Study Abroad: వీసా తిరస్కరణకు ముఖ్యమైన కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- నిబంధనలపై పూర్తి అవగాహన ముఖ్యం
- నిర్దేశిత టెస్ట్ స్కోర్లు కూడా ప్రామాణికమే
- కన్సల్టెన్సీల విషయంలో అప్రమత్తత అవసరం
విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం దక్కిందంటే చాలు.. వీసా సులువుగా లభిస్తుందనే అభిప్రాయం ఎక్కువ మంది విద్యార్థుల్లో నెలకొంది. వాస్తవానికి వీసా మంజూరు అనేది సదరు ఇమ్మిగ్రేషన్ అధికారుల విచక్షణాధికారాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా దేశాల్లో వీసా నిబంధనలపై అవగాహన పెంచుకొని, అందుకనుగుణంగా సన్నద్ధమైతే వీసా పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
గుర్తింపు పొందిన వర్సిటీలకే
స్టడీ అబ్రాడ్ విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న విదేశీ యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌కు ఆ దేశ విద్యాశాఖ, ఇతర నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందా? లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలి. గుర్తింపు ఉన్న వర్సిటీల్లో చేరితేనే వీసా మంజూరవుతుంది. దీంతోపాటు సదరు ఇన్‌స్టిట్యూట్‌కున్న గుర్తింపు కాల పరిమితిపైనా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులు చేరాలనుకుంట్ను ప్రోగ్రామ్‌కున్న అనుమతిని పరిశీలించాలి.
చదవండి: యూకే విజిటింగ్, స్టూడెంట్ వీసా ఫీజుల మోత
స్టాండర్ టెస్ట్ స్కోర్లు
విదేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశాల కోసం జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ తదితర టెస్ట్ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పలు విద్యాసంస్థలు టెస్ట్ స్కోర్ల నుంచి సడలింపు ఇస్తున్నాయి. దీంతో కొంతమంది విద్యార్థులు నిబంధనలు సరళీకృతంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌వైపు దృష్టి సారిస్తున్నారు. కానీ.. వీసా మంజూరులో మాత్రం స్టాండర్డ్ టెస్ట్ స్కోర్లను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత టెస్ట్‌ల్లో పొందిన స్కోర్లు తక్కువగా ఉంటే.. అందుకు కారణాలను అడుగుతున్నారు. టెస్ట్ స్కోర్ల ఆధారంగా వీసా మంజూరుపై నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉంటుంది. కాబట్టి స్టడీ అబ్రాడ్ అభ్యర్థులు సదరు టెస్టుల్లో మంచి స్కోర్ సాధించేలా కృషి చేయాలి.
కమ్యూనికేషన్ స్కిల్స్
వీసా ఇంటర్వ్యూ సమయంలో అడిగే ప్రశ్నలకు కొంతమంది విద్యార్థులు సరిగా సమాధానాలు ఇవ్వలేక తొట్రుపాటుకు గురవుతున్నారు. ఇది కూడా వీసా తిరస్కరణకు మరో కారణంగా నిలుస్తోంది. కాబట్టి అభ్యర్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. రిటెన్ స్కిల్స్‌కే పరిమితం కాకుండా.. స్పోకెన్ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేయాలి.
భవిష్యత్ లక్ష్యాలేంటి
వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యే విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత పెంచుకోవాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొస్తామని.. స్వదేశంలోనే స్థిరపడతామని చెప్పాలి. ఎందుకంటే.. ఏ దేశమైనా ఉద్యోగ కల్పనలో తమ యువతకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే కోర్సు పూర్తయ్యాక కచ్చితంగా స్వదేశానికి తిరిగొస్తామనే రీతిలో సమాధానం ఇవ్వాలి. దీంతోపాటు సదరు విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి గల కారణాలను మెప్పించేలా చెప్పాలి.
చదవండి: Study Abroad: 14 Key Points Every Indian Student Should Remember
నకిలీ డాక్యుమెంట్లు
స్టడీ అబ్రాడ్ వీసా తిరస్కరణకు మరో ప్రధాన కారణం..నకిలీ డాక్యుమెంట్లు! ముఖ్యంగా ఆర్థిక వనరులకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్ లెటర్ల విషయంలో..కొంతమంది పొరపాట్లు చేస్తున్నారు. ఫీజులతోపాటు కనీసం ఒక ఏడాది కాలానికి ఖర్చులకు సరిపడే నిధులున్నట్లు రుజువు చేసే ఫైనాన్షియల్ డాక్యుమెంట్ల కోసం కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నారు.దీన్ని ఆసరాగా చేసుకొని పలు కన్సల్టెన్సీలు తప్పుడు డాక్యుమెంట్లతో విద్యార్థుల తరఫున దరఖాస్తు చేస్తున్నాయి. పర్యవసానంగా వీసా తిరస్కరణకు గురవుతోంది.
నిర్దేశిత నమూనా
విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులు.. నిర్దేశిత నమూనాలోనే వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు అమెరికా వీసా కోసం ఐ-20 ఫామ్‌గా పిలిచే అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేయాలి. అలాగే యూకే వీసా కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఇచ్చే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సప్టెన్స్ ఫర్ స్టడీస్(సీఏఎస్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ నిర్దేశిత నమూనాలో లేకుంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.
వీలైనంత త్వరగా
- విదేశీ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులు..వీలైనంత త్వరగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ చేతికందిన తర్వాత రెండు వారాల్లోపు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. యూఎస్ వర్సిటీలో ప్రవేశం పొందిన వారు.. వీసా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను 20 రోజుల్లోపు పూర్తి చేయాలి.
