UK's Scale-Up Visa Scheme: స్పాన్సర్‌షిప్‌తో 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు బ్రిటన్‌లో కొలువు... నిబంధనలు, అర్హతలు..
విదేశాల్లో విద్య, ఉద్యోగం.. నేటి యువతలో ఎక్కువ మంది స్వప్నం! తమ కల సాకారం కోసం ముందుగా విదేశీ వర్సిటీలో ప్రవేశం.. ఆ తర్వాత అక్కడి విద్యార్హతతో ఉద్యోగాన్వేషణ కొనసాగించడం!! నేరుగా ఉద్యోగం పొందాలంటే..ఆయా దేశాల నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి! ఇలాంటి పరిస్థితుల్లో
జాబ్స్ అబ్రాడ్ అభ్యర్థులకు మేలు చేసేలా.. యూకే నూతన వీసా పథకాన్ని ప్రకటించింది. ఆ పథకమే.. స్కేల్ అప్ వీసా స్కీమ్! ఈ నేపథ్యంలో.. యూకే స్కేల్ అప్ వీసా స్కీమ్ ఉద్దేశం, నిబంధనలు, అర్హతలు తదితర అంశాలపై విశ్లేషణ...
- యూకేలో ఉద్యోగాలకు కొత్తగా స్కేల్ అప్ వీసా పథకం
- వృత్తి నిపుణులు, ఉన్నత విద్యావంతులకు సరికొత్త మార్గం
- స్పాన్సర్‌షిప్‌తో 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు బ్రిటన్‌లో కొలువు
- భారత యువతకు చక్కటి అవకాశం అంటున్న నిపుణులు
యూకేలోని సంస్థలకు నిపుణులైన మానవ వనరుల కొరత సమస్య నెలకొంది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఆ క్రమంలోనే ఆయా రంగాల్లోని సంస్థలు స్పాన్సర్‌షిప్ ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేందుకు కొత్తగా అమల్లోకి తెచ్చిన పథకమే.. స్కేల్ అప్ వీసా స్కీమ్. ఇటీవల ఈ కొత్త వీసా పథకాన్ని యూకే ప్రభుత్వం ప్రకటించింది.
వ్యాపారాభివృద్ధి దిశగా
స్కేల్ అప్ వీసా పథకం ప్రధాన ఉద్దేశం..ఆయా రంగాల్లోని సంస్థల వృద్ధికి తోడ్పాటును అందించడం. ఇందుకోసం కీలకమైన మానవ వనరుల నియామకాల పరంగా విదేశీ టాలెంట్‌కు స్వాగతం పలకాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దాదాపు 35 వేలకు పైగా వ్యాపార సంస్థలు స్కేల్ అప్ వీసా పథకం ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునే అర్హత పొందాయి. దీనిద్వారా ఆయా సంస్థలు స్పాన్సర్‌షిప్ లెటర్‌తో విదేశీయులను నియమించుకునే అవకాశం ఉంది.
చదవండి: Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..
ఈ ప్రమాణాలుంటేనే
స్కేల్ అప్ వీసా పథకం ద్వారా విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే సంస్థలకు అర్హత నిబంధనలు పేర్కొంది. అవి..
- స్పాన్సర్ లైసెన్స్ పొందే తేదీ నాటికి కనీసం మూడేళ్ల ముందు సదరు సంస్థను, లేదా వ్యాపారాన్ని ప్రారంభించి ఉండాలి.
- ప్రతి ఏటా సంస్థ ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ లేదా ఉపాధి కల్పనలో 20 శాతం వృద్ధి నమోదు చేసుకుని ఉండాలి.
- గడిచిన మూడేళ్ల వ్యవధిలో కనీసం పది మంది ఉద్యోగులతో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుండాలి.
- ఈ నిబంధనలు పాటించే సంస్థలన్నీ స్కేల్ అప్ వీసా ద్వారా.. విదేశీ నిపుణులను నియమించుకోవడానికి, స్పాన్సర్‌షిప్ లెటర్ ఇచ్చేందుకు అర్హత పొందుతాయి.
