Skip to main content

MBA Placements: విద్యార్థులకు ఆఫర్ల జోరు.. కోవిడ్‌ పూర్వ స్థితికి రిక్రూట్‌మెంట్స్‌..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్స్‌(ఐఐఎంలు).. మేనేజ్‌మెంట్‌ విద్యలో మెరికలను తయారు చేసే విద్యా సంస్థలు. ఈ క్యాంపస్‌ల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ పట్టా పుచ్చుకుంటే.. కార్పొరేట్‌ ప్రపంచం కళ్లు చెదిరే ఆఫర్లతో పట్టం కడుతుంది. అద్భుతమైన ప్యాకేజ్‌లతో రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతుంది!! ఈ ఏడాది కూడా ఐఐఎంల విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ ఆఫర్లు వెల్లువెత్తాయి. తొలితరం ఐఐఎంలు మొదలు కొత్త ఐఐఎంల వరకూ.. ఇదే ట్రెండ్‌ కనిపించింది! ఈ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థుల కోసం కార్పొరేట్‌ దిగ్గజాలు క్యూ కట్టాయి! ఈ నేపథ్యంలో.. ఐఐఎంల్లో ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ట్రెండ్స్‌.. ఎక్కువ ఆఫర్లు ఇచ్చిన రంగాలు.. జాబ్‌ ప్రొఫైల్స్, కంపెనీలు ఆశిస్తున్న లక్షణాలు, నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ...
MBA Special: IIM Placements Trends with Highest Salary Package and top companies, job roles here
MBA Special: IIM Placements Trends with Highest Salary Package and top companies, job roles here
  • ఐఐఎం విద్యార్థులకు ఆఫర్ల జోరు
  • కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకున్న రిక్రూట్‌మెంట్స్‌
  • అంతర్జాతీయ అవకాశాలు అధికంగానే
  • కన్సల్టింగ్, ఫైనాన్స్, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ క్రేజీ

ఐఐఎంల విద్యార్థులు కార్పొరేట్‌ రంగానికి హాట్‌ కేక్‌లని మరోసారి స్పష్టమైంది. గత రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా ప్యాకేజ్‌ల్లో కొంత తగ్గుదల కనిపించినా.. ఈసారి మాత్రం రెట్టింపు వేతనాలు లభించాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలు కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

అంతర్జాతీయ ఆఫర్లు రెట్టింపు

ఐఐఎం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో.. ఈ ఏడాది అంతర్జాతీయ ఆఫర్ల సంఖ్య గత సంవత్సరం కంటే రెట్టింపు స్థాయిలో నమోదు కావడం విశేషం. ముఖ్యంగా కన్సల్టింగ్, ఫైనాన్స్, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఈ ఆఫర్లు లభించాయి. అంతర్జాతీయంగా సంస్థలు కార్యకలాపాల నిర్వహణలో డిజిటలైజేషన్‌కు పెద్దపీట వేయడం, టెక్‌–మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలున్న వారిని నియమించుకోవాలని భావించడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందుకే డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్‌ వంటి టెక్‌ నైపుణ్యాలున్న ఐఐఎం విద్యార్థులకు ఆఫర్లలో ప్రాధాన్యం లభించింది.

చ‌ద‌వండి: NCHM JEE 2022: ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. రూ. 5 లక్షల వేత‌నంతో ఉద్యోగం

ఈ మూడు రంగాలదే హవా

ఐఐఎంల 2022 ఫైనల్‌ ప్లేస్‌మెంట్స్‌లో.. కన్సల్టింగ్, ఫైనాన్స్, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల హవా కనిపించింది. ఈ విభాగాలతో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహించే కన్సల్టింగ్‌ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టాయి. అంతర్జాతీయంగా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, ఈ అండ్‌ వై తదితర సంస్థలు ఆఫర్ల అందించడంలో ముందంజలో నిలిచాయి. వీటితోపాటు బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ–కామర్స్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, ఐటీ/ఐటీఈఎస్‌ సంస్థలు కూడా భారీ ఆఫర్లతో విద్యార్థులకు స్వాగతం పలికాయి.

