Skip to main content

IELTS Exam Guidance: విదేశీ విద్యకు.. ఐఈఎల్‌టీఎస్‌ ప్రాధాన్యత, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు..

IELTS Exam Guidance

ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌.. ఐఈఎల్‌టీఎస్‌! ఇది విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థుల ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరిశీలించేందుకు అంతర్జాతీయంగా నిర్వహించే లాంగ్వేజ్‌ టెస్ట్‌! ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే.. జీమ్యాట్, జీఆర్‌ఈలతోపాటు.. లాంగ్వేజ్‌ టెస్ట్‌లోనూ స్కోర్‌ సాధించాలి. టోఫెల్, పియర్సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ వంటి లాంగ్వేజ్‌ టెస్ట్‌లు ఉన్నా.. ఐఈఎల్‌టీఎస్‌కు పోటీ పెరుగుతోంది! స్టడీ అబ్రాడ్‌కు సన్నద్ధతమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఐఈఎల్‌టీఎస్‌ ప్రాధాన్యత, పరీక్ష విధానం, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలపై ప్రత్యేక కథనం...

  • ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌తో విదేశీ వర్సిటీల్లో ప్రవేశం
  • నాలుగు విభాగాల్లో పరీక్ష నిర్వహణ

ఐఈఎల్‌టీఎస్‌.. తొలుత యూరప్‌ దేశాలకే పరిమితమని భావించేవారు. కానీ ఈ టెస్ట్‌ ప్రామాణికత, పరీక్ష విధానం తదితర కారణాల వల్ల ఇప్పుడు దాదాపు అన్ని దేశాలు ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ను ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పదకొండు వేలకుపైగా ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ప్రామాణికంగా భావిస్తున్నాయి. గతంలో టోఫెల్‌ స్కోర్‌తోనే దరఖాస్తులు స్వీకరించిన అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్స్‌ కూడా ఇప్పుడు ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూఎస్‌లోని 3,400కు పైగా విద్యాసంస్థలు ఐఈఎల్‌టీఎస్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఖరారు చేస్తున్నాయి.

చ‌ద‌వండి: Study Abroad Career Opportunities: విదేశీ విద్యకు స్కాలర్‌షిప్‌ చేయూత

నాలుగు విభాగాల్లో పరీక్ష

ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష.. మొత్తం నాలుగు విభాగాల్లో అభ్యర్థుల ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పరిశీలించేలా నిర్వహిస్తున్నారు. అవి..లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్‌. విభాగాల వారీగా పరీక్ష విధానం, మార్కింగ్‌ వివరాలు..

లిజనింగ్‌

  • 30 నిమిషాల వ్యవధిలో జరిగే లిజనింగ్‌ టెస్ట్‌ ప్రధాన ఉద్దేశం..సదరు విద్యార్థి అన్ని దేశాల 'యాస'లను అర్థం చేసుకోగలడా.. లేదా అనేది పరిశీలించడం. అభ్యర్థులకు ఆయా అంశాలకు సంబంధించిన నాలుగు సంభాషణల ఆడియో రికార్డ్‌లను వినిపిస్తారు. వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అవి.. రికార్డింగ్‌1: నిజ జీవిత సంఘటనలపై ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. రికార్డింగ్‌2: నిజ జీవిత సంఘటనలపై ప్రసంగం. రికార్డింగ్‌3: విద్య లేదా శిక్షణకు సంబంధించి గరిష్టంగా నలుగురు వ్యక్తుల మధ్య సంభాషణ. రికార్డింగ్‌4: ఒక అకడమిక్‌ సబ్జెక్ట్‌పై యూనివర్సిటీ లెక్చర్‌.
  • మొత్తం 30 నిమిషాల వ్యవధిలో ఇవి ఉంటాయి. వీటి నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, మ్యాచింగ్‌ టైప్‌ ప్రశ్నలు, ప్లాన్‌/మ్యాప్‌/ డయాగ్రమ్‌ లేబిలింగ్‌ తదితర రూపాల్లో ప్రశ్నలు అడుగుతారు.
  • ఇలా.. గరిష్టంగా 40 మార్కులకు నిర్వహించే లిజనింగ్‌ టెస్ట్‌ను 9 బ్యాండ్‌ స్కేల్‌లోకి క్రోడీకరించి.. అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా బ్యాండ్స్‌ కేటాయిస్తారు.