స్పాన్సర్‌షిప్ లెటర్
స్కేల్ అప్ వీసా ద్వారా విదేశీయులను నియమించుకునే సంస్థలు.. సదరు వ్యక్తులకు స్పాన్సర్‌షిప్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా సంస్థ సదరు వ్యక్తిని తాము నియమించుకుంటున్నట్లు తెలిపే లేఖ ఇది. దీని ఆధారంగానే ఉద్యోగం పొందిన వారికి యూకేలో పనిచేసేందుకు వీసా లభిస్తుంది.
తొలుత ఆరు నెలలు
కొత్త పథకం ద్వారా స్పాన్సర్‌షిప్ లెటర్‌తో దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ఆరు నెలల వ్యవధికి స్కేల్ అప్ వీసా మంజూరు చేస్తారు. దీనినే స్పాన్సర్‌షిప్ రూట్ అని కూడా పిలుస్తున్నారు. ఆరు నెలల వ్యవధి తర్వాత కూడా యూకేలోనే మరో ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంది. స్కేల్ అప్ వీసా కనీస వ్యవధి ఆరు నెలలు ముగిసిన తర్వాత మరో సంస్థ లేదా యజమాని ద్వారా స్పాన్సర్‌షిప్ లెటర్ పొంది.. దాని ఆధారంగా రెండేళ్ల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత మరో స్పాన్సరర్ లెటర్ ఆధారంగా మరో మూడేళ్లు యూకేలోనే ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే.. ఒకసారి స్కేల్ అప్ వీసా ద్వారా ఆరు నెలల ప్రాథమిక గడువుతో అడుగు పెట్టిన వారు.. గరిష్టంగా అయిదేళ్లపాటు పాటు యూకేలో పని చేసే అవకాశం ఉంటుంది. అయిదేళ్లు పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉద్యోగం పొందితే శాశ్వతంగా యూకేలోనే ఉద్యోగం చేసే వీలుంది. ఉద్యోగం మారిన ప్రతిసారి స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: Study Abroad Career Opportunities: విదేశీ విద్యకు స్కాలర్‌షిప్ చేయూత
కనీస వేతనం తప్పనిసరి
యూకే స్కేల్ అప్ వీసా పథకం ద్వారా ఉద్యోగంలో చేరాలంటే..కనీస వేతనం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఏడాదికి కనీసం 33వేల పౌండ్ల వేతనం లేదా గంటకు పది పౌండ్ల వేతనం ఇచ్చే ఉద్యోగాలకే స్కేల్ అప్ వీసా మంజూరు చేస్తారు.
విద్యార్హతలు
- స్కేల్ అప్ వీసా ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి విద్యార్హతలను కూడా నిర్దేశించారు. అవి..
- బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- సెక్యూర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్. అంటే.. నిర్దేశిత ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
సెక్యూర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్(సెల్ట్)
ఈ టెస్ట్ కోసం యూకే ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు సంస్థలు నిర్వహించే టెస్ట్‌లలో ఏదో ఒక టెస్ట్‌లో బి1 లెవల్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఐఈఎల్‌టీఎస్‌ఎస్‌ఈఎల్‌టీ కన్సార్షియం నిర్వహించే టెస్ట్ లేదా, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్, లేదా పీఎస్‌ఐ సర్వీసెస్(యూకే) నిర్వహించే స్కిల్స్ ఫర్ ఇంగ్లిష్ యూకేవీఐ లేదా లాంగ్వేజ్‌సెర్ట్ నిర్వహించే ఇంటర్నేషనల్ ఈఎస్‌ఓఎల్ సెల్ట్ పరీక్షల్లో ఏదో ఒక పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు ఉంది.
పాయింట్ల ఆధారంగా
- స్కేల్ అప్ వీసా మంజూరు విషయంలో పాయింట్ల విధానం ద్వారా నిర్ణయం తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. గరిష్టంగా 70 పాయింట్లు ఉంటాయి.
