Skip to main content

Careers After Degree: మేనేజ్‌మెంట్‌ పీజీలో ప్రవేశానికి పలు ఎంట్రన్స్‌ టెస్టులు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో మేలంటున్న నిపుణులు..

CAT Entrance Exam   CAT and ISAT Preferred for Management PG   National Level MBA Admission Process   management pg entrance exams and preparation tips in telugu   Professionals Collaborating in Joint Preparation
  • మేనేజ్‌మెంట్‌ పీజీలో ప్రవేశానికి పలు ఎంట్రన్స్‌లు 
  • జాతీయ స్థాయిలో క్యాట్, రాష్ట్రంలో ఐసెట్‌కు ప్రాధాన్యం
  • ఉమ్మడి ప్రిపరేషన్‌తో మేలంటున్న నిపుణులు

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌.. సంక్షిప్తంగా ఎంబీఏ! గ్రాడ్యుయేషన్‌ స్థాయి అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న కోర్సు. దేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఐఐఎంలతోపాటు రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీలు, కాలేజీలు ఎంబీఏను అందిస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్‌ రంగంలో కొలువులు దక్కించుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు క్యాట్, ఐసెట్‌తోపాటు మరెన్నో ఎంబీఏ ఎంట్రెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ముఖ్యమైన ఎంబీఏ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర వివరాలు..

ఎంబీఏ అభ్యర్థులు అధికశాతం మంది క్యాట్, ఐసెట్‌లపైనే దృష్టిసారిస్తున్నారు. వీటిలో ఆశించిన ఫలితం రాకుంటే నిరాశకు లోనవుతున్నారు. కానీ.. ఈ పరీక్షల సన్నద్ధతతోనే పలు ఇతర ఎంబీఏ ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు పోటీ పడే అవకాశముంది. వాటిలో మంచి స్కోర్‌తో ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌లో మేనేజ్‌మెంట్‌ పీజీలో ప్రవేశం పొందొచ్చు అంటున్నారు నిపుణులు. మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ కోసం క్యాట్, ఐసెట్‌తోపాటు సీమ్యాట్, మ్యా­ట్, ఎక్స్‌ఏటీ, ఎన్‌మ్యాట్‌ వంటి ఎన్నో ఎంట్రన్స్‌ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షల సిలబస్‌ దాదాపు ఒకే విధంగా ఉంటోంది.

చదవండి: CAT 2023 Results: క్యాట్‌.. మలిదశలో మెరిసేలా!

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌)
కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా క్యాట్‌. జాతీయ స్థాయిలో ఐఐఎంలు, ఇతర ప్రముఖ బిస్కూల్స్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఎంబీఏ అభ్యర్థుల తొలి గమ్యంగా నిలుస్తోంది క్యాట్‌. మొత్తం మూడు విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. అవి.. వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌; డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌; క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఆబ్జెక్టివ్‌ విధానంలో, ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఆయా ఐఐఎంలు నిర్దిష్ట కటాఫ్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి.. తదుపరి దశ(గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ)కు ఎంపిక చేస్తాయి. వాటిలోనూ విజయం సాధిస్తే ఐఐఎంలలో ప్రవేశం లభిస్తుంది.

ఐసెట్‌
ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా ఐసెట్‌. ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సుపరిచితమైన ఎంబీఏ ప్రవేశ పరీక్ష. తెలంగాణలో టీఎస్‌ ఐసెట్, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఐసెట్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఉత్తీర్ణత ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎంబీఏ కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు. ఐసెట్‌ను మూడు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. అవి.. అనలిటికల్‌ ఎబిలిటీ, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ , కమ్యూనికేషన్‌ ఎబిలిటీ. వీటిల్లో డేటా సఫీషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, అర్థమెటిక్‌ ఎబిలిటీ, అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ, వొకాబ్యులరీ, బిజినెస్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఎబిలిటీ, ఫంక్షనల్‌ గ్రామర్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ వంటి ఉప విభాగాలుగా ఉంటాయి. ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఐసెట్‌కు ప్రతి ఏటా ఫిబ్రవరి/మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. పరీక్ష మే నెలలో నిర్వహిస్తారు. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

సీమ్యాట్‌
దేశంలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సంస్థ.. ఏఐసీటీఈ(ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌). ఈ సంస్థ ఆధ్వర్యంలో జరిగే పరీక్ష..కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌). ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ అనుబంధ కళాశాలలు, ఇతర ప్రముఖ బీస్కూల్స్‌లో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ తదితర పీజీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఈ పరీక్షను మొత్తం అయిదు విభాగాల్లో 400 మార్కులకు నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 20 ప్రశ్నలు–80 మార్కులు; లాజికల్‌ రీజనింగ్‌ 20 ప్రశ్నలు–80 మార్కులు; లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ 20 ప్రశ్నలు–80 మార్కులు; జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు–80 మార్కులు; ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ 20 ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి/మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. మార్చి/ఏప్రిల్‌ల్లో పరీక్ష ఉంటుంది. సీమ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఆయా బీస్కూల్స్‌ దరఖాస్తులు ఆహ్వానించి.. మలి దశలో గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహించి అడ్మిషన్‌ కల్పిస్తాయి.