రెట్టింపు వేతనాలు

  • ఐఐఎంల విద్యార్థులకు.. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు రెట్టింపు వేతనాలతో కంపెనీలు ఆఫర్లు అందించాయి.
  • తొలి తరం ఐఐఎంగా పేరొందిన ఐఐఎం–అహ్మదాబాద్‌లో గరిష్టంగా 83 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్లు లభించాయి. ఈ క్యాంపస్‌లో సగటు వేతనం రూ.43 లక్షలుగా నమోదైంది.
  • మరో ప్రముఖ ఐఐఎం– బెంగళూరులో కూడా సగటున రూ.40 లక్షల ప్యాకేజ్‌ లభించినట్లు సమాచారం.
  • మరో ప్రముఖ ఐఐఎం–కోజికోడ్‌లో సగటు వేతనాలు గత ఏడాది కంటే 30 శాతం పెరగాయి. ఈ క్యాంపస్‌లో అత్యధిక వేతనం రూ.61.5 లక్షలుగా ఉండటం విశేషం. సగటు వేతనంలోనూ 31 శాతం పెరుగుదల కనిపించింది. సగటు వేతనం రూ.29.5 లక్షలుగా ఉంది.
  • ఐఐఎం–ఇండోర్‌లో ఈసారి రికార్డు స్థాయిలో సగటు వేతనం నమోదైంది. ఈ క్యాంపస్‌లో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి సగటు వేతనం రూ.25.01 లక్షలుగా నమోదైంది. 
  • ఐఐఎం విశాఖపట్నంలో.. అత్యధిక వేతనం రూ.23.5 లక్షలుగా నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఈ మొత్తం 13 శాతం ఎక్కువగా ఉంది. అదే విధంగా సగటు వేతనం రూ.15 లక్షలుగా ఉంది.
  • ఐఐఎం–లక్నోలో అత్యధిక వేతనాలు రూ.58 లక్షలు(డొమెస్టిక్‌), రూ. 61.59 లక్షలు (ఇంటర్నేషనల్‌)గా నమోదయ్యాయి.
  • అన్ని ఐఐఎంలలోనూ విద్యార్థులకు దాదాపు డబుల్‌ ఆఫర్స్‌ లభించడం ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ప్రధానమైన ట్రెండ్‌గా పేర్కొనొచ్చు. ముఖ్యంగా రెండేళ్ల వ్యవధిలోని పీజీపీఎం విద్యార్థులకు కంపెనీలు పెద్దపీట వేశాయి. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ అభ్యర్థులకూ మిడ్‌ లెవల్‌ పొజిషన్స్‌ ఆఫర్‌ చేశాయి.


చ‌ద‌వండి: STEM Courses: బీ–స్కూల్స్‌లో టెక్‌ కోర్సులు... కార్పొరేట్‌ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు...

ఇతర బి–స్కూల్స్‌లోనూ ఇదే జోరు

  • ఐఐఎంలే కాకుండా దేశంలో పేరున్న ఇతర బి–స్కూల్స్‌లోనూ ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ జోరు కనిపించింది.
  • దేశంలోని మరో ప్రముఖ బి–స్కూల్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో అత్యధిక వేతనం రూ.60 లక్షలుగా, సగటు వేతనం రూ.31 లక్షలుగా నమోదైంది.
  • ఐఎస్‌బీ–హైదరాబాద్‌లోనూ ఈ ఏడాది భారీగా ఆఫర్లు లభించాయి. గత ఏడాది సగటు వార్షిక ప్యాకేజ్‌ రూ.28.21 లక్షలుగా నమోదవగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ. 34.07 లక్షలుగా నమోదైంది. ఈ క్యాంపస్‌లో దాదాపు ప్రతి విద్యార్థికి రెండు ఆఫర్లు లభించడం విశేషం. మొత్తం 929 మంది విద్యార్థులకు గాను దాదాపు రెండు వేల ఆఫర్లు వచ్చాయి. 
  • ఐఐటీ–కాన్పూర్‌ అందిస్తున్న ఎంబీఏ ప్రోగ్రామ్‌ విద్యార్థులకు కూడా ఈ ఏడాది 24 శాతం మేరకు వేతనాల్లో పెరుగుదల కనిపించింది.
  • ఇలా ఐఐఎంలతోపాటు ఇతర ప్రముఖ బీస్కూల్స్‌లోనూ గతేడాది కంటే దాదాపు రెట్టింపు వేతనాలతో ఆఫర్లు లభించడం, ముఖ్యంగా అంతర్జాతీయ ఆఫర్లలోనూ పెరుగుదల కనిపించడం జాబ్‌ మార్కెట్‌ ఆశాజనకనంగా ఉందని చెప్పడానికి నిదర్శమని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

కన్సల్టింగ్‌.. కింగ్‌గా

ఆఫర్లు కల్పించిన రంగాలను చూస్తే.. కన్సల్టింగ్‌ ముందంజలో నిలిచింది. మొత్తం ఆఫర్లలో దాదాపు 40 శాతం ఆఫర్లు కన్సల్టింగ్‌ సంస్థల నుంచే ఉండటం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వ్యాపార రంగ పరిస్థితులు కోవిడ్‌ పూర్వ స్థితికి చేరుకోవడంతో.. అన్ని రంగాల్లోని సంస్థలు తమ భవిష్యత్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వ్యాపార కార్యకలాపాల వేగం పెంచాలని, మళ్లీ పూర్వ స్థాయికి చేరుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం తగిన వ్యూహాల కోసం కన్సల్టింగ్‌ సంస్థలను సంప్రదిస్తున్నాయి. ఇదే ఇప్పుడు కన్సల్టింగ్‌ సంస్థల్లో నియామకాలు పెరగడానికి కారణాలుగా పేర్కొంటున్నారు.

