Skip to main content

MBA Specialisations: ఈ స్పెషలైజేషన్స్‌.. వెరీ స్పెషల్‌!

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌.. సంక్షిప్తంగా ఎంబీఏ! బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపే కోర్సు ఇది! ఎంబీఏలో సాంప్రదాయ ఫైనాన్స్, హెచ్‌ఆర్, మార్కెటింగ్‌తోపాటు ఇప్పుడు ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ఐఐఎంలతోపాటు పలు ప్రముఖ బీ స్కూల్స్‌ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఐఐఎంల్లో ఎంబీఏ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎంబీఏలో వినూత్న స్పెషలైజేషన్స్, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం..
Innovative specializations in MBA

ఎంబీఏ అనగానే ఫైనాన్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి స్పెషలైజేషన్స్‌ గుర్తొస్తాయి. కానీ నేటి కార్పొరేట్‌ యుగంలో అనేక సరికొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ బిజినెస్, రూరల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర స్పెషలైజేషన్స్‌ ఎంబీఏ అభ్యర్థుల కెరీర్‌కు మరింత ఊతమిస్తున్నాయి. 

ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌

ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న స్పెషలైజేషన్‌.. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాలతో వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అమలవుతున్న విధానాలు, వ్యూహాలకు సంబంధించి నైపుణ్యాలు అందించే స్పెషలైజేషన్‌గా ఇంటర్నేషనల్‌ బిజినెస్‌కు పేరుంది.

ఈ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ పూర్తి చేసుకుంటే.. బహుళ జాతి సంస్థల్లో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజర్, గ్లోబల్‌ బిజినెస్‌ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ మేనేజర్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు.

చదవండి: IIT MBA Placements: ఐఐటీల్లో ఎంబీఏ.. ప్లేస్‌మెంట్స్‌లో జోరు.. ఎంబీఏ ఏడు ఐఐటీల్లో ఇవే..!

రూరల్‌ మేనేజ్‌మెంట్‌

సామాజిక సేవా దృక్పథం, సహనం, వైవిధ్యం కోరుకునే వారికి సంతృప్తితోపాటు సంపాదనను అందించే స్పెషలైజేషన్‌.. రూరల్‌ మేనేజ్‌మెంట్‌! దేశంలోని గ్రామీణ ప్రజలకు ప్రభుత్వాలు అనేక ప­థకాలు అమలు చేస్తున్నాయి. అదే విధంగా యూనిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు పలు పథకాలు రూపొందిస్తున్నాయి.

అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసి.. పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రత్యేక విభాగాలను ఆవిష్కరించింది(ఉదా: ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌). వాటి సమర్థ నిర్వహణకు నిపుణుల అవసరం ఏర్పడుతోంది. 

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోపాటు, పలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యకలాపాల నిర్వహణపై అవగాహన పెంచేలా రూరల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌ స్వరూపం ఉంటుంది.ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లుగా పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(అహ్మదాబాద్‌), టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(ముంబై), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌(ఆనంద్‌),కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూ­రల్‌ డెవలప్‌మెంట్‌(హైదరాబాద్‌)లు పూర్తిస్థాయి­లో రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి.

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌

జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ నెలకొన్న మరో వినూత్న స్పెషలైజేషన్‌.. హెల్త్‌కేర్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషలైజేషన్లుగా పలు ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి.

ఈ స్పెషలైజేషన్‌ ద్వారా హెల్త్‌కేర్‌ రంగంలో హాస్పిటల్స్‌కు సంబంధించి ఆదాయ–వ్యయ నిర్వహణ, పేషెంట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి నైపుణ్యాలు లభిస్తాయి. ఈ స్పె షలైజేషన్‌తో కోర్సు పూర్తి చేసుకున్న వారు హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్స్, హాస్పిటల్‌ మేనేజర్స్,ఆపరేటింగ్‌ ఆఫీసర్స్‌ వంటి కొలువులు దక్కించుకోవచ్చు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌

ఆకర్షణీయ అవకాశాలు కల్పిస్తున్న మరో స్పెషలైజేషన్‌.. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌. ఎకోటూరిజం,హెల్త్‌/మెడికల్‌ టూరిజం, కల్చరల్‌ టూరిజం తదితర కాన్సెప్ట్‌లతో విదేశీ పర్యాటకులను ఆకర్షించి.. తద్వారా విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఫలితంగా ఈ రంగం కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో మానవ వనరుల కొరత నెలకొంది. దీన్ని గుర్తించిన పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయి­లో టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ లేదా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ పేరుతో కోర్సులను అందిస్తున్నా­యి. తెలంగాణలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌.. ఎంబీఏ హాస్పిటాలిటీ కోర్సును అందిస్తోంది. ప్రయాణాలు చేయడంపై ఆసక్తి, ఎదుటివారిని మెప్పించే నేర్పు ఉన్న వారికి సరైన కోర్సు ఇది.

