Education Loan: స్టడీ అబ్రాడ్‌కు రూ.20 లక్షలు... దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- ఎడ్యుకేషన్ లోన్‌కు ఉమ్మడి వేదిక విద్యాలక్ష్మి పోర్టల్
- దరఖాస్తు నుంచి మంజూరు వరకు అంతా ఆన్‌లైన్‌లోనే
- నిర్దేశిత ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి
యువతలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందేందుకు ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కానీ.. బ్యాంకింగ్ సంస్థలు అనుసరించే నిబంధనల కారణంగా దరఖాస్తుకు సుదీర్ఘ సమయం వెచ్చించాలనే అభిప్రాయం నెలకొంది. ఇప్పుడు వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేసి.. వన్ స్టాప్ సొల్యూషన్‌గా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యా రుణాలకు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్రం ఆధ్వర్యంలో విద్యాలక్ష్మి
విద్యా రుణాలకు దరఖాస్తు, మంజూరులో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్ అయి.. కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఇలా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను.. అభ్యర్థులు ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి సంతృప్తి చెందితే.. తదుపరి దశలో ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు తెలియజేస్తారు.
చదవండి: Education Loans: రూ. 15లక్షల వరకు రుణం.. ఈ నిబంధనలు పాటిస్తే
దరఖాస్తు ప్రక్రియ ఇలా
- ముందుగా విద్యాలక్ష్మి పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి.
- ఈ దరఖాస్తును పూర్తి చేసుకునే సమయంలో అభ్యర్థులు గరిష్టంగా మూడు బ్యాంకులను ఎంచుకోవచ్చు.
- తర్వాత సదరు బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు వివరాలను పరిశీలిస్తాయి.
- నిబంధనలకు అనుగుణంగా రుణ మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి.
- రుణ మంజూరు విషయాన్ని విద్యాలక్ష్మి పోర్టల్‌లోనే పొందుపరుస్తారు.
- అలా రుణం పొందిన వారు మంజూరు చేసిన బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.
ఉన్నత విద్య కోర్సులు
విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా దాదాపు అన్ని రకాల ఉన్నత విద్య కోర్సుల విద్యార్థులకు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సంప్రదాయ డిగ్రీలు మొదలు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల వరకూ.. ఇలా పలు రకాల కోర్సుల్లో చేరే విద్యార్థులు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు తప్పనిసరి
బ్యాంకులు విద్యా రుణం మంజూరలో నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. బ్యాంకుల విధి విధానాల ప్రకారం-ఏఐసీటీఈ, యూజీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటారు. సదరు గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యా రుణం లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కోర్సులో ప్రవేశం ఖరారు చేసుకున్న తీరును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఎంట్రెన్స్‌లో ప్రతిభ
ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారికే బ్యాంకులు విద్యారుణ దరఖాస్తుకు అర్హత కల్పిస్తున్నాయి. సాధారణంగా మేనేజ్‌మెంట్ కోటాలో చేరాలనుకునే వారికి ఈ రుణ దరఖాస్తుకు అర్హత ఉండదు. పలు ప్రైవేట్ బ్యాంకులు మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశం పొందిన వారికి కూడా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. కాని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఎంట్రన్స్‌లో మెరిట్ సాధించి ప్రవేశం పొందిన వారికే విద్యా రుణ మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నాయి.
చదవండి: Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం
స్టడీ అబ్రాడ్‌కు రూ.20 లక్షలు
విద్యా రుణాలు స్వదేశంలో కోర్సులో చేరిన వారితోపాటు విదేశీ విద్య అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉన్నాయి. మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌ల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షల వరకూ రుణం మంజూరు చేస్తున్నారు. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖాయం చేసుకున్న వారికి గరిష్టంగా రూ.20 లక్షల వరకూ లోన్ లభిస్తోంది.
మూడు శ్లాబ్‌ల్లో రుణాలు
- రుణ మంజూరులో బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానాన్ని అమలు చేస్తున్నాయి.
- శ్లాబ్-1 మేరకు రూ.4 లక్షలు రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.
- శ్లాబ్-2 ప్రకారం-రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
- శ్లాబ్-3లో రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం ఉంటోంది. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను)ఇవ్వాల్సి ఉంటుంది.
మార్జిన్ మనీ నిబంధన
విద్యార్థులు రుణ మొత్తంలో కొంత మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రూ.4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కాని రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో చదివే విద్యార్థులు అయిదు శాతం, స్టడీ అబ్రాడ్ విద్యార్థులు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాలి.
రుణం లభించే వ్యయాలు
ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్/లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు; విదేశీ విద్య అభ్యర్థులు ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం, కంప్యూటర్ కొనుగోలు వ్యయం, కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే ఖర్చులు, ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్‌లకు రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి. కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది.
ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్
ఐబీఏ మార్గనిర్దేశకాల ప్రకారం-గరిష్ట రుణమొత్తం విషయంలో నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ.. విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే ఆ గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికారాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐఎంలు, ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో రూ.పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితిలో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.
అకడమిక్ ప్రతిభపై సమీక్ష
విద్యా రుణం మంజూరైన విద్యార్థికి సంబంధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లిస్తే సంబంధిత రశీదుల ఆధారంగా ఆ ఫీజును విద్యార్థికి అందిస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్‌స్టిట్యూట్‌కే అందజేస్తాయి. అదే విధంగా రుణ మొత్తాన్ని ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభలో నిర్దేశిత గడువులోగా ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తాయి. ఆ క్రమంలో అంతకుముందు సంవత్సరంలో సదరు విద్యార్థి అకడెమిక్ ప్రతిభను సమీక్షిస్తున్నాయి. దీని ఆధారంగా మిగతా రుణం మంజూరుపై నిర్ణయం తీసుకుంటున్నాయి.
ఈ పత్రాలు తప్పనిసరి
విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో కొన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి..ప్రవేశ ధ్రువీకరణ పత్రం, అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ కాపీలు, కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం, కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.vidyalakshmi.co.in/Students/index