రీడింగ్‌

నిర్ణీత అంశానికి సంబంధించి చదివిన విషయాన్ని విద్యార్థి ఏ స్థాయిలో అర్ధం చేసుకోగలడో తెలుసుకునేందుకు ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 60 నిమిషాల వ్యవధిలో రీడింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ సమయంలో మూడు ప్యాసేజ్‌లను చదివి.. దాదాపు 40 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

రైటింగ్‌

  • విద్యార్థికున్న ఇంగ్లిష్‌ రాత నైపుణ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో రెండు టాస్క్‌లు ఇచ్చి.. వాటికి అభ్యర్థుల నుంచి సమాధానాలు అడుగుతారు. 
  • టాస్క్‌1లో గ్రాఫ్‌ లేదా టేబుల్‌ లేదా డయాగ్రమ్‌ ఇచ్చి దానిపై విశ్లేషణ రాయమంటారు. 
  • టాస్క్‌2లో ఒక అంశం లేదా సమస్య లేదా చర్చకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను చదివి విద్యార్థి తనదైన విశ్లేషణ చేయాలి. ఐఈఎల్‌టీఎస్‌ టాస్క్‌1లో 150 పదాలు, టాస్క్‌2లో 250 పదాలతో సమాధానం రాస్తేనే ఉపయుక్తంగా ఉంటుంది.

స్పీకింగ్‌

అభ్యర్థుల్లోని స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరిశీలించే ఉద్దేశంతో స్పీకింగ్‌ విభాగంలో పరీక్ష నిర్వస్తారు. మూడు పార్ట్‌లుగా స్పీకింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. 

  • పార్ట్‌1: ఈ విభాగంలో అభ్యర్థులకు సంబంధించి సాధారణ విషయాల(ఉదా: కుటుంబ నేపథ్యం, చదువు, ఉద్యోగం, ఆసక్తులు తదితర అంశాలు)పై ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగం నాలుగు నుంచి అయిదు నిమిషాల వ్యవధిలో ఉంటుంది.
  • పార్ట్‌2: నిర్దిష్టంగా ఒక అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగా సదరు అంశంపై అవగాహనకు ఒక నిమిషం సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత గరిష్టంగా రెండు నిమిషాల వ్యవధిలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌3: పార్ట్‌2కు కొనసాగింపుగా పార్ట్‌3ని నిర్వహిస్తారు. పార్ట్‌2లో చర్చించిన అంశంపై మరింత కూలంకషంగా చర్చించడం, ఐడియాలు, సమస్యల గురించి చర్చించాల్సి ఉంటుంది. ఈ పార్ట్‌ నాలుగు నుంచి అయిదు నిమిషాల వ్యవధిలో ముగుస్తుంది.
  • మొత్తంగా 11 నుంచి 14 నిమిషాల వ్యవధిలో స్పీకింగ్‌ విభాగంలో పరీక్షను నిర్వహిస్తారు.

9 బ్యాండ్‌ స్కేల్‌

  • అన్ని విభాగాల్లోనూ అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా 9 బ్యాండ్‌ స్కేల్‌ విధానంలో స్కోర్‌ను నిర్ధారిస్తారు. 9 బ్యాండ్స్‌ పొందితే ఎక్స్‌పర్ట్‌ యూజర్‌గా, 8 బ్యాండ్స్‌ పొందితే వెరీగుడ్‌ యూజర్‌గా, 7బ్యాండ్స్‌ పొందితే గుడ్‌ యూజర్‌గా, 6 బ్యాండ్స్‌ పొందితే కాంపిటెంట్‌ యూజర్‌గా, 5 బ్యాండ్స్‌ పొందితే మోడెస్ట్‌ యూజర్, 4 బ్యాండ్స్‌ పొందితే లిమిటెడ్‌ యూజర్, 3 బ్యాండ్స్‌ పొందితే ఎక్స్‌ట్రీమ్లీ లిమిటెడ్‌ యూజర్, 2 బ్యాండ్స్‌ పొందితే ఇంటర్మిటెంట్‌ యూజర్, 1 బ్యాండ్‌ పొందితే నాన్‌యూజర్‌గా పేర్కొంటారు.
  • కాబట్టి విద్యార్థులు కనీసం ఆరు బ్యాండ్స్‌ పొందేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు మాత్రమే ఆయా యూనివర్సిటీలు వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటాయని అంటున్నారు.