మ్యాట్‌
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(మ్యాట్‌). ఏటా నాలుగు సార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో ఈ పరీక్ష జరుగుతుంది. మ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆరు వందలకు పైగా బిజినెస్‌ స్కూల్స్‌ ఎంబీఏ, ఇతర పీజీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తున్నాయి. 
ఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో(లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌–40 ప్రశ్నలు; ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌–40 ప్రశ్నలు; మ్యాథమెటికల్‌ స్కిల్స్‌–40 ప్రశ్నలు; డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ–40 ప్రశ్నలు; ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌–40 ప్రశ్నలు) ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు ఉంటాయి.

  • వెబ్‌సైట్‌: https://mat.aima.in

చదవండి: Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్‌ విద్య

ఎక్స్‌ఏటీ
జాతీయ స్థాయిలో పేరున్న పరీక్ష.. ఎక్స్‌ఏటీ. గ్జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ పేరుతో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ–జంషెడ్‌పూ­ర్‌.. ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఎక్స్‌ఏటీ స్కోర్‌ ఆధారంగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అనుబంధ కళాశాలలే కాకుండా.. జాతీయ స్థాయిలో మరో 150 ఇన్‌స్టిట్యూట్‌ల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ కోర్సుల్లో చేరే వీలుంది. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు ఎక్స్‌ఏటీకి దరఖాస్తుకు అర్హులు. చివరి సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షను అయిదు విభాగాల్లో(డెసిషన్‌ మేకింగ్, వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ; క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌; జనరల్‌ నాలెడ్జ్‌; ఎస్సే రైటింగ్‌) వంద మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది.

  • వెబ్‌సైట్‌: https://xatonline.in/

ఎన్‌మ్యాట్‌
జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మరో మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. ఎన్‌మ్యాట్‌(నర్సీమొంజీ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌). తొలుత ముంబైలోని నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ప్రవేశాలకు ఆ ఇన్‌స్టిట్యూట్‌ ఎన్‌మ్యాట్‌ను నిర్వహించేది. ప్రస్తుతం జీ­మ్యాక్‌ ఆధ్వర్యంలో ఎన్‌మ్యాట్‌ను నిర్వహిస్తున్నా­రు. ఎన్‌మ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా భారతదేశంతోపాటు దక్షిణాఫ్రికా, ఫిలిప్పైన్, మొరాకోలలోని ఇన్‌ష్టిట్యూట్‌లు కూడా మేనేజ్‌మెంట్‌ పీజీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. పరీక్ష మూడు విభాగాల్లో(లాంగ్వేజ్‌ స్కిల్స్‌–36 ప్రశ్నలు; క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌–36 ప్రశ్నలు; లాజికల్‌ రీజనింగ్‌–36 ప్రశ్నలు) జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. 

  • వెబ్‌సైట్‌: https://www.mba.com/exams/nmat

ఏటీఎంఏ
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మరో మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. ఏఐఎంఏ. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌.. టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణత ద్వారా జాతీయ స్థాయి­లో రెండు వందలకుపైగా ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. మొత్తం ఆరు విభాగాల్లో(అనలిటికల్‌ రీజనింగ్, వెర్బల్‌ స్కిల్స్, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌) పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 180 ప్రశ్నలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంట­లు. ప్రతి ఏటా మూడుసార్లు(ఫిబ్రవరి, మే, జూలై) పరీక్ష జరుగుతుంది.

  • వెబ్‌సైట్‌: https://www.atmaaims.com/

చదవండి: MBA Placements: విద్యార్థులకు ఆఫర్ల జోరు.. కోవిడ్‌ పూర్వ స్థితికి రిక్రూట్‌మెంట్స్‌..

ఉమ్మడి ప్రిపరేషన్‌ ఇలా

  • దేశంలోని ఎంబీఏ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల సిలబస్‌ దాదాపు ఒకే తీరుగా ఉంటోంది. అన్నింటిలోనూ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డెసిషన్‌ మేకింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాలున్నాయి. 
  • క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ/క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి జామెట్రీ, ఆల్‌జీబ్రా, నెంబర్స్, ప్రాబబిలిటీ తదితర అంశాలపై కాన్సెప్ట్‌ ఆధారిత ప్రిపరేషన్‌ సాగించాలి. వాటి ఆధారంగా సమస్యలను సాల్వ్‌ చేయడం ప్రాక్టీస్‌ చేయాలి. 
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించాలంటే.. ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్‌ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి. 
  • లాజికల్‌ రీజనింగ్‌లో స్కోర్‌ కోసం స్టేట్‌మెంట్స్, పజిల్స్‌ సాధన చేయడం ఉపకరిస్తుంది. అదే విధంగా వెన్‌ డయాగ్రమ్స్, డిడక్షన్, పజిల్స్, లాజికల్‌ కనెక్టివిటీ, క్యూబ్స్‌ వంటి వాటిపై పట్టు సాధించాలి. 
  • వెర్బల్‌ ఎబిలిటీ కోసం విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరం. బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీ నేర్చుకోవాలి. పద ప్రయోగం, వాక్య నిర్మాణ శైలిపై ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. 
  • జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ నాలెడ్జ్‌లకు సంబంధించి సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్జాతీయ అంశాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఆర్థిక, వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
Published date : 02 Feb 2024 10:28AM

Photo Stories