- అప్లికేషన్ సెంటర్‌లో ప్రక్రియకు వెళ్లేముందు పాస్‌పోర్ట్, డిఎస్-160 కన్ఫర్మేషన్ పేజ్, అపాయింట్ కన్ఫర్మేషన్ పేజ్‌లతో వెళ్లాలి. అప్లికేషన్ సెంటర్‌లో ఇంటర్వ్యూ విజయవంతంగా ముగించుకుంటే వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- ఈ ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సిటిజన్‌షిప్ పాస్‌పోర్ట్, అపాయింట్‌మెంట్ లెటర్, డిఎస్-160 కన్ఫర్మేషన్ లెటర్, ఈవీఐఎస్(స్టూడెంట్ ఎక్సే ్చంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్) రిసీప్ట్ (ఐ-901), ఐ-20లను దగ్గర ఉంచుకోవాలి.
చదవండి: Foreign Education: విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం
సోషల్ మీడియాలో జాగ్రత్తగా
ఆయా దేశాలు విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా నెట్‌వర్కింగ్‌పైనా సునిశితంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో అమెరికాలో దాదాపు మూడు వేల మంది విదేశీ విద్యార్థులను వారి సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ ప్రొఫైల్, పోస్ట్‌ల కారణంగా వీసాలను తిరస్కరించారు. అదే విధంగా ఆస్ట్రేలియాలో గత మే నెలలో పలు యూనివర్సిటీల విదేశీ విద్యార్థుల కదలికలపై అనుమానంతో వీసాలను రద్దు చేశారు. కాబట్టి విదేశాల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. ఆ దేశానికి సంబంధించి వ్యతిరేక వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని గుర్తించాలి.
రీ-అప్లై.. ఇంటర్వ్యూ
వీసా తిరస్కరణకు గురైన విద్యార్థులకు.. మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు అన్ని దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి. రెండోసారి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలో.. మొదటిసారి తిరస్కరణకు కారణాలపై ఇమిగ్రేషన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కాబట్టి విద్యార్థులు సదరు లోపాలను సరిదిద్దుకున్న తర్వాతే రెండోసారి వీసాకు దరఖాస్తు చేసుకోవడం మేలు.
కన్సల్టెన్సీలతో అప్రమత్తంగా
ప్రస్తుతం విద్యార్థులు విదేశీ విద్య కోసం కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నారు. ఈ కన్సల్టెన్సీలను ఎంచుకునే ముందు.. వాటి ప్రామాణికత, ఆయా దేశాల్లోని యూనివర్సిటీల్లో సదరు కన్సల్టెన్సీలకు ఉన్న గుర్తింపును పరిశీలించాలి. కన్సల్టెన్సీ నిర్వాహకులు తమకు గుర్తింపు కల్పించాయని చెబుతున్న వర్సిటీలతో సంప్రదించి వివరాలు సేకరించాలి.
అధికారిక ఏజెన్సీలు
ప్రస్తుతం పలు దేశాలు తమ అధికారిక ఏజెన్సీల ద్వారా విదేశీ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నాయి. వీటి ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసా పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో.. యూఎస్‌ఐఈఎఫ్ అధికారిక ఏజెన్సీగా గుర్తింపు పొందింది. అదే విధంగా యూకేలో బ్రిటిష్ కౌన్సిల్ పరిధిలోని యూకేఐఈఆర్‌ఐ వంటివి అధికారిక ఏజెన్సీలుగా సేవలందిస్తున్నాయి. ఇదే తరహాలో పలు దేశాలు తమ అధికారిక ఏజెన్సీల ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో విద్యార్థులకు యూనివర్సిటీలు, కోర్సులు మొదలు వీసా అప్లికేషన్ వరకు సహకారం అందిస్తున్నాయి.
చదవండి: American universities: అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా?
ధ్రువీకరణ పత్రాలు
- సిటిజన్ పాస్‌పోర్ట్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్
- ఆర్థిక వనరులకు సంబంధించిన రుజువులు
- ఎడ్యుకేషన్ లోన్ పొందితే సంబంధిత బ్యాంకు నుంచి అధీకృత రుజువు స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
- ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్
- మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్
- స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ రిపోర్ట్స్.
దేశాలు.. వీసా దరఖాస్తులు
- అమెరికా: యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే ఐ-20 ఫామ్(అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్) ఆధారంగా వీసా కోసం దరఖాస్తు చేయాలి. తర్వాత దశలో ఆన్‌లైన్ విధానంలో యూఎస్ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌లోని డిఎస్-160 వీసా అప్లికేషన్‌ను పూర్తి చేయాలి.
- యూకే: యూకేలో పీజీ, యూజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు.. టయర్-4 జనరల్ కేటగిరీ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. సదరు ఇన్‌స్టిట్యూట్ అందించే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సప్టెన్స్ ఫర్ స్టడీస్(సీఏఎస్) ఫామ్ ఆధారంగానే చేయాలి.
- కెనడా: కెనడా స్టూడెంట్ వీసాకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్.. రెండు విధాలుగానూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోదల్చిన విద్యార్థులు ఠీఠీఠీ.ఛిజీఛి.జఛి.ఛ్చి ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.
- ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో యూజీ, పీజీ, మాస్టర్ డిగ్రీ కోర్సుల విద్యార్థులు సబ్ క్లాస్ 500 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
- సింగపూర్: సింగపూర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులు.. వీసా కోసం ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఇచ్చే ఈ-ఫార్మ్ 16 ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
- ఫ్రాన్స్: ఈ దేశంలో ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధిలో ఉండే కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు లాంగ్ స్టే వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.