Skip to main content

Study Abroad: ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలు..

Problems Faced by Students Studying Abroad
Problems Faced by Students Studying Abroad

విదేశాల్లో, పేరున్న యూనివర్సిటీలో చదువుకోవడం.. దేశంలోని లక్షల మంది విద్యార్థుల స్వప్నం! ఇందుకోసం పలు అర్హత పరీక్షలు ఉత్తీర్ణులవ్వాలి. అనేక నిబంధనలను దాటాలి. దీంతో అప్లికేషన్‌ నుంచి మొదలు విదేశీ యూనివర్సిటీ క్యాంపస్‌లో అడుగుపెట్టేదాకా.. విద్యార్థులకు అనేక సవాళ్లు, సందేహాలు!! ముందస్తు ప్రణాళికతో పూర్తి అవగాహన పెంచుకుంటే.. ఈ సవాళ్లను సులువుగానే అధిగమించొచ్చు అంటున్నారు నిపుణులు!! ప్రస్తుతం.. అమెరికా, యూకే తదితర దేశాల్లో ఫాల్‌ సెషన్‌ అడ్మిషన్స్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రత్యేక కథనం.. 
 

  • కొనసాగుతున్న ఫాల్‌ సెషన్‌ అడ్మిషన్ల సందడి
  • స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లు
  • అప్లికేషన్‌ నుంచి వర్సిటీలో అడుగుపెట్టే వరకు అనేక సందేహాలు
  • ముందస్తు ప్రణాళికతో అధిగమించొచ్చు అంటున్న నిపుణులు

ఉన్నత విద్య కోసం భారత్‌ నుంచి విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కరోనా పరిస్థితుల్లోనూ విదేశీ విద్యకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గడం లేదు. కానీ ఇదే సమయంలో వారికి పలు సందేహాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించాలంటే.. వ్యక్తిగతంగా, అకడమిక్‌గా అవసరమైన అర్హతలు, ఇతర నిబంధనల గురించి ముందుగానే తెలుసుకొని.. అడుగులు వేయడమే పరిష్కారం అంటున్నారు నిపుణులు.


చ‌ద‌వండి: యూఎస్‌లో యూజీ.. ఈ కోర్సులకు అధిక ప్రాధాన్యం
అప్లికేషన్‌ దశ నుంచే

  • స్టడీ అబ్రాడ్‌ అభ్యర్థుల్లో చాలామంది అప్లికేషన్‌ దశ నుంచే పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయా యూనివర్సిటీల అప్లికేషన్‌ ప్రక్రియ క్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌(ఎస్‌ఓపీ), లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌(ఎల్‌ఓఆర్‌)లను సమర్థవంతంగా పూర్తి చేయడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 
  • ముఖ్యంగా ఎస్‌ఓపీ ద్వారా విద్యార్థులు తమ ఆసక్తిని, ఉద్దేశాన్ని సదరు యూనివర్సిటీ అధికారులను మెప్పించే విధంగా వ్యక్తం చేయలేకపోతున్నారు. దీనికి పరిష్కారంగా ఇప్పటికే ఆయా యూనివర్సిటీల్లో చదువుతున్న పరిచయస్తులు, సీనియర్ల సలహాలు తీసుకొని.. తమదైన శైలిలో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ను రాయాలి. అలాగని.. పూర్వ విద్యార్థులు రూపొందించిన ఎస్‌ఓపీలోని అంశాలను యథాతథంగా రాస్తే.. యూనివర్సిటీ అధికారులు ఇట్టే పసిగట్టే ఆస్కారం ఉంది. కాబట్టి తమ సొంత శైలిలో ఎస్‌ఓపీని రూపొందించి దరఖాస్తుతోపాటు అందించాలి. అలాగే ఎల్‌ఓఆర్‌పై ముందుగానే కసరత్తు పూర్తి చేయాలి. సదరు అధ్యాపకులు విద్యార్థి గురించి పూర్తి సమాచారంతో ఎల్‌ఓఆర్‌ సమగ్రంగా రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

