Skip to main content

Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!

AP and TS ICET Counselling 2021 for MBA and MCA Admissions
AP and TS ICET Counselling 2021 for MBA and MCA Admissions

డిగ్రీ స్థాయి కోర్సులు చదివిన విద్యార్థులు.. ఆ తర్వాత ఎక్కువగా ఎంచుకునేది ఎంబీఏ లేదా ఎంసీఏలనే. ఇటీవల తెలంగాణ, ఏపీల్లో ఐసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఐసెట్‌ ద్వారా ఎంబీఏ లేదా ఎంసీఏల్లో ప్రవేశం పొందొచ్చు. ఐసెట్‌ ఉత్తీర్ణులు ఇప్పుడు ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?! అనే సందిగ్ధంలో ఉన్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలకు ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో..ఎంబీఏ/ఎంసీఏతో కెరీర్‌ అవకాశాలు, కరిక్యులమ్‌ తదితర అంశాలపై ప్రత్యేక కథనం... 

  • అర్హత, ఆసక్తి మేరకే కోర్సు ఎంపిక
  • ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివితేనే ఎంసీఏకు అర్హత 
  • మేనేజ్‌మెంట్‌ రంగంలో రాణించాలనుకుంటే ఎంబీఏ
  • సాఫ్ట్‌వేర్, ఐటీపై ఆసక్తి ఉంటే ఎంసీఏ

ఎంబీఏ, ఎంసీఏ అనేవి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి ప్రోగ్రాములు. ఇవి అభ్యర్థి కెరీర్‌లో ముందుకు సాగడానికి, మెరుగైన ఉద్యోగాలు పొందడానికి దోహదం చేస్తాయి. ఎంబీఏ, ఎంసీఏ రెండూ.. కార్పొరేట్‌ రంగంలో కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సులు. విద్యార్థులు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి.. ఏ కోర్సు అనువైనది.. మన లక్ష్యానికి వీటిలో ఏది ఉపయోగపడుతుందో తెలుసుకొని ముందడుగు వేయాలి. ఏ విభాగం విద్యార్థులైనా ఎంబీఏలో చేరొచ్చు. కాని ఎంసీఏలో చేరడానికి మాత్రం ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

ఎంబీఏ

  • ఎంబీఏలో చేరాలంటే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేయాలి. కార్పొరేట్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారు, మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవాలి, కార్పొరేట్‌ కెరీర్‌ సొంతం చేసుకోవాలి అనుకునే వారు ఎంబీఏను ఎంచుకోవచ్చు. 
  • ఎంబీఏలో అనేక స్పెషలైజేషన్స్‌ ఉన్నాయి.అవి.. హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, టూరిజం మేనేజ్‌మెంట్, హెల్త్‌ కేర్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, సప్లయి చైన్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి. విద్యార్థి తన ఆసక్తి మేరకు ఏదైనా స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. కొన్ని కాలేజీల్లో డ్యూయల్‌ స్పెషలైజేషన్స్‌ అవకాశం కూడా ఉంది.

 చ‌ద‌వండి: (Career Opportunities: బీమా రంగంలో ఉద్యోగాలు... ప్రారంభంలోనే రూ.3లక్షల వేత‌నం)

ఎంసీఏ

  • మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ).. ఇది కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించిన కోర్సు. ఇది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌కు దీటైన కోర్సుగా చెప్పొచ్చు. రోజురోజుకు విస్తరిస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగ ంలో పనిచేయాలని కోరుకునే వారికి ఇది చక్కటి కోర్సు. కంప్యూటర్స్‌పై ఆసక్తి ఉండి.. ఐటీ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటే..ఎంసీఏను ఎంచుకోవచ్చు. 
  • ఎంసీఏలో నెట్‌వర్కింగ్‌/హార్డ్‌వేర్‌ టెక్నాలజీ/ఇంటర్నెట్‌/మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌/అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌/సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌/సిస్టం ఇంజనీరింగ్‌/సిస్టం మేనేజ్‌మెంట్‌/సిస్టం డెవలప్‌మెంట్‌/ట్రబుల్‌షూటింగ్‌ వంటి వివిధ విభాగాలు ఉంటాయి. 


