Skip to main content

Study Abroad Career Opportunities: విదేశీ విద్యకు స్కాలర్‌షిప్‌ చేయూత

study abroad career opportunities and scholarships
study abroad career opportunities and scholarships

విదేశాల్లో ఉన్నత విద్యతో కెరీర్‌ అవకాశాలు విస్తరించుకోవాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటున్నారు. అందుకే ట్రెడిషనల్‌ నుంచి టెక్నికల్‌ వరకు.. డిగ్రీ ఏదైనా.. తమకు సరితూగే ఉన్నత విద్య కోర్సు కోసం విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ.. ఫీజుల భారం, ఇతర వ్యయాలు చూసి ఆందోళన చెందుతున్నారు! ఇలాంటి వారికి చేయూతనిస్తున్నాయి.. స్కాలర్‌షిప్స్‌! అకడమిక్‌గా అద్భుత ప్రతిభతోపాటు పేరున్న యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకుంటే.. ఫెలోషిప్‌లు/స్కాలర్‌షిప్‌ల చేయూత లభిస్తోంది. తాజాగా.. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలు కూటమిగా ఉన్న క్వాడ్‌.. ‘క్వాడ్‌ ఫెలోషిప్స్‌’ అనే కొత్త పథకాన్ని  ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. ఈ క్వాడ్‌ ఫెలోషిప్‌తోపాటు.. విదేశీ విద్యకు సంబం«ధించి విద్యార్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్కాలర్‌షిప్‌ల వివరాలపై విశ్లేషణ...

  • తాజాగా క్వాడ్‌ ఫెలోషిప్‌ ప్రారంభం
  • అందుబాటులో మరెన్నో స్కాలర్‌షిప్స్‌
  • వ్యయ భారం తగ్గించుకునేందుకు మార్గం
  • ముందస్తు అవగాహనతో అందుకునే అవకాశం

Study Abroad‌ Career Opportunities: విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలు ఇవే!!

క్వాడ్‌ ఫెలోషిప్‌ ఫర్‌ స్టెమ్‌ కోర్సెస్‌

క్వాడ్‌.. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలు కలిసి భద్రత వ్యవహారాలకు సంబంధించి పరస్పర సహకారం అందించుకునేందుకు ఏర్పాటైన కూటమి. ఇటీవల సమావేశమైన ఈ క్వాడ్‌ దేశాధినేతలు ‘క్వాడ్‌ ఫెలోషిప్‌’ పేరుతో కొత్త పథకానికి ఆమోదం తెలిపారు. 

  • అమెరికాలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌(స్టెమ్‌) విభాగాల్లో పీజీ కోర్సుల్లో చేరిన క్వాడ్‌ కూటమి దేశాలకు చెందిన వంద మంది విద్యార్థులకు ఈ ఫెలోషిప్‌ను అందిస్తారు.
  • ఈ నాలుగు దేశాలకు సంబంధించి ఒక్కో దేశం నుంచి 25 మందిని క్వాడ్‌ ఫెలోషిప్‌నకు ఎంపిక చేస్తారు.
  • ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి రూ.50వేల డాలర్ల ఏక మొత్త ఆర్థిక సహాయం అందిస్తారు.
  • అదే విధంగా నీడ్‌ బేస్డ్‌ విధానంలో.. కోర్సులు పూర్తి చేసుకునేందుకు అయ్యే వ్యయంలో మరో 25 వేల డాలర్లు అందజేస్తారు. దీనికోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Study Abroad‌: ఎంక్యాట్‌తో.. విదేశీ వైద్య పీజీ

అర్హతలు

  • ఆగస్ట్‌ 2023(వచ్చే సంవత్సరం) నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకుని, అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్స్‌లో స్టెమ్‌ కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి.
  • ఒకవేళ ఇప్పటికే అభ్యర్థులు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ లేదా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుని ఉంటే కూడా అర్హులే.

