Scholarships: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు..
విదేశాల్లో ఉన్నత విద్య.. ప్రతి విద్యార్థి స్వప్నం! కాని అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోని అత్యున్నత శ్రేణి యూనివర్సిటీల్లో అడుగుపెట్టాలంటే.. రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఫీజులు, ఇతరత్రా వ్యయాలకు వెచ్చించాలి! దాంతో ఎందరో ప్రతిభావంతులు తమకు వచ్చిన అవకాశాలను సైతం వదులుకుంటున్న పరిస్థితి! ఇలాంటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం ప్రవేశ పెట్టింది. ఈ స్కాలర్‌షిప్ పథకం ద్వారా అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఉచితంగా ఉన్నత విద్యను పూర్తిచేసుకోవచ్చు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫాల్ సెషన్ ప్రవేశాలు పొందే విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో ప్రయోజనాలు, లక్షిత వర్గాలు, కోర్సులు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం..
- అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్య
- టాప్-100 వర్సిటీల్లో చేరితే పూర్తి ట్యూషన్ ఫీజు చెల్లింపు
- 101-200 వర్సిటీల్లో చేరితే రూ.50 లక్షల వరకు చేయూత
- క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రామాణికంగా వర్సిటీల గుర్తింపు
- ప్రతి ఏటా స్ప్రింగ్, ఫాల్ సెషన్ ప్రవేశాలు పొందిన వారికి స్కాలర్‌షిప్
- ఫాల్ సెషన్‌కు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తుకు అవకాశం
'విదేశీ విద్య..అందులోనూ..ఎంఐటీ, కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అత్యున్నత శ్రేణి యూనివర్సిటీల్లో అడుగుపెట్టాలంటే లక్షలు వెచ్చించాల్సిందే.దీంతో ఎంత ప్రతిభ ఉన్నా.. అంతర్జాతీయంగా టాప్ యూనివర్సిటీల్లో చదువుకోవాలనే కల..కలగానే మిగిలిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలుస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని 202-223 నుంచి అమలు చేయనున్నారు.
చదవండి: IELTS Exam Guidance: విదేశీ విద్యకు.. ఐఈఎల్‌టీఎస్ ప్రాధాన్యత, బెస్ట్ స్కోర్‌కు మార్గాలు..
100 శాతం ట్యూషన్ ఫీజు చెల్లింపు
- జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా.. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్200 జాబితాలో నిలిచిన యూనివర్సిటీల్లో.. ఎంబీబీఎస్, పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తారు.
- క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారంటాప్-100 జాబితాలో ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే మొత్తం ట్యూషన్ ఫీజు(100శాతం)ను చెల్లిస్తారు.
- క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం101-200 జాబితాలోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే.. ట్యూషన్ ఫీజు మొత్తంలో యాభై శాతం లేదా రూ.50 లక్షలు(ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని)సాయంగా అందజేస్తారు.
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సమయానికి అందుబాటులో ఉన్న జాబితా ప్రకారంక్యూఎస్ వరల్డ్‌యూనివర్సిటీ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు.
పేద వర్గాలకు.. అండగా
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రధాన ఉద్దేశం.. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోర్సులు పూర్తి చేసుకునేలా.. అవసరమైన ఆర్థిక సాయం అందించడం.
అర్హత ప్రమాణాలు
- ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెంది ఉండాలి.
- కుటుంబ వార్షికాదాయం రూ.ఎనిమిది లక్షలు దాటకూడదు.
- దరఖాస్తు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 ఏళ్లలోపు వయసుండాలి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
విద్యార్హతలు
- పీజీ కోర్సులు అర్హత: ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/ప్యూర్ సైన్సెస్/అగ్రికల్చర్ సైన్సెస్/మెడిసిన్ అండ్ నర్సిగ్/సోషల్ సైన్సెస్/హ్యుమానిటీస్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- పీహెచ్‌డీకి అర్హత: ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/ప్యూర్ సైన్సెస్/అగ్రికల్చర్ సైన్సెస్/ మెడిసిన్ అండ్ నర్సిగ్/సోషల్ సైన్సెస్/హ్యుమానిటీస్ విభాగాల్లో పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంబీబీఎస్ కోర్సుకు అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నీట్‌లో ర్యాంకు సాధించాలి.
- టోఫెల్/ఐఈఎల్‌టీఎస్/జీఆర్‌ఈ/జీమ్యాట్ స్కోర్.
- చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్ట్, వీసా.
- క్యూఎస్ టాప్-200 జాబితాలోని యూనివర్సిటీల్లోనే ప్రవేశం ఖరారు చేసుకోవాలి.
- పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఎంపికైన తేదీ నుంచి ఆరు నెలలోపు సంబంధిత యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి.
చదవండి: Student Loans: 10 వేల డాలర్ల దాకా విద్యార్థి రుణాల మాఫీ
అనుమతించే కోర్సులివే
- జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం మార్గదర్శకాల ప్రకారం-ఉచిత విదేశీ విద్యకు అర్హమైన కోర్సులను పేర్కొన్నారు. అవి...
- ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ప్యూర్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, మెడిసిన్ అండ్ నర్సింగ్, సోషల్ సైన్సెస్, హుమానిటీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు.
- ఇవే విభాగాల్లో పీహెచ్‌డీ. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఎంబీబీఎస్ కోర్సు.
