా ఇమిగ్రేషన్‌ విభాగంలో ఐ-20ఫామ్‌ను పూర్తి చేసి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించిన ఇమిగ్రేషన్‌ విభాగం అధికారులు నిర్దేశిత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచిస్తా­రు. ఇంటర్వ్యూ సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తి­రిగొచ్చేస్తామనే విధంగానే సమాధానాలు ఇవ్వాలి.

చ‌ద‌వండి: యూకే విజిటింగ్, స్టూడెంట్‌ వీసా ఫీజుల మోత

కొలువుకు మార్గం ఓపీటీ
అమెరికాలో అడుగుపెట్టిన విద్యార్థులకు కలిసొస్తున్న విధానం.. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ). ముఖ్యంగా కోర్సు పూర్తి చేసుకున్నాక అక్కడే ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓపీటీ దోహదపడుతోంది. యూఎస్‌లోని ఏదైనా యూనివర్సిటీలో పీజీ ప్రోగ్రామ్‌లో చేరిన అభ్యర్థులు.. కోర్సు ముగిసిన తర్వాత ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పేరుతో అక్కడి సంస్థల్లో 12 నెలలపాటు పని చేసే అవకాశం ఉంది. స్టెమ్‌(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) కోర్సుల అభ్యర్థులు 12 నెలలకు అదనంగా మరో 24 నెలలు అంటే మొత్తం 36 నెలలు ఓపీటీ విధానంలో అక్కడి కంపెనీల్లో పని చేసే వీలుంది.
ఓపీటీ సమయంలో అభ్యర్థులు తమ పనితీరుతో సదరు సంస్థల యాజమాన్యాల నుంచి సానుకూల ఫలితం ఆశించొచ్చు. వారి ద్వారా ఆ సంస్థల్లో శాశ్వత ఉద్యోగం కల్పించే విధంగా యాజమాన్యాలు అభ్యర్థుల తరఫున హెచ్‌-1బి పిటిషన్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా యూఎస్‌లో దాఖలవుతున్న హెచ్‌-1బి పిటిషన్లలో ఓపీటీ పూర్తి చేసుకున్న విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 

50 వేల డాలర్ల ఫీజు
అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్‌ ప్రోగ్రా­మ్‌ ఫీజు గరిష్టంగా 50 వేల డాలర్ల వరకు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలో 30వేల డాలర్లతో చదివే అవకాశం ఉంది. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలంటే.. ఏడాదికి కనీసం యాభై వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే.

ముఖ్య డాక్యుమెంట్స్‌
అకడమిక్‌ ట్రాన్స్‌క్రిప్ట్స్‌(విద్యార్హతల సర్టిఫికెట్లు); జీఆర్‌ఈ/జీమ్యాట్‌/టోఫెల్‌ /ఐఈఎల్‌టీఎస్‌ తదితర టెస్ట్‌ స్కోర్లు; లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌; స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌; వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌(బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌); రెజ్యుమే/సీవీ.

వీసాకు కావల్సిన పత్రాలు
ఐ-20(అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్‌);యాక్సెప్టెన్స్‌ లెటర్‌; సెవిస్‌ రిసిప్ట్‌(ఐ-901); వీటితోపాటు ఆ­ర్థిక వనరుల రుజువులు; సిటిజన్‌ షిప్‌ పాస్‌పోర్ట్‌; అపాయింట్‌మెంట్‌ లెటర్‌;డిఎస్‌-160కన్ఫర్మేషన్‌ లెటర్‌.

Published date : 13 Oct 2023 07:52AM

Photo Stories