Skip to main content

Career Opportunities: మ్యాథమెటిక్స్‌ కోర్సులతో కెరీర్‌ అవకాశాలు..

గణిత శాస్త్రం..మ్యాథమెటిక్స్‌.. అంకెలు, సంఖ్యలు, సూత్రాలు, సిద్ధాంతాలు.. ఇలా ఎన్నో క్లిష్టమైన అంశాలతో కూడిన సబ్జెక్ట్‌! ఒక పట్టాన అంతుపట్టని లెక్కల చిక్కులు!! అందుకే.. అల్జీబ్రా.. గుండె గాబరా.. అని అనుకుంటారు కూడా! కానీ ఇదే గణితంపై కొద్దిగా ఆసక్తి చూపి.. పట్టు సాధిస్తే మాత్రం ఘనమైన కెరీర్‌ ఖాయం అంటున్నారు నిపుణులు!! స్కూల్‌ టీచర్‌ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వరకూ.. అదేవిధంగా టెక్నాలజీ రంగంలో ప్రోగ్రామింగ్‌ నుంచి ఏఐ నిపుణుడి దాకా అవకాశాలు అనేకం!! ఈ నేపథ్యంలో.. మ్యాథమెటిక్స్‌ కోర్సులు-కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..
Mathematics Courses and Careers  Career Opportunities with Mathematics Courses  Diverse Opportunities in Mathematics
 • మ్యాథ్స్‌ కోర్సులతో విస్తృత కెరీర్‌ మార్గాలు
 • టెక్‌ నుంచి రీసెర్చ్‌ వరకు పలు ఉద్యోగాలు
 • డేటా అనలిటిక్స్‌లోనూ కీలకంగా మ్యాథ్స్‌
 • ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో యూజీ, పీజీ

నేటి ఏఐ టెక్నాలజీ యుగంలో మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. మ్యాథమెటిక్స్‌ కాన్సెప్ట్‌లతో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్, లాజికల్‌ రీజనింగ్‌ వంటి నైపుణ్యాలు అలవడుతాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఈ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. మ్యాథమెటిక్స్‌పై పట్టు సాధిస్తే.. టీచింగ్‌ నుంచి ఐటీ, ఆస్ట్రానమీ, రీసెర్చ్‌ వరకూ.. అనేక రంగాల్లో అడుగుపెట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

టెక్నాలజీలో మ్యాథ్స్‌
నేడు ప్రతి రంగంలో టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఈ టెక్నాలజీలో రాణించాలంటే.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై పట్టుండాలి. అందుకు మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు ఎంతో కీలకం. మ్యాథమెటిక్స్‌పై అవగాహన అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామింగ్‌కు దోహదం చేస్తుంది. సీ, సీ++, జావా, పైథాన్‌ వంటి లాంగ్వేజెస్‌లో రాణించాలన్నా.. మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు ఉండాల్సిందే. ప్రోగ్రామర్స్, డెవలపర్స్‌ మొదలు అప్లికేషన్‌ విభాగం వరకు.. అన్నింటా మ్యాథమెటిక్స్‌ స్కిల్స్‌ అత్యంత ఆవశ్యకంగా మారుతున్నాయి.

చదవండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది

డేటా అనలిటిక్స్‌
డేటా అనలిటిక్స్, డేటా సైన్స్‌తో ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి.. దాని ఆధారంగా తమ ప్రొడక్ట్స్, సర్వీసెస్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇందుకోసం కస్టమర్స్‌ డేటాపై ప్రధానంగా ఆధారపడుతున్నాయి. ఈ డేటా విశ్లేషణలో మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి డేటాసైన్స్‌కు పునాదిగా మ్యాథమెటిక్స్‌ను పేర్కొనవచ్చు. లీనియర్‌ అల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌ నైపుణ్యాలతో డేటా అనలిస్ట్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుంటుంది.