నిర్దేశిత ప్రోగ్రామ్‌లివే

  • స్టెమ్‌ ప్రోగ్రామ్‌లతోపాటు బిహేవియరల్‌ సైన్సెస్, బయలాజికల్‌ సైన్సెస్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, ఇంజనీరింగ్, జియో సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్‌ సైన్సెస్, హెల్త్‌ సైన్సెస్‌లో చేరిన విద్యార్థులు అర్హులు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జూన్‌ 30,2022లోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.quadfellowship.org

ఫుల్‌బ్రైట్‌ మాస్టర్స్‌ ఫెలోషిప్స్‌

అమెరికాలో మాస్టర్స్‌ కోర్సులో చేరాలనుకునే ప్రతిభావంతులకు ఫుల్‌బ్రైట్‌ ఫెలోషిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ స్టడీస్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ లీగల్‌ స్టడీస్,జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్,పబ్లిక్‌ హెల్త్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ఉమెన్స్‌ స్టడీస్‌/జండర్‌ స్టడీస్‌ తదితర విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి కోర్సుల్లో చేరిన వారు ఈ ఫెలోషిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి కోర్సు వ్యవధిలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేందుకు విమాన ఛార్జీలు,నివాస ఖర్చులు, ట్యూషన్‌ ఫీజు ఫండింగ్‌ వంటివి లభిస్తాయి. 

  • వివరాలకు వెబ్‌సైట్‌: www.usief.org.in/FullbrightNehruFellowships.aspx

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ ఎస్సీ క్యాండిడేట్స్‌

ఎస్సీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేలా చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం.. నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌. ఎస్సీ/ఎస్టీ, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, డినోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార జాతులు, సంపద్రాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుచేసుకోవచ్చు. ప్రతి ఏటా 125 స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. మొత్తం 125 స్కాలర్‌షిప్‌ల్లో ఎస్సీలకు–115, సంచార, పాక్షిక సంచార జాతుల వారికి–06, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు–04 స్కాలర్‌షిప్స్‌ను కేటాయిస్తారు. 

  • అర్హతలు: డిగ్రీ లేదా పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. విదేశాల్లో పీజీ లేదా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుని ఉండాలి.
  • మాస్టర్స్‌లో చేరితే మూడేళ్ల పాటు, పీహెచ్‌డీ చేసే వారికి నాలుగేళ్ల కాలానికి స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేస్తారు. 
  • ట్యూషన్‌ ఫీజు, మెయింటనెన్స్‌ అలవెన్స్, అత్యవసర ఖర్చులు, వీసా ఫీజు, ఎక్విప్‌మెంట్‌ అలవెన్స్, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ కింద ఆర్థిక సహకారం అందిస్తారు.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://nosmsje.gov.in/

Study Abroad: ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు, పరిష్కార మార్గాలు..

టోఫెల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

అభ్యర్థులు అడుగుపెట్టాలనుకున్న దేశంతో సంబంధం లేకుండా.. అందుబాటులో ఉన్న మరో స్కాలర్‌షిప్‌.. టోఫెల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌. ప్రముఖ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సంస్థ ఈటీఎస్‌ అందిస్తున్న స్కాలర్‌షిప్‌ ఇది. అకడమిక్‌గా 80 శాతంపైగా మార్కులతో ఉత్తీర్ణత, టోఫెల్‌లో సదరు యూనివర్సిటీ పేర్కొన్న స్కోర్‌ సాధించిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు ఏడు వేల డాలర్ల స్టయిఫండ్‌ లభిస్తుంది.

  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ets.org/toefl/grants

ఏడీబీ జపాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

మన దేశ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రముఖ స్కాలర్‌షిప్‌ పథకం.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌–జపాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌. ఇది ఆసియా–పసిఫిక్‌ ప్రాంత యూనివర్సిటీల్లో మాస్టర్‌ స్థాయి కోర్సుల అభ్యర్థుల కోసం ఉద్దేశించింది. ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి పూర్తిస్థాయి ట్యూషన్‌ ఫీజు, హౌసింగ్‌ అలవెన్స్, బుక్స్‌ అలవెన్స్, ట్రావెల్‌ ఎక్స్‌పెన్సెస్‌ లభిస్తాయి. అభ్యర్థులు తాము ప్రవేశం ఖరారు చేసుకున్న యూనివర్సిటీలో అడ్మిషన్‌ తేదీ ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.adb.org/workwithus/careers/japanscholarshipprogram/institutions

