STEM Courses: బీ–స్కూల్స్‌లో టెక్ కోర్సులు... కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు...
బిజినెస్ స్కూల్స్.. మరో మాటలో చెప్పాలంటే.. మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్! పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌ల ద్వారా.. మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు అందించే విద్యాసంస్థలు! ఇప్పుడు ఈ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు.. టెక్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సులు బోధిస్తున్నాయి. దేశంలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ బీస్కూల్స్.. పీజీ ప్రోగ్రామ్స్ కరిక్యలంలో.. టెక్నికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండటం నయా ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్‌లో టెక్ కోర్సుల బోధనకు కారణాలు.. వాటితో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
- మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో స్టెమ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
- ఐఐఎంలు మొదలు ప్రముఖ బీ స్కూల్స్‌లో నయా ట్రెండ్
- ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేక కోర్సులు
- ఇండస్ట్రీ అవసరాలే కారణం అంటున్న నిపుణులు
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్తంగా స్టెమ్ కోర్సులుగా గుర్తింపు. వీటిని సైన్స్, ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.
చదవండి: MBA Entrance: IIFT ప్రవేశ పరీక్ష... సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్..
డేటా సైన్స్
మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్న ఇన్‌స్టిట్యూట్‌లు ప్రధానంగా.. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరగడమే! అనలిటిక్స్ ఆధారంగా బిజినెస్ వ్యూహాలు రూపొందించే మేనేజ్‌మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. అనలిటిక్స్ నైపుణ్యాలకు టెక్ స్కిల్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీంతో మేనేజ్‌మెంట్ విద్యార్థులకే డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పిస్తే.. కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు.
ఏఐ–ఎంఎల్ కూడా
- మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అన్నింటా ముఖ్యంగా వస్తు సేవల్లో.. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక ఉత్పత్తి లేదా సర్వీస్‌ను ఏఐ ఆధారంగా రూపొందించాలనుకుంటే.. సదరు నిర్వహణ అధికారులకు దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా కంపెనీల రోజువారీ విధుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్,ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో.. ఏఐ ఆధారంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
- ఏఐ ఆధారంగా.. పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. సంస్థకు కీలకమైన హెచ్‌ఆర్ విభాగంలో సైతం నూతన నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐ–ఎంఎల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించడం సులభం అవుతోంది. దీంతో.. మేనేజ్‌మెంట్ విభాగాల్లో పని చేసే వారికి సైతం టెక్నికల్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన ఆశ్యకత నెలకొంది. అందుకే ఇప్పుడు మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు.. ఏఐ, ఎంఎల్ వంటి టెక్ స్కిల్స్‌ను బోధిస్తున్నాయి.
చదవండి: Career with MBA: డిగ్రీ తర్వాత ఎక్కువ మంది చేరుతున్న కోర్సు.. కారణం ఇదే..
బిజినెస్ అనలిటిక్స్
మేనేజ్‌మెంట్ విభాగంలో టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.. బిజినెస్ అనలిటిక్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. సంస్థకు సంబంధించి రా మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాలు కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన విషయాలు(ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర)ను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి మేనేజ్‌మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్పష్టతకు రావలసి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు ఆవశ్యకంగా మారుతున్నాయి. దీంతో మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ బిజినెస్ అనలిటిక్స్‌ను తమ కరిక్యులంలో భాగంగా చేర్చుతున్నాయి.
ప్రత్యేక ప్రోగ్రామ్‌లు సైతం
- మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు స్టెమ్ కోర్సులను బోధిస్తుండగా.. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పూర్తి స్థాయిలో ప్రత్యేక టెక్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి.
- ఐఐఎం–అహ్మదాబాద్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 16 నెలల అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది.
- ఐఐఎం–బెంగళూరు.. బిజినెస్ అనలిటిక్స్‌లో రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
- ఐఐఎం–కోల్‌కత.. ఏడాది వ్యవధిలో బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా డేటా సైన్సెస్‌లో అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లో సైతం ప్రవేశం కల్పిస్తోంది.
- ఐఐఎం–కాశీపూర్ కూడా అనలిటిక్స్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది.
ఇతర బీ–స్కూల్స్ కూడా
- ఐఐఎంలే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ బీ–స్కూల్స్ కూడా మేనేజ్‌మెంట్ పీజీ లేదా పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయి.