చ‌ద‌వండి: Medical Students: విదేశీ వైద్య విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌

సన్నద్ధత ఇలా

  • ఐఈఎల్‌టీఎస్‌లో బెస్ట్‌ స్కోర్‌కు అభ్యర్థులు విభిన్న వ్యూహంతో ప్రిపరేషన్‌ సాగించాలి. అకడమిక్‌ పరీక్షల మాదిరిగా పరీక్ష కోణంలో కాకుండా.. నైపుణ్యాలు పెంచుకునేలా చదవాలి.గ్రామర్‌ బుక్స్‌ కంటే.. వొక్యాబులరీని పెంచే పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది. రీడింగ్‌లో పరిజ్ఞానం పెంచుకోవడానికి నవలలు, ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు క్రమం తప్పకుండా చదవాలి. ఇంగ్లిష్‌ లిటరేచర్‌కు సంబంధించినవే కాకుండా.. బిజినెస్, సైన్స్, ఆర్ట్స్‌ సంబంధిత వ్యాసాలు చదవడం, వినడం ద్వారా విభిన్న పదజాలంపై అవగాహన లభిస్తుంది. ఇది పరీక్ష సమయంలో ముఖ్యంగా లిజనింగ్, రీడింగ్‌ విషయంలో ఎంతో లాభిస్తుంది. 
  • రైటింగ్‌ నాలెడ్జ్‌ పెంచుకోవడానికి 'యాక్టివ్‌ వాయిస్, ప్యాసివ్‌ వాయిస్‌', 'సబ్జెక్ట్‌ అండ్‌ వెర్బ్‌ అగ్రిమెంట్‌', 'కాంప్లెక్స్‌ సెంటెన్స్‌ ఫార్మేషన్‌'పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. ప్రాక్టీస్‌ సమయంలో స్పీడ్‌ రీడింగ్‌ అలవర్చుకోవాలి. ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి అర్థం వెతకడానికి ప్రయత్నించే బదులు.. కాన్సెప్ట్‌ ఆధారంగా త్వరగా అర్థం చేసుకోవాలి. ఇది స్పీడ్‌ రీడింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. 
  • లిజనింగ్‌లో నైపుణ్యం కోసం ఇంగ్లిష్‌ సినిమాలు, ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానెల్స్‌ వీక్షించాలి. 
  • స్పీకింగ్‌ స్కిల్‌ పెంచుకోవడానికి ఇంగ్లిష్‌ పత్రికలు, పుస్తకాల్లోని అంశాలను, ప్యాసేజీలను చదవడంతోపాటు మాట్లాడటం ప్రాక్టీస్‌ చేయాలి.

స్కోర్‌కు రెండేళ్ల గుర్తింపు

  • ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌కు రెండేళ్లపాటు గుర్తింపు ఉంటుంది. అంటే.. సదరు స్కోర్‌ కార్డ్‌ ఆధారంగా రెండేళ్లపాటు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షకు ఏడాదిలో ఎప్పుడైనా, ఎన్ని సార్లయినా హాజరయ్యే అవకాశం ఉంటుంది. 
  • పరీక్షకు కనీసం వారం ముందు టెస్ట్‌ డేట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇందుకోసం ఐఈఎల్‌టీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న స్లాట్స్‌ను చూసుకుని దానికి అనుగుణంగా.. దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. 
  • టెస్ట్‌ పూర్తయిన తర్వాత 13 రోజులకు ఫలితాలు విడుదల చేస్తారు. ఆ ఫలితాల్లో సరైన స్కోర్‌ రాలేదని భావిస్తే.. మరో స్లాట్‌లో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. 
  • అభ్యర్థులు గరిష్టంగా రెండు స్లాట్లలోనే మెరుగైన స్కోర్‌ సాధించేలా ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడు, నాలుగు స్లాట్లకు హాజరైతే అది యూనివర్సిటీ ప్రవేశాల సమయంలో కొంత ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.

ఐఈఎల్‌టీఎస్‌ముఖ్య సమాచారం

  • అంతర్జాతీయంగా 11 వేలకు పైగా యూనివర్సిటీలకు, ఇన్‌స్టిట్యూట్స్‌కు ప్రామాణికంగా నిలుస్తున్న ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌.
  • అమెరికాలోనూ టోఫెల్‌తోపాటు ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తున్న పలు యూనివర్సిటీలు. 
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ పరీక్ష నిర్వహణ.
  • 9 బ్యాండ్‌ స్కేల్‌ విధానంలో స్కోరింగ్‌.
  • కనీసం 6 బ్యాండ్స్‌ సాధిస్తే మెరుగైన ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం లభించే అవకాశం.
  • ఐఈఎల్‌టీఎస్‌ ముఖ్యమైన వెబ్‌సైట్స్‌: https://ielts.org, https://www.britishcouncil.in/exam/ielts, https://www.ieltsidpindia.com

చ‌ద‌వండి: Student Loans: 10 వేల డాలర్ల దాకా విద్యార్థి రుణాల మాఫీ

Published date : 30 Aug 2022 04:20PM

Photo Stories