ఛార్లెస్‌ వాలెస్‌ ఇండియా ట్రస్ట్‌ స్కాలర్‌షిప్స్‌

యూకేలో పీజీ, ఆపై స్థాయి కోర్సుల అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ ఇది. విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు మేరకు ఏడాదికి గరిష్టంగా 1400 పౌండ్ల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.britishcouncil.in/studyuk/scholarships/charleswallaceindiatrustscholarships

యూఎస్‌లో యూజీ.. ఈ కోర్సులకు అధిక ప్రాధాన్యం

డీఏఏడీ స్కాలర్‌షిప్స్‌

రీసెర్చ్‌కు కేరాఫ్‌గా నిలిచే జర్మనీలో ఇంజనీరింగ్, సైన్స్‌ రంగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్, పోస్ట్‌ డాక్టోరల్‌ స్టడీస్‌ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ పథకం ఇది. దీన్ని జర్మన్‌ అకడమిక్‌ ఎక్సే్ఛంజ్‌ ప్రోగ్రామ్‌ మేరకు అందిస్తారు. ఎంపికైన వారికి ట్యూషన్‌ ఫీజు, నివాస ఖర్చుల మెుత్తానికి స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.

  • వివరాలకు వెబ్‌సైట్‌: www.daad.in/en

ఎరాస్‌మస్‌ ముండస్‌

యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ చేయాలనుకున్న వారికి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌..ఎరాస్‌మస్‌ముండస్‌. ఎంపికైన వారికి ట్యూషన్‌ ఫీజు, నివాస వసతి, మెడికల్‌ అలవెన్స్, ఇన్సూరెన్స్‌ తదితర ఖర్చుల మెుత్తానికి సరిపడే విధంగా ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. 

  • వివరాలకు వెబ్‌సైట్‌: eacea.europa.eu/erasmus_mundus/funding/

బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఐఈఎల్‌టీఎస్‌ అవార్డ్స్‌

  • ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ అందిస్తున్న స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఇది. ఐఈఎల్‌టీఎస్‌ జాయింట్‌ ఫండెడ్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్స్‌ను.. బ్రిటిష్‌ కౌన్సిల్, ఐడీపీ, ఐఈఎల్‌టీఎస్‌ ఆస్ట్రేలియా సహకారం అందిస్తాయి. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారికి ట్యూషన్‌ ఫీజు కోసం రూ.మూడు లక్షల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ielts.org/forresearchers/grantsandawards

కామన్వెల్త్‌ స్కాలర్‌షిప్స్‌–యూకే

భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ పథకం ఇది. కామన్వెల్త్‌ సభ్య దేశాల జాబితాలోని ఏ దేశంలోనైనా చదవాలనుకునే వారు ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుకు అర్హులు. మాస్టర్స్‌ స్థాయిలో ఒక ఏడాది, పీహెచ్‌డీ స్థాయిలో మూడేళ్లు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు, నివాస వ్యయాలకు సరిపడ మొత్తంలో ఆర్థిక తోడ్పాటు అందుతుంది.

  • వివరాలకు వెబ్‌సైట్‌: mhrd.gov.in/scholarships

ఎ–స్టార్‌ యూత్‌ స్కాలర్‌షిప్‌

సింగపూర్‌లో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన భారత విద్యార్థుల కోసం సింగపూర్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్న స్కాలర్‌షిప్‌ పథకం.. ఎ–స్టార్‌ యూత్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ ఇండియా. 

  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.astar.edu.sg/Scholarships/forgraduatestudies

స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌.. సర్టిఫికెట్లు

  • అకడమిక్‌ అర్హతల సర్టిఫికెట్లు
  • అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్‌
  • అధికారిక టెస్ట్‌ల(టోఫెల్, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్, జీమ్యాట్, శాట్‌ తదితర) స్కోర్లు
  • అడ్మిషన్‌ పొందిన యూనివర్సిటీ నుంచి రిఫరెన్స్‌ లెటర్‌
  • స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌
  • యూనివర్సిటీలు అందించే స్కాలర్‌షిప్‌లకైతే ప్రతి సెమిస్టర్‌లో నిర్దిష్ట జీపీఏ లేదా పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత తప్పనిసరి.
Published date : 20 Jun 2022 06:35PM

Photo Stories