Telangana Jobs: ఇలా భర్తీ.. అలా ఖాళీ!.. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన నియామకాలు ఇవే..
నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరా శకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారు తోంది. ఓవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురుచూసిన వారికి చేదు అనుభవం మిగులుతుంటే.. మరోవైపు వేలకొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి.
వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవడం.. నియామక పత్రాలు స్వీకరించడం.. చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకుని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తోంది. గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి కారణాలతో మిగిలిపోయినట్టు అంచనా. రాష్ట్రంలో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతుండటమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.
చదవండి: Career in Maths: మెరిసే కెరీర్‌కు మ్యాథ్స్.. మ్యాథమెటిక్స్ నైపుణ్యంతో అనేక కెరీర్ అవకాశాలు
భర్తీ 53 వేలు.. ఖాళీ అయినవి 10 వేలు!
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 53 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల పంపిణీ కొనసాగుతుండగా.. మిగతా కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ (టీజీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై కేటగిరీలలో 16,067 ఉద్యోగాలు భర్తీకాగా.. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా 11 వేల ఉద్యోగాలను, గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా 8,304 గురుకుల టీచర్ పోస్టులను, తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా 6,956 నర్సు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవిగాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 10,006 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది. మరో 441 ఉద్యోగాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు. మొత్తంగా వీటన్నింటిలో కలిపి సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ అయి, ఆ వెంటనే ఖాళీ అయ్యాయి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అటకెక్కిన అవరోహణ విధానం..
ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో ఒక క్రమపద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఖాళీలను నూరు శాతం భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది. అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టులను భర్తీ చేసి.. తర్వాత క్రమంగా దిగువ కేడర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి.
ఉదాహరణకు తొలుత గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేసి... తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, చివరగా గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను ప్రకటించగా.. నియామక ఉత్తర్వులు కూడా జారీ అవుతున్నాయి. త్వరలో గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాలు సాధించినవారు వాటిలో ఎంపికైతే, గ్రూప్–4 ఉద్యోగాన్ని వదులుకుంటారు. అంటే భర్తీ అయిన పోస్టు ఖాళీ అయినట్టే.
కానరాని సమన్వయం..
రాష్ట్రంలో నాలుగు రిక్రూట్‌మెంట్ బోర్డులున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. పోలీసు నియామకాలు, గురుకుల కొలువులు, మెడికల్ సర్వీసులకు వేర్వేరుగా బోర్డులు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖలకు సంబంధించిన పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది.
కొత్త బోర్డుల ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా.. ఎవరికివారే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది. వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అనుసరిస్తూ ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి. ఇందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం అవసరం. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ మొదలు, తుది ఫలితాల ప్రకటన వరకు ఒక్కసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగకపోవడం గమనార్హం.
నియామక పత్రాల జారీ ఇలా..
ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగ నియామక పత్రాల జారీ సాగింది. ప్రధానంగా ఎల్‌బీ స్టేడియం వేదికగా పంపిణీ ప్రక్రియ నిర్వహించారు. జనవరి 31న వైద్యారోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన 6,959 మందికి నియామక పత్రాలు ఇచ్చారు.
- ఫిబ్రవరి 7న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 441 కారుణ్య నియామకాలు చేపట్టారు.
- ఫిబ్రవరి 14న పోలీసు, ఫైర్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలో 13,444 కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు.
- ఫిబ్రవరి 15న గురుకులాల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీలు కేటగిరీలలో 1,997 మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.
- మార్చి 4న గురుకులాల్లో లెక్చరర్, టీచర్, మెడికల్ ఎంప్లాయీస్ కేటగిరీల్లో 5,192 మందికి నియామకపత్రాలు అందించారు.
- సెప్టెంబర్ 26న వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 687 మంది అపాయింట్ అయ్యారు.
- తర్వాత గురుకులాల్లోని లైబ్రేరియన్, పీఈటీ, ఇంజనీరింగ్ కేటగిరీలో ఏఈఈ, అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కేటగిరీలకు సంబంధించి 1,635 మందికి నియామకపత్రాలు అందించారు.
- దసరా సందర్భంగా అక్టోబర్ 9న 10,009 మంది టీచర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.
- ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా వేర్వేరు రోజుల్లో ఇప్పటివరకు 8,143 మందికి నియామక పత్రాల పంపిణీ జరిగింది.
అన్ని రకాల పోస్టుల్లో అదే ఖాళీలు..
- గురుకుల విద్యా సంస్థల్లో కూడా తొలుత పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) ఫలితాలను ప్రకటించి, నియామక ఉత్తర్వులు జారీ చేశాక.. అంతకంటే పెద్ద కేటగిరీలైన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టడంతో వేలాది ఖాళీలు ఏర్పడ్డాయి. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తంగా 8,304 ఉద్యోగాలు భర్తీ చేయగా... విధుల్లో చేరింది సుమారు 6 వేల మందే. ఇలా గురుకుల పోస్టుల్లోనే 20శాతానికిపైగా ఖాళీలు ఏర్పడ్డాయి.
- ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు మొదట భర్తీ చేసి, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ను భర్తీ చేస్తే నియామకాలు నూరుశాతం జరిగేవి. కానీ రెండు కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి, నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెయ్యికి పైబడి ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి.
- పోలీస్ శాఖలో జరిగిన నియామకాల్లోనూ రెండున్నర వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.
- ఇప్పుడు గ్రూప్–4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధుల్లో చేరేనాటికి మొత్తం 53వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు ఖాళీగా ఉండిపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన నియామకాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
11,536 |
తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ |
6,956 |
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ |
16,067 |
గురుకుల విద్యాసంస్థల నియామకాల సంస్థ |
8,304 |
డీఎస్సీ– పాఠశాల విద్యాశాఖ |
10,006 |
ఇతరాలు |
441 |
మొత్తం |
53,310 |
Tags
- Job Appointments
- Jobs
- Singareni Collieries Company Limited
- police
- TGPSC
- TGSLPRB
- Telangana Jobs
- Recruitment Agencies
- Group 4
- TMHSRB
- Recruitment Boards
- School Education Department
- TREIRB
- latest recruitment notification
- Jobs in Telangana
- Direct Recruitment
- Job vacancies in Telangana
- Job Vacancies In Telangana 2024
- Telangana Govt Jobs 2024
- Telangana jobs in Telugu
- Telangana jobs Notification
- ts govt jobs notification 2024
- Telangana News