- ఐఎస్‌బీ–హైదరాబాద్ బిజినెస్ అనలిటిక్స్‌లో హైబ్రీడ్ అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
ప్రత్యేక రీసెర్చ్ కేంద్రాలు
- ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను అందిస్తున్న మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు.. సంబంధిత విభాగాల్లో ప్రత్యేకంగా రీసెర్చ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నాయి.
- ఐఐఎం అహ్మదాబాద్ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలు నిర్వహించి.. వ్యాపారాలకు, పాలనకు, విధాన నిర్ణయాలకు సహకరించడం లక్ష్యంగా చేసుకుంది.
- ఐఐఎం–రాయ్‌పూర్ కూడా సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పేరుతో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షన్, ఆన్‌లైన్ సెక్యూరిటీ, డిజిటైజేషన్ స్ట్రాటజీ విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది.
చదవండి: Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!
కార్పొరేట్ వర్గాలు
టెక్ నైపుణ్యాలున్న మేనేజ్‌మెంట్ నిపుణులకు కార్పొరేట్ వర్గాలు సైతం పెద్దపీట వేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే.. టెక్, మేనేజ్‌మెంట్ రెండు నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్‌స్టిట్యూట్‌లు స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
70 శాతం వారే
- టెక్ నైపుణ్యాలున్న మేనేజ్‌మెంట్ నిపుణులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్ కంపెనీల నియామకాల్లో సైతం 70 శాతం మేరకు మేనేజ్‌మెంట్ విద్యార్థులే ఉంటున్నారు.
- జీమ్యాక్ సర్వే ప్రకారం–గత ఏడాది టెక్ ఆధారిత సేవలందిస్తున్న సంస్థల్లో 89 శాతం ఎంబీఏ ఉత్తీర్ణులను నియమించుకున్నాయి.
- మేనేజ్‌మెంట్ సంస్థల విషయానికొస్తే.. టెక్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్న సంస్థల సంఖ్య 60 శాతంగా నిలిచింది.
టెక్.. మేనేజ్‌మెంట్
- ఒకవైపు మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు టెక్ కోర్సులను అందిస్తుండగా.. మరోవైపు.. టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు సైతం మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం.
- ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటాసైన్స్ కోర్సును అందిస్తోంది.
- ఐఐటీ–ఢిల్లీ,ఐఐటీ–కాన్పూర్,ఐఐటీ–ఖరగ్‌పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్‌ఐటీలు ఎంటెక్ (సీఎస్‌ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
- వీటితోపాటు పలు ఇతర ఐఐటీలు, మరెన్నో ప్రముఖ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఎంటెక్ స్థాయిలో డేటా అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి.
ప్రయోజనం
ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల స్థాయిలో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకూ.. ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉంటేనే సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే టెక్ నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. అదేసమయంలో కంపెనీలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లభిస్తాయి.
టెక్ కోర్సులు–ముఖ్యాంశాలు
- ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో టెక్ కోర్సులను అందిస్తున్న ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ–స్కూల్స్.
- బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లకు ప్రాధాన్యం.
- కోర్సు కరిక్యులంతో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్‌లకు రూపకల్పన.
- ఏఐ–ఎంఎల్, డేటా అనలిటిక్స్‌లో రీసెర్చ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్న మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు.
- ఈ నైపుణ్యాలతో సంస్థల్లో విధుల నిర్వహణలో మరింత సమర్థంగా రాణించే అవకాశం.
- టెక్ నైపుణ్యాలున్న మేనేజ్‌మెంట్ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న టెక్ కంపెనీలు.
- టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు.
- ఇండస్ట్రీలో.. ఐఓటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహణ పెరగడమే ప్రధాన కారణం.
డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం
అన్ని రంగాల్లోనూ డేటా విశ్లేషణ.. ఆయా సంస్థల భవిష్యత్తు వ్యూహాలకు, మార్కెట్ ప్రణాళికలకు కీలకంగా మారింది. వీటి ఆధారంగానే ఉత్పత్తుల రూపకల్పన, నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తోంది. ఇంత కీలకమైన డేటాను విశ్లేషించాలంటే.. మేనేజ్‌మెంట్‌తోపాటు డేటా మైనింగ్, డేటాసైన్స్ నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే మేనేజ్‌మెంట్ విద్యలోనే వీటిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది.
–ప్రొ‘‘ యు.దినేశ్ కుమార్, డేటాసెంటర్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్ చైర్మన్, ఐఐఎం–బెంగళూరు
చదవండి: Management