మూడు కోర్‌ విభాగాలు
మ్యాథమెటిక్స్‌ను మూడు కోర్‌ విభాగాలుగా పేర్కొంటున్నారు. అవి..అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్, ప్యూర్‌ మ్యాథ్స్, మ్యాథమెటికల్‌ ఫిజిక్స్‌. అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌ పూర్తిగా రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌తో ఉండే సబ్జెక్ట్‌గా పేర్కొనొచ్చు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో వాస్తవ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు మార్గంగా నిలుస్తోంది అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌. ఇందులో న్యూమరికల్‌ మెథడ్స్, అనాలిసిస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌ ఉంటాయి. ప్యూర్‌ మ్యాథ్స్‌లో ఉండే నెంబర్‌ థియరీ అప్లికేషన్స్‌ నైపుణ్యాల ద్వారా ఫైనాన్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో అడుగుపెట్టే అవకాశముంది. మ్యాథమెటికల్‌ ఫిజిక్స్‌.. క్వాంటమ్‌ థియరీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి విభాగాల్లో ఎంతో కీలకంగా మారుతోంది. వీరికి సెమీ కండక్టర్‌ ఇండస్ట్రీ, టెలికం, మెడికల్‌ టెక్నాలజీ, విద్యుత్‌ రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి.

లెక్చరర్‌ నుంచి సైంటిస్ట్‌ వరకూ

 • మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ పట్టాతో టాటా ఫండమెంటల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, హరీశ్‌చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ఇస్రో, సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆర్గనైజేషన్, హోమి భాభా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ వంటి సంస్థల్లో సైంటిస్ట్‌లుగా కెరీర్‌ ప్రారంభించొచ్చు. డీఆర్‌డీఓ, డి­పార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలలో­నూ మ్యాథమెటిక్స్‌ పీహెచ్‌డీ ఉత్తీర్ణులకు కొలువులు లభిస్తాయి. అదే విధంగా బోధన విభాగంలో ప్రొఫెసర్‌ హోదాలను సొంతం చేసుకోవచ్చు. 
 • మ్యాథమెటిక్స్‌ పీజీ అర్హతతో జూనియర్‌ లెక్చరర్స్‌ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్‌ రంగంలోనూ పలు కొలువులు అందుబాటులో ఉన్నాయి.
 • బ్యాచిలర్‌ డిగ్రీలో మ్యాథమెటిక్స్‌తోపాటు డేటా అనాలిసిస్, డేటాసైన్స్‌ వంటి సర్టిఫికేషన్స్‌ పూర్తి చేసుకుంటే.. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ కొలువు సొంతం చేసుకోవచ్చు.

చదవండి: Student Visa Latest Rules: స్టూడెంట్‌ వీసాలపై పలు దేశాల ఆంక్షలు.. కొత్త నిబంధనలు ఇవే..

