IIT MBA Placements: ఐఐటీల్లో ఎంబీఏ.. ప్లేస్‌మెంట్స్‌లో జోరు.. ఎంబీఏ ఏడు ఐఐటీల్లో ఇవే..!

ఏడు ఐఐటీల్లో ఎంబీఏ
- దేశంలో ప్రస్తుతం ఏడు ఐఐటీలు ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.
- ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వినోద్ గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి.. ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. క్యాట్‌లో నిర్దేశిత కటాఫ్ పర్సంటైల్ పొందిన అభ్యర్థులకు రిటెన్ అనాలిసిస్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అడ్మిషన్ కల్పిస్తుంది.
- ఐఐటీ–చెన్నై.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రెండేళ్ల వ్యవధిలో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. ఫైనాన్స్, హెచ్‌ఆర్ అండ్ ఓబీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంటిగ్రేటివ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
- ఐఐటీ కాన్పూర్‌లో ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ 21 నెలల వ్యవధిలో ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇక్కడ ఆపరేషన్స్, సిస్టమ్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజ్‌మెంట్, సర్వీస్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.
- ఐఐటీ–ముంబై శైలేశ్ జె.మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఎంబీఏ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్, జనరల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ అండ్ ఓబీ, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్టివ్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఐఐటీ–ఢిల్లీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పరిధిలో ఎంబీఏ, ఎంబీఏ(టెలికం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్) కోర్సులను అందిస్తోంది. ఎంబీఏ కోర్సులో భాగంగా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫైనాన్స్, మార్కెటింగ్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.
- ఐఐటీ–రూర్కీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పరిధిలో ఎంబీఏ కోర్సు అందిస్తోంది. మార్కెటింగ్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆపరేషన్స్, హెచ్‌ఆర్‌ఎం స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
- ఐఐటీ జోథ్‌పూర్ కూడా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
ప్లేస్‌మెంట్స్ జోరు
ఐఐటీల్లో ఎంబీఏ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఆఫర్ల జోరు కొనసాగుతోంది. ఇక్కడ ఐఐఎంలకు దీటుగా ఆఫర్లు లభిస్తున్నాయి. నూటికి తొంభై శాతం మందికి ఉద్యోగాలు ఖరారవుతున్నాయి. వేతనాలు కూడా ఐఐఎంలకు దీటుగా అందుతున్నాయి. ఐటీ, కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాల్లో నియామకాలు జరిపే కంపెనీలకు ఈ స్కిల్స్‌తోపాటు నిర్వహణ నైపుణ్యాలున్న విద్యార్థులు ఐఐటీల్లో లభిస్తున్నారు. ఐఐటీల్లో ఎంబీఏ అభ్యర్థులకు ఐటీ, ఐటీఈఎస్, అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో ఎక్కువ ఆఫర్లు లభిస్తుండటమే ఇందుకు నిదర్శనం.
తాజా బ్యాచ్ ఎస్‌పీఓల హవా
- 2023–25 ఎంబీఏ బ్యాచ్‌కు సంబంధించి సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్లు(ఎస్‌పీవో) హవా కొనసాగింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రూ.5.35 లక్షలతో అత్యధిక స్టయిఫండ్ లభించగా.. సగటు స్టయిఫండ్ రూ.4.61 లక్షలుగా ఉంది. ఐఐటీ–ముంబైలో అత్యధిక స్టయిఫండ్ రూ.5 లక్షలుగా.. సగటు స్టయిఫండ్ రూ.2.92 లక్షలుగా నమోదైంది.
- ఐఐటీ–చెన్నైలో అత్యధిక స్టయిఫండ్ రూ.4.4 లక్షలు కాగా, సగటు స్టయిఫండ్ రూ.1.05 లక్షలు. ఐఐటీ–కాన్పూర్‌లో అత్యధిక స్టయిఫండ్ రూ.1.7 లక్షలుగా.. సగటు స్టయిఫండ్ రూ.80 వేలుగా నమోదైంది. ఐఐటీ–రూర్కీలో అత్యధిక స్టయిఫండ్ రూ.2.3 లక్షలు, సగటు స్టయిఫండ్ రూ.89 వేలుగా ఉంది. ఐఐటీ–ఢిల్లీలో రూ.4.04 లక్షలు అత్యధిక స్టయిఫండ్ కాగా..రూ.2.63 లక్షల సగటు స్టయిఫండ్ లభించింది. ఐఐటీ–జోథ్‌పూర్‌లో అత్యధిక స్టయిఫండ్ రూ.80వేలు కాగా, సగటున రూ.44 వేల స్టయిఫండ్ అందింది.
![]() ![]() |
![]() ![]() |
ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌దీ అదే తీరు
ఐఐటీల్లో ఎంబీఏ చదివిన వారికి ఐఐఎంలకు దీటుగా ఫైనల్ ఆఫర్లు లభించాయి. ఐఐటీ–ముంబైలో రూ.72 లక్షల అత్యధిక వేతనంతో ఆఫర్ నమోదైంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అత్యధిక వేతనం రూ.38 లక్షలుగా, సగటు వేతనం రూ.20.65 లక్షలుగా ఉంది. ఐఐటీ ఢిల్లీలో రూ.41.13 లక్షలతో అత్యధిక ప్యాకేజ్ ఆఫర్ లభించింది.