చ‌ద‌వండి: (Robotics and AI: పది లక్షల ఉద్యోగాలకు వేదిక‌... రూ. 12 లక్షల వార్షిక వేతనం)
కరిక్యులం

  • ఎంబీఏ, ఎంసీఏ.. ఈ కోర్సుల కరిక్యులం వేర్వేరుగా ఉంటుంది. సబ్జెక్టులు, సిలబస్‌..ఇలా అన్నింటా దేని ప్రత్యేకత దానిదే. రెండు కోర్సుల స్వభావంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఎంబీఏ అనేది పూర్తిగా మేనేజ్‌మెంట్‌ విభాగానికి చెందినది. కాగా, ఎంసీఏ అనేది కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించినది. 
  • ఎంబీఏ కరిక్యులం: ఈ కోర్సు సిలబస్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలతో కూడి ఉంటుంది. ఎంబీఏలో మేనేజీరియల్‌ అకౌంటింగ్, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్, ఎకనామిక్‌ అనాలసిస్‌ ఫర్‌ బిజినెస్‌ డెసిషన్స్, బిజినెస్‌ రీసెర్చ్‌ మెథడ్స్, మార్కెటింగ్‌ బేసిక్స్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్‌ ప్రిన్సిపుల్స్, డిజిటల్‌ బిజినెస్‌ తదితర అంశాలు ఉంటాయి. 
  • ఎంసీఏ కరిక్యులం: ఇది పూర్తిగా టెక్నికల్‌ స్కిల్స్‌ కు సంబంధించింది. ఈ కోర్సు కరిక్యులంలో కంప్యూటర్‌ సంబంధిత బేసిక్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ప్రోగ్రామింగ్, కోడింగ్, నెట్‌వర్కింగ్‌ వంటి అంశాలు ఉంటాయి. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఐటీ, కంప్యూటేషన్, లినక్స్‌ ప్రోగ్రామింగ్, ప్రోగ్రామింగ్‌ ఇన్‌ ‘సి’, కంప్యూటర్‌ గ్రాఫిక్స్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, డిస్క్రీట్‌ మ్యాథమెటిక్స్, వెబ్‌ టెక్నాలజీస్, ఎంటర్‌ప్రైజ్‌ కంప్యూటింగ్‌ విత్‌ జావా వంటి సబ్జెక్టులు ఎంసీఏలో ఉంటాయి.

 
Check AP ICET College Predictor 2021

కెరీర్‌

  • ఎంబీఏతో కొలువులు: మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్‌ వంటి విభాగాల్లో ఎంబీఏ అభ్యర్థులకు కొలువులు లభిస్తాయి. ముఖ్యంగా ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి ఉద్యోగాలు ఉంటాయి. మేనేజర్‌గా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, టీమ్‌ లీడింగ్, ఇతర విభాగాలతో సమన్వయం వంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇండస్ట్రీ, కన్సల్టెంట్‌ సంస్థలు, ఆతిథ్య పరిశ్రమ, ప్రకటనల విభాగం,బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ లు, మీడియా రంగం, డిజిటల్‌ మార్కెటింగ్, ఎడ్యుకేషన్‌ రంగం తదితరాల్లో కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 
  • ఎంసీఏతో అవకాశాలు: ఈ కోర్సుతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోచ్చు. ఎంసీఏ పూర్తిచేసుకున్న వారికి ఇటీవల కాలంలో ఐటీ రంగంలో అవకాశాలు మెరుగవుతున్నాయి. వెబ్‌ డిజైనర్, గ్రాఫిక్‌ డిజైనర్‌ వంటి ఉద్యోగాలతోపాటు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, ఐటీ అడ్మినిస్ట్రేటర్‌ వరకూ.. అనేక కొలువులు దక్కించుకునే వీలుం ది. నైపుణ్యాలుంటే.. ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు, టెలికాం కంపెనీలు అవకాశాలు కల్పిస్తున్నాయి.

 
ఏది బెటర్‌

  • ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఏది బెటర్‌ అనేది చెప్పడం కష్టమే. ఎందుకుంటే.. ఇవి రెండు దేనికదే ప్రత్యేకమైన కోర్సులు. ఎంబీఏ, ఎంసీఏ రెండూ.. రెండేళ్ల కాలపరిమితి గలవే. అందువల్ల అభ్యర్థి ఆసక్తి, కెరీర్‌ లక్ష్యాల మేరకు నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. 
  • నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్‌ డవలప్‌మెంట్, ఐటీ రంగాల్లో కెరీర్‌ కోరుకునేవారు, టెక్నాలజీ అంటే ఆసక్తి ఉన్నవారు ఎంసీఏను ఎంచుకోవడం ఉత్తమం.
  • అలాగే బిజినెస్, నిర్వహణ, లీడర్‌షిప్, అడ్మినిస్ట్రేషన్‌ వంటి విభాగాల్లో పనిచేయాలనుకునేవారు, భవిష్యత్‌లో సొంతంగా వ్యాపారం లేదా కంపెనీ స్థాపించాలనుకునేవారు ఎంబీఏలో చేరడం మంచిది. 
  • ఏ విభాగంలో రాణించాలన్నా.. కెరీర్‌గా పరంగా ఎదగాలన్నా.. స్కిల్స్‌ పెంచుకోవడం ముఖ్యమని గుర్తించాలి.
Published date : 26 Oct 2021 07:22PM

Photo Stories