ఏటా రెండుసార్లు దరఖాస్తుల స్వీకరణ
విదేశాల్లోని యూనివర్సిటీలు.. ప్రతి విద్యా సంవత్సరంలో.. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఫాల్ సెషన్ పేరుతో; అదే విధంగా జనవరి నుంచి మే వరకు స్ప్రింగ్ సెషన్ పేరుతో ప్రవేశాలు కల్పిస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగనన్న విదేశీ విద్యా దీవెనకు అర్హులైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతి ఏటా రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అంటే.. విద్యార్థులు ఏ సెషన్‌లో ప్రవేశాలు ఖరారు చేసుకున్నా.. ఆర్థిక సాయం పొందొచ్చు. 2022-23 విద్యా సంవత్సరంలో.. ఫాల్ సెషన్ ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా స్ప్రింగ్ సెషన్ ప్రవేశాల విషయంలో.. జనవరి 1 నుంచి ఫిబ్రవరి చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ఇలా
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హులైన అభ్యర్థులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను https://jnanabhumi.ap.gov.in పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. సంబంధిత వివరాలు.. ముందుగా జిల్లా స్థాయిలో ఆయా సంక్షేమ శాఖకు చెందిన జిల్లా అధికారులకు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. వీటిని సదరు అధికారులు పరిశీలించి.. అన్ని డాక్యుమెంట్లు, ఇతర వివరాలు పథకం మార్గదర్శకాల మేరకు.. సరిగా ఉన్నాయని ధ్రువీకరిస్తే.. సంబంధిత సంక్షేమ శాఖలు/కార్పొరేషన్‌కు చెందిన రాష్ట్ర స్థాయి అధికారికి ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఆ తర్వాత వాటిని సదరు అధికారి.. ఈ పథకం కోసం ప్రత్యేకంగా నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీకి అందజేస్తారు.
చదవండి: Higher Education: అమెరికా యానం.. అత్యంత భారం!
రాష్ట్ర స్థాయి కమిటీ ముందు హాజరు
ఆయా సంక్షేమ శాఖలు/కార్పొరేషన్‌కు సంబంధించిన అధికారులు.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం రాష్ట్ర స్థాయి కమిటీకి దరఖాస్తులను పంపిన తర్వాత.. కమిటీ పేర్కొన్న తేదీన సదరు విద్యార్థులు కమిటీ ముందు హాజరుకావల్సి ఉంటుంది. సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌లు సభ్యులుగా, సంబంధిత సంక్షేమ శాఖ కమిషన్/డైరెక్టర్ మెంబర్‌కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియలో అర్హులైన విద్యార్థుల దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించి.. తుది ఎంపిక చేపడుతుంది.
నాలుగు విడతలుగా చెల్లింపు
- జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తారు.
- సదరు దేశంలో అడుగు పెట్టేందుకు ల్యాండింగ్ పర్మిట్ అందించిన తర్వాత మొదటి వాయిదాను చెల్లిస్తారు.
- రెండో వాయిదాను అభ్యర్థులు చదువుతున్న కోర్సు మొదటి సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు చూపాక.. మూడో వాయిదాను రెండో సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు అందించాక.. కోర్సు నాలుగో సెమిస్టర్/చివరి సెమిస్టర్ పూర్తి చేసుకుని.. వాటి మార్క్‌షీట్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాక.. చివరి విడత నిధులు అందిస్తారు.
- పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ విద్యార్థుల విషయంలో ప్రతి విడత నిధులను అంతకుముందు వార్షిక లేదా సెమిస్టర్ ఫలితాల ఆధారంగా విడుదల చేస్తారు.
- ఈ పథకంలో భాగంగా.. ప్రవేశం పొందిన దేశానికి వెళ్లేందుకు విమానయాన వ్యయం, వీసా ఫీజురీయింబర్స్‌మెంట్ కూడా లభిస్తుంది.
రాష్ట్ర కమిటీ నిరంతర పరిశీలన
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా.. రాష్ట్ర స్థాయి కమిటీ దరఖాస్తులను నిరంతర పరిశీలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల అర్హులైన విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్ అనుమతులు మంజూరవుతాయి. తద్వారా వారు ఎలాంటి ఆందోళన లేకుండా.. తమ విదేశీ విద్య స్వప్నాన్ని సాకారం చేసుకునే అవకాశం లభించనుంది.
ఫాల్ సెషన్ దరఖాస్తులు
- విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి..
- గ్రామ/వార్డ్ సచివాలయం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం.
- గ్రామ/వార్డ్ సచివాలయం మంజూరు చేసి.. జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా ధ్రువీకరించిన ఇన్‌కం సర్టిఫికెట్.
- వయో పరిమితిని నిర్ధారించేందుకు పదో తరగతి/పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
- ఆధార్ కార్డ్.
- మీ సేవ/రెవెన్యూ శాఖ జారీ చేసిన స్థానికత సర్టిఫికెట్.
- నిర్దేశిత విద్యార్హతల సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు.
- నీట్ స్కోర్ కార్డ్(ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి)
- టోఫెల్/ఐటీఎల్‌టీఎస్/జీఆర్‌ఈ/జీమ్యాట్ స్కోర్ షీట్.
- సంబంధిత విదేశీ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్.
- కుటుంబ సభ్యుల ఆదాయం పన్ను రిటర్న్ కాపీలు(అవసరమైన సందర్భాల్లో).
- కుటుంబంలో తాను, మరెవరూ ఇలాంటి పథకం ద్వారా లబ్ధి పొందట్లేదని తెలియజేస్తూ స్వీయ ధ్రువీకరణ.
- వీటితోపాటు పాస్‌పోర్ట్‌సైజ్ ఫోటోగ్రాఫ్, స్కాన్ చేసిన సంతకాన్ని కూడా ఆన్‌లైన్ దరఖాస్తులో అప్‌లోడ్ చేయాలి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jnanabhumi.ap.gov.in