టెస్ట్‌ ప్రిపరేషన్‌

మన విదేశీ విద్య అభ్యర్థులు ఎదుర్కొంటున్న మరో సమస్య.. టెస్ట్‌ ప్రిపరేషన్‌. ప్రస్తుతం ఆయా దేశాల్లోని యూనివర్సిటీల నిబంధనల ప్రకారం–విద్యార్థులు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ తదితర టెస్ట్‌లలో మెరుగైన స్కోర్‌ సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ టెస్ట్‌లకు హాజరయ్యే విషయంలో కొంత ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభానికి రెండు, మూడు నెలల ముందు మాత్రమే వీటిపై దృష్టిపెడుతున్నారు. దీనివల్ల మొదటిప్రయత్నంలో మంచి స్కోర్‌ రాకుంటే.. రెండోసారి హాజరయ్యేందుకు తగిన సమయం లభించడం లేదు. దీంతో విద్యార్థులు టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీనికి పరిష్కారంగా.. విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌లో ఉన్నప్పుడే టెస్టులపై దృష్టిపెట్టాలి. ఫలితంగా తొలి అటెంప్ట్‌లో నిర్దేశిత లేదా ఆశించిన స్కోర్‌ రాకున్నా.. మరోసారి పరీక్షకు హాజరై మంచి స్కోర్‌ సాధించే అవకాశం ఉంటుంది. 

చ‌ద‌వండి: ఉజ్వల భవితకు ఉత్తమ గమ్యం ఇలా..
సరితూగే కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌

  • విద్యార్థులు ఎదుర్కొంటున్న మరో సమస్య.. కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌ ఎంపికలో తాత్సారం. కొందరు విద్యార్థులు చివరి నిమిషం వరకు అన్వేషణ సాగిస్తూ.. కోర్సు, విద్యాసంస్థపై ఎలాంటి స్పష్టత తెచ్చుకోలేకపోతున్నారు. 
  • బీటెక్‌ విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో ఎంఎస్‌ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇండస్ట్రీ అవసరాలకు సరితూగే కొత్త కోర్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. వీటిపై లోతైన అన్వేషణ సాగించని కారణంగా.. విద్యార్థులు చివరి నిమిషంలో మూస కోర్సులను ఎంచుకుంటున్నారని చెబుతున్నారు.
  • సీఎస్‌ఈ విద్యార్థులకు విదేశాల్లో ఎంఎస్‌ స్థాయిలో కొత్త కోర్సులు(ఏఐ–ఎంఎల్, ఐఓటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితర) అందుబాటులో ఉన్నాయి. వీటిపై అవగాహన లేక తమ డొమైన్‌లోని సంప్రదాయ కోర్సులనే ఎంచుకుంటున్నారు. 
  • ఇలాంటి సమస్యకు పరిష్కారం.. వీలైనంత ముందుగానే చేరాలనుకుంటున్న యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను వీక్షించి.. అక్కడ తమ అర్హతలకు సరితూగే వినూత్న కోర్సులు, వాటికి ఇండస్ట్రీలో ఉన్న ప్రాధాన్యం,భవిష్యత్తు అవకాశాలను బేరీజు వేసుకొని కోర్సులను ఎంపిక చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆర్థిక వనరులు

స్టడీ అబ్రాడ్‌ అభ్యర్థులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య.. ఆర్థిక వనరులు. అక్కడ ఖర్చులకు సరిపడే ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా సదరు దేశంలో బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్టడీ లోన్‌ ద్వారా వెళ్లే విద్యార్థులు ఆయా దేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లు తెరవడం, తాము ఆ దేశంలో అడుగుపెట్టే సమయానికి అవి నిర్వహణలోకి వచ్చే∙విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విద్యార్థులు ఆర్థిక వనరుల సమీకరణ దిశగా.. బ్యాంక్‌ రుణం, బ్యాంక్‌ అకౌంట్‌ కోసం  ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించాలి. 

