Skip to main content

Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!

మానవ దైనందిన జీవితం అంతా డిజిటల్‌మయమైంది. వ్యక్తుల నుంచి టాప్‌ కంపెనీలు, ప్రభుత్వ కార్యకలాపాల వరకూ..అన్నీ ఆన్‌లైన్‌లోనే! ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులతోపాటు కంపెనీలకు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉంది. కరోనా కాలంలో.. హ్యాకింగ్, ఫిషింగ్‌తో డబ్బుతోపాటు ఎంతో విలువైన సమాచారం క్షణాల్లో తస్కరిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి సైబర్‌ ముప్పును ఎదుర్కొనే మార్గమే.. సైబర్‌ సెక్యూరిటీ!! దాంతో ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌లో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది. సైబర్‌ సెక్యూరిటీలో నైపుణ్యాలు కలిగిన యువతకు.. సంస్థలు ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సైబర్‌ సెక్యూరిటీ ప్రయోజనాలు, జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్, నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం...
Cyber Security
Cyber Security

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరికరాలను వినియోగించి ఆన్‌లైన్‌ కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించడాన్ని సైబర్‌ సెక్యూరిటీగా పేర్కొనొచ్చు. కంప్యూటర్లు, నెట్‌వర్క్‌ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్, విలువైన డేటా.. హ్యాకింగ్‌కు గురికాకుండా.. సైబర్‌ సెక్యూరిటీ రక్షణగా నిలుస్తుంది. దీంతో ఆన్‌లైన్‌ విధానంలో కార్యకలాపాలు నిర్వహించే ప్రయివేటు సంస్థల నుంచి బహుళ జాతి కంపెనీలు, ప్రభుత్వ శాఖల్లో సైతం సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. 

అన్ని రంగాల్లోనూ
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ సెక్యూరిటీ అనేది ఐటీ నుంచి సర్వీస్‌ సెక్టార్‌ వరకూ.. అన్ని రంగాల్లోనూ తప్పనిసరిగా మారింది. ఐటీ క్లౌడ్‌ సర్వీసెస్, ఈ–కామర్స్, రిటైల్‌ సెక్టార్,హెల్త్‌కేర్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, బీఎఫ్‌ఎస్‌ఐలలో దీని అవసరం మరింత ఎక్కువగా ఉంది. ఈ రంగాల్లోని సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో ఎక్కువగా సేవలందిస్తుండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు ఫిన్‌టెక్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఈ రంగ సంస్థలు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఆయా సేవలకు సంబంధించి దరఖాస్తు నుంచి ఆమోదం వరకూ.. అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. దాంతో హ్యాకర్లు దాడి చేసి.. విలువైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఎక్కువగా ఉంది.


భారీగా నియామకాలు

 • పలు రిక్రూటింగ్, స్టాఫింగ్‌ సంస్థల అంచనాల ప్రకారం–గతేడాది కాలంలో ఈ విభాగంలో నియామకాలు దాదాపు 40 శాతం మేర వృద్ధి చెందాయి.
 • డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అంచనా ప్రకారం– ప్రస్తుతం దాదాపు పది లక్షల మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం నెలకొంది. 
 • నాస్‌కామ్‌ డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ అంచనా ప్రకారం–ఈ ఏడాది చివరికి..సైబర్‌ సెక్యూరిటీ రంగంలో 3.5 మిలియన్ల మంది అవసరం ఉంటుంది.
 • టీమ్‌లీజ్‌ సంస్థ అంచనా ప్రకారం–డిమాండ్‌–సప్లయ్‌ మధ్య వ్యత్యాసం 70 శాతంగా నమోదైంది. 