రిటైల్‌ మేనేజ్‌మెంట్‌

దేశంలో వ్యాపార, వాణిజ్యం పరంగా శరవేగంగా దూసుకెళ్తున్న విభాగం.. రిటైల్‌ మేనేజ్‌మెంట్‌! బహుళ జాతి సంస్థల ప్రవేశంతో దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ఏర్పాటవుతున్నాయి. వాటి సమర్థ నిర్వహణకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం నెలకొంది.

ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఏడాది, రెండేళ్ల వ్యవధిలో ఎంబీఏ, పీజీ డిప్లొమా పేరుతో రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ను ఒక స్పెషలైజేషన్‌గా రూపొందిస్తున్నాయి. ఈ కోర్సులో రిటైల్‌ అవుట్‌లెట్‌కు సంబంధించి ప్యాకింగ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ అవుట్‌లెట్, మర్కండైజింగ్‌ వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. 

ఫార్మాస్యుటికల్‌ మేనేజ్‌మెంట్‌

దేశంలో ఫార్మా రంగం విస్తరిస్తోంది. ఫార్మా సంస్థల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన స్పెషలైజేషన్‌.. ఫార్మాస్యుటికల్‌ మేనేజ్‌మెంట్‌! ఈ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ పూర్తి చేసుకున్న వారికి ఫార్మా కంపెనీలు, మెడికల్‌ డివైజ్‌ సంస్థలు, మార్కెట్‌ రీసెర్చ్, హెల్త్‌కేర్, మెడికల్‌ కమ్యూనికేషన్‌ తదితర ఫార్మా అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

బిజినెస్‌ అనలిస్ట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజర్స్‌ వంటి హోదాల్లో కొలువుదీరొచ్చు. ప్రస్తుతం ఈ కోర్సును నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, నైపర్, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, ఐఐహెచ్‌ఎంఆర్‌ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి.

అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌

సాగుకు సంబంధించి నిర్వహణ నైపుణ్యాలు అందించే స్పెషలైజేషన్‌.. అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఆపరేషన్స్, స్లపయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్, మొబిలైజేషన్‌ వంటి మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ద్వారా సొంతం చేసుకోవచ్చు.

ఈ కోర్సు ఉత్తీర్ణులకు సీడ్‌ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్స్, ఫుడ్‌ ఇండస్ట్రీలలో కొలువులు లభిస్తాయి. ఐఐఎం–అహ్మదాబాద్, లక్నో క్యాంపస్‌లలో ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. క్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా వీటిలో చే­రొచ్చు. అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తి చే­సిన అభ్యర్థులు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌ సంస్థలు, ఫుడ్‌ ఆఫీసర్స్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

ఫ్యామిలీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌

బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో టాప్‌–500లో 60 నుంచి 70 శాతం వరకు కుటుంబ యాజమాన్యంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బిర్లా గ్రూప్, రిలయన్స్, డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ వంటివే ఇందుకు ఉదాహరణ. కుటుంబ పరిధిలోని సంస్థలకు అవసరమైన సుశిక్షితులను తీర్చిదిద్దే స్పెషలైజేషన్‌.. ఫ్యామిలీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.

కుటుంబ యాజమాన్యాల పరిధిలోని సంస్థలు సైతం సమర్థ నిర్వహణ, అభివృద్ధి దిశగా నిపుణులను నియమించుకుంటున్నాయి. ఫ్యామిలీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 15 నెలల కోర్సును అందిస్తోంది. అదే విధంగా నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, ఎస్‌.పి.జైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ వంటివి కూడా ఈ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి.

వ్యక్తిగత ఆసక్తి ముఖ్యం

ఎంబీఏలో ఒక్కో స్పెషలైజేషన్‌కు వ్యక్తిగతంగా ఒక్కో లక్షణం ఉండాలి. ఉదాహరణకు.. రూరల్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్లలో ఎక్కువ శాతం ఫీల్డ్‌ వర్క్, ప్రజలతో మమేకం అవ్వాల్సి ఉంటుంది. స్వతహాగా ఈ లక్షణాలు ఉన్న అభ్యర్థులకే ఇవి సరితూగుతాయి. కాబట్టి స్పెషలైజేషన్‌ ఎంపికలో తమ వ్యక్తిగత లక్షణాలను స్వాట్‌ అనాలిసిస్‌ చేసుకుని ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. 

Published date : 31 Jan 2025 03:58PM

Photo Stories