Indian Origin Student Arrested: యూఎస్ యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ సంతతి విద్యార్థిపై వేటు, కారణమిదే..
ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని అచింత్య శివలింగన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు క్యాంపస్ ఆవరణలో విద్యార్థుల నేతృత్వంలోని పాలస్తీనా అనుకూల శిబిరం నిరసనలో పాల్గొన్నందుకుగాను ఆమెను యూనివర్శిటీనుంచి నిషేధించారు. అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.
అరెస్ట్‌కు కారణమిదే..
గురువారం తెల్లవారుజామున యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనల మధ్య శివలింగన్‌తోపాటు, మరో విద్యార్థి హసన్ సయ్యద్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిరసనను నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పదే పదే హెచ్చరించినా చెప్పినా వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసినట్టు పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ యూనివర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ తెలిపారు.
కాగా తమిళనాడులోని కోయం బత్తూరుకు చెందిన శివలింగన్ ప్రిన్స్‌టన్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్ విద్యార్థి కాగా, సయ్యద్ పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య కారణంగా గాజా మరణాలకు వ్యతిరేకంగా వేలాదిమంది విద్యార్థులు నిరసనలకు దిగారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీలో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా అనేక యూనివర్శిటీలకు పాకాయి.
యేల్ సహా అనేక ఇతర విద్యా సంస్థలలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. అయితే ప్రతి ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ, బాధ్యత, ప్రజా భద్రత, సమతుల్యత ఉండాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.