Skip to main content

American universities: అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా?

How are admissions in American universities
  • వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఇంటర్వ్యూకు ఎలా సన్నద్ధం కావాలి?
  • సాక్షి టీవీ, సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
  • పాల్గొన్న అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్, నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా చీఫ్‌ ఎమ్మి, యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషన్‌  ఫౌండేషన్‌ ప్రాంతీయ అధికారి సుజనా మైరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో విద్యాభ్యాసంకోసం వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం యూఎస్‌ కాన్సు­లేట్‌ పలు సూచనలు చేసింది. అమెరికాలో చదువు, ఆపై ఉద్యో­గం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థు­లు వెళ్తున్న విషయం విదితమే.

అమెరికా వెళ్లే విద్యార్థులు ఆయా యూని­వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా పొందాలి? యూనివర్సిటీల ఎంపిక ఎలా? వీసా దరఖా­స్తు ఎలా చేసుకోవాలి? వీసా ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలపై విద్యార్థుల­కు అవగాహన కల్పించడానికి ‘సాక్షి టీవీ, సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌’ శనివా­రం అవ­గాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

చదవండి: Indian Software Engineers: 12 ముక్కల్లో మన ఇంజినీర్ల అమెరికా జీవితం ఇదే..

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరి­కా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్, నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా చీఫ్‌ ఎమ్మి, యూ­ఎస్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ప్రాంతీయ అధికారి సుజనా మైరెడ్డి తది­తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్సెన్‌ మాట్లాడుతూ, అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వారిలో తెలుగువారు కూడా ఉన్నారని, అమెరికాలో చదువుకుని స్థిరపడే వారి సంఖ్య ప్రతీయేటా పెరుగుతోందని ఆమె వివరించారు. 

వీసాల మంజూరులో...
యూఎస్‌ వెళ్లే వారికి వీసా మంజూరులో ఆలస్యమవుతోందన్న ప్రశ్నకు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా చీఫ్‌ ఎమ్మి సమాధానమిస్తూ వీసాల జారీని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వారికి అనుకున్న సమయంలోనే వీసా ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్లాట్లు విడుదలకాగానే బుక్‌ చేసుకోవాలని, వీసాకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

ధ్రువపత్రాలు చెక్‌ చేసిన తర్వాత, ఫింగర్‌ప్రింట్స్‌ను నమోదు చేసి, అన్ని సక్రమంగా ఉన్నాయని చెక్‌ చేసిన వెంటనే వీసాను మంజూరు చేస్తున్నామని వివరించారు. వీసా స్లాట్ల బుకింగ్‌ కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా నాలుగు యూఎస్‌ కాన్సులేట్స్‌లో అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. 

ఉచితంగా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌..
అమెరికాలో చదవాలనే విద్యార్థులకు ఉచితంగా ‘స్టడీ ఇన్‌ద యూఎస్‌ యూనివర్సిటీ ఫెయిర్‌’ నిర్వహిస్తున్నట్లు యూఎస్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ రీజనల్‌ ఆఫీసర్‌ సుజనా మైరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నొవాటెల్‌ కన్వెన్షన్‌లో ఆగస్ట్‌ 26 ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఫెయిర్‌ నిర్వహిస్తామని, విద్యార్థుల అనుమా­నాలన్నింటినీ ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.

చదవండి: Foreign Education: విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం

మరిన్ని వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.యూఎస్‌ఐఈఎఫ్‌.ఓఆర్‌జీ.ఐ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు. అమెరికాలో 4,700 యూనివర్సిటీలు ఉన్నాయని, ఈనెల 26న నిర్వహించే ఫెయి­ర్‌కు 40 ప్రముఖ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.  విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు యూనివర్సిటీ ప్రతినిధులు సమాధానమిస్తారన్నారు.

ఫేక్‌ యూనివర్సిటీల వివరాలు ఎలా కనుక్కోవాలి?
ఫేక్‌ యూనివర్సిటీల వివరాలు ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు సుజనా సమాదానమిస్తూ... అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని యూనివర్సిటీల వివరాలను అధికారికంగా వెబ్‌సైట్‌లలో ఉంచుతుందని చెప్పారు. జాయిన్‌ కావాలనుకున్న యూనివర్సిటీ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయో లేదో విద్యార్థులు చెక్‌ చేసుకోవాలన్నారు. విద్యకు సంబంధించి అమెరికాకు చెందిన 8 కేంద్రాలు ఇండియాలో ఉన్నాయని.. వీటిలో సంప్రదించినా గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 

Published date : 21 Aug 2023 05:35PM

Photo Stories