భిన్న సంస్కృతులు

విదేశీ విద్యకు వెళ్లే మన విద్యార్థులు ఎదుర్కొంటున్న మరో సమస్య..క్యాంపస్‌లోని భిన్న సంస్కృతుల విద్యార్థులతో ఇమడలేక పోవడం. విదేశీ యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటి గురించి ముందుగానే కొంత అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం ఆయా దేశాలకు సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోలను, పుస్తకాలను చదవాలి. యూనివర్సిటీలు సైతం విదేశీ విద్యార్థులకు అవసరమయ్యే సలహాలు, సూచనలు అందించేందుకు కౌన్సెలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని సంప్రదించి అక్కడి స్థానిక పరిస్థితులు, సంస్కృతి, సంప్రదాయాలు, తాము మెలగాల్సిన తీరుపై అవగాహన పొందొచ్చు.

క్లాస్‌ రూమ్‌ సమస్యలు

విదేశీ యూనివర్సిటీల్లో అధిక శాతం కోర్సు వర్క్‌ను ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో సాగించే విధంగా కరిక్యులంను అనుసరిస్తున్నారు. విద్యార్థులు థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్‌లోనూ తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. మన దేశంలో అధిక శాతం థియరీకి అలవాటు పడి ఉంటారు. ఇలాంటి విద్యార్థులు ఒక్కసారిగా భిన్నమైన కోర్స్‌వర్క్‌ను పూర్తిచేసే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా.. విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా సంబంధిత ప్రొఫెసర్లను, పూర్వ విద్యార్థులను నిరంతరం సంప్రదించాలి. ముఖ్యంగా ప్రొఫెసర్లతో ఇంటరాక్షన్‌కు ప్రాధాన్యమివ్వాలి. తమ పరిస్థితిని, సందేహాలను వివరించి..పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి.

పార్ట్‌టైమ్‌ జాబ్‌

విదేశీ యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు..పార్ట్‌ టైమ్‌ జాబ్‌ అవకాశాల గురించి అన్వేషిస్తుంటారు. పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ విధులు, నిబంధనలు, పనివేళలు తమ చదువుకు అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి. కోర్సు, కరిక్యులం, బోధన తీరు, కోర్స్‌ వర్క్, ప్రాక్టికల్స్‌.. ఇలా అన్ని విషయాలపై అవగాహనకు వచ్చాకే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌పై దృష్టి పెట్టాలి. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కూడా తమ అకడమిక్స్‌కు సరితూగే విభాగాల్లో ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం క్యాంపస్‌లోనే టీచింగ్‌ అసిస్టెన్స్, రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ వంటి వాటి కోసం ప్రయత్నించడం మేలు. 

నిబంధనలు తెలుసుకోవాలి

నేటికీ అంతర్జాతీయంగా కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికీ క్వారంటైన్, హోం క్వారంటైన్‌ వంటివి అమలు చేస్తున్నాయి. వీటి గురించి ముందుగానే తెలుసుకోవాలి. అదే విధంగా పలు యూనివర్సిటీలు హైబ్రీడ్‌ మోడల్‌ లెర్నింగ్‌(ఆఫ్‌లైన్‌ + ఆన్‌లైన్‌)ను కొనసాగిస్తున్నాయి. ఇలా హైబ్రీడ్‌ మోడల్‌ లెర్నింగ్‌ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులు.. సదరు ఇన్‌స్టిట్యూట్‌ నుంచి భవిష్యత్తులో అవసరమయ్యే ఇమిగ్రేషన్, వీసా మంజూరు తదితర ప్రక్రియలపై స్పష్టమైన హామీ తీసుకోవాలి.

ముందస్తు కసరత్తు

విద్యార్థులు తాము వెళ్లాలనుకుంటున్న దేశం, చేరాలనుకుంటున్న ఇన్‌స్టిట్యూట్, కోర్సు ఎంపికపై ముందస్తు కసరత్తు చేయాలి. కొత్త గమ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అడ్మిషన్‌ కోరుకుంటున్న దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ముందుగానే తెలుసుకోవాలి. తద్వారా అక్కడకు వెళ్లాక ఎదురయ్యే వ్యక్తిగత ఇబ్బందులను అధిగమించొచ్చు.
–ఇంతియాజ్, స్టడీ అబ్రాడ్‌ కన్సల్టెంట్‌

చ‌ద‌వండి: Part Time Jobs In Abroad: చదువుకుంటూనే.. సంపాదన నెల‌కు రూ. 59 వేలు..

Published date : 23 Nov 2021 06:05PM

Photo Stories