  • కన్సల్టింగ్‌ తర్వాత బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు ముందు వరుసలో నిలిచాయి. తయారీ రంగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్‌ ప్రొఫైల్స్‌ డేటా అనాలిసిస్, బిగ్‌ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్‌ విభాగాల్లోనే లభించాయి.
  • తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, స్ట్రాటజీ ప్రొఫైల్స్‌లోనూ కోవిడ్‌ పూర్వ దశకు నియామకాలు పెరిగాయని పేర్కొంటున్నారు. ఈ రంగాల్లోనూ డిజిటల్‌ నైపుణ్యాలున్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఈ స్కిల్స్‌ తప్పనిసరి

  • ఐఐఎం విద్యార్థులకు భారీ స్థాయిలో ఆఫర్లు ఖరారు చేసిన కార్పొరేట్‌ సంస్థలు.. కేవలం సర్టిఫికెట్లు, జీపీఏలే కాకుండా.. ఇతర ఎన్నో అంశాలను, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నాయి. 
  • ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. అలాగే సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు డిజిటల్‌ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయి. అదే విధంగా బిజినెస్‌ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌ వంటి లేటెస్ట్‌ నైపుణ్యాలున్న విద్యార్థులకు పెద్ద పీట వేసినట్లు ఆయా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.


చ‌ద‌వండి: Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

సానుకూల సంకేతాలు

ఐఐఎంల్లో ప్లేస్‌మెంట్స్‌ ట్రెండ్స్‌ను చూస్తే.. సంస్థలు టైర్‌–2, టైర్‌–3ల్లోనూ క్యాంపస్‌ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ నియామకాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్టార్టప్‌ సంస్థలు, ఈ–కామర్స్‌ కంపెనీలు.. ఎంట్రీ లెవల్, సీఆర్‌ఎం, డిజిటల్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలకు టైర్‌–2, టైర్‌–3 ఇన్‌స్టిట్యూట్‌లవైపు చూసే అవకాశముందని ఆయా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • మొత్తంగా చూస్తే గత ఏడాది కోవిడ్‌ కారణంగా కొంత వెనుకంజలో ఉన్న బి–స్కూల్స్‌ ప్లేస్‌మెంట్స్‌.. తిరిగి పుంజుకోవడం మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు సానుకూల సంకేతంగా చెప్పొచ్చు. కాబట్టి నాన్‌–ఐఐఎం విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐఐఎం ప్లేస్‌మెంట్స్‌.. ముఖ్యాంశాలు

  • 2022లో ఐఐఎంల్లో భారీగా పెరిగిన ఆఫర్లు
  • కన్సల్టింగ్, మేనేజ్‌మెంట్, బిజినెస్‌ ఫైనాన్స్‌ విభాగాల్లో పెద్దపీట
  • బీఎఫ్‌ఎస్‌ఐ, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లోనూ ఆశాజనక స్థాయిలో నియామకాలు.
  • సగటున రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వార్షిక వేతనం
  • ఈ ఏడాది మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు జాబ్‌ మార్కెట్‌ సానుకూలంగా ఉంటుందనే సంకేతాలిస్తున్న ఐఐఎం–ప్లేస్‌మెంట్స్‌ గణాంకాలు.

టెక్‌ నైపుణ్యాలున్న వారికి పెద్ద పీట

ఐఐఎంలలో రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ చేపట్టిన కంపెనీలు.. అభ్యర్థుల్లోని మేనేజీరియల్‌ స్కిల్స్‌తోపాటు టెక్నికల్‌ నైపుణ్యాలపైనా ప్రత్యేక దృష్టి సారించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌లు కీలకంగా నిలిచాయి. కన్సల్టింగ్‌ సంస్థలు ఎక్కువగా ఆఫర్లు ఇవ్వడానికి ప్రధాన కారణం.. అవి నిర్వహించే కార్యకలాపాలు, ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులే. ఈసారి అంతర్జాతీయ ఆఫర్లు కూడా ఎక్కువగానే లభించాయి. అన్ని దేశాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు కోవిడ్‌ ముందు స్థాయికి చేరుకోవడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ఇకపై ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా క్యాంపస్‌ డ్రైవ్స్‌ జరిగి ఆఫర్లు లభిస్తాయనడానికి తాజా పరిస్థితులను నిదర్శనంగా పేర్కొనొచ్చు. టైర్‌–2, టైర్‌–3 ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు ఇంటర్వ్యూలో రాణించేందుకు స్మార్ట్‌గా వ్యవహరించాలి. కోర్‌ నాలెడ్జ్‌తోపాటు ఆధునిక నైపుణ్యాలపైనా అవగాహన పెంచుకోవాలి. 
–ప్రొ‘‘ యు.దినేశ్‌ కుమార్, చైర్‌ పర్సన్, సీడీఎస్, ఐఐఎం–బెంగళూరు​​​​​​​

Published date : 23 Mar 2022 07:01PM

Photo Stories