- స్పాన్సర్‌షిప్ అప్లికేషన్‌కు 50 పాయింట్లు; బి1 లెవల్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యానికి 10 పాయింట్లు, స్వీయ ఆర్థిక నిధులకు సంబంధించి 10 పాయింట్లు.. ఇలా మొత్తం 70 పాయింట్ల విధానాన్ని అమలు చేస్తారు.
డిపెండెంట్ వీసా కూడా
స్కేల్ అప్ వీసా స్కీమ్‌లో.. సదరు ఉద్యోగం పొందిన వ్యక్తులు డిపెండెంట్ వీసా ద్వారా తమ జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇందుకోసం సదరు వ్యక్తులు డిపెండెంట్ పార్ట్‌నర్ వీసా, డిపెండెంట్ చిల్డ్రన్ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరు వీసా అప్లికేషన్ దరఖాస్తు ఫీజుతోపాటు హెల్త్‌కేర్ సర్‌ఛార్జ్ మొత్తాలను చెల్లించాలి.
చదవండి: Study Abroad Career Opportunities: విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు ఇవే!!
మూడు నెలల ముందుగా
స్కేల్ అప్ వీసా విధానంలో..స్పాన్సర్‌షిప్ విధానంలో వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. సదరు సంస్థలో పని తేదీ ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందుగా యూకే ఇమిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అదే విధంగా డిపెండెంట్ల విషయంలో కనీసం ఏడాదికి సరిపడే రీతిలో ఆర్థిక నిధుల రుజువులను చూపించాల్సి ఉంటుంది.
అవసరమైన పత్రాలు
- స్కేల్ అప్ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు పలు డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.. అవి.. స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్ రిఫరెన్స్ నెంబర్; ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌ను ధ్రువపరిచే సర్టిఫికెట్; సిటిజన్‌షిప్ పాస్‌పోర్ట్; ఉద్యోగ హోదా పేరు, వార్షిక వేతనం; ఉద్యోగ వృత్తి కోడ్; యజమాని స్పాన్సర్ లైసెన్స్ నెంబర్; కనీసం 1,270 పౌండ్లకు సమానమైన మొత్తం ఉన్నట్లు రుజువు; విద్యార్హతల ధ్రువ పత్రాలు.
భారతీయులకు ప్రయోజనం
యూకే అమల్లోకి తెచ్చిన స్కేల్ అప్ వీసా పథకం ద్వారా భారతీయులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల యూకే హై కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం 2022 జూన్ నాటికి 1,02,981 మంది భారతీయులకు వర్క్ వీసా లభించింది. 2019తో పోల్చితే దాదాపు 80 శాతం వృద్ధి కనిపించింది. అదే విధంగా యూకే జారీ చేసిన వీసాల్లో అత్యధిక వీసాలతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. అంతేకాకుండా స్కిల్డ్ వర్కర్స్ వీసా విషయంలోనూ భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 46 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. భారత్‌లో ఉన్న నిపుణులు, ఉన్నత విద్యా వంతులే. దీంతో స్కేల్ అప్ వీసా విషయంలోనూ భారత్‌కు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యూకే.. స్కేల్ అప్ వీసా.. ముఖ్యాంశాలు
- ఈ విధానం ద్వారా యూకే లోని దాదాపు 35 వేల సంస్థల్లో ఉద్యోగావకాశాలు
- కనీస వేతనం ఏడాదికి 33 వేల పౌండ్లు లేదా గంటకు పది పౌండ్లు.
- ముందుగా ఆరు నెలలకు స్కేల్ అప్ వీసా మంజూరు. తర్వాత గరిష్టంగా అయిదేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం.
- భారతీయులకు ప్రయోజనంగా మారనున్న విధానం. ఇప్పటికే స్కిల్డ్ వర్కర్స్ వీసాలో ముందంజలో ఉంటున్న భారతీయులు.