TG CETS 2025: టీజీ ‘సెట్స్’ షెడ్యూల్ విడుదల.. సెట్స్ అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు ఇలా..

ఆయా సెట్‌ల తేదీలను ముందుగానే ప్రకటించడం వల్ల విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికలను సమర్థంగా రూపొందించుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు అకడమిక్ వార్షిక పరీక్షలతో వీటిని సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించడం ద్వారా మంచి ర్యాంకు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ను గమనిస్తే.. రెండు నెలలపాటు ఈ సెట్స్ కొనసాగనున్నాయి. తొలుత ఏప్రిల్ 29, 30, మే 2, 5 తేదీల్లో ఈఏపీ సెట్‌ను నిర్వహించనున్నారు. చివరగా జూన్ 11 నుంచి 14 వరకు పీఈసెట్ ఉంటుంది.
ఈఏపీ సెట్
- రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చరల్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన ఎంట్రన్స్.. టీజీ ఈఏపీసెట్. ఈ సెట్‌కు హాజరయ్యేందుకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత; అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈఏపీ సెట్.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లలో వేర్వేరుగా పరీక్ష విధానం ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మొత్తం 160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
- ఈఏపీసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష కూడా 160 మార్కులకు ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ఇందులో ర్యాంకు ద్వారా ఏజీ బీఎస్సీ, బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, బీఫార్మసీ, ఫార్మ్–డి, బీటెక్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
- పరీక్ష తేదీలు: ఈఏపీసెట్ ఏప్రిల్ 29, 30 (అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ); మే 2–5(ఇంజనీరింగ్ స్ట్రీమ్).
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్ పేపర్స్ | గెస్ట్ కాలమ్
ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశానికి ఐసెట్
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. సంక్షిప్తంగా ఐసెట్. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. టీజీ ఐసెట్‌ను జూన్ 8, 9 తేదీల్లో రెండు రోజుల్లో నాలుగు స్లాట్లలో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
చదవండి: ICET - Analytical Ability | Mathematical Ability | Communication Ability | Computer Terminology | Previous Papers | Model Papers
ఎంసీఏ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసెట్ పరీక్షను మూడు సెక్షన్లుగా.. 200 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహించనున్నారు.
న్యాయం చేసే‘లా’.. లాసెట్
- తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ‘లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్)’ను నిర్వహిస్తుంది. ఇందులో పొందిన ర్యాంకు ఆధారంగా.. మూడేళ్లు, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- ఈ ఏడాది టీజీ లాసెట్ పరీక్ష తేదీ:2025,జూన్ 6
- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఓబీసీ వర్గాల వారు 42 శాతంతో, ఎస్‌సీ,ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
- అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఓబీసీ విద్యార్థులు 42 శాతంతో,ఎస్‌సీ,ఎస్టీ విద్యార్థులు 40 శాతంతో ఉత్తీర్ణత పొందాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- టీజీ లాసెట్‌ను మొత్తం మూడు విభాగాల్లో 120 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు, అప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా విభాగం నుంచి 60 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. అప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా విభాగంలోని 60 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు కాంప్రహెన్షన్ విధానంలో ఉంటాయి. న్యాయ సంబంధ అంశాలతో కూడిన ప్యాసేజ్‌లు ఇచ్చి.. వాటి ఆధారంగా సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా ప్రశ్నల అడుగుతారు.
- ఎల్‌ఎల్‌బీ అర్హతతో పీజీ స్థాయిలో.. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పీజీ లాసెట్ రెండు విభాగాలుగా 120 మార్కులకు ఉంటుంది. పార్ట్–ఎలో జ్యూరిస్పుడెన్స్ నుంచి 20 ప్రశ్నలు, కాన్‌స్టిట్యూషనల్ లా నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్–బిలో.. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా నుంచి 16 ప్రశ్నలు, మర్కంటైల్ లా నుంచి 16 ప్రశ్నలు, లేబర్ లా నుంచి 16 ప్రశ్నలు, క్రైమ్స్ అండ్ టార్ట్స్ నుంచి 16 ప్రశ్నలు, అదర్ ‘లా’స్ నుంచి 16 ప్రశ్నలు అడుగుతారు. పీజీ లా సెట్‌కు.. ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు.
చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్ | కరెంట్ అఫైర్స్ | జనరల్ నాలెడ్జ్
టీజీ ఎడ్‌సెట్
- ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశానికి మార్గం.. బీఈడీ. ఈ కోర్సుల్లో ప్రవేశానికి టీజీ ఎడ్‌సెట్ నిర్వహిస్తారు. ఈ సెట్‌కు.. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు మొదలు టెక్నికల్ డిగ్రీ అయిన బీటెక్ వరకూ.. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు పోటీ పడొచ్చు. అయితే వారు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లనే ఎడ్‌సెట్‌లో మెథడాలజీ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. –ఎడ్‌సెట్ పరీక్షను అయిదు విభాగాల్లో 150 ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్ట్/కంటెంట్ (60 ప్రశ్నలు), టీచింగ్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (20 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ (30 ప్రశ్నలు), కంప్యూటర్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్ట్/కంటెంట్ విభాగానికి సంబంధించి మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు, సైన్స్ నుంచి 20 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
- ఎడ్‌సెట్ పరీక్ష తేదీ: 2025, జూన్ 1.
![]() ![]() |
![]() ![]() |
పీజీఈసెట్
- రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్‌లో చేరేందుకు అవకాశం కల్పించే పరీక్ష.. టీజీ పీజీఈసెట్(పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఇందులో ర్యాంకు ఆధారంగా ఎంఈ, ఎంటెక్, ఎం. ఫార్మసీ,మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఫార్మ్–డి(పోస్ట్ బా క్యులరేట్) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్/బీఈ/బీఫార్మసీ/ బీఆర్క్ సంబంధిత కోర్సులను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
- పీజీ ఈసెట్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు.
- పీజీఈసెట్ పరీక్ష తేదీ: 2025, జూన్ 16 – 19.
ఈసెట్
- బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశించేందుకు నిర్వహించే పరీక్ష.. టీజీ ఈసెట్(ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్). పాలిటెక్నిక్, బీఎస్సీ ఉత్తీర్ణులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. పాలిటెక్నిక్ ఉత్తీర్ణతతో పరీక్షకు హాజరయ్యే వారికి 200 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. రెండో పేపర్‌లో మొత్తం 100 ప్రశ్నలు అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ నుంచే ఉంటాయి.
- ఫార్మసీ అభ్యర్థులకు ఫార్మాస్యుటిక్స్, ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ, ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ విభాగాల నుంచి 50 ప్రశ్నలు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.
- బీఎస్సీ ఉత్తీర్ణులకు మ్యాథమెటిక్స్ నుంచి 100 ప్రశ్నలు, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 50, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
- ఈసెట్ పరీక్ష తేదీ: 2025, మే 12.
Tags
- TGCET 2025 Guidance
- TG CETS 2025 Schedule
- Telangana Common Entrance Tests 2025
- TS EAPCET
- TS ECET
- TS LAWCET
- TS PGLCET
- TS EDCET
- TS ICET
- TS PGECET
- TS PECET
- TG EAPCET 2025
- Engineering
- Schedule of TG Common Entrance Tests 2025
- Telangana News
- Agriculture
- Pharmacy
- MBA
- TelanganaHigherEducation
- EntranceExamPreparation
- ExamDetailsTelangana