ఎవరైనా నేర్చుకోవచ్చు
సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలను అన్ని విభాగాల విద్యార్థులు అందిపుచ్చుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. డిగ్రీ విద్యార్థులు సైతం సైబర్‌ సెక్యూరిటీ సంబంధిత కోర్సుల్లో అడుగుపెట్టి.. ఇంటర్నెట్, డేటా మేనేజ్‌మెంట్‌/ఇన్ఫర్మేషన్, ఎథికల్‌ హ్యాకింగ్‌ తదితర అంశాల్లో పట్టు సాధిస్తే.. కొలువు గ్యారెంటీ అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్, డేటా ఇన్ఫర్మేషన్, దాని ప్రాధాన్యతకు సంబంధించి స్పష్టత ఉండాలి. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో.. కొలువులు దక్కించుకోవడంలో.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌ కొంత ముందంజలో ఉంటారనే అభిప్రాయం నెలకొంది. దీనికి ప్రధాన కారణం.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఐటీ అప్లికేషన్స్‌పై ఎక్కువ అవగాహన ఉండటమే. 


భిన్న విభాగాలు
సైబర్‌ సెక్యూరిటీలో ప్రధానమైన విభాగాలు.. డేటా సెక్యూరిటీ, అప్లికేషన్‌సెక్యూరిటీ, ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ మానిటరింగ్, క్లౌడ్‌ సెక్యూరిటీ.


డేటా సెక్యూరిటీ
సైబర్‌ సెక్యూరిటీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన విభాగం.. డేటా సెక్యూరిటీ. సంస్థలు.. ఆన్‌లైన్‌ సేవలు అందించే క్రమంలో డేటా మేనేజ్‌మెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆయా సంస్థల క్లయింట్‌ కంపెనీలు, వారి యూజర్లకు సంబంధించిన వివరాలు, వారికి అందిస్తున్న సర్వీసులకు సంబంధించిన డేటాను భద్రంగా నిక్షిప్తం చేసుకోవడం తప్పనిసరి. అదే విధంగా డేటా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం కూడా అవసరమే. ఇలా డేటా నిక్షిప్తం, అప్‌డేట్‌ సమయంలో చిన్నపాటి తప్పిదం జరిగినా.. విలువైన సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లే! డేటాను పటిష్టంగా నిర్వహించడం, ఇతరులు యాక్సెస్‌ చేసేందుకు ఏమాత్రం వీలు లేకుండా చూసే విభాగం.. డేటాసెక్యూరిటీ.


అప్లికేషన్‌ సెక్యూరిటీ
సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు హ్యాకింగ్‌కు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రాథమిక స్థాయిలోనే పటిష్ట భద్రత విధానాలు రూపొందించే విభాగమే.. అప్లికేషన్‌ సెక్యూరిటీ. ఇది ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించే క్రమంలో.. అప్లికేషన్‌ సమయంలోనే పటిష్టమైన భద్రత విధానాలు, వాటి నైపుణ్యాలు అందించే ఏర్పాట్లు చేస్తుంది.


ఐటీ సెక్యూరిటీ
సైబర్‌ భద్రత పరంగా మరో ప్రధాన విభాగం.. ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) సెక్యూరిటీ. ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడం, సురక్షిత అప్లికేషన్స్‌ను రూపొందించడం వంటి కార్యకలాపాలను ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తారు. దాంతోపాటు హ్యాకింగ్‌ చేసిన డొమైన్‌/ఐపీ వివరాలు; ఎక్కడ నుంచి హ్యాక్‌ చేశారు అనే విషయాలు గుర్తించడం; హ్యాకింగ్‌ క్రమంలో సదరు సంస్థ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు అప్‌లోడ్‌ చేసిన ఫేక్‌ అంశాలను గుర్తించి, తొలగించడం వంటివి చేస్తారు. లాన్‌(లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌) సెక్యూరిటీ; సర్వర్‌ సెక్యూరిటీ; రూటర్‌ సెక్యూరిటీ; డిజిటల్‌ సెక్యూరిటీ తదితర విభాగాల్లోనూ ఐటీ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. 


ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌
ఇది పూర్తిగా కోర్‌ డొమైన్‌కు సంబంధించిన విభాగం. సంస్థలు సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చిన సమాచారంలో మార్పులుచేర్పులు, భద్రత చర్యలు ఈ విభాగం కిందకు వస్తాయి. 


జాబ్‌ ప్రొఫైల్స్‌

 • సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో నైపుణ్యాలు సొంతం చేసుకున్న అభ్యర్థులకు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 
 • ఎంట్రీ లెవల్‌(ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ హోదా); మిడిల్‌ లెవల్‌(మేనేజర్‌ హోదా); సీనియర్‌ లెవల్‌. సీనియర్‌ లెవల్‌లోనే మరో రెండు హోదాలు లభిస్తున్నాయి. అవి.. సెక్యూరిటీ అడ్వయిజర్స్, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్స్‌.
 • ఎంట్రీ లెవల్‌లో నెలకు రూ.20వేల వేతనం లభిస్తోంది. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా మూడేళ్లలోనే నెలకు రూ.50వేల వరకు జీతభత్యాలు అందుకోవచ్చు. 


సర్కారీ కొలువులు
సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం లభిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో నిర్వహించే దిశగా అడుగులు వేస్తుండటమే ఇందుకు కారణం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌), ఈ–ఆఫీస్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగం వంటి వాటి కారణంగా ప్రభుత్వ విభాగాల్లో కూడా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. 


అకడమిక్‌ మార్గాలు

 • సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన యూనివర్సిటీలు, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లు.. అకడమిక్‌ స్థాయిలోనే ఆయా నైపుణ్యాలు అందుకునే అవకాశం కల్పిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి. 
 • పలు విద్యాసంస్థల్లో బీసీఏ, బీటెక్‌ ప్రోగ్రామ్‌లలో ఒక సబ్జెక్ట్‌గా సైబర్‌ సెక్యూరిటీ అంశాన్ని బోధిస్తున్నారు.
 • పీజీ స్థాయిలో మాత్రం ఎంటెక్, ఎంసీఏలలో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అందిస్తున్న కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు: 

జేఎన్‌టీయూ–హైదరాబాద్‌: వెబ్‌సైట్‌: http://jntuh.ac.in/
ఐఐఐటీ–అలహాబాద్‌: వెబ్‌సైట్‌: http://www.clis.iiita.ac.in/​​​​​​​
సీడాక్‌: వెబ్‌సైట్‌: https://www.cdac.in/
వీటితోపాటు ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా ఎంటెక్‌ స్థాయిలో సైబర్‌ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పేరుతో స్పెషలైజేషన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. గేట్‌ స్కోర్‌ ఆధారంగా వీటిలో ప్రవేశం పొందొచ్చు.


ఈ సర్టిఫికేషన్లు తప్పనిసరి

 • సిస్కో సంస్థ అందించే సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ:  వెబ్‌సైట్‌: https://www.cisco.com/c/en_in/index.html
 • EC కౌన్సిల్‌ నిర్వహించే సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌: వెబ్‌సైట్‌: https://www.eccouncil.org/
 • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సులు: వెబ్‌సైట్‌: https://www.iisecurity.in/
 • డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ అందించే సర్టిఫికేషన్‌ కోర్సులు: వెబ్‌సైట్‌: https://www.dsci.in/

 
అన్ని రంగాల్లోనూ అవసరం
సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అవసరమవుతున్నారు. హ్యాకింగ్‌ సమస్యలు, మాల్‌వేర్స్‌ పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీంతో ఐటీ సంస్థలతోపాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, బ్యాంకింగ్, ఫిన్‌–టెక్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు అవకాశాలు లభిస్తున్నాయి. 
– ప్రొఫెసర్‌.టి.భీమార్జున రెడ్డి, 
ఐఐటీ–హైదరాబాద్‌

Published date : 15 Sep 2021 06:38PM

Photo Stories