ఐఐటీ కాన్పూర్‌లో రూ.24 లక్షల ప్యాకేజ్‌తో కొలువు ఖాయమైంది. ఐఐటీ రూర్కీలో రూ.26 లక్షలు అత్యధిక ప్యాకేజ్ కాగా, రూ.18.3 లక్షలు సగటు ప్యాకేజ్‌గా నమోదైంది. ఐఐటీ–చెన్నైలో రూ.29.6 లక్షలు, రూ.16.93 లక్షలుగా అత్యధిక, సగటు ప్యాకేజ్‌లు ఉన్నాయి. ఐఐటీ జోథ్‌పూర్‌లో అత్యధిక ప్యాకేజ్ రూ.24.81 లక్షలు, సగటు ప్యాకేజ్ రూ.11.77 లక్షలుగా ఉంది.
ఈ మూడు రంగాలదే
ఐఐటీల్లోని ఎంబీఏ ప్రోగ్రామ్ విద్యార్థులకు కన్సల్టింగ్, ఫైనాన్స్, జనరల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఎక్కువ ఆఫర్లు లభించాయి. ఈ విభాగాలతో ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహించే కన్సల్టింగ్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టాయి. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గడించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, ఈ అండ్ వై తదితర సంస్థలు ఆఫర్ల ఇవ్వడంలో ముందంజలో నిలిచాయి. వీటితోపాటు బీఎఫ్‌ఎస్‌ఐ, ఈ–కామర్స్, ఎడ్‌టెక్, ఫిన్‌టెక్, ఐటీ /ఐటీఈఎస్ సంస్థలు కూడా భారీ ఆఫర్లతో విద్యార్థులకు స్వాగతం పలికాయి. కొన్ని ఐఐటీల్లోని ఎంబీఏ విద్యార్థులకు డబుల్ ఆఫర్లు, ఇంటర్నేషనల్ ఆఫర్లు కూడా అందాయి. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అభ్యర్థులకూ మిడ్ లెవల్ పొజిషన్స్ అందాయి.
చదవండి: Jobs Abroad: విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారికి శుభవార్త.. ఇక ఏజెంట్ల మోసాలకు చెక్ ఇలా..
కన్సల్టింగ్.. కింగ్
ఆఫర్లు అందించడంలో కన్సల్టింగ్ సంస్థలు ముందంజలో నిలిచాయి. మొత్తం ఆఫర్లలో దాదాపు 40 శాతం ఆఫర్లు కన్సల్టింగ్ సంస్థల నుంచే ఉండడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కంపెనీలు తగిన వ్యూహాల కోసం కన్సల్టింగ్ సంస్థలను సంప్రదిస్తున్నాయి. ఇదే ఇప్పుడు కన్సల్టింగ్ సంస్థల్లో నియామకాలు పెరగడానికి, క్యాంపస్ డ్రైవ్స్‌లో టాప్ రిక్రూటర్స్‌గా నిలవడానికి కారణంగా చెబుతున్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్ ప్రొఫైల్స్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోనే లభించాయి.
ఈ నైపుణ్యాలు తప్పనిసరి
ఐఐటీల్లోని ఎంబీఏ విద్యార్థులకు భారీ స్థాయిలో ఆఫర్లు ఖరారు చేసిన కార్పొరేట్ సంస్థలు.. కేవలం సర్టిఫికెట్లు, జీపీఏలే కాకుండా ఇతర ఎన్నో అంశాలను, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చాయి.
కోర్ స్కిల్స్ కోణంలో సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సదరు సబ్జెక్ట్‌కు సంబంధించి డిజిటల్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్నాయి. అదే విధంగా బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్ వంటి లేటెస్ట్ స్కిల్స్ ఉన్న విద్యార్థులకు పెద్ద పీట వేశాయని ఆయా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఐఐటీ–ఎంబీఏలో ప్రవేశం ఇలా
ఐఐటీల్లో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరాలంటే తప్పనిసరిగా క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అనంతరం ప్రతి ఐఐటీలోని మేనేజ్‌మెంట్ స్కూల్స్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మలిదశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలలోనూ విజయం సాధించాలి.
అప్పుడే ప్రవేశం ఖరారవుతుంది. అదే విధంగా కొన్ని ఐఐటీలు ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన విధిస్తున్నాయి. 2025–26 ప్రవేశాలకు సంబంధించి క్యాట్–2024 ఉత్తీర్ణత ఆధారంగా.. ఐఐటీల్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశ ప్రక్రియ మొదలైంది.
Tags
- Management courses at PG level
- MBA placements
- Engineering and Technology Education
- IIM
- 2023-25 batch in IITs
- Campus drives for MBA students
- Indian Institutes of Technology
- Master of Business Administration
- 7 IITs
- IIT MBA Placements
- Career After MBA
- Highest Paying Careers After MBA
- CampusPlacement
- JobOpportunities
- InterviewPreparation