గణితంతో జాబ్‌ ప్రొఫైల్స్‌

 • మ్యాథమెటిక్స్‌ టీచర్‌: బీఎస్సీతోపాటు బీఈడీ పూర్తి చేసుకుంటే పాఠశాల స్థాయిలో మ్యాథమెటిక్స్‌ టీచర్‌గా అడుగు పెటొచ్చు.
 • ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటర్‌: బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఇన్సూరెన్స్‌ విభాగంలో ఆయా పాలసీలు, వాటికి వయో వర్గాల వారీగా నిర్దేశించే వ్యవధి, ప్రీమియంల గురించి విశ్లేషించే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 • స్టాటిస్టిషియన్‌: పేరుకు స్టాటిస్టిషియన్‌ అని పేర్కొంటున్నా.. పలు కంపెనీలు, డేటా అనాలిసిస్, డేటా కంపేరిజన్‌ వంటి విభాగాల్లో స్టాటిస్టిక్స్‌తోపాటు మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు కూడా ఉంటేనే నియమించుకుంటున్నాయి. 
 • డేటా అనలిస్ట్‌: గణితంపై పట్టుంటే..మ్యాథమెటికల్, స్టాటిస్టికల్‌ టూల్స్‌ సమ్మేళనంగా ఉండే డేటా అనలిస్ట్‌ కెరీర్‌లో రాణించొచ్చు. నిర్దేశిత డేటాను విశ్లేషించి.. దాని ఆధారంగా కంపెనీలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై నివేదిక ఇవ్వడం డేటా అనలిస్ట్‌ల ప్రధాన విధిగా ఉంటుంది.
 • ఆపరేషన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌: వ్యాపార కార్యకలాపాలు, వ్యూహాలకు ఆపరేషనల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌లు ఆవశ్యకంగా మారుతున్నారు. మ్యాథమెటికల్‌ టెక్నిక్స్‌ను ఉపయోగించి సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్‌ వంటి విభాగాల్లో కార్యకలాపాలు సజావుగా సా­గేలా చూడటంలో వీరి సేవలు ఎంతో కీలకం.
 • మ్యాథమెటీషియన్‌: పలు వ్యాపారాలు, సాంకేతికతలు, ఖగోళ శాస్త్రం, పర్యావరణ విభాగం, హెల్త్‌ కేర్‌ తదితర రంగాల్లో మ్యాథమెటీషియన్‌ కొలువులు లభిస్తున్నాయి. వీటిలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌లోని అల్గారిథమ్స్, థియరీస్‌ను ఉపయోగిస్తూ అవసరమైన నివేదికలు అందించాల్సి ఉంటుంది.
 • యాక్చుయరీస్‌: బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఎంతో కీలకమైన యాక్చుయరీ విభాగంలోనూ మ్యాథమెటిక్స్‌ పీజీ ఉత్తీర్ణులకు యాక్చుయేరియన్‌ స్పెషలిస్ట్‌ కొలువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్‌ రంగంలో రిస్క్‌ అనాలిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది. 
 • డేటా సైంటిస్ట్‌: ఆయా కంపెనీలకు సంబంధించి అన్‌ స్ట్రక్చర్డ్‌ డేటాను క్రమ పద్ధతిలో పొందుపరిచి.. ఆ డేటాను విశ్లేషించడం, వివిధ నమూనాలుగా వర్గీకరించడం, విశ్లేషణ చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 • అల్గారిథమ్‌ ఇంజనీర్స్‌: ప్రస్తుత టెక్‌ యుగంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, అదే విధంగా ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లో అల్గారిథమ్‌ ఇంజనీర్స్‌గానూ అడుగు పెట్టొచ్చు. ఆయా కంపెనీల అల్గారిథమ్స్‌ ద్వారా డేటాను వినియోగించి.. వాస్తవ పరిస్థితులను వి­శ్లేషించడం, దానికి సంబంధించిన నివేదికలు ఇ­వ్వడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 
 • మార్కెట్‌ రీసెర్చర్స్‌: వ్యాపార ప్రపంచంలో కస్టమర్లు, పోటీదారుల డేటాను విశ్లేషించి.. కంపెనీల లక్ష్యాలకు అనుగుణంగా నివేదికలు రూపొందించడం, సర్వేలు నిర్వహించడం, మార్కెట్‌ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు విశ్లేషించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటితోపాటు పలు సంస్థల్లో ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగాల్లో సైతం మ్యాథమెటిక్స్‌ నిపుణులకు అవకాశాలు లభిస్తున్నాయి.

చదవండి: STEM: ఈ కోర్సులతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు

రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లోనూ
పలు ఎన్‌ఐటీలు కూడా ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఐఐటీ-జామ్‌ ఎంట్రన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. బ్యాచిలర్‌ కోర్సులకు సంబంధించి ఐఐటీల్లో జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రాల స్థాయిలోనూ పలు యూనివర్సిటీల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 
వీటిలో పీజీ కోర్సులో ప్రవేశానికి పీజీ సెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు కూడా మ్యాథమెటిక్స్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నాయి. సీయూఈటీ-యూజీ, పీజీ ఎంట్రన్స్‌లలో స్కోర్ల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి.


ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌-కోర్సులు

 • చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌: కోర్సులు: బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ; ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 • ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌: కోర్సులు: బీఎస్సీ మ్యాథమెటిక్స్‌(ఆనర్స్‌); ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌; పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్‌). ఈ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే రాత పరీక్షలో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 • ఐఐఎస్‌సీ-బెంగళూరు: బీటెక్‌(మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌)లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్‌ లభిస్తుంది. 
 • ఐఐటీ-ఖరగ్‌పూర్‌: ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌లో ఐఐటీ-జామ్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం పొందొచు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌)లో జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు. 
 • ఐఐటీ-కాన్పూర్‌: మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ సైన్స్‌లో.. బీఎస్‌ డిగ్రీ, బీఎస్‌-ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీలో జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌లో ఐఐజీ-జామ్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 • టీఐఎఫ్‌ఆర్‌: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ఈ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి గేట్, జెస్ట్, సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు.
 • ఐఐటీ-చెన్నై: ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్‌)లో ఐఐటీ-జామ్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఎంటెక్‌(ఇండస్ట్రియల్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌)లో గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
Published date : 09 Mar 2024